పీఎం ఈ–డ్రైవ్ స్కీము కింద తొలి ఏడాది గరిష్ట సబ్సిడీ
రెండో ఏడాది రూ. 5 వేలు
కేంద్ర మంత్రి కుమారస్వామి వెల్లడి
న్యూఢిల్లీ: త్వరలో అమల్లోకి రానున్న పీఎం ఈ–డ్రైవ్ పథకం కింద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనదారులు తొలి ఏడాదిలో గరిష్టంగా రూ. 10,000 వరకు సబ్సిడీని పొందవచ్చని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి తెలిపారు. ఈ స్కీమ్ ప్రకారం ఎలక్ట్రిక్ టూ–వీలర్ల విషయంలో బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి కిలోవాట్ అవర్‌కు (కేడబ్ల్యూహెచ్) సబ్సిడీని రూ. 5,000గా నిర్ణయించినట్లు చెప్పారు. అయితే, తొలి ఏడాది ఇది మొత్తమ్మీద రూ. 10,000కు మించదు. రెండో ఏడాది ఇది కిలోవాట్ అవర్‌కు సగానికి తగ్గి రూ. 2,500కు పరిమితమవుతుంది.
మొత్తమ్మీద సబ్సిడీ రూ. 5,000కు మించదు. ఇక, ఈ–రిక్షా కొనుగోలుదారులు తొలి ఏడాది రూ. 25,000 వరకు, రెండో ఏడాది రూ. 12,500 వరకు సబ్సిడీ ప్రయోజనాలు పొందవచ్చని కుమారస్వామి చెప్పారు. కార్గో త్రీ వీలర్లకు తొలి ఏడాది రూ. 50,000, రెండో ఏడాది రూ. 25,000 సబ్సిడీ లభిస్తుంది. స్కీమ్ ప్రకారం పీఎం ఈ–డ్రైవ్ పోర్టల్‌లో ఆధార్ ఆధారిత ఈ–వోచర్ జారీ అవుతుంది. కొనుగోలుదారు, వినియోగదారు దానిపై సంతకం చేసి పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి. ప్రోత్సాహకాన్ని పొందేందుకు కొనుగోలుదారు సెల్ఫీని కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
25 లక్షల టూ–వీలర్లకు..
పీఎం ఈ–డ్రైవ్ పథకం కింద వివిధ రకాల ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు రూ. 3,679 కోట్ల మేర సబ్సిడీలు/ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు కుమారస్వామి చెప్పారు. మొత్తం మీద 24.79 లక్షల ఈ–టూవీలర్లు, 3.16 లక్షల ఈ–త్రీ వీలర్లు, 14,028 ఈ–బస్సులకు స్కీముపరమైన తోడ్పాటు ఉంటుందన్నారు. ప్రస్తుతం ఓలా,
టీవీఎస్, ఏథర్ ఎనర్జీ, హీరో విడా, బజాజ్ చేతక్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరల శ్రేణి రూ. 90,000 నుంచి రూ. 1.5 లక్షల వరకు ఉంది.
ఈవీల వినియోగానికి ప్రోత్సాహం..
పీఎం ఈ–డ్రైవ్ స్కీమును ఆటోమొబైల్ దిగ్గజాలు స్వాగతించాయి. ఈవీల వినియోగం జోరందుకుంటుందని, ఫాస్ట్ చార్జింగ్ మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెట్టడం కూడా ఈవీలపై వినియోగదారుల నమ్మకాన్ని పెంపొందిస్తుందని మహీంద్రా గ్రూప్ సీఈవో అనీష్ షా తెలిపారు. ఉద్గారాల విషయంలో వేగంగా తటస్థ స్థాయిని సాధించేందుకు స్కీమ్ ఉపయోగపడుతుందని టాటా మోటార్స్ ఈడీ గిరీష్ వాఘ్ చెప్పారు. ఈవీ రంగం వేగంగా విస్తరించేందుకు పథకం తోడ్పడుతుందని ఓలా ఫౌండర్ భవీష్ అగర్వాల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment