
ఎలక్ట్రిక్ వాహనాలకు అందించే సబ్సిడీ విషయమై కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా పెరుగుతోందని, వినియోగదారులు స్వచ్ఛమైన ఇంధనాలతో నడిచే వాహనాల కొనుగోలు వైపు మొగ్ చూపుతున్న క్రమంలో విక్రయాలను ప్రోత్సహించడానికి ఇక ప్రోత్సాహకాలు అవసరం లేదని అభిప్రాయపడ్డారు.
"నా అభిప్రాయం ప్రకారం.. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ఇకపై ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం లేదు" అని న్యూఢిల్లీలో జరిగిన బ్లూమ్‌బెర్గ్ ఎన్‌ఈఎఫ్ సమ్మిట్‌లో వ్యాఖ్యానించారు. ఎలక్ట్రిక్, సీఎన్‌జీ వాహనాలు కొనుగోలు చేయడానికే వినియోగదారులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని అన్నారాయన.
శిలాజ ఇంధన వాహనాలతో పోల్చితే ఎలక్ట్రిక్ వాహనాలపై తక్కువ జీఎస్టీ విధించడం వల్ల ఆ ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులకు ఇప్పటికే ప్రయోజనాన్ని అందిస్తోందన్నారు. ఇక భారీగా జరుగుతన్న పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధన దిగుమతులకు కేంద్ర ప్రభుత్వం ఒక పరిష్కారాన్ని కనుగొనవలసిన అవసరం ఉందన్నారు.అయితే ఇది పెట్రోల్, డీజిల్ కార్లపై అధిక పన్నులకు దారితీయదని స్పష్టం గడ్కరీ చేశారు.
త్వరలో ఇంటర్ సిటీ ఎలక్ట్రిక్ బస్సులు
"ప్రజా రవాణాలో ఎలక్ట్రిక్ వాహనాలను, ముఖ్యంగా ఎలక్ట్రిక్ బస్సులను ఉపయోగించడం కాలుష్య స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.శిలాజ ఇంధన దిగుమతులను తగ్గించడానికి దోహదపడుతుంది" అన్నారు. త్వరలో ఇంటర్ సిటీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించేందుకు ప్రభుత్వం యోచిస్తోందని కూడా మంత్రి తెలిపారు.