రంగంపేట జల్లికట్టులో పోట్ల గిత్తని లొంగదీసుకుంటున్న యువకులు
చంద్రగిరి/గుడివాడ టౌన్: సంక్రాంతి సంబరాల్లో భాగంగా మంగళవారం కనుమ పండుగను ప్రజలు ఆనందోత్సాహల మధ్య ఘనంగా జరుపుకున్నారు. చిత్తూరు జిల్లాలో జల్లికట్టు పోటీలు సందడిగా సాగాయి. జల్లికట్టులో దిగి.. కోడెగిత్తల మెడల వంచి.. వాటికి కట్టిన పలకల్సి సొంతం చేసుకునేందుకు యువకులు ఉత్సాహం చూపారు. చంద్రగిరి మండలం ఎ.రంగంపేటలో మంగళవారం నిర్వహించిన జల్లికట్టును వీక్షించేందుకు జిల్లా నలుమూలల నుంచి, రాష్ట్రే తర ప్రాంతాల నుంచి ప్రజలు పెద్దఎత్తున విచ్చేశారు. వీధులన్నీ ఇసుకవేస్తే రాలనంత జనంతో నిండిపోయాయి.
మహిళలు మేడలు, మిద్దెలు ఎక్కి ఆసక్తికరంగా జల్లికట్టును వీక్షించారు. పౌరుషంతో పరుగులు తీస్తున్న కోడెగిత్తలను నిలువరించేందుకు యువకులు ఉత్సాహం చూపారు. ఎద్దులకు కట్టిన పలకలను సొంతం చేసుకునేందుకు పోటీపడ్డారు. పశువుల యజమానులు వాటికి వెండి దేవతామూర్తుల విగ్రహాలను కట్టి బరిలోకి దింపడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అక్కడక్కడా చెదురుమదురు గొడవలు తప్ప, ఆద్యంతం ఎడ్ల పందేలు ప్రశాంతంగా ముగిశాయి. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యరి్థ, తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి గ్రామ దేవతకు పూజలను నిర్వహించి జల్లికట్టును వీక్షించారు.
ముగిసిన బండలాగుడు పోటీలు
కృష్ణా జిల్లా గుడివాడలో ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించిన ఎడ్ల పోటీలు విజయవంతంగా ముగిశాయి. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), ఆయన సోదరుడు కొడాలి నాగేశ్వరరావు (చిన్ని) ఆధ్వర్యంలో జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండ లాగుడు పోటీలు నిర్వహించారు. పోటీల్లో పాల్గొన్న జతలకు తొమ్మిది విభాగాలలో బహుమతులు అందజేశారు. రూ.లక్ష నుంచి రూ.5 వేల వరకు నగదు బహుమతులు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment