కొత్త ఏడాదిలో తెలంగాణ | telangana comes in new year | Sakshi
Sakshi News home page

కొత్త ఏడాదిలో తెలంగాణ

Published Sun, Dec 15 2013 12:09 AM | Last Updated on Sat, Sep 2 2017 1:36 AM

telangana comes in new year

సిద్దిపేట జోన్/ సిద్దిపేట మున్సిపాలిటీ, న్యూస్‌లైన్:  కొన్ని దశాబ్ధాల తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం సాకారం కాబోతోందనీ, కొత్త ఏడాదిలో కొత్త రాష్ట్రం తప్పకుండా ఏర్పడి తీరుతుందని భారీ పరిశ్రమల శాఖ మంత్రి జే.గీతారెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీకి వచ్చే తెలంగాణ బిల్లుపై చర్చ మాత్రమే జరుగుతుందని ఆమె వెల్లడించారు. సిద్దిపేట అంబేద్కర్‌నగర్‌లో రూ.20 లక్షల ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో నిర్మించనున్న అంబేద్కర్ కమ్యూనిటీ భవనానికి శంఖుస్థాపన చేసిన ఆమె, అనంతరం చైతన్యపురి కాలనీలో గౌతమ బుద్ధుని విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ పట్టుదలతోనే తెలంగాణ బిల్లును రాష్ట్రానికి వచ్చిందన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు నేటికీ అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అసెంబ్లీలో బిల్లుపై చర్చమాత్రమే జరుగుతుందనీ, అనంతరం తిరిగి రాష్ర్టపతి వద్దకు వెళ్తుందన్నారు. అక్కడి నుంచి తిరిగి పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశ పెట్టడం ద్వారా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం అవుతుందన్నారు. బిల్లును శాసనసభలో త్వరగా చర్చించి రాష్ట్రపతికి పంపాలని తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఇప్పటికే ఏకగ్రీవ తీర్మానం చేశామన్నారు. సోనియా అశీస్సులతో తెలంగాణ రావడం ఖయమన్నారు. తెలంగాణ తేచ్చేది, ఇచ్చేది కేవలం కాంగ్రెస్ పార్టీనేని, ఇతర పార్టీలకు అది సాధ్యం కాదన్నారు.
 దళిత వర్గాల దేవుడు అంబేద్కర్
 రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అన్ని వర్గాల వారికీ స్ఫూర్తి ప్రదాత అయినప్పటికీ, దళిత వర్గాలకు మాత్రం ఆయన దేవుడని మంత్రి గీతారెడ్డి అన్నారు. తాను అనుభవించిన వివక్ష భావితరాలు అనుభవించకూడదన్న లక్ష్యంతోనే అంబేద్కర్, దళితుల అభివృద్ధికి రాజ్యాగం ద్వారా రిజర్వేషన్‌లు కల్పించారన్నారు. అయితే  33 సంవత్సరాలుగా దళితులకు కేటాయిస్తున్న నిధులు ఆ వర్గాలకు అందకుండా దారి తప్పాయని ఆవేదన వ్యక్తం చేశారు. సోనియా గాంధీ స్ఫూర్తితో దేశ ప్రధాని సబ్‌ప్లాన్ చట్ట ఆమలుకు చర్యలు తీసుకున్నారన్నారు. దళితుల నిధులు వారికే వినియోగించేలా డిప్యూటీ సీఎంతో పాటు రాష్ర్టంలోని దళిత , గిరిజన ప్రజా ప్రతినిధులు  సీఎంపై వత్తిడి తీసుకువచ్చి సబ్‌ప్లాన్ చట్టం అమలయ్యేలా చూశామన్నారు. ఇది సమష్టి విజయమని ఆమె అభివర్ణించారు.
 బుద్ధ విగ్రహం...దళితుల స్ఫూర్తికి చిహ్నం
 అంతకుముందు బుద్ధుని విగ్రహాన్ని ఆవిష్కరించిన గీతారెడ్డి మాట్లాడుతూ, బుద్ధుని సిద్దాంతాలకు అనుగుణంగానే అంబేద్కర్ కఠోరంగా శ్రమించి దళితుల అభివృద్ధికి బాటలు వేశారన్నారు. సిద్దిపేటలో బుద్ధుని విగ్రహ ఏర్పాటు దళితుల స్ఫూర్తికి చిహ్నంలాంటిదన్నారు. సిద్దిపేటలోని దళితుల సాగు భూముల సమస్యను జిల్లా కలెక్టర్, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని ఆమె ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్, పీసీసీ కార్యదర్శులు గంప మహేందర్‌రావు, సుప్రభాతరావు, తెలంగాణ దళిత సంఘాల జేఏసీ కన్వీనర్ బత్తుల చంద్రం, నాయకులు భూంపల్లి మనోహర్, తాడూరి శ్రీనివాస్‌గౌడ్, సాకి అనంద్, సికిందర్, వహీద్‌ఖాన్, ప్రభాకర్‌వర్మ, బొమ్మల యాదగిరి, నర్సింలు, ఐలయ్య, మహేష్, నాగరాజు, బాబురావు, కనకయ్యతో పాటు ఆర్డీవో ముత్యంరెడ్డి, తహశీల్దార్ గిరి, ఇన్‌చార్జి కమిషనర్ లక్ష్మణ్, ఏఈ ఇంతియాజ్ పాల్గొన్నారు.
 కూలిన సభావేదిక
 మంత్రి గీతారెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్‌లు బుద్ధుని విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం సభావేదికపైకి చేరుకోగా, స్థానిక నేతలంతా ఒక్క సారిగా వేదిక మీదకు వచ్చేశారు. దీంతో సభావేదికలోని ఓ వైపు భాగం అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ఘటనతో వేదికపైనున్న మంత్రి గీతారెడ్డి కూర్చీతో పాటు తూలిపడ్డారు. అనంతరం మాట్లాడిన గీతారెడ్డి బుద్ధుని దయ,  ప్రజల అభిమానంతోనే తనకు ఏమీ కాలేదన్నారు. అయితే వేదిక కూలిన విషయం వివిధ ఛానళ్లల్లో విస్తృతంగా ప్రచారం కావడంతో అభిమానుల పరామర్శల తాకిడి ఎక్కువైందని ఆమె చమత్కరించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement