సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: నారాయణఖేడ్ కాంగ్రెస్‌లో ఉప్పు, నిప్పు అన్నట్లుగా ఉన్న ఇద్దరు ముఖ్యనేతల మధ్య సయోధ్య కుదుర్చేందుకు రాష్ట్ర నాయకత్వం చర్యలు చేపట్టింది. మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్, పీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ సంజీవరెడ్డిల సమన్వయానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. నేడో, రేపో తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల కమిటీ (టీపీఈసీ) సభ్యులు, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావుఠాక్రే పిలిపించి మాట్లాడాలని నిర్ణయించారు. ఇప్పటికే ఇద్దరితో జహీరాబాద్‌కు చెందిన ఓ కీలక నాయకుడు చర్చలు జరిపారు. కాంగ్రెస్‌కు పట్టున్న నియోజకవర్గంలో కీచులాటలు తీవ్రనష్టాన్ని తెస్తోంది. ఒకరు పోటీలో ఉంటే మరొకరు ఇందుకు సహకరించకపోవడంతో ఇతర పార్టీలకు కలిసొస్తోంది. ఈ సమస్యను అధిగమించకపోతే వచ్చే ఎన్నికల్లో పరాజయం పునరావృతం అవుతుందని భావిస్తున్న అధినాయకత్వం.. ఇప్పటి నుంచి జాగ్రత్తగా అడుగులు వేస్తోంది.
వైఎస్సార్ ఫార్ములా ప్రయోగించేందుకు..
ఈ నియోజకవర్గంలో గతంలో సంజీవరెడ్డి తండ్రి పట్లోళ్ల కిష్టారెడ్డికి, సురేష్‌షెట్కార్ మధ్య ఇదే పరిస్థితి ఉండేది. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అప్పట్లో వారిద్దరికి సయోధ్య కుదిర్చారు. షెట్కార్‌ను జహీరాబాద్ ఎంపీగా, కిష్టారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. ఇదే ఫార్ములాను ఇప్పుడు కాంగ్రెస్ అనుసరించాలని భావిస్తోంది. ఒకరిని ఎంపీ అభ్యర్థిగా, మరొకరిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలనే యోచనలో ఉంది. వీలు కాని పక్షంలో ఒకరికి ఎమ్మెల్సీ ఇవ్వాలనే ప్రతిపాదనను తెరపైకి తెస్తోంది.
ఆసక్తికరమైన పరిణామాలు
ఖేడ్ కాంగ్రెస్‌లో ఇటీవల ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. సంజీవరెడ్డి.. సురేశ్ నివాసానికి వెళ్లి ఆయనతో మాట్లాడగా, ఇటీవల జరిగిన కిష్టారెడ్డి వర్ధంతి కార్యక్రమానికి షెట్కార్ కూడా హాజరుకావడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
తార స్థాయిలో కీచులాటలు
ఈ నియోజకవర్గంలో షెట్కార్, సంజీవరెడ్డిల మధ్య కీచులాటలు తార స్థాయిలో ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ రెండు వర్గాలుగా విడిపోయింది. పార్టీ కార్యక్రమాలు కూడా వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. ఇటీవల మండల, పట్టణ అధ్యక్షుల నియామక విషయమై కూడా వివాదానికి దారితీసింది. షెట్కార్ అనుచరులకే అధ్యక్ష పదవులన్నీ దక్కడంపై సంజీవరెడ్డి భగ్గుమన్నారు. దీనిపై పీసీసీకి ఫిర్యాదు చేశారు. ఒకానొకదశలో గాంధీభవన్‌ను సైతం ముట్టడించాలనే యోచనలో ఉన్నట్లు ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడు సమన్వయం చేయకపోతే ఈ స్థానాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి తప్పదని అధినాయకత్వం భావిస్తోంది. వెంటనే సయోధ్య కుదుర్చేందుకు సన్నాహాలు చేస్తుండటం ఆసక్తి కరంగా మారింది.
మద్దతు కూడగట్టే ప్రయత్నాలు..
పార్టీ అభ్యర్థిత్వం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్న వీరు పార్టీ ముఖ్యనేతల మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పీసీ సీ చీఫ్ రేవంత్‌రెడ్డి షెట్కార్‌ను ప్రోత్సహిస్తుండగా, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి తదితర ముఖ్యనేతలు సంజీవరెడ్డికి మద్దతుగా నిలుస్తున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేతో ఉన్న పరిచయాలతో ఎలాగైనా అభ్యర్థిత్వం దక్కించుకునేందుకు సురేశ్ విశ్వప్రయత్నాలు చేస్తున్నా రు. ఇద్దరు కూడా అధినాయత్వం మద్దతును కూడగట్టుకునే ప్రయత్నాల్లో ఉండటం పార్టీ అంతర్గత వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీస్తోంది. ఒకవేళ సయోధ్య కుదిరినప్పటికీ, వచ్చే ఎన్నికల్లో మనస్ఫూర్తిగా పని చేస్తారా? లేదా? అనేది ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment