ఉత్తుత్తి గ్యాసేనా? | No Clarity On 500 Gas Scheme In Telangana, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

ఉత్తుత్తి గ్యాసేనా?

Published Sun, Dec 22 2024 1:14 PM | Last Updated on Sun, Dec 22 2024 1:49 PM

NO clarity On 500 gas scheme

రాంనగర్‌కు చెందిన గృహిణి ఈ ఏడాది ఆరంభంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా  నిర్వహించిన ప్రజా పాలనలో భాగంగా గృహజ్యోతి, మహాలక్ష్మి , ఇందిరమ్మ.. ఇలా ఇతరత్రా పథకాల వర్తింపునకు దరఖాస్తు చేసుకున్నారు. ఆమె అర్హత సాధించడంతో గృహజ్యోతి కింద విద్యుత్‌ జీరో బిల్లు వర్తించింది. కానీ.. రూ.500 వంట గ్యాస్‌ సబ్సిడీ మాత్రం వర్తించలేదు. ఎల్పీజీ గ్యాస్‌ కనెక్షన్‌ ఆమె భర్త పేరుపై ఉండటంతో ఈ పథకం వర్తించదని ప్రచారం జరగడంతో.. సరిగా  ఐదు నెలల క్రితం ప్రభుత్వం దరఖాస్తును సవరించుకునేందుకు వెసులుబాటు కల్పించింది. దీంతో కలెక్టరేట్‌లోని మీ సేవ కేంద్రానికి వెళ్లి మార్పు చేసుకుంది. అయినా.. ఆమెకు ఇప్పటి వరకు రూ. 500 గ్యాస్‌ పథకం వర్తించని పరిస్థితి నెలకొంది. అయితే.. దీనిపై గ్యాస్‌ ఏజెన్సీలతో పాటు పౌరసరఫరాల అధికారులకు సైతం స్పష్టత లేకపోవడం గమనార్హం.

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఏడాది గడిచింది. కానీ.. అర్హులందరికీ రూ.500కు వంటగ్యాస్‌ అందని ద్రాక్షగా మారింది. ఆరు గ్యారంటీల్లో భాగంగా  సిలిండర్‌పై సబ్సిడీ అందిస్తున్నా.. మెజార్టీ బీపీఎల్‌ కుటుంబాలకు వర్తించడం లేదు. బీపీఎల్‌ కింద ఒకే  కుటుంబం గృహజ్యోతి పథకానికి అర్హత సాధించినా.. మహాలక్ష్మి పథకానికి మాత్రం అర్హత సాధించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. 

దీంతో పూర్తి స్థాయి బహిరంగ మార్కెట్‌ ధర చెల్లించి వంట గ్యాస్‌ సిలిండర్‌ కొనుగోలు చేయక తప్పడం లేదు. లోక్‌సభ ఎన్నికల ముందు గ్యాస్‌ సబ్సిడీ వర్తింపు అమలు ప్రారంమైంది. ప్రజాపాలనలో  స్వీకరించిన దరఖాస్తుల ఆధారంగా బీపీఎల్‌ కుటుంబాలను గుర్తించారు. మిగతా పథకాల మాదిరిగా మహాలక్ష్మి పథకానికి కూడా తెల్ల రేషన్‌ కార్డును ప్రామాణికంగా తీసుకున్నారు. కానీ పథకం కొందరికే వర్తించడంతో పేద కుటుంబాలు నిరాశలో ఉన్నాయి.  

ఒక్క శాతం సైతం దాటలేదు.. 
నగర పరిధిలో వంట గ్యాస్‌ కనెక్షన్లు సుమారు 31.18 లక్షలు ఉండగా అందులో కేవలం ఒక శాతం కనెక్షన్‌దారులకు మాత్రమే రూ.500 సబ్సిడీ వంటగ్యాస్‌ వర్తిస్తోంది. సుమారు 24.74 లక్షల కుటుంబాలు మహాలక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసుకున్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.  అందులో సుమారు 19.01 లక్షల కుటుంబాలు మాత్రమే తెల్లరేషన్‌ కార్డులు కలిగి ఉన్నాయి. అయితే.. సబ్సిడీ గ్యాస్‌ మాత్రం మూడు లక్షలలోపు కనెక్షన్‌దారులు మాత్రమే ఎంపికైనట్లు పౌరసరఫరాల శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మిగతా సుమారు 16 లక్షల కనెక్షన్‌దారులు అర్హులుగా ఉన్నా.. సబ్సిడీ వర్తింపు మాత్రం అందని ద్రాక్షగా మారింది.  

⇒ నగర పరిధిలో సుమారు 52,65,129 గృహ విద్యుత్‌ కనెక్షన్లు ఉండగా.. ఇందులో ప్రజాపాలనలో గృహజ్యోతి కింద ఉచిత విద్యుత్‌ కోసం 24 లక్షల కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. అందులో 11 లక్షల  కటుంబాలు జీరో బిల్లుకు అర్హత సాధించాయి. మిగతా కుటుంబాలు వివిధ కారణాలతో తిరస్కరణకు గురయ్యాయి.

కేంద్రం సబ్సిడీ ఓకే.. 
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వంట గ్యాస్‌ సబ్సిడీ మాత్రం వినియోగదారులకు బ్యాంక్‌ ఖాతాలో నగదు బదిలీ కింద రూ. 40.71 జమ అవుతోంది. కేంద్ర ప్రభుత్వం సిలిండర్‌ ధరతో నిమిత్తం లేకుండా వినియోగదారు బ్యాంక్‌ ఖాతాలో పరిమితంగా నగదు జమ చేస్తోంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌ ప్రకారం ‡14.5 కేజీల డొమెస్టిక్‌ ఎల్పీజీ సిలిండర్‌ ధర రూ.855. పలుకుతోంది. గృహ వినియోగదారులందరూ సిలిండర్‌ ధరను పూర్తిగా చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చమురు సంస్థల ద్వారా సబ్సిడీని నగదు బదిలీ కింద  వినియోగదారుల ఖాతాలో జమ చేస్తోంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement