అర్హులకు దీపం కనెక్షన్లు ఇవ్వాలి
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : అర్హులైన నిరుపేదలకు దీపం పథకం కింద మంజూరు చేసిన గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని కలెక్టర్ అహ్మద్ బాబు అన్నారు. శుక్రవారం రాత్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్యాస్ వినియోగదారులకు ఆధార్ ఆధారిత నగదు బదిలీ పథకం అమలుపై జిల్లా అధికారులు, గ్యాస్ ఏజెన్సీ యాజమానులు, బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వసతిగృహాలకు 2,943 కనెక్షన్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడీలోని పిల్లలకు భోజనం అందించేందుకు రాష్ట్రంలో మొదటిసారిగా జిల్లాలో గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసినట్లు చెప్పారు.
అదనపు నిధుల కోసం ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. 890 అంగన్వాడీలు, 1951 పాఠశాలలు, 102 సాంఘిక సంక్షేమ శాఖ వసతిగృహాలకు గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసినట్లు తెలిపారు. స్టౌలు త్వరలో పంపిణీ చేస్తామని అన్నారు. ఇప్పటి వరకు నగదు బదిలీ పథకం 84.73 శాతం సీడింగ్ పూర్తయిందని, కొన్ని బ్యాంకులు ఈ విషయంలో శ్రద్ధ వహించడం లేదని పేర్కొన్నారు. సీడింగ్ చేయాల్సిన కేసులు జిల్లాలో 13 వేలు తిరస్కరించామని తెలిపారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్, సబ్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్, ఆర్డీవోలు సుధాకర్‌రెడ్డి, రామచంద్రయ్య, అరుణశ్రీ, డీఎస్వో వసంత్‌రావు, డ్వామా, డీఆర్డీఏ పీడీలు వినయ్‌కృష్ణారెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, బ్యాంకర్లు, గ్యాస్ డీలర్లు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, పాల్గొన్నారు.