heavy industries minister
-
ఈ–టూవీలర్లపై 10 వేలు
న్యూఢిల్లీ: త్వరలో అమల్లోకి రానున్న పీఎం ఈ–డ్రైవ్ పథకం కింద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనదారులు తొలి ఏడాదిలో గరిష్టంగా రూ. 10,000 వరకు సబ్సిడీని పొందవచ్చని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి తెలిపారు. ఈ స్కీమ్ ప్రకారం ఎలక్ట్రిక్ టూ–వీలర్ల విషయంలో బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి కిలోవాట్ అవర్‌కు (కేడబ్ల్యూహెచ్) సబ్సిడీని రూ. 5,000గా నిర్ణయించినట్లు చెప్పారు. అయితే, తొలి ఏడాది ఇది మొత్తమ్మీద రూ. 10,000కు మించదు. రెండో ఏడాది ఇది కిలోవాట్ అవర్‌కు సగానికి తగ్గి రూ. 2,500కు పరిమితమవుతుంది. మొత్తమ్మీద సబ్సిడీ రూ. 5,000కు మించదు. ఇక, ఈ–రిక్షా కొనుగోలుదారులు తొలి ఏడాది రూ. 25,000 వరకు, రెండో ఏడాది రూ. 12,500 వరకు సబ్సిడీ ప్రయోజనాలు పొందవచ్చని కుమారస్వామి చెప్పారు. కార్గో త్రీ వీలర్లకు తొలి ఏడాది రూ. 50,000, రెండో ఏడాది రూ. 25,000 సబ్సిడీ లభిస్తుంది. స్కీమ్ ప్రకారం పీఎం ఈ–డ్రైవ్ పోర్టల్‌లో ఆధార్ ఆధారిత ఈ–వోచర్ జారీ అవుతుంది. కొనుగోలుదారు, వినియోగదారు దానిపై సంతకం చేసి పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. ప్రోత్సాహకాన్ని పొందేందుకు కొనుగోలుదారు సెల్ఫీని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 25 లక్షల టూ–వీలర్లకు.. పీఎం ఈ–డ్రైవ్ పథకం కింద వివిధ రకాల ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు రూ. 3,679 కోట్ల మేర సబ్సిడీలు/ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు కుమారస్వామి చెప్పారు. మొత్తం మీద 24.79 లక్షల ఈ–టూవీలర్లు, 3.16 లక్షల ఈ–త్రీ వీలర్లు, 14,028 ఈ–బస్సులకు స్కీముపరమైన తోడ్పాటు ఉంటుందన్నారు. ప్రస్తుతం ఓలా, టీవీఎస్, ఏథర్ ఎనర్జీ, హీరో విడా, బజాజ్ చేతక్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరల శ్రేణి రూ. 90,000 నుంచి రూ. 1.5 లక్షల వరకు ఉంది. ఈవీల వినియోగానికి ప్రోత్సాహం.. పీఎం ఈ–డ్రైవ్ స్కీమును ఆటోమొబైల్ దిగ్గజాలు స్వాగతించాయి. ఈవీల వినియోగం జోరందుకుంటుందని, ఫాస్ట్ చార్జింగ్ మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెట్టడం కూడా ఈవీలపై వినియోగదారుల నమ్మకాన్ని పెంపొందిస్తుందని మహీంద్రా గ్రూప్ సీఈవో అనీష్ షా తెలిపారు. ఉద్గారాల విషయంలో వేగంగా తటస్థ స్థాయిని సాధించేందుకు స్కీమ్ ఉపయోగపడుతుందని టాటా మోటార్స్ ఈడీ గిరీష్ వాఘ్ చెప్పారు. ఈవీ రంగం వేగంగా విస్తరించేందుకు పథకం తోడ్పడుతుందని ఓలా ఫౌండర్ భవీష్ అగర్వాల్ తెలిపారు. -
దేశీయంగా తయారీకి ప్రాధాన్యమివ్వండి
న్యూఢిల్లీ: దేశీయంగా తయారీకి ప్రాధాన్యమివ్వాలని ఆటో విడిభాగాల పరిశ్రమకు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే సూచించారు. క్షేత్రస్థాయిలో స్థానికీకరణపై దృష్టి పెట్టాలని.. పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) కార్యకలాపాలపై మరింతగా ఇన్వెస్ట్ చేయాలని పేర్కొన్నారు. అలాగే సిబ్బందికి కొత్త నైపుణ్యాల్లో శిక్షణనిప్పించడంపైనా ఇన్వెస్ట్ చేయాలని తెలిపారు. ఆటోమోటివ్ విడిభాగాల తయారీ సంస్థల అసోసియేషన్ ఏసీఎంఏ 61వ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు పేర్కొన్నారు. ‘‘స్థానికంగా తయారీకి ప్రాధాన్యం లభించాలన్నది ప్రధాని మోదీ ఉద్దేశ్యం. పరిశ్రమ కూడా స్థానికీకరణ ప్రక్రియపై కసరత్తు చేస్తోందని నాకు తెలుసు. సియామ్ (వాహనాల తయారీ సంస్థల సమాఖ్య), ఏసీఎంఏ స్థానికీకరణ మార్గదర్శ ప్రణాళికను కూడా రూపొందించాయి. దాన్ని క్షేత్ర స్థాయిలో అమలు చేయాలని పరిశ్రమను కోరుతున్నాను’’ అని ఆయన తెలిపారు. ప్రధానంగా ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి ఆర్అండ్డీ కార్యకలాపాలపై మరింతగా ఇన్వెస్ట్ చేయాలని పేర్కొన్నారు. ఆటో విడిభాగాల పరిశ్రమకు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 2.3 శాతం వాటా ఉందని, 50 లక్షల మందికి పైగా ఉపాధి కల్పిస్తోందని ఆయన చెప్పారు. ప్రస్తుతం 60 శాతం ఆటో విడిభాగాల ఎగుమతులు ఉత్తర అమెరికా, యూరప్ దేశాలకు వెడుతున్నాయని తెలిపారు. వచ్చే అయిదేళ్లలో 2025–26 నాటికి ఎగుమతులను 30 బిలియన్ డాలర్ల స్థాయికి పెంచుకోవాలని ప్రభుత్వం నిర్దేశించుకుందని, తద్వారా అంతర్జాతీయ మార్కెట్లో దేశీ పరిశ్రమ వాటా 3 శాతానికి చేరగలదని వివరించారు. అలాగే 2025 నాటికి ఆటో విడిభాగాల రంగంలో ఉద్యోగాల సంఖ్య 70 లక్షలకు చేరగలదన్నారు. 2021 ఆర్థిక సంవత్సరంలో ఆటోమోటివ్ ఎగుమతులు 13 బిలియన్ డాలర్లుగా ఉండగా, 1.3 లక్షల కోట్ల డాలర్ల అంతర్జాతీయ మార్కెట్లో భారత్‌కు 1.2 శాతం వాటా ఉంది. ఏసీఎంఏలో 800 పైచిలుకు తయారీ సంస్థలు ఉన్నాయి. వీటికి సంఘటిత ఆటో విడిభాగాల పరిశ్రమ టర్నోవరులో 85 శాతం పైగా వాటా ఉంది. ఎలాంటి టెక్నాలజీలనైనా స్థానికంగా వినియోగంలోకి తెచ్చేందుకు తగినంత సమయం లభించేలా దీర్ఘకాలికమైన, స్థిరమైన మార్గదర్శ ప్రణాళిక అవసరమని ఏసీఎంఏ ప్రెసిడెంట్ దీపక్ జైన్ అభిప్రాయపడ్డారు. దిగుమతులపై ఆధారపడటం తగ్గాలి: కాంత్ దేశీ ఆటోమొబైల్, విడిభాగాల రంగాలు చైనా నుంచి దిగుమతులపై ఆధారపడటం నుంచి పూర్తిగా బైటికి రావాలని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ సూచించారు. ఆటో విడిభాగాలు మొదలైన వాటన్నింటినీ దేశీయంగా తయారు చేసుకోవడంపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. ఫేమ్ 2 పథకం కింద ఎంపికైన తొమ్మిది నగరాల్లో ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించిన ప్రక్రియ పూర్తయిన తర్వాత నాలుగు చక్రాల వాహనాలకు (కార్లు మొదలైన వాటికి) కూడా స్కీమును వర్తింపచేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తుందని ఆయన చెప్పారు. 2030 నాటికి కార్లన్నీ ఎలక్ట్రిక్: నిస్సాన్ వాహన తయారీ రంగంలో భారత్‌లో అపార అవకాశాలు ఉన్నాయని నిస్సాన్ మోటార్ కార్పొరేషన్ తెలిపింది. ఎలక్ట్రిక్ వాహన విభాగం కారణంగా పరిశ్రమలో సమూల మార్పులు వస్తాయని కంపెనీ సీవోవో అశ్వని గుప్తా అన్నారు. 2030 నాటికి కంపెనీ కార్లన్నీ ఎలక్ట్రిక్ ఆప్షన్స్‌తో ఉంటాయని వెల్లడించారు. ‘భారత వాహన పరిశ్రమ ప్రపంచంలో నాల్గవ స్థానంలో ఉంది. అయిదారేళ్లలో మూడవ స్థానానికి చేరడం ఖాయం. దేశంలో 1,000 మంది జనాభాకు 20 కార్లు మాత్రమే ఉన్నాయి. ఈ అవకాశాన్ని ఎలా చేజిక్కించుకోవాలన్నదే పెద్ద సవాల్’ అని అన్నారు. -
e- vehicles: గుడ్‌న్యూస్.. తగ్గనున్న టూ వీలర్ ధరలు!
వెబ్‌డెస్క్ : ఎలక్ట్రికల్ వెహికల్ మార్కెట్‌కి మరింత ఊతం ఇచ్చే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఎలక్ట్రికల్ వెహికల్ తయారీ సంస్థలకు ఇస్తున్న సబ్సిడీని రెట్టింపు చేసింది. దీని వల్ల ఎలక్ట్రిక్ వెహికల్స్ ధరలు తగ్గి అమ్మకాలు పెరుగుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ మేరకు భారీ పరిశ్రమల శాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. 1 kWhకి రూ.15,000 ప్రస్తుతం ఈవీ వెహికల్స్ తయారీకి సంబంధించి కిలోవాట్ పర్ అవర్ సామర్థ్యం కలిగిన బైక్ తయారీ ధరలో 20 శాతంగా ఉన్న సబ్సిడీని 40 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఒక కిలోవాట్ పర్ అవర్ (kWh) సామర్థ్యం కలిగిన బైక్‌పై రూ. 15,000 సబ్సిడీ లభిస్తోంది. ఇలా 2 kWh బైక్‌పై రూ. రూ. 30,000 సబ్సిడీ 3 kWh బైక్‌పై రూ. 45,000 వరకు సబ్సిడీ లభిస్తోంది. లక్షన్నర ధర మించని బైకులకు ఈ సబ్సడీ వర్తిస్తుందని కేంద్రం ప్రకటించింది. అథర్ స్పందన ఈవీ వెహికల్స్‌పై సబ్సిడీని ఒకేసారి 50 శాతానికి పైగా పెంచడంతో అథర్ సంస్థ తన స్కూటర్ల ధరలను వెంటనే తగ్గించింది. అథర్ 450ఎక్స్ మోడల్‌పై రూ. 14,500 ధర తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఈవీ అమ్మకాలు జోరందుకుంటాయని అథర్ ఫౌండర్ తరుణ్ మెహతా ప్రకటించారు. రివోల్ట్ మోటార్స్ దీన్ని గేమ్ ఛేంజర్‌గా ప్రకటించింది. మరిన్ని కంపెనీలు ధరలు తమ ఈవీల తగ్గించే పనిలో పడ్డాయి. డిమాండ్ పెంచేందుకే ప్రస్తుతం మార్కెట్లో మైలేజ్, ఛార్జింగ్ పరంగా 2 kWh సామార్థ్యం ఉన్న బైకులు పెట్రోలు బైకులకు ప్రత్యామ్నయంగా ఉన్నాయి. అయితే ధరల విషయంలో పోల్చినప్పుడు పెట్రోలు బైకుల కంటే ఈవీ బైకుల ధరలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో కష్టమర్ల నుంచి ఆశించిన మేరకు డిమాండ్ రావడం లేదు. దీంతో సబ్సిడీ ఇవ్వడం ద్వారా వెహికల్స్ ధర తగ్గించి, డిమాండ్ పెంచేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఫేమ్ 2 ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడకాన్ని పెంచేందుకు కేంద్రం ప్రత్యేకంగా ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ (FAME) పథకాన్ని అమల్లోకి తెచ్చింది. తాజాగా ఫేమ్ 2లో భాగంగా సబ్సిడీ మొత్తాన్ని పెంచింది. దీని కోసం కేంద్రం రూ. 10,000 కోట్లు కేటాయించింది. Govt of India doubles down on its commitment towards #goingelectric. Subsidy for electric 2W increases under #FAME2 incentives. Which means a whopping ₹14,500 additional subsidy on the #ATHER450X. Haven't booked it yet? Now seems like a good time: https://t.co/HNCOb2bGc9 pic.twitter.com/t2qD3c5Qq6 — Ather Energy (@atherenergy) June 11, 2021 చదవండి: బాబోయ్ పెట్రోల్.. భవిష్యత్తు హైపర్ ఛార్జర్లదే -
భారీ పరిశ్రమల శాఖా మంత్రిగా ప్రకాశ్ జవదేకర్
సాక్షి, ఢిల్లీ : మహారాష్ట్రలో బీజేపీ - శివసేన పార్టీల మధ్య విభేదాల నేపథ్యంలో కేంద్ర మంత్రి పదవికి సోమవారం రాజీనామా చేసిన సేన నేత అరవింద్ సావంత్ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. ఆయన నిర్వహించిన శాఖకు మంత్రిగా కేబినెట్ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను నియమించారు. ప్రధాన మంత్రి సలహా మేరకు రాష్ట్రపతి ఈ నిర్ణయం తీసుకున్నారని రాష్ట్రపతిభవన్ వర్గాలు మంగళవారం పేర్కొన్నాయి. ప్రకాశ్ జవదేకర్ ఇప్పటికే పర్యావరణ, అటవీ, సమాచార శాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు వీటికి అదనంగా భారీ పరిశ్రమల శాఖా మంత్రిగా కూడా వ్యవహరించనున్నారు. మరోవైపు మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో సస్పెన్స్ కొనసాగుతోంది. -
కొత్త ఏడాదిలో తెలంగాణ
సిద్దిపేట జోన్/ సిద్దిపేట మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: కొన్ని దశాబ్ధాల తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం సాకారం కాబోతోందనీ, కొత్త ఏడాదిలో కొత్త రాష్ట్రం తప్పకుండా ఏర్పడి తీరుతుందని భారీ పరిశ్రమల శాఖ మంత్రి జే.గీతారెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీకి వచ్చే తెలంగాణ బిల్లుపై చర్చ మాత్రమే జరుగుతుందని ఆమె వెల్లడించారు. సిద్దిపేట అంబేద్కర్‌నగర్‌లో రూ.20 లక్షల ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో నిర్మించనున్న అంబేద్కర్ కమ్యూనిటీ భవనానికి శంఖుస్థాపన చేసిన ఆమె, అనంతరం చైతన్యపురి కాలనీలో గౌతమ బుద్ధుని విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ పట్టుదలతోనే తెలంగాణ బిల్లును రాష్ట్రానికి వచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు నేటికీ అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అసెంబ్లీలో బిల్లుపై చర్చమాత్రమే జరుగుతుందనీ, అనంతరం తిరిగి రాష్ర్టపతి వద్దకు వెళ్తుందన్నారు. అక్కడి నుంచి తిరిగి పార్లమెంట్లో బిల్లు ప్రవేశ పెట్టడం ద్వారా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం అవుతుందన్నారు. బిల్లును శాసనసభలో త్వరగా చర్చించి రాష్ట్రపతికి పంపాలని తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఇప్పటికే ఏకగ్రీవ తీర్మానం చేశామన్నారు. సోనియా అశీస్సులతో తెలంగాణ రావడం ఖయమన్నారు. తెలంగాణ తేచ్చేది, ఇచ్చేది కేవలం కాంగ్రెస్ పార్టీనేని, ఇతర పార్టీలకు అది సాధ్యం కాదన్నారు. దళిత వర్గాల దేవుడు అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అన్ని వర్గాల వారికీ స్ఫూర్తి ప్రదాత అయినప్పటికీ, దళిత వర్గాలకు మాత్రం ఆయన దేవుడని మంత్రి గీతారెడ్డి అన్నారు. తాను అనుభవించిన వివక్ష భావితరాలు అనుభవించకూడదన్న లక్ష్యంతోనే అంబేద్కర్, దళితుల అభివృద్ధికి రాజ్యాగం ద్వారా రిజర్వేషన్లు కల్పించారన్నారు. అయితే 33 సంవత్సరాలుగా దళితులకు కేటాయిస్తున్న నిధులు ఆ వర్గాలకు అందకుండా దారి తప్పాయని ఆవేదన వ్యక్తం చేశారు. సోనియా గాంధీ స్ఫూర్తితో దేశ ప్రధాని సబ్‌ప్లాన్ చట్ట ఆమలుకు చర్యలు తీసుకున్నారన్నారు. దళితుల నిధులు వారికే వినియోగించేలా డిప్యూటీ సీఎంతో పాటు రాష్ర్టంలోని దళిత , గిరిజన ప్రజా ప్రతినిధులు సీఎంపై వత్తిడి తీసుకువచ్చి సబ్‌ప్లాన్ చట్టం అమలయ్యేలా చూశామన్నారు. ఇది సమష్టి విజయమని ఆమె అభివర్ణించారు. బుద్ధ విగ్రహం...దళితుల స్ఫూర్తికి చిహ్నం అంతకుముందు బుద్ధుని విగ్రహాన్ని ఆవిష్కరించిన గీతారెడ్డి మాట్లాడుతూ, బుద్ధుని సిద్దాంతాలకు అనుగుణంగానే అంబేద్కర్ కఠోరంగా శ్రమించి దళితుల అభివృద్ధికి బాటలు వేశారన్నారు. సిద్దిపేటలో బుద్ధుని విగ్రహ ఏర్పాటు దళితుల స్ఫూర్తికి చిహ్నంలాంటిదన్నారు. సిద్దిపేటలోని దళితుల సాగు భూముల సమస్యను జిల్లా కలెక్టర్, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని ఆమె ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్, పీసీసీ కార్యదర్శులు గంప మహేందర్‌రావు, సుప్రభాతరావు, తెలంగాణ దళిత సంఘాల జేఏసీ కన్వీనర్ బత్తుల చంద్రం, నాయకులు భూంపల్లి మనోహర్, తాడూరి శ్రీనివాస్‌గౌడ్, సాకి అనంద్, సికిందర్, వహీద్‌ఖాన్, ప్రభాకర్‌వర్మ, బొమ్మల యాదగిరి, నర్సింలు, ఐలయ్య, మహేష్, నాగరాజు, బాబురావు, కనకయ్యతో పాటు ఆర్డీవో ముత్యంరెడ్డి, తహశీల్దార్ గిరి, ఇన్చార్జి కమిషనర్ లక్ష్మణ్, ఏఈ ఇంతియాజ్ పాల్గొన్నారు. కూలిన సభావేదిక మంత్రి గీతారెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్‌లు బుద్ధుని విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం సభావేదికపైకి చేరుకోగా, స్థానిక నేతలంతా ఒక్క సారిగా వేదిక మీదకు వచ్చేశారు. దీంతో సభావేదికలోని ఓ వైపు భాగం అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ఘటనతో వేదికపైనున్న మంత్రి గీతారెడ్డి కూర్చీతో పాటు తూలిపడ్డారు. అనంతరం మాట్లాడిన గీతారెడ్డి బుద్ధుని దయ, ప్రజల అభిమానంతోనే తనకు ఏమీ కాలేదన్నారు. అయితే వేదిక కూలిన విషయం వివిధ ఛానళ్లల్లో విస్తృతంగా ప్రచారం కావడంతో అభిమానుల పరామర్శల తాకిడి ఎక్కువైందని ఆమె చమత్కరించారు.