
దేశంలో ఐదేళ్లలో 16.14లక్షల ఈవీ వాహనాలు
ఆంధ్రప్రదేశ్‌లో 1,266, తెలంగాణలో 1,289 ఛార్జర్‌లు
14.28లక్షల టూవీలర్‌లు, 1.64లక్షల త్రీవీలర్, 22వేల ఫోర్ వీలర్‌లు
వెల్లడించిన కేంద్ర భారీ పరిశ్రమల శాఖ
సాక్షి, న్యూఢిల్లీ: ముంచుకొస్తున్న పర్యావరణ ముప్పును అరికట్టేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని కార్ల కంపెనీలు మాత్రమే ఈవీలను తయారు చేసేవని, ప్రస్తుతం అన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తూ పర్యావరణ పరిరక్షణకు సహకరిస్తున్నాయని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ ఇటీవల పార్లమెంట్‌లో తెలిపింది. ఈవీ రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం ‘ప్రధాన మంత్రి–ఈ–డ్రైవ్’ అనే పథకాన్ని అందుబాటులోకి తెచ్చిoదని తెలిపింది.
ఈ పథకం ద్వారా ఈ–కార్లకు జీఎస్‌టీ, పన్ను, పర్మిట్‌లో మినహాయింపు వంటి అనేక ప్రయోజనాలు అందిస్తున్నట్లు చెప్పింది. 2030 నాటికి ప్రైవేటు ఎలక్ట్రిక్ కార్లలో 30శాతం, ద్విచక్ర వాహనాలు, మూడు చక్రాల వాహనాలలో 80శాతం వృద్ధిని సాధించే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు పేర్కొంది. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసిన వారికి ఏ విధమైన అవాంతరాలు ఏర్పడకుండా ఉండేందుకు ఛార్జింగ్ పాయింట్‌లను, ఛార్జింగ్ స్టేషన్‌లను కూడా ఏర్పాటు చేసినట్లు వివరించింది.
ఆంధ్రప్రదేశ్‌లో 1,266, తెలంగాణలో 1,289..
‘ఫాస్టెర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్’(ఎఫ్‌ఏఎంఈ) సబ్సిడీ పథకం కింద దేశవ్యాప్తంగా 4,523 ఛార్జర్‌లు ఉండగా, 251 ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. ‘ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్’(ఓఎంసీఎస్) పథకం కింద దేశవ్యాప్తంగా 20,035 ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో ఉన్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఎఫ్‌ఏఎంఈ పథకం కింద 354 ఛార్జర్‌లు ఇన్‌స్టాల్ జరగగా, 20 ఛార్జింగ్ స్టేషన్‌లు, ఓఎంసీఎస్ కింద రాష్ట్రవ్యాప్తంగా 912 ఛార్జింగ్‌స్టేషన్లు ఉన్నాయి. ఇక తెలంగాణలో ఎఫ్‌ఏఎంఈ కింద 238 ఛార్జర్‌లు ఇన్‌స్టాల్ చేయగా, ఒకే ఒక్క ఛార్జింగ్ స్టేషన్ ఉండగా, ఓఎంసీఎస్ కింద 1,051 స్టేషన్లు అందుబాటులో ఉన్నాయి.
దేశవ్యాప్తంగా 16.14లక్షల ఈవీలు..
దేశవ్యాప్తంగా ఎఫ్‌ఏఎంఈ పథకం సెకెండ్ ఫేజ్‌లో 16,14,737 లక్షల ఈవీలు ఉన్నట్లు కేంద్రం తెలిపింది. వీటిలో టూవీలర్‌లు 14, 28,009లక్షలు, త్రీవీలర్‌లు 1,64,180, ఫోర్ వీలర్‌లు 22,548 ఉన్నట్లు తెలిపింది. ఈసంఖ్యను రానున్న రోజుల్లో పెంచేదిశగా తాము ప్రోత్సహిస్తున్నట్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment