ఆగస్టు 6న చలో విజయవాడలో పాల్గొన్న వారిలో ఓ వృద్ధురాలిని బలవంతంగా లారీలోకి ఎక్కిస్తున్న పోలీసులు
కనీస వేతనాలతో బడి పిల్లలకు బాధ్యతగా వంట చేసి పెడుతున్న వాళ్లను కాదని, ఆ పనిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మధ్యాహ్న భోజన పథకం.. అధ్వాన్న భోజన పథకంగా మారే పరిస్థితి తలెత్తబోతోంది.
ఆగస్టు 9 మధ్యాహ్నం. సమయం ఒకటీ ముప్పావు. కొటికే భారతికి ఫోన్ చేసింది సాక్షి. ఆ ఫోన్‌ను అదే స్కూల్లో ఉన్న ఒక టీచర్ తీశారు. ‘భారతి బయటకెళ్లిందని, అరగంటలో వస్తుందని’ చెప్పారామె. అన్నట్లుగానే అరగంటకు భారతి నుంచి ఫోన్ వచ్చింది. మధ్యాహ్నం స్కూల్లో పిల్లలకు భోజనం వండి, వారికి వడ్డించి, పిల్లల భోజనాలయిన తర్వాత హాస్పిటల్‌కెళ్లి వచ్చిందామె. అంతకు మూడు రోజుల ముందు పోలీసులు కొట్టిన దెబ్బలకు వైద్యం చేయించుకోవడానికి హాస్పిటల్ కెళ్లిందామె. ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ ‘మూగదెబ్బలు! తొడలు సహా ఒంటి మీద ఫలానా చోట అని చెప్పలేను. చెప్పలేని చోట్ల కూడా దెబ్బలయ్యాయి’ అన్నదామె బేలగా. ‘‘అసలేం జరిగింది?’’ అని అడిగినప్పుడు తన ఆవేదనను సాక్షితో పంచుకుంది భారతి. ‘‘మాది కర్నూలు. డ్వాక్రా మహిళను. మధ్యాహ్న భోజన పథకంలో పిల్లలకు భోజనం వండుతుంటాను. కర్నూలు వన్‌టౌన్ ఎలిమెంటరీ స్కూల్లో వంట చేస్తాను. పదిహేనేళ్లుగా నాలాగ చాలామంది ఇదే పనిలో ఉన్నాం. ఇప్పుడు ఈ పనిని ప్రైవేటు వాళ్లకివ్వాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ‘ఇన్నేళ్లుగా పని చేశాం, మాకు నెల గడవడానికి కొంత జీతమిచ్చి, పిల్లల మెనూ పెంచండి’ అని అడిగినందుకు మమ్మల్ని పడేసి కొట్టుకుంటూ ఈడ్చుకెళ్లారు.
మేమేం అడిగామని!
మేము ప్రభుత్వాన్ని పెద్ద కోరికలేమీ కోరలేదు. ‘నెలకు ఐదువేల ఐదు వందలు వేతనం ఇవ్వండి, పిల్లల మెనూ ఇరవై రూపాయలకు పెంచండి’ అని అడిగాం. ఇప్పుడు ప్రభుత్వం మాకిస్తున్నది నెలకు వెయ్యి రూపాయలు. అది కూడా మే నెలలో స్కూళ్లకు సెలవున్న రోజుల్లో ఉండదు. ఏప్రిల్, జూన్ నెలల్లో స్కూళ్లు తెరిచేది సగం రోజులే కాబట్టి ఆ నెలల్లో ఐదు వందలే ఇచ్చారు. పిల్లల భోజనానికి ఒక్కొక్కరికి వందగ్రాముల బియ్యం ఇచ్చి, నాలుగు రూపాయల పదమూడు పైసలిస్తోంది. అందులోనే పప్పు, ఉప్పు, కారం, కూరగాయలు, నూనె... అన్నీ. గ్యాస్ లేదా కట్టెలు కొన్నా ఆ నాలుగు రూపాయల పదమూడు పైసల్లోనే. మా స్కూల్లో 70 మంది పిల్లలున్నారు. ఏ రోజుకారోజు లెక్కవేస్తారు, ఆ రోజు ఎంతమంది హాజరైతే అంతమందికే లెక్క వేసి డబ్బిస్తారు. వారానికి రెండు గ్యాస్ సిలిండర్లు ఖర్చవుతాయి. నెలకు ఎనిమిది సిలిండర్లు కావాలి. సబ్సిడీలో సిలిండర్‌లు ఇప్పించినా కొంత వెసులుబాటు ఉంటుంది. గ్యాస్ ఎక్కువ ధర పెట్టి కొనాల్సి వస్తోంది. ధరలు ఒకరోజు ఉన్నట్లు మరో రోజు ఉండవు. నెలాఖరులో ఖర్చు లెక్క చూసుకుంటే మాకు మిగిలేది ఏమీ ఉండడం లేదు. మా వేతనం వెయ్యి రూపాయలు కూడా నికరంగా మిగిలే పరిస్థితి ఉండడం లేదు.
గుడ్లు ఉడికేదెలా?
వారానికి మూడు గుడ్లు పెట్టాలని ఒక విద్యార్థికి ఆరు రూపాయల పద్దెనిమిది పైసలిస్తామన్నారోసారి. గ్యాస్ సిలిండర్ సబ్సిడీలో ఇస్తే తప్ప గుడ్లు ఉడికించలేమని చెప్పాం. డబ్బులు పెంచకుండా గుడ్లు పంపిస్తున్నారు, కాదనకుండా వాటిని ఉడికించి పెడుతున్నాం. బ్లాక్‌లో సిలిండర్ కొని ఉడికించాలంటే మా చేతి డబ్బే పడుతోంది. ఇవన్నీ చెప్పుకోవడానికే విజయవాడకు వెళ్లాం.
ఆ రోజు ఆగస్టు 6
ఊరూరు నుంచి మధ్యాహ్న భోజన పథకంలో వంట చేస్తున్న వాళ్లం కదిలాం. అందరం విజయవాడ చేరి ఉంటే ఉప్పెన ఉబికి వచ్చినట్లే ఉండేది. ఎక్కడి వాళ్లనక్కడ గ్రామాల్లో, మండలాల్లో బస్‌స్టాపుల్లో నిఘా వేసి మరీ... అరెస్టు చేశారు. మాలాంటి కొందరం మాత్రం ఎవరికీ అనుమానం రాకుండా, పోలీసుల కంట పడకుండా విజయవాడ చేరుకోగలిగాం. తీరా అక్కడికి వెళ్లాక ఒక్కొక్కరినీ తరుముతూ, ఈడ్చుకుంటూ వెళ్లారు పోలీసులు. మా బట్టలూడిపోతున్నా సరే... అలాగే పట్టి వ్యాన్‌లలో పడేశారు. సిటీ నుంచి 30– 40 కిలోమీటర్ల దూరాన వదిలారు. మేమెక్కడున్నామో తెలియదు. ఎవర్ని అడగాలన్నా మనుషులే కనిపించడం లేదు. రోడ్డు మీదకెళ్లి వచ్చిన బస్సుల్ని ఆపి, ఎటు వైపు వెళ్తుందో అడిగి ఎక్కాం. బస్సు దిగిన తర్వాత ఆటోల్లో రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాం. అక్కడ రాత్రి ఎనిమిదిన్నరకు రైలెక్కి తెల్లవారి కర్నూలు చేరుకున్నాం.
గాయం మానేది కాదు
ఆ రోజు ఎంతటి దుర్దినమో మాటల్లో చెప్పలేం. కళ్లు తెరిచినా, కళ్లు మూసుకున్నా అవే సంఘటనలు గుర్తుకువస్తున్నాయి. ఎక్కడ బస్సెక్కామో, ఎక్కడ రైలెక్కామో... అంతా అయోమయంగా ఉంది. మాకు తగిలిన గాయాలు చిన్నవి కాదు. ఒంటికైన గాయాలు వారానికో నెలకో తగ్గుతాయి. కానీ మనసుకైన గాయాలు ఎప్పటికీ మానేవి కాదు. మేమేం తప్పు చేశామని అంత దారుణంగా వ్యవహరించిందీ ప్రభుత్వం! ఉగ్రవాదులమా, తీవ్రవాదులమా, నేరగాళ్లమా, దొంగతనాలు– దోపిడీలు చేసినోళ్లమా? మా పిల్లలకు వండి పెట్టుకున్నట్లే బడి పిల్లలకు అన్నం వండి పెడుతున్నాం. టీచర్లు సెలవులు పెడతారు, పిల్లలు బడికి డుమ్మా కొడతారేమో కానీ మేము ఎండనక, వాననక బడి తెరిచిన అన్ని రోజులూ పని చేశామే. మాకు చేసే న్యాయం ఇదేనా’’ అంటున్నప్పుడు భారతి గొంతు పూడుకుపోయింది. మాటలతో చెప్పలేని వేదన ఆమె గొంతులో పలికింది.
నడిపిస్తున్నది మహిళలే!
ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం మొదలు పెట్టినప్పుడు వంట చేయడానికి ఎవరూ ముందుకు రాని రోజులవి. అప్పట్లో రోజుకు ఒక విద్యార్థికి రూపాయి పావలా ఇచ్చేది ప్రభుత్వం. సామాజిక కార్యకర్తలు ఉద్యమించగా, మెనూ నాలుగు రూపాయల పదమూడు పైసలు చేసి, వండేవాళ్లకు వెయ్యి రూపాయలు ఇస్తోందని నిర్మల చెప్పారు. ‘నిజానికి పొదుపు సంఘాల మహిళలే ఈ పథకాన్ని నిలబెట్టారు. కొన్ని స్కూళ్లలో నీళ్లుండవు, నీళ్లు మోసుకొచ్చి వండాలి. వంటగది ఉండని చోట బయటే వండాలి. కొంతమంది పాత్రలు కూడా సొంతంగా కొనుక్కున్నారు. ప్రభుత్వం వాటికి డబ్బివ్వలేదు. వేతనం పెంచమంటే ‘పనిచేసేది మధ్యాహ్నం ఒక గంట సేపే కదా’ అంటున్నారు. వడ్డించే సమయం, తినే సమయమే కాదు కదా! పన్నెండు గంటలకు వడ్డించాలంటే ఉదయం వేరే ఏ పనులకూ వెళ్లకుండా ఈ పని కోసమే వాళ్ల సమయాన్ని కేటాయించుకోవాలి. స్కూలుకి వచ్చి వండి, భోజనం వడ్డించిన తర్వాత ఇళ్లకు పోయి ఇంటి పనులు చూసుకోవాలి. సాయంత్రమయ్యే సరికి మర్నాడు వంట కోసం కూరగాయల వంటివి సమకూర్చుకోవడానికి ఉపక్రమించాలి. దాదాపుగా రోజంతా ఇదే పనిలో ఉండక తప్పదు. కొన్ని చోట్ల ఆరు నెలలకు కూడా బిల్లులు రావడం లేదు. దుకాణాల్లో సరుకులు అరువివ్వకపోతే అప్పులు తెచ్చి వంట చేయాల్సిన పరిస్థితి. డబ్బివ్వలేదని వండడం మానేస్తే ‘ఎందుకు వండలేదు’ అని తప్పు వీళ్ల మీదనే మోపుతారు. ప్రభుత్వం కేంద్రీకృత వంటశాలల నిర్ణయంతో వీళ్లను రోడ్డున పడేయాలని చూస్తోంది. ఈ నిర్ణయం ప్రకారం జిల్లాలను క్లస్టర్లుగా విభజించి కొన్ని సంస్థలకిస్తారు. ఒక్కో వంటశాలకు మూడు నుంచి ఐదెకరాల పొలం ఇస్తారు. వంటగది కట్టి, వండి, పాతిక కిలోమీటర్ల పరిధిలోని పాఠశాలలన్నింటికీ రవాణా చేయాలి. కొన్నిచోట్ల ప్రయోగాత్మకంగా అమలు చేసినా, పిల్లలు ఆ భోజనాన్ని తినడం లేదన్న వాస్తవం ప్రభుత్వానికి కూడా తెలుసు. అయినా సరే, అమలు చేసి తీరాలని చూస్తోంద’ంటూ నిర్మల ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేరుకేనా?
ఆంధ్రప్రదేశ్ మొత్తంలో స్కూళ్లలో వంట చేస్తున్న వాళ్లు 60 వేల వరకు ఉన్నారు. ఆరవ తేదీన విజయవాడలో 1,650 మందిని అరెస్టు చేశారు. నాగమణి అనే అమ్మాయి కాలిని పట్టుకుని మెలి తిప్పేశారు. ఆమె నడవలేక పోతోంది. మహిళల మీద, పిల్లల భోజనం మీద ఉక్కుపాదం మోపే బదులు... మెనూ, వేతనం పెంచినట్లయితే పిల్లలు చక్కటి భోజనం చేస్తారు. ఈ పథకం అమలు చేస్తున్నామని జబ్బలు చరుచుకుంటూ ప్రచారం చేసుకోవడానికి పెట్టే డబ్బును పిల్లల కంచాల్లోకి మళ్లిస్తే చాలు.
– పి. నిర్మల, కన్వీనర్,
శ్రామిక మహిళా సంఘం, కర్నూలు జిల్లా
– వాకా మంజులారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment