
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఈవో గీతారెడ్డి గురువారం రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను వెంటనే ఆమోదించిన అధికారులు, ఆలయ నూతన ఈవోగా దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణారావును నియమించారు. 2014 డిసెంబర్ 2న గీతారెడ్డి యాదాద్రి ఆలయ ఈవోగా బాధ్యతలు తీసుకున్నారు. తొమ్మిదేళ్ల పాటు ఆమె ఈవోగా బాధ్యతల్లో ఉన్నారు.
గీతారెడ్డి 2020 ఫిబ్రవరి 28న పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. యాదాద్రి ఆలయ అభివృద్ధి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక సంవత్సరం పాటు అంటే 2021 ఫిబ్రవరి 28వ తేదీ వరకు గీతారెడ్డి సర్వీసును పొడిగించింది. అనంతరం ప్రధాన ఆలయ ఉద్ఘాటన నేపథ్యంలో ఆమె పదవీ కాలాన్ని బీఆర్‌ఎస్ ప్రభుత్వం మళ్లీ పొడిగించింది.
మరో అధికారిని ఈవోగా నియమించే వరకు గీతారెడ్డినే ఆలయ ఈవోగా కొనసాగుతారని జీవో ఇచి్చంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పదవీ విరమణ పొందిన ప్రభుత్వ అధికారులంతా తమ రాజీనామాలు సమరి్పస్తుండటంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో గీతారెడ్డి రాజీనామా చేశారు.
రామకృష్ణారావు బాధ్యతల స్వీకరణ..
యాదాద్రి ఆలయ నూతన ఈవోగా దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణారావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఆయన గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్టా అలంకార మూర్తులను దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రామకృష్ణారావుకు ప్రధాన కార్యాలయంలో గీతారెడ్డి బాధ్యతలను అప్పగించారు.