
వారానికి 70 గంటలు పనిచేయాలని చెప్పిన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి మాటలు ఎంత దుమారం రేకెత్తించాయో అందరికీ తెలుసు. ఈ వ్యాఖ్యలపై రాజ్యసభ ఎంపీ 'సుధామూర్తి' ఇండియా త్రూ ది ఐస్ ఆఫ్ ఇట్స్ ఐకాన్స్ కార్యక్రమంలో మాట్లాడారు.
ఏదైనా పనిని అంకిత భావంతో చేయాలని సంకల్పించినప్పుడు.. సమయంతో పని ఉండటం. నారాయణమూర్తి డబ్బు లేకుండా, అంకితభావంతో పనిచేసే సహోద్యోగులతో ఇన్ఫోసిస్‌ను నిర్మించాలని నిర్ణయించుకున్నారు. వారందరూ వారానికి 70 గంటలు, కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ పనిచేసినప్పుడే అది సాధ్యమైంది. పని గంటలు చూసుకుని ఉంటే.. ఇన్ఫోసిస్ ఈ స్థాయికి వచ్చి ఉండేది కాదు.
ఇన్ఫోసిస్ ఈ రోజు ఈ స్థాయికి వచ్చిందంటే.. దీని వెనుక మాయ, మంత్రమో ఏమీ లేదు. కేవలం పూర్తి స్థాయిలో కష్టపడి పనిచేయడం వల్లనే అది సాధ్యమైంది. అదృష్టం కొంత, సరైన సమయం, సరైన స్థలం వంటివన్నీ ఇన్ఫోసిస్ ఎదగడానికి కారణమయ్యాయని సుధామూర్తి పేర్కొన్నారు.
నా భర్త మాత్రమే కాదు..
నా భర్త మాత్రమే కాదు.. కొందరు జర్నలిస్టులు, వైద్యులు, ఇతర రంగాలలోని వారు కూడా వారానికి 90 గంటలు కూడా పనిచేశారని సుధామూర్తి పేర్కొన్నారు. నారాయణమూర్తి ఇన్ఫోసిస్‌లో బిజీగా ఉన్నప్పుడు.. నేను ఇంటిని, నా పిల్లలను చూసుకోవడంలో సమయం కేటాయించాను, కాలేజీలో కంప్యూటర్ సైన్స్ బోధించడం కూడా ప్రారంభించానని సుధామూర్తి అన్నారు.
ఏదైనా పనిచేయాలనుకున్నప్పుడు.. నాకు సమయం లేదు అని అనుకోకూడదు. పని చేస్తూ.. ఆ పనిని ఆస్వాదించాలి. కాబట్టి నేను ఎప్పుడూ కొత్త మార్గాలను అన్వేషిస్తూ బిజీగా ఉంటాను. నా పిల్లలు విదేశాలకు వెళ్ళినప్పుడు.. ఓవర్ టైమ్ కూడా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం నా భర్త కంటే బిజీగా ఉంటాను. దీనిని నారాయణమూర్తి కూడా మద్దతు ఇస్తుంటారు.
ఇదీ చదవండి: ఏప్రిల్ నుంచి బ్యాంకుల పనిదినాలు వారానికి ఐదు రోజులా?: ఇదిగో క్లారిటీ
ప్రతి విజయవంతమైన మహిళ వెనుక, ఒక అవగాహన కలిగిన పురుషుడు ఉంటాడు. కాబట్టి.. మూర్తి పనిచేస్తున్నప్పుడు నేను ఆయనకు మద్దతు ఇచ్చాను. నేను పనిచేస్తున్నప్పుడు మూర్తి మద్దతు ఇస్తున్నారు. దీనినే నేను జీవితం అని పిలుస్తానని సుధామూర్తి పేర్కొంది. ధనవంతులకైనా, పేదవారికైనా, అందమైనవారికైనా, వికారమైనవారికైనా.. అందరికీ దేవుడు 24 గంటలు మాత్రమే ఇచ్చాడు అని ఆమె చెప్పింది. దానిని ఎలా ఖర్చు చేయాలనేది పూర్తిగా మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుందని అన్నారు. మీకు మీరు చేసే పనిమీద ఆసక్తి ఉంటే.. మీ భాగస్వామి కూడా దానికి తప్పకుండా మద్దతు ఇవ్వాలి అని సుధామూర్తి స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment