
వైవాహిక జీవితం సక్సెస్ కావడానికి సుధామూర్తి చెప్పిన కీలక సూచనలు
రాజ్యసభ ఎంపీ, ఇన్ఫోసిస్ కోఫౌండర్ నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రముఖ విద్యావేత్త, దాత, రచయితగా పేరు తెచ్చుకున్న సుధామూర్తి తనదైన సూచనలు, సలహాలతో తన అభిమానులకు ప్రేరణగా నిలుస్తుంటారు. ఇటీవల వైవాహిక జీవితంలో భార్యాభార్తల సఖ్యతకు పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన సూత్రాల గురించి తెలిపారు.
సుధామూర్తి చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతారు. ఆమె మాటతీరు, కట్టూ బొట్టూ, ప్రసంగాలు యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. ఆమె నవ దంపతులకు కూడా చాలా కీలకమైన సలహాలు ఇచ్చారు.
కలహాలు లేని కాపురం ఎక్కడా ఉండదు
భార్యభర్తలమధ్య తేడాలు, అభిప్రాయభేదాలు రాకుండా ఉండవు. వస్తాయి. కానీ వాటిని చిలికి చిలికి గాలి వానలా మారకుండా ఇరువురూ జాగ్రత్త పడాలి. అసలు కలహాలు,కలతలు లేని కాపురాలు ఎక్కడ ఉంటాయి. తగాదాలు పడని వాళ్లు భార్యభర్తలే కాదు అంటూ సుధామూర్తి తెలిపారు. కానీ ఒకరు గట్టిగా మాట్లాడినపుడు, ఆగ్రహంగా ఉన్నపుడు ఇంకొకరు తగ్గాలి. ఇద్దరూ అరుచుకుంటూ ఉంటే సమస్య పరిష్కారం కాదు. శాంతి, సహనం అనేది ఇద్దరి మధ్య ఉండాలి.
ఒకర్నొకరు గౌరవించుకోవాలి
ఒకళ్లు చెప్పింది మరొకరు వినాలి. ఒకరి విజ్ఞానాన్ని మరొకరు పంచుకోవాలి. ఒకరి అభిప్రాయాల్ని ఒకరు గౌరవించుకోవాలి.థ్యాంక్స్ చెప్పుకోవడం, ప్రశంసించుకోవడం ద్వారా ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం, ప్రేమ పెరుగుతుంది. భాగస్వామి చేసే చిన్న పనులను గుర్తించి మెచ్చుకోవాలని సుధా మూర్తి సూచించారు. కొన్ని విషయాల్లో ఎవరు ఒకరు రాజీ పడాలి. మార్పునకు సిద్ధంగా ఉండాలి. రిలేషన్ షిప్ కోసం కొన్ని విషయాల్లో రాజీ పడడం దీర్ఘకాలిక సంతోషాల్ని పంచుతుంది.
బాధ్యలు బరువులు పంచుకోవాలి
ఇంట్లో, జీవితంలో బాధ్యతలను, బరువులను పంచుకోవడం చాలా ముఖ్యం. జీవితం అంటేనే కష్టనష్టాల పయనం. ఎవ్వరమూ పర్‌ఫెక్ట్ కాదు. లోటుపాట్లను గమనించుకొని అర్థం చేసుకొనిముందుకు సాగాలి. కష్టనష్టాలను, బరువు బాధ్యతలను సమానంగా పంచుకోవడంలోనే అసలైన భార్యభర్తల విలువ తెలుస్తుంది.
అబ్బాయిలకో సలహా
ముఖ్యంగా ఈతరం అబ్బాయిలకు చెప్పేది ఒకటే. వంటగదిలో భార్యకు సహాయం చేయడం అనేది చాలా ముఖ్యం. జీవితభాగస్వామి కష్టాల్ని, బాధ్యతల్ని పంచుకోవడం ద్వారా టీం వర్క్,భాగస్వామ్య అనేభావాలను పెంపొదిస్తుంది. ఆధునిక ప్రేమ అనే అంశంపై ఏర్నాటు చేసిన ఒక కాంక్లేవ్‌లో సుధామూర్తి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్బంగానే ఆమె యువ జంటలకు కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. దంపతులుగా తామూ ఈ విషయాలను పాటించామని, ఇవే తమ సక్సెస్ మంత్రా అని సుధామూర్తి వివరించారు.