
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (SP Balasubrahmanyam) తనయుడు చరణ్ సింగర్ మాత్రమే కాదు నిర్మాత, నటుడు కూడా! ఈయన ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం లైఫ్: లవ్ యువర్ ఫాదర్. తండ్రిపై ప్రేమతో చరణ్ తన పేరును SPB చరణ్ (SPB Charan)గా మార్చుకున్నాడు. తాజాగా ఈయన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు. చరణ్ మాట్లాడుతూ.. నా జీవితంలో గెలుపు, ఓటమి.. రెండూ చూశాను. ఉదాహరణకు 2000వ సంవత్సరంలో అనుకుంటాను.. రూ.75 లక్షలు పెట్టి తొలిసారి ఓ సినిమా నిర్మిస్తే అంతా కోల్పోయాను.
20 ఏళ్ల కిందటే విడాకులు
నా కుటుంబ విషయానికి వస్తే.. నేను అమెరికాలో ఓ అమ్మాయిని ప్రేమించాను. తనను ఇంట్లో పరిచయం చేశాను. అందరి ఆశీర్వాదంతో మేము పెళ్లి చేసుకున్నాం. మాకు జాహ్నవి, మయూక అని కవలపిల్లలు సంతానం. న్యూయార్క్‌లో చదువుకుంటున్నారు. తల్లితో కలిసి అక్కడే ఉంటున్నారు. నాకు, నా భార్యకు 2005లో విడాకులయ్యాయి. ప్రతి ఏడాది న్యూయార్క్ వెళ్లి కనీసం పది రోజులైనా పిల్లలతో కాలక్షేపం చేస్తుంటాను.
డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా..
అయితే నా పెళ్లయిన కొత్తలో ఎక్కువగా ఖాళీగా ఉన్నాను. నేను కెరీర్‌లో స్లో అయ్యేసరికి అమ్మ తిట్టడం మొదలుపెట్టింది. ఈ వయసులో నాన్నను పనికి పంపించి నువ్వు దున్నపోతులా పడుకుంటున్నావేంట్రా అని విసుక్కునేది. ఆ మాటలు నా మనసుకు తగిలాయి. నా అంతట నేను ఏం చేయలేకపోతున్నానని డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. సరిగ్గా ఆ సమయంలో దర్శకుడు కె. బాలచందర్ ఆఫీస్ నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. అలా సీరియల్ ఆడిషన్‌కు వెళ్లి అందులో యాక్ట్ చేశాను. అక్కడైన పరిచయాలతో నిర్మాతగా మారిపోయాను.
హీరో అజిత్, నేను క్లోజ్..
నిజానికి నేను చదువుకునే రోజుల్లోనే హీరోగా ఛాన్స్ వచ్చింది. అదెలాగంటే.. అజిత్, నేను బెస్ట్ ఫ్రెండ్స్. ఐదారేళ్లపాటు కలిసి చదువుకున్నాం. తర్వాత నేను ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిపోయాను. సరిగ్గా అప్పుడే డైరెక్టర్ వాసంత్ ఆశై సినిమా కోసం మా నాన్నను సంప్రదించాడు. నా చదువు పాడు చేయడం ఇష్టం లేక నాన్న నా స్నేహితుడు అజిత్ పేరు సూచించాడు. అలా ఆశై అజిత్ చేయడం.. అది బ్లాక్‌బస్టర్ అవడం నాకు సంతోషంగా అనిపించింది. మేము కనిపిస్తే మాట్లాడుకుంటాం తప్ప పెద్దగా టచ్‌లో లేము అని ఎస్పీ చరణ్ చెప్పుకొచ్చాడు.
సినిమా పాటలు
ఎస్పీ చరణ్.. ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారకా.., చెప్పవే ప్రేమా.., నేను నేనుగా లేనే.., ఒక తోటలో ఒక కొమ్మలో.., తెలుగు భాష గొప్పదనం, మెల్లగా కరగనీ.., అవునన్నా ప్రేమే కాదన్నా ప్రేమే.., చాలు చాలు చాలు.., ఉయ్యాలో ఉయ్యాల.. ఇలా ఎన్నో హిట్ సాంగ్స్ ఆలపించాడు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించాడు.
చదవండి: గంట లేటైందని సెట్‌లో కమల్ హాసన్ తిట్టాడు: సీనియర్ హీరోయిన్