సంగారెడ్డి: జిల్లాలో రైతుబంధు సాయం నత్తనడకన సాగుతోంది. ఇప్పటివరకు రెండెకరాల భూమి ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు జమయ్యాయి. మిగతావారు పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడి సాయం విడుదల చేస్తున్నామని నెలరోజుల క్రితం ప్రకటించింది. ఇప్పటివరకు పూర్తిస్థాయిలో రైతుల ఖాతాల్లో దానికి సంబంధించిన డబ్బు జమ కాలేదు. రెండెకరాల భూమి ఉన్న రైతులకు మాత్రమే వారికి మాత్రమే పెట్టుబడి అందిందని రైతాంగం పేర్కొంటోంది. ఈ నెలాఖరు వరకు అర్హులందరికీ రైతు బంధు అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే యాసంగి పనులు మొదలయ్యాయి. సాయం సకాలంలో అందక సాగు కోసం రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తుంది.
కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు పథకం పేరును రైతు భరోసాగా మార్చింది. ఎకరం భూమికి ఒక్కో సీజన్‌లో రూ.7,500 వంతున సాయం అందిస్తామని ఎన్నికల ముందు ప్రకటించింది. రైతు భరోసా విధి విధానాలు ఇంకా ఖరారు కాకపోవడంతో ఈ సీజన్‌కు గాను పాత విధానంలోనే ఎకరానికి రూ.5వేల వంతున సాయం అందిస్తోంది. సంగారెడ్డి జిల్లాలో 4,16,210 మంది రైతులు ఉన్నారు. ఈ సీజన్‌కు గాను రూ.393.21 కోట్ల మేర పెట్టుబడి సాయం రైతాంగం ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు రూ.108 కోట్ల మేర రైతుల ఖాతాల్లో జమచేయడం జరిగిందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఎకరం లోపు ఉన్న కొంత మంది రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమకాలేదని పేర్కొంటున్నారు.
పెట్టుబడి సాయాన్ని ఐదెకరాలకు కుదించడం, ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లించే వారు, బడా వ్యాపారులు, ఆర్థికంగా వృద్ధి చెందిన వారికి ఇవ్వకూడదనే డిమాండ్ ముందు నుంచి వినిపిస్తోంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇదేమీ పరిగణనలోకి తీసుకోకుండా భూమి ఉండి.. పట్టాపాసు పుస్తకం పొందిన ప్రతి ఒక్కరికీ రైతుబంధు నిధులు జమ చేసింది. వందల ఎకరాల భూమి ఉన్న రైతులు, వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు, ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులకు కూడా పెట్టుబడి సాయం తీసుకున్నారు. ఈ విధానంతో రాష్ట్ర ఖజానా దివాలా తీసే పరిస్థితి ఏర్పడిందని అప్పట్లో ప్రతిపక్షాలు విమర్శించాయి.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా కింద అందించే సాయం విషయంలో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా సాగుతుందని ప్రకటించారు. యాసంగి సీజన్ సమయం మొదలు కావడంతో ఇప్పుడు విధి విధానాలు రూపొందించి సాయం జమచేయాలంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతం పాత పద్ధతిలోనే నిధులు జమచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వర్షాకాలం సీజన్ వరకు కొత్త మార్గదర్శకాలతో పెట్టుబడి సాయం జమచేసే అవకాశం ఉంది. పాత పద్ధతిలోనైనా మెజార్టీ రైతులకు సాయం అందలేదు. ప్రభుత్వ ఖజానాలో నిధుల కొరత కారణంగా జాప్యం జరుగుతోందనే అభిప్రాయం అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పెట్టుబడి సాయం త్వరగా అందించాలని రైతాంగం కోరుతోంది.
నెలాఖరుకు ఖాతాల్లో జమ
రైతు బంధు విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ నెలాఖరు వరకు అందరి ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. ఇప్పటి వరకు రెండున్నర ఎకరాలు ఉన్న రైతుల ఖాతాల్లో జమ చేశాం. ఇప్పటివరకు రూ.108 కోట్ల మేర రైతుల ఖాతాల్లో వేశాం.
–నర్సింహారావు, జేడీఏ, సంగారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment