ఎలక్ట్రిక్‌ త్రీవీలర్లు.. ‘ఫేమ్‌’! | three-wheel electric vehicle enters the last-mile delivery fray | Sakshi
Sakshi News home page

ఎలక్ట్రిక్‌ త్రీవీలర్లు.. ‘ఫేమ్‌’!

Published Fri, Mar 22 2019 5:41 AM | Last Updated on Fri, Mar 22 2019 5:41 AM

three-wheel electric vehicle enters the last-mile delivery fray - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశవ్యాప్తంగా ఏటా 10 లక్షల పైచిలుకు త్రీవీలర్లు తయారవుతున్నాయి. ఇందులో సుమారు 65 శాతం వాహనాలు దేశీయంగా అమ్ముడవుతున్నాయి. ఫేమ్‌–2 కింద ఇప్పుడు 5,00,000 ఎలక్ట్రిక్‌ త్రిచక్ర వాహనాలకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ప్రోత్సాహం ఇవ్వనుండడంతో ఈ రంగంలో అనూహ్య మార్పులు చోటు చేసుకోనున్నాయని కంపెనీలు అంటున్నాయి. ఒక్కో వాహనానికి బ్యాటరీ రకాన్నిబట్టి రూ.50 వేల నుంచి రూ.1 లక్ష వరకు సబ్సిడీ ఉండడంతో ఈ ఏడాది నుంచి అమ్మకాలు జోరుమీదుంటాయని చెబుతున్నాయి. 2020 నుంచి ఏటా అమ్ముడయ్యే త్రీవీలర్లలో 25% ఎలక్ట్రిక్‌ వాహనాలు ఉంటాయని పరిశ్రమ ధీమాగా ఉంది. ఫేమ్‌–టూ జోష్‌తో కొత్త మోడళ్ల రూపకల్పన, తయారీ సామర్థ్యం పెంపు, చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుపై కంపెనీలు దృష్టిసారించాయి. పట్టణాల్లో లాస్ట్‌ మైల్‌ కనెక్టివిటీకి ఎలక్ట్రిక్‌ త్రీవీలర్లే ఉత్తమ పరిష్కారమని డెలాయిట్‌ తన నివేదికలో వెల్లడించింది.

ఇదీ భారతీయ పరిశ్రమ..
సంప్రదాయ సైకిల్‌ రిక్షాల స్థానంలో క్రమంగా బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్‌ రిక్షాలు వచ్చి చేరుతున్నాయి. భారత్‌కు ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా, అమ్మకాలు వేగంగా పుంజుకుంటున్నాయి. దేశంలో 15 లక్షల పైచిలుకు ఎలక్ట్రిక్‌ త్రీవీలర్లు పరుగెడుతున్నాయి. 2017–18లో కొత్తగా 3.5 లక్షల వాహనాలు రోడ్డెక్కాయి. మహీంద్రా, గోయెంకా, ట్రినిటీ క్లీన్‌టెక్, కినెటిక్‌ ఇంజనీరింగ్‌ వంటి 15–20 కంపెనీలు దీర్ఘకాలిక లక్ష్యంతో రంగంలోకి దిగాయి. వచ్చే ఏడాదికల్లా బజాజ్‌ ఆటో, పియాజియో ఈ విపణిలోకి అడుగుపెట్టనున్నాయి. చెనా నుంచి విడిభాగాలను దిగుమతి చేసుకుని విక్రయించే కంపెనీలు సుమారు 200 దాకా ఉంటాయి. ఉత్తర, తూర్పు భారత్‌లో ఈ–రిక్షా, ఈ–ఆటోలకు డిమాండ్‌ ఎక్కువ. ఫేమ్‌–2తో దక్షిణాదిలోనూ వీటి అమ్మకాలు పెరగనున్నాయి. ఓలా 10,000 ఈ–రిక్షాలను రంగంలోకి దింపుతోంది.

కిలోమీటరుకు రూ.1.50..
త్రిచక్ర వాహనం కిలోమీటరు తిరిగినందుకు అయ్యే వ్యయం పెట్రోల్‌ వేరియంట్‌ అయితే రూ.4, డీజిల్‌ రూ.3.50 అవుతోంది. అదే ఎలక్ట్రిక్‌ త్రీ వీలర్‌కు వ్యయం కిలోమీటరుకు రూ.1.50 మాత్రమేనని గోయెంకా ఎలక్ట్రిక్‌ మోటార్‌ వెహికిల్స్‌ సీఈవో జాఫర్‌ ఇక్బాల్‌ సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు. రెండేళ్ల క్రితంతో పోలిస్తే బ్యాటరీ ఖరీదు ఇప్పుడు 20–25%కి వచ్చి చేరిందని చెప్పారు. హైదరాబాద్‌లో తమ కంపెనీ చార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేస్తోం దని వెల్లడించారు. వాహన యజమానులు తమ వాహనానికి బ్యాటరీ వినియోగించినందుకు నెలవారీ చందా చెల్లిస్తే చాలని వివరించారు. ఈ–త్రీవీలర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టిసారిస్తే పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఓలెక్ట్రా గ్రీన్‌టెక్‌ ఈడీ నాగ సత్యం తెలిపారు. రిజిస్ట్రేషన్ల విషయంలో అడ్డంకులు తొలగించాలని కోరారు. డీజిల్‌ ఆటోల కొత్త అనుమతులకు బదులు ఎలక్ట్రిక్‌ త్రీవీలర్‌ ఉండాలన్న నిబంధన రావాలన్నారు.

ఈ–రిక్షాలకూ అనుమతి..!
గంటకు 25 కిలోమీటర్ల కంటే తక్కువ వేగంతో వేళ్లే ఈ–రిక్షాలకు ప్రధాన నగరాల్లోని ముఖ్యమైన రహదారుల్లో అనుమతి లేదు. 25 కిలోమీటర్ల కంటే అధిక వేగం ఉన్న ఈ–ఆటోలకే అనుమతి ఉంది. ఢిల్లీ మెట్రోలో రోజూ 30 లక్షల మంది ప్రయాణిస్తున్నట్టు సమాచారం. ఇందులో 50–60 శాతం మంది 3 లక్షల పైచిలుకు ఈ–త్రీవీలర్లలో గమ్య స్థానాలకు చేరుకుంటున్నారు. ఇక హైదరాబాద్‌ మెట్రోలో రోజూ 2 లక్షల మంది జర్నీ చేస్తున్నారు. ఇంతే సంఖ్యలో ఎంఎంటీఎస్‌లో వెళ్తున్నారు. ప్రధాన రహదారులు మినహా ఇతర ప్రాంతాలకు ఈ స్టేషన్ల నుంచి వెళ్లే మార్గాల్లో ఈ–రిక్షాలకు అనుమతి ఇవ్వాలని కంపెనీలు కోరుతున్నాయి. చిన్న రోడ్లలో వెళ్లేందుకు పెద్ద వేగం అక్కర లేదన్నది కంపెనీల వాదన. ట్రినిటీ క్లీన్‌టెక్‌ ఈటో బ్రాండ్‌ ఈ–ఆటోలను మెట్రో స్టేషన్ల నుంచి త్వరలో నడుపనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement