జహీరాబాద్: గతంలో నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆరుగురిలో ముగ్గురికి మాత్రం మంత్రివర్గలో చోటు లభించింది. కాంగ్రెస్ హయాంలోనే ఎం.బాగారెడ్డి, ఎండీ ఫరీదుద్దీన్, జె.గీతారెడ్డిలకు మంత్రి పదవులు దక్కాయి. అప్పుడు కాంగ్రెస్ తరఫున గెలిచిన పి.నర్సింహారెడ్డి, టీడీపీ తరఫున గెలిచిన సి.బాగన్న, బీఆర్‌ఎస్ తరఫున గెలుపొందిన కె.మాణిక్‌రావులకు మంత్రి పదవులు దక్కలేదు. అప్పుడు వారి ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి.
1957 నుంచి 1985 వరకు జరిగిన ఏడు పర్యాయాలు వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎం.బాగారెడ్డి గెలుపొందారు. పలువురి మంత్రి వర్గంలో బాగారెడ్డికి చోటు లభించింది. చక్కెర పరిశ్రమలు, భారీ పరిశ్రమలు, పంచాయతీరాజ్ తదితర శాఖలను ఆయన నిర్వహించారు. 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎండీ ఫరీదుద్దీన్ మొదటి సారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో ఆయన తిరిగి గెలుపొందడంతో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి మంత్రి వర్గంలో చోటు లభించింది.
వక్ఫ్, మైనార్టీ సంక్షేమం, మత్యశాఖలను నిర్వహించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అప్పట్లో జహీరాబాద్ అసెంబ్లీ ఎస్సీలకు రిజర్వు కావడంతో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి గీతారెడ్డికి గజ్వేల్ నుంచి జహీరాబాద్‌కు మార్చారు. ఆ ఎన్నికల్లో ఆమె గెలుపొందడంతో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా అవకాశం దక్కింది. 2014 ఎన్నికల్లో తాను ఓటమి పాలవ్వగా బీఆర్‌ఎస్ అభ్యర్థి కె.మాణిక్‌రావు గెలుపొందారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చినా ఆయనకు మాత్రం మంత్రివర్గంలో అవకాశంలభించలేదు.
పదవులు దక్కలేదు..
1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన పి.నర్సింహారెడ్డి గెలుపొందారు. రాష్ట్రంలో అప్పట్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఆయనకు మంత్రి యోగం కలుగలేదు. 1994 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన సి.బాగన్న ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పట్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న నందమూరి తారకరామారావు ఆయనకు మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తామని సీఎం పేషీ నుంచి ఆహ్వానం అందింది.
మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి సైతం బాగన్న తన అనుచర గణంతో హాజరయ్యారు. చివరి వరకు వేచి చూసినా ఆయనకు పిలుపు రాలేదు. మంత్రి వర్గంలో చోటు లభించలేదు. దీంతో ఆయన అసంతృప్తితో వెనుదిరగడం అప్పట్లో చర్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment