Heavy Industries
-
ప్రభుత్వరంగ సంస్థల భూములను వెనక్కి ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు (పీఎస్‌యూ) రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేటాయించిన భూములను తిరిగి వెనక్కి ఇవ్వాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి శ్రీధర్‌బాబు కాంగ్రెస్, బీజేపీ నేతలతో కలిసి కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి తో భేటీ అయ్యారు. పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను విక్రయిస్తోందని, వీటి ఆ«దీనంలో ఉన్న మిగులు భూములను రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి అప్పగించాలని శ్రీధర్‌బాబు కోరారు.కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన 70 ఏళ్లలో అనేక ప్రభుత్వరంగ సంస్థలను ఏర్పాటు చేసిందని, వాటి ఏర్పాటు కోసం అప్పట్లో వేలాది ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఇదిలా ఉంటే ఆదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరా రు. ఖాయిలా పడిన ఆదిలాబాద్ సీసీఐ పునరుద్ధరణ ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు. 4 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి సామ ర్ధ్యం కలిగిన సీసీఐ ఆదిలాబాద్ యూనిట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 2,100 ఎకరాల సున్నపురాతి గనులతో పాటు మొత్తం 2,290 ఎకరాల భూమిని ఉచితంగా ఇచి్చన విషయాన్ని గుర్తు చేశారు.రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అత్యంత అనుకూల వాతావరణం ఉందని, సులభతర వాణిజ్యంలోనూ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములు, నీరు, విద్యుత్ తదితర మౌలిక వసతులు ఉన్నాయని, వీటితో పాటు నైపుణ్యం కలిగిన మానవ వనరులు కూడా ఉన్నాయని, పరిశ్రమల ఏర్పాటుకు సహకరించాలని శ్రీధర్‌బాబు కోరారు. త్వరలో హైదరాబాద్‌లో పర్యటించి శ్రీధర్‌బాబు ప్రస్తావించిన అంశాలపై అధికారులతో చర్చిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. ఈ భేటీలో ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేశ్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. -
ఫేమ్ ఉల్లంఘనలపై విచారణ
న్యూఢిల్లీ: ఫేమ్–2 స్కీము నిబంధనల ఉల్లంఘనలో అధికారులపరంగా తప్పిదాలు జరిగాయన్న ఆరోపణలపైనా కేంద్రం దృష్టి పెట్టింది. వాటితో పాటు వేలిడేషన్, టెస్టింగ్ ఏజెన్సీలైన ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ), ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ఐసీఏటీ) అధికారుల పాత్రపైనా కేంద్ర భారీ పరిశ్రమల శాఖ విచారణ ప్రారంభించింది. దీనికి సంబంధించి నెల రోజుల వ్యవధిలో నివేదిక రావచ్చని శాఖ కార్యదర్శి కమ్రాన్ రిజ్వి తెలిపారు. ఆ తర్వాత ఉల్లంఘనలకు బాధ్యులైన వారితో పాటు సిస్టమ్స్‌ను కూడా సరిదిద్దే చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. స్థానికంగా తయారీని, విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు.. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలకు సబ్సిడీలు ఇచ్చేలా కేంద్రం రూ. 10,000 కోట్లతో ఫేమ్–2 స్కీమును ప్రవేశపెట్టింది. అయితే, నిబంధనలకు విరుద్ధంగా పలు కంపెనీలు పెద్ద స్థాయిలో దిగుమతి చేసుకుంటున్నాయని, ఏడు సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా ప్రోత్సాహకాలు పొందాయని ఆరోపణలొచ్చాయి. -
తొమ్మిదేళ్లలో ఖాతాల్లోంచి రూ.14.56 లక్షల కోట్ల రద్దు!
న్యూఢిల్లీ: భారత్ బ్యాంకింగ్ 2014–15 నుంచి గడచిన తొమ్మిది ఆర్థిక సంవత్సరాల్లో రూ.14,56,226 కోట్ల మొండి బకాయిలను మాఫీ (రైటాఫ్) చేశాయని ప్రభుత్వం సోమవారం పార్లమెంటుకు తెలియజేసింది. ఇందులో భారీ పరిశ్రమలు, సేవల రంగం వాటా రూ. 7,40,968 కోట్లని ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కరాద్ ఒక లోక్‌సభలో ఇచి్చన ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. రైటాఫ్ అంటే ఖాతాలు, లెక్కల నుంచి మొండిబకాయిలను తొలగించడం. అయితే అటువంటి ఖాతాదారులపై చట్టబద్ధమైన, రికవరీకి సంబంధించిన చర్యలు కొనసాగుతాయి. ఆయా అంశాలకు సంబంధించి ఆర్బీఐ నుంచి అందిన తాజా గణాంకాలను ఉటంకిస్తూ, కరాద్ లోక్‌సభలో చేసిన లిఖితపూర్వక ప్రకటనలో కొన్ని ముఖ్యాంశాలు.. ► 2022–23 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేట్ రంగ బ్యాంకుల నికర రైటాఫ్ రుణాలు రూ.73,803 కోట్లు. ► 2017–18 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటు రంగ బ్యాంకుల స్థూల రుణాల్లో నికర రైటాఫ్‌లు 1.25 శాతం. 2022–23లో ఇది 1.57 శాతంగా ఉంది. ప్రభుత్వం రంగ బ్యాంకుల విషయంలో ఈ అంకెలు వరుసగా 2 %, 1.12 శాతాలుగా ఉన్నాయి. ► మొండిబకాయిలు దిగిరావడానికి ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)లు సమగ్ర చర్యలు తీసుకుంటున్నాయి. ఫలితంగా 2018 మార్చి 31 నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల ఎన్పీఏలు రూ.8.96 లక్షల కోట్లు ఉంటే, 2023 మార్చి 31వ తేదీ నాటికి ఈ విలువ రూ.4.28 లక్షల కోట్లకు తగ్గింది. గత తొమ్మిది ఆర్థిక సంవత్సరాల్లో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు (ఎస్సీబీలు)రూ. 10,16,617 కోట్ల మొత్తాన్ని రికవరీ చేశాయి. ► రుణగ్రహీతల డేటాను సేకరించడం, నిర్వహించడం, ప్రచురించడం కోసం ఆర్బీఐ ఏర్పాటు చేసిన సెంట్రల్ రిపోజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ లార్జ్ క్రెడిట్స్ (సీఆర్‌ఐఎల్‌సీ)డేటా ప్రకారం, 2023 మార్చి 1వ తేదీ నాటికి రూ. 1,000 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ బకాయి ఉన్న మొత్తం రూ. 1,03,975 కోట్లు. ► రూ. 5 కోట్లు అంతకంటే ఎక్కువ రుణం తీసుకున్న సంస్థలు ఏదైనా డిఫాల్ట్ అయితే, బ్యాంకులు ఈ సమాచారాన్ని ప్రతి వారం సీఆర్‌ఐఎల్‌సీకి నివేదించాలి. ► షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్‌లు, ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లలో రూ.20 కోట్లకు పైగా ఉన్న ఎన్పీఏలు గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో తగ్గుదలని నమోదు చేసుకున్నాయి. పటిష్ట రికవరీ చర్యలు... రుణ నిష్పత్తిని తగ్గించడంలో సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రస్ట్ యాక్ట్, 2002 సవరణ కీలక పాత్ర పోషిస్తోంది. డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ (డీఆర్టీ) ఆర్థిక అధికార పరిధిని రూ. 10 లక్షల నుండి రూ. 20 లక్షలకు పెంచడం వల్ల అవి అధిక–విలువ కేసులపై దృష్టి సారించేందుకు వీలు కలిగింది. ఇది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు అధిక రికవరీకి దోహదపడింది. రూ. 500 కోట్లకు పైగా ఒత్తిడిలో ఉన్న ఆస్తులను పరిష్కరించే లక్ష్యంతో నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్‌ను (ఎన్ఏఆర్సీఎల్) కూడా ఏర్పాటు చేసినట్లు మంత్రి కరాద్ వివరించారు. ఒత్తిడితో ఉన్న రుణ ఆస్తులను స్వా«దీనం చేసుకునేందుకు రుణ సంస్థలకు ఎన్‌ఆర్‌సీఎల్ జారీ చేసిన సెక్యూరిటీ రసీదులకు మద్దతుగా రూ. 30,600 కోట్ల వరకు గ్యారెంటీని పొడిగించడానికి ప్రభుత్వం ఆమోదించిందని ఆయన చెప్పారు. బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు ఎటువంటి అదనపు సౌలభ్యతలను మంజూరు చేయడం లేదు. వారి యూనిట్ ఐదేళ్లపాటు కొత్త వెంచర్లను నిర్వహించకుండా నిషేధం కూడా ఉంది. ఉద్దేశపూర్వక డిఫాల్టర్లు లేదా కంపెనీలు నిధుల సమీకరణకు క్యాపిటల్ మార్కెట్లనూ ఎంచుకోడానికి వీలుండకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. వాటి ప్రమోటర్లు, డైరెక్టర్లు ఉద్దేశపూర్వక ఎగవేతదారులతో కలిసి నిధులను సేకరించేందుకు వీలుండదు. అంతేకాకుండా, ఒత్తిడికి గురైన ఆస్తులను ముందస్తుగా గుర్తించడం, నివేదించడం, సమయానుకూలంగా పరిష్కరించడం కోసం ఒక ఫ్రేమ్‌వర్క్‌ను అందించడానికి 2019లో ఆర్బీఐ ప్రుడెన్షియల్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ స్ట్రెస్డ్ అసెట్స్‌ను విడుదల చేసింది. ఒత్తిడిలో ఉన్న రుణాలకు సంబంధించి రిజల్యూషన్ ప్లాన్‌ను ముందస్తుగా అనుసరించిన బ్యాంకర్లకు ప్రో త్సాహకాలను కూడా అందించడం జరుగుతోంది. పీఎంఎంవై దేశ వ్యాప్త అమలు ఇదిలావుండగా, 2015 ఏప్రిల్ 8వ తేదీన ప్రారంభించిన ప్రధాన్ మంత్రి ముద్రా యోజనను దేశ వ్యాప్తంగా పటిష్టంగా అమలు చేస్తున్నట్లు మరో సమాధానంలో మంత్రి కరాద్ పేర్కొన్నారు. 2023 జూన్ 30 నాటికి ఈ పథకం కింద రుణగ్రహీతలకు దాదాపు రూ. 24.34 లక్షల కోట్ల రుణాల మంజూరు జరిగినట్లు వివరించారు. -
కోనసీమలో కొబ్బరి పరిశ్రమలపై ప్రత్యేక శ్రద్ద..
-
భారీగా పెరిగిన హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ ధర.. ఎంతంటే?
ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ విడా వీ1 ప్రో ధరను దాదాపు రూ.6000 పెంచినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. జూన్ 1 నుంచి ఫేమ్-2 పథకం కింద ప్రభుత్వం సబ్సిడీని తగ్గించిన నేపథ్యంలో విడా వీ1 ప్రో ధరను పెంచినట్లు తెలుస్తోంది. దీంతో, తాజాగా పెరిగిన ధరతో ఫేమ్-2 రాయితీ, పోర్టబుల్ ఛార్జర్ కలుపుకుని విడా వీ1 ప్రో స్కూటర్ రూ.1,45,900కు లభించనుంది. పాత ధరతో పోలిస్తే ఇది దాదాపు రూ.6000 ఎక్కువ. అయితే,పెరిగిన ధరలపై సంస్థ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దేశంలో ఈవీ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేలా కేంద్రం ఫేమ్2 పథకాన్ని అమలు చేసింది. ఈ స్కీంలో ఈవీ స్కూటర్లపై భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఎక్స్ ఫ్యాక్టరీ ధరపై ప్రోత్సాహకాలు 40 శాతం అందించేది. జూన్ 1 నుంచి వాటిని 15 శాతానికి పరిమితం చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకోవడంతో వాహనాల తయారీ సంస్థలు ధరల్ని పెంచడం అనివార్యమైంది. కాగా, ఫేమ్-2 కింద తయారీ సంస్థలకు కేంద్రం ఇచ్చే ప్రోత్సహకాల్లో యూనిట్‌కు దాదాపు రూ. 32,000 సబ్సిడీ తగ్గినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. చదవండి👉 భారత పర్యటనలో చాట్‌జీపీటీ సృష్టికర్త శామ్ ఆల్ట్‌మన్.. ఆయన ఎందుకొస్తున్నారంటే? -
చార్జింగ్ స్టేషన్లకు రూ.800 కోట్లు
న్యూఢిల్లీ: పబ్లిక్ ఫాస్ట్ చార్జింగ్ ఈవీ స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వ రంగంలోని మూడు చమురు కంపెనీలకు రూ.800 కోట్లు మంజూరు చేసినట్టు భారీ పరిశ్రమల శాఖ వెల్లడించింది. ఫేమ్ ఇండియా స్కీమ్ ఫేజ్–2 కింద ఈ మొత్తాన్ని సమకూరుస్తున్నట్టు ప్రకటించింది. ఇందులో భాగంగా ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం కంపెనీలు దేశవ్యాప్తంగా ఫిల్లింగ్ సెంటర్లలో 7,432 చార్జింగ్ కేంద్రాలను 2024 మార్చి నాటికి ఏర్పాటు చేస్తాయి. ఈ స్టేషన్స్‌లో ద్విచక్ర వాహనాలు, ఫోర్ వీలర్లు, తేలికపాటి వాణిజ్య వాహనాలు, చిన్న బస్‌లకు చార్జింగ్ సౌకర్యాలు ఉంటాయి. ఈ మూడు కంపెనీలకు తొలి విడతగా రూ.560 కోట్లు విడుదల చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 6,586 చార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. కొత్తగా జోడించనున్న కేంద్రాలతో ఎలక్ట్రిక్ వాహన రంగానికి మంచి బూస్ట్‌నిస్తుందని భారీ పరిశ్రమల శాఖ తెలిపింది. -
సమర్థంగా రసాయన ప్రమాదాల నియంత్రణ
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: భారీపరిశ్రమల్లో సంభవించే రసాయన ప్రమాదాలను సైతం సమర్థంగా నివారించే శక్తిసామర్థ్యాలు మనకున్నాయని జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) ప్రతినిధి బ్రిగేడ్ బి.ఎస్.తకర్ చెప్పారు. అగ్ని ప్రమాదాలతో పాటు ఫ్యాక్టరీల్లో సంభవించే ఇతర ప్రమాదాల నివారణపైనా దృష్టిపెట్టినట్టు తెలిపారు. ఎన్డీఎంఏ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఎస్డీఎంఏ) సహకారంతో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆధ్వర్యంలో గురువారం రాష్ట్రంలోని 17 జిల్లాల్లో ఆఫ్‌సైట్, ఆన్సైట్ ఫ్యాక్టరీల్లో కెమికల్ ఎమర్జెన్సీ మాక్‌డ్రిల్ నిర్వహించారు. విశాఖపట్నంలోని ఈస్ట్ ఇండియా హెచ్‌పీసీఎల్ వద్ద నిర్వహించిన మాక్‌డ్రిల్‌ను బ్రిగేడ్ బి.ఎస్.తకర్, ఎస్డీఎంఏ ఎండీ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డి.ఎస్.సి.వర్మ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా తకర్ మాట్లాడుతూ ఇలాంటి మాక్‌డ్రిల్స్‌తో పరిశ్రమల్లో రసాయన ప్రమాదాలు జరిగినప్పుడు యాజమాన్యం, ఆయా జిల్లాల యంత్రాంగం స్పందించి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన పెరుగుతుందని చెప్పారు. డాక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ సహజ, మానవ తప్పిదాలతో జరిగే విపత్తులతోపాటు కెమికల్ డిజాస్టర్స్‌పైనా దృష్టి సారించినట్లు తెలిపారు. అవగాహన, ముందుజాగ్రత్త చర్యలతో పాటు ప్రణాళిక రూపొందించడం ద్వారా రసాయనిక ప్రమాదాల స్థాయిని తగ్గించవచ్చన్నారు. భవిష్యత్‌లో వరదలు, తుపాన్లపైనా మాక్‌డ్రిల్స్‌తో అవగాహన కలి్పస్తామని చెప్పారు. 17 జిల్లాల్లో నిర్వహించిన మాక్‌డ్రిల్స్‌లో.. ఫ్యాక్టరీల్లో రసాయనిక ప్రమాదాలు జరిగితే ఎలా ప్రతి స్పందించి చర్యలు తీసుకుంటారో ఫైర్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ప్రత్యక్షంగా చూపించాయి. -
సత్ఫలితాలిస్తున్న ‘పాట్’
సాక్షి, అమరావతి: భారీ పరిశ్రమల్లో ఇంధన సామర్థ్యం, సాంకేతికతను ప్రవేశపెట్టేందుకు ఉద్దేశించిన పెర్ఫార్మ్, అచీవ్, ట్రేడ్ (పాట్) పథకం సత్ఫలితాలనిస్తోంది. రాష్ట్ర ఇంధన శాఖకు చెందిన రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) పదేళ్లుగా రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఇంధన శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. పాట్ వల్ల రాష్ట్రంలోని 36 భారీ పరిశ్రమల్లో దాదాపు రూ.5,709 కోట్ల విలువైన బొగ్గు, చమురు, గ్యాస్, లిగ్నైట్‌తో కూడిన 0.818 మిలియన్ టన్ ఆఫ్ ఆయిల్ ఈక్వెలెంట్ (ఎంటీఓఈ) ఇంధనం ఆదా అయింది. అంతేకాదు.. 2.464 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను కూడా తగ్గించింది. ‘బీఈఈ’ ప్రోత్సాహం పరిశ్రమలకు నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ కరెంటును సమర్థంగా వినియోగించుకోవటం ద్వారా విద్యుత్‌ను ఆదా చేయటమే కాకుండా పారిశ్రామిక ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించవచ్చు. తద్వారా ఉత్పత్తుల నాణ్యత పెరుగుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) పాట్ పథకానికి ప్రోత్సాహం అందిస్తోంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) ఆధారిత పరికరాలను అందిస్తోంది. రాష్ట్రంలో ఏపీఎస్ఈసీఎం ద్వారా 65 ఎంఎస్ఎంఈల్లో వీటిని అమర్చింది. ఇవి విద్యుత్ వినియోగాన్ని, యంత్రాల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగిన సూచనలు అందిస్తాయి. తద్వారా ఇంధన ఆదాకు దోహదపడతాయి. పాట్ పథకం లక్ష్యాలను సాధించిన పరిశ్రమలకు ఇంధన పొదుపు సర్టిఫికెట్లను కూడా బీఈఈ ఇస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇలా 4,01,496 సర్టిఫికెట్లను అందించింది. వీటిని పవర్ ఎక్సే్ఛంజ్‌లో విక్రయించడం ద్వారా ఆ పరిశ్రమలు ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. ఇంధన పొదుపు లక్ష్యాలను సాధించని పరిశ్రమలు ఆ సర్టిఫికెట్లను డబ్బులిచ్చి కొనుగోలు చేయాలి. అలా 2,79,667 సర్టిఫికెట్లను పలు పరిశ్రమలు కొన్నాయి. అన్ని పరిశ్రమలు ‘పాట్’ పరిధిలోకి రావాలి భారీ పరిశ్రమల్లో ప్రత్యేకంగా విద్యుత్ క్యాప్టివ్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వమే నిరంతర విద్యుత్‌ను సరఫరా చేస్తోంది. దీనివల్ల పరిశ్రమలు విద్యుత్‌పై చేసే వ్యయం తగ్గుతుంది. పరిశ్రమలలో ఆధునిక విధానాల్లో ఇంధనాన్ని సక్రమంగా వినియోగించే సాంకేతికతను ప్రోత్సహించడానికి ప్రభుత్వం పాట్ పథకాన్ని అమలు చేస్తోంది. రాష్ట్రంలో పాట్ పథకం వల్ల భారీ పరిశ్రమలలో ఇంధన సామర్థ్యం పెరిగింది. ఈ పథకం పరిధిలోకి రావాలని అన్ని పరిశ్రమలను కోరుతున్నాం. –కె.విజయానంద్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి. -
ఆటో పీఎల్ఐ నోటిఫికేషన్ విడుదల
న్యూఢిల్లీ: అత్యాధునిక ఆటోమోటివ్ టెక్నాలజీ ఆధారిత వాహనాలు (ముందస్తు అనుమతి కలిగిన), అన్ని రకాల ఆటో విడిభాగాల తయారీపై ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (పీఎల్ఐ పథకం) అందుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. ఆటోమొబైల్ రంగానికి రూ.25,938 కోట్ల ప్రోత్సాహకాలను ఇవ్వనున్నట్టు ఇటీవలే ప్రకటించగా.. ఇందుకు సంబంధించి పీఎల్ఐ పథకం కింద రాయితీలు కలి్పంచే నోటిఫికేషన్‌ను కేంద్ర భారీ పరిశ్రమల శాఖ శుక్రవారం జారీ చేసింది. సైనిక వినియోగానికి సంబంధించిన వాహనాలకూ ఈ పథకం కింద ప్రయోజనాలు లభించనున్నాయి. సీకేడీ/ఎస్కేడీ కిట్లు, ద్విచక్ర, త్రిచక్ర, ప్యాసింజర్, వాణిజ్య, ట్రాక్టర్ల అగ్రిగేట్స్ సబ్సిడీలకు అర్హతగా నోటిఫికేషన్లో ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుత ఆటోమొబైల్ కంపెనీలతోపాటు.. కొత్త నాన్ ఆటోమోటివ్ పెట్టుబడి సంస్థలూ పథకం కింద ధరఖాస్తు చేసుకోవచ్చు. ఛాంపియన్ ఓఈఎం, కాంపోనెంట్ చాంఫియన్ ఇన్సెంటివ్ స్కీమ్ అనే రెండు భాగాల కింద ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పథకం కింద ఒక గ్రూపు పరిధిలోని కంపెనీలకు మొత్తం ప్రోత్సాహకాల్లో 25 శాతానికి మించకుండా (అంటే రూ.6,485 కోట్లకు మించకుండా) ప్రోత్సాహకాలు లభిస్తాయి. చాంపియన్ ఓఈఎం పథకం కింద విక్రయాలు కనీసం రూ.125 కోట్లుగాను, కాంపోనెంట్ చాంపియన్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద విక్రయాలు కనీసం రూ.25 కోట్లుగాను ఉండాలని ఈ నోటిఫికేషన్ స్పష్టం చేస్తోంది. -
ఉత్పత్తి మొదలెట్టండి.. మినహాయింపులు తర్వాత చూద్దాం!
న్యూఢిల్లీ: భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి కోసం పన్ను మినహాయింపులు కోరుతున్న అమెరికన్ కార్ల దిగ్గజం టెస్లాకు కేంద్రం కీలక సూచన చేసింది. ముందుగా భారత్‌లో తయారీ మొదలుపెట్టాలని, ఆ తర్వాత మినహాయింపుల గురించి పరిశీలించవచ్చని టెస్లాకు భారీ పరిశ్రమల శాఖ సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం ఏ ఆటోమొబైల్ సంస్థకూ సుంకాలపరమైన మినహాయింపులు ఇవ్వడం లేదని, ఇప్పుడు టెస్లాకు గానీ ఇచ్చిన పక్షంలో భారత్‌లో బిలియన్ల డాలర్ల కొద్దీ ఇన్వెస్ట్ చేసిన ఇతర కంపెనీలకు తప్పుడు సంకేతాలు పంపించినట్లవుతుందని కేంద్రం భావిస్తున్నట్లు వివరించాయి. ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి సుంకాలను తగ్గించాలని టెస్లా కోరుతోంది. ప్రస్తుతం పూర్తిగా తయారై దిగుమతయ్యే వాహనాలపై (సీబీయూ) కస్టమ్స్ సుంకాలు 60 శాతం నుంచి 100 శాతం దాకా ఉంటున్నాయి. దీనికి 40,000 డాలర్ల విలువను (వాహన ధర) ప్రామాణికంగా తీసుకుంటున్నారు. 40,000 డాలర్ల పైగా ఖరీదు చేసే వాహనాలపై 110 శాతం దిగుమతి సుంకాలను విధించడమనేది .. పర్యావరణ హిత ఎలక్ట్రిక్ వాహనాలకు వర్తింపచేయొద్దంటూ కేంద్రాన్ని టెస్లా కోరుతోంది. కస్టమ్స్ విలువతో సంబంధం లేకుండా టారిఫ్‌ను 40 శాతానికి పరిమితం చేయాలని, 10 శాతం సామాజిక సంక్షేమ సుంకం నుంచి కూడా మినహాయింపు ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాసింది. -
రోడ్డెక్కనున్న 5,595 ఎలక్ట్రిక్ బస్‌లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా మరో 5,595 ఎలక్ట్రిక్ బస్‌లు రోడ్డెక్కనున్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ ఈ మేరకు ఫేమ్ ఇండియా స్కీం ఫేజ్–2 కింద ఆమోదం తెలిపింది. 64 నగరాల్లో ఇవి కొద్ది రోజుల్లో పరుగెత్తనున్నాయి. 10 లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాలు, స్మార్ట్ సిటీస్, రాజధాని నగరాలు, స్పెషల్ కేటగిరీ స్టేట్స్‌లోని నగరాల్లో ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు ఆసక్తి వ్యక్తీకరణను డిపార్ట్మెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ కోరింది. 26 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మొత్తం 14,988 ఎలక్ట్రిక్ బస్‌ల కోసం 86 ప్రతిపాదనలు చేశాయి. వీటిని పరిశీలించిన ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్, సాంక్షనింగ్ కమిటీ చేసిన సూచన మేరకు కేంద్ర ప్రభుత్వం 5,595 బస్‌లను మంజూరు చేసింది. ఇందులో 5,095 బస్‌లు నగరాల్లో (ఇంట్రాసిటీ) నడిపేందుకు నిర్దేశించారు. నగరాల మధ్య (ఇంటర్సిటీ) కార్యకలాపాలు సాగించేందుకు మరో 400 బస్‌లు, లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం 100 బస్‌లను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌కు కేటాయించారు. కాంట్రాక్టు కాలంలో అన్ని బస్‌లు 400 కోట్ల కిలోమీటర్లు తిరగనున్నాయి. 120 కోట్ల లీటర్ల ఇంధనం ఆదా అవుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇలా.. ఫేజ్–2 కింద ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ మొత్తం 350 ఎలక్ట్రిక్ బస్‌లను చేజిక్కించుకుంది. ఇందులో విశాఖపట్నం 100, విజయవాడ 50, అమరావతి 50, తిరుపతి 50, కాకినాడ 50 బస్‌లను దక్కించుకున్నాయి. అలాగే నగరాల మధ్య ప్రజా రవాణాకు 50 బస్‌లను కేటాయించారు. తెలంగాణలో హైదరాబాద్‌కు 300, వరంగల్‌కు 25 బస్‌లు అలాట్ అయ్యాయి. కాగా, ఫేజ్–2లో నాలుగు రాష్ట్రాల్లో లోయెస్ట్ బిడ్డర్‌గా హైదరాబాద్ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ నిలిచినట్టు మార్కెట్ వర్గాల సమాచారం. అలాగే దేశవ్యాప్తంగా రోడ్డు రవాణా సంస్థల టెండర్లలో ఈ కంపెనీ పోటీలో ముందున్నట్టు తెలుస్తోంది. 9, 12 మీటర్ల పొడవున్న బస్‌లను ఒలెక్ట్రా తయారు చేస్తోంది. ఇప్పటికే దేశంలో పలు నగరాల్లో 400కుపైగా ఒలెక్ట్రా ఈ–బస్‌లు విజయ వంతంగా పరుగెడుతున్నాయి. బ్యాటరీ మినహా బ స్కు కావాల్సిన విడిభాగాలన్నీ దేశీయంగా తయా రు చేస్తోంది. జడ్చర్ల వద్ద సంస్థకు ప్లాంటు ఉంది. -
అనంతపురంలో మరో రెండు భారీ పరిశ్రమలు
సాక్షి, అమరావతి: అనంతపురం జిల్లాలో మరో రెండు భారీ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. గత కొన్నేళ్లుగా వీటికి అడ్డంకిగా ఉన్న జీవోను సడలిస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ నిర్ణయం తీసుకోవడంతో ఇది సాధ్యపడింది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న వీర్ వాహన్ ఉద్యోగ్ లిమిటెడ్ అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయాలనుకున్న ఎలక్ట్రికల్ బస్ యూనిట్‌తో పాటు ఏపీ ఏరోస్పేస్ డిఫెన్స్ పార్కు నిర్మాణాలు ప్రారంభం అయ్యేందుకు సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. ► అనంతపురం జిల్లాలో కియా మోటర్స్ పరిశ్రమ ఏర్పాటు సమయంలో ఇచ్చిన జీవోతో ఆ ప్రాంతంలో మిగిలిన పరిశ్రమలకు ఆటంకంగా మారింది. కియా చుట్టుపక్కల 10 కి.మీ పరిధి వరకు ఎటువంటి కాలుష్య కారకమైన పరిశ్రమలు ఏర్పాటు చేయకూడదంటూ 2017లో జీవో నెంబర్ 151 ద్వారా ఉత్తర్వులు ఇచ్చారు. దీని ఫలితంగా అప్పటికే ఒప్పందం కుదిరినప్పటికీ ఈ రెండు పరిశ్రమల ఏర్పాటు ఆగిపోయింది. ► ఈ నేపథ్యంలో అడ్డంకిగా ఉన్న ఆ జీవో నుంచి ఈ పరిశ్రమలకు మినహాయింపు ఇస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ శనివారం ఉత్తర్వులిచ్చారు. దీంతో కియా కంటే ముందే పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నందున ఈ 2 పరిశ్రమలకు ఈ జీవో నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ► తాజా ఉత్తర్వులతో వీర్‌వాహన్ ఉద్యోగ్ లిమిటెడ్ సుమారు రూ.1,000 కోట్ల పెట్టుబడితో 120 ఎకరాల్లో ఎలక్ట్రిక్ బస్సులు తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి అడ్డంకులు తొలిగాయి. ► అలాగే ఏపీఐఐసీ భాగస్వామ్యంతో 246.06 ఎకరాల్లో ఏర్పాటు చేయాలనుకున్న ఏపీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ పార్క్‌కు కూడా అడ్డంకులు తొలిగాయి. -
వడి వడిగా.. నుడా
సాక్షి ప్రతినిధి–నెల్లూరు: నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ (నుడా) ఏర్పాటులో శుక్రవారం మరో అడుగు ముందుకు పడింది. తడ నుంచి కావలి దాకా ఉన్న జిల్లాలోని 21 మండలాలు, మున్సిపాలిటీలు.. చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం, సత్యవేడు మండలాల్లోని 13 గ్రామాలతో నుడా ఏర్పడింది. ఈ నేపథ్యంలో నెల్లూరులో అధికారిక కార్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వం శుక్రవారం జీఓ నంబర్ 108 జారీ చేసింది. 2014 నవంబర్‌లో కార్పొరేషన్ కమిషనర్‌గా పనిచేసిన ఐఏఎస్ అధికారి చక్రధర్‌బాబు, టౌన్‌ప్లానింగ్ అధికారి శ్రీనివాసులు నుడా ప్రతిపాదనలు తయారుచేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. జిల్లాలోని 33 మండలాలతో కూడిన నుడా ప్రతిపాదనను ప్రభుత్వానికి ఇచ్చారు. ప్రతిపాదనలు అందిన రెండేళ్ళ తరువాత ఇటీవల నుడా ఆమోదానికి అడుగులు పడ్డాయి. మొదట 33 మండలాలతో కూడిన ప్రతిపాదనను, రెండవసారి 14 మండలాలతో కూడిన ప్రతిపాదనలు పంపారు. దీనికి కొన్ని సవరణలు చేస్తూ 21 మండలాలు.. చిత్తూరు జిల్లాలోని సత్యవేడు, వరదయ్య పాలెం మండలాల్లోని 13 గ్రామాలను కలుపుతూ రాష్ట్ర మంత్రి వర్గం ఆర్నెల్ల కిందట నుడా ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. నుడాలో కలిపిన ప్రాంతాలు ఇవే.. నెల్లూరు కార్పొరేషన్, నెల్లూరు రూరల్, గూడూరు, కావలి, సూళ్ళూరుపేట, నాయుడుపేట, జలదంకి, బోగోలు, దగదర్తి, అల్లూరు, కొడవలూరు, కోవూరు, టీపీ గూడూరు, ముత్తుకూరు, వెంకటాచలం, మలుబోలు, చిల్లకూరు, ఓజిలి, దొరవారిసత్రం, తడ మండలాలు నుడాలో ఉన్నాయి. చిత్తూరు జిల్లాకు చెందిన సత్యవేడు, వరదయ్యపాళెం మండలాల్లోని 13 గ్రామాలను నుడాలో చేర్చారు. తడ నుంచి కావలి దాకా హైవేకి ఇరు వైపులా ఉన్న గ్రామాలు, మున్సిపాలిటీలు, మండల కేంద్రాలతో పాటు శ్రీసిటీ 7వేల ఎకరాలను మొత్తం నుడాలో కలిపారు. నుడా పరిధిలో 13లక్షల జనాభా, 1600 చదరపు కి.మీ. భూ విస్తీర్ణం ఉంది. నుడా ద్వారానే అనుమతులు ఇప్పటి వరకు భారీ పరిశ్రమలు, భవనాల నిర్మాణాలకు అనుమతుల కోసం అమరావతికి వెళ్ళాల్సి వచ్చేది. నుడా ఏర్పాటుతో పరిశ్రమలు, భారీ భవనాలకు అనుమతులు నుడా ద్వారానే ఇచ్చే అవకాశం ఉంది. దీంతో నుడాకు భారీ ఆదాయం సమకూరుతుంది. నుడా ఆదాయాన్ని రోడ్లు, పార్క్‌లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించాల్సి ఉంది. త్వరలో కార్యాలయం ఏర్పాటు నెల్లూరు కేంద్రంగా త్వరలో నుడా కార్యాలయం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు సిద్ధం చేసింది. నుడా కమిషనర్‌గా ఐఏఎస్ అధికారిని నియమించనున్నారు. దీంతో పాటు ఈ కార్యాలయ నిర్వహణకు ప్రత్యేక విభాగం ఏర్పాటు కానుంది. -
దొనకొండలో భారీ పరిశ్రమలు
► పక్షం రోజుల్లో ప్రతిపాదనలు పూర్తి ► రామాయపట్నంపై ప్రత్యేక దృష్టి ► బాబు సమర్థత చూసి ప్రధాని మోదీనే ఆశ్చర్యపోతున్నారు ► నవ నిర్మాణ దీక్ష సభలో మంత్రి శిద్దా రాఘవరావు ఒంగోలు: జిల్లాలోని దొనకొండలో స్పెయిన్ కంపెనీలు ఏర్పాటు చేయనున్న భారీ పరిశ్రమలకు సంబంధించిన ప్రతిపాదనలు మరో పక్షం రోజుల్లో పూర్తికానున్నాయని రాష్ట్ర రవాణా శాఖామంత్రి శిద్దా రాఘవరావు చెప్పారు. రామాయపట్నం ఓడరేవుపై కూడా ముఖ్యమంత్రి విస్తృత చర్చలు నిర్వహిస్తున్నారని, త్వరలోనే అది కూడా సాధించుకుంటామని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పిలుపులో భాగంగా జిల్లా కేంద్రం ఒంగోలులోని ప్రకాశం భవనం వద్ద గురువారం నిర్వహించిన నవనిర్మాణ దీక్షకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి ర్యాలీని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. స్వయం సహాయక సంఘాల మహిళలతో స్థానిక డీఆర్ఆర్ఎం మున్సిపల్ ఉన్నత పాఠశాల నుంచి డీఆర్డీఏ పీడీ మురళి నేతృత్వంలో ర్యాలీ నిర్వహించారు. ప్రకాశం భవనం వద్ద జరిగిన కార్యక్రమంలో మంత్రి శిద్దా మాట్లాడుతూ రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రానికి సమర్థమైన నాయకుడు చంద్రబాబేనని గుర్తించి ప్రజలు ఆయనను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని, చంద్రబాబు పాలన చూసి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం ఆశ్చర్యపోతున్నారని పేర్కొన్నారు. దేశంలోనే ఎక్కడా జరగని విధంగా చంద్రబాబు నదుల అనుసంధానం చేసి చూపించారని, ఇది చూసి ప్రధాని సైతం ఎలా సాధ్యమైందంటూ ఆశ్చర్యపోతున్నారన్నారు. విద్యుత్ సమస్య లేకుండా చర్యలు చేపట్టడంతోపాటు రాష్ట్రంలో ఆదాయ వనరులు పెంచుకునేందుకు 24గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. హోదాతోపాటు ప్యాకేజీ ఇవ్వాలి.. శాసనమండలి సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ విభజన హేతుబద్దంగా జరగలేదని, పార్లమెంట్లో తలుపులు మూసి ఏకపక్షంగా విభజించారని ఆరోపించారు. కేంద్రప్రభుత్వం ప్రత్యేకహోదాతో పాటు ప్యాకేజీ కూడా ఇచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిచేలా చూడాలన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావు మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబాటుకు గురైన ఏపీని అభివృద్ధి చేసేందుకు కేంద్రప్రభుత్వం సైతం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు. రాష్ట్రానికి కేంద్రం అందించాల్సిన సాయం చాలా ఉందన్నారు. కష్టదశలో సైతం రాష్ర్ట అభివృద్ధి కోసం తపిస్తున్న ముఖ్యమంత్రికి అండగా నిలిచేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ సుజాతశర్మ మాట్లాడుతూ జిల్లాలో జరిగే నవనిర్మాణ దీక్షా కార్యక్రమాల్లో ప్రజలందరు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈనెల 8న ముఖ్యమంత్రి మహా సంకల్పదీక్షలో భాగంగా ఒంగోలుకు వస్తున్నారని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. ఉద్యమకారులకు సత్కారం.. ఈ కార్యక్రమంలో భాగంగా సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న ఎన్ జీవో సంఘం జిల్లా అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, కార్యదర్శి శరత్‌బాబు, రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు కె.ఎల్.నరశింహారావు, జేఏసీ సభ్యులు ఆర్.జగదీష్, ఎన్జీవో సంఘం నగర అధ్యక్షులు మస్తాన్‌వలి, ఆర్సీహెచ్ కృష్ణారెడ్డి, శెట్టిగోపి, డీఆర్డీఎ పీడీ మురళి తదితరులను దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు, పీడీపీపీబీ చైర్మన్ ఈదర మోహన్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.హరిజవహర్‌లాల్, ప్రకాష్‌కుమార్, డీఆర్వో నూర్భాషా ఖాశిం తదితరులు పాల్గొన్నారు. -
భారీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం
గల్ఫ్ వెళ్లే బాధ తప్పిస్తాం ఎంపీ కవిత హామీ బాల్కొండ : నియోజకవర్గంలో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ఎంపీ కల్వకుంట్ల కవిత తెలిపారు. బుధవారం ఆమె వన్నెల్(బి)లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సరైన ఉపాధి అవకాశాలు లేక చాలా మంది గల్ఫ్ బాట పడుతున్నారన్నారు. అక్కడా సరైన అవకాశాలు లేక నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎడారి దేశా ల్లో ఎంతోమంది మృత్యువాత పడుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఏడాదిలో 72 మంది మృతదేహాలను ప్రభుత్వం స్వదేశానికి తెప్పించిందన్నారు. నిరుద్యోగులు ఎడారి దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే ఉపాధి అవకాశా లు కల్పిస్తామన్నారు. బాల్కొండలో పరిశ్రమ ఏర్పాటు చేసి ఐదు వేల మందికి ఉపాధి చూపుతామన్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో సరైన వివరాలు అందించని వారికే జీవన భృతి అందడం లేదన్నారు. జిల్లాలో 1,500 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఇతర ప్రాంతాల నుంచి 500 మంది టీచర్లను సర్దుబాటు చేసిన తర్వాత ఉద్యోగ భర్తీ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. త్వరలో పసుపుపార్కు పనులు.. వేల్పూర్ : వేల్పూర్ క్రాస్‌రోడ్డు వద్ద త్వరలో పసుపు పార్కు పనులు ప్రారంభమవుతాయని ఎంపీ కవిత తెలిపారు. బుధవారం ఆమె అంక్సాపూర్ నుంచి వన్నెల్(బి) వరకు రూ. 4 కోట్లతో నిర్మించే రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అంక్సాపూర్‌లో మాట్లాడారు. ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు పసుపు పార్కు మంజూరు చేయించానన్నారు. మామిడిపల్లి నుంచి నిజామాబాద్ వరకు ైరె ల్వేలైన్ నిర్మాణానికి బడ్జెట్లో రూ. 140 కోట్లు మంజూరు చేయించానని, పనులకు ఇటీవల శంకుస్థాపన జరిగిందని పేర్కొన్నారు. జిల్లా లో పసుపుబోర్డు ఏర్పాటుకు కృషి చేస్తున్నానన్నారు. లక్ష మందికిపైగా బీడీ కార్మికులకు ఇప్పటికే జీవనభృతి అందుతోందని ఎంపీ తెలిపారు. అర్హులందరికీ జీవనభృతి అందుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి, టీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, ఆర్డీవో యాదిరెడ్డి, ఎంపీపీ రజిత బాల్‌రాజ్, జడ్పీటీసీ సభ్యురాలు విమల హన్మంత్‌రావు, అంక్సాపూర్ సర్పంచ్ లక్ష్మి, ఉపసర్పంచ్ పెద్ద ఇస్తారి, ఎంపీటీసీ సభ్యురాలు లక్ష్మి, నాయకులు దేగాం రాములు, మహీపాల్, చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పదవి వద్దు.. పరిశ్రమలు కావాలి
రైతుల కళ్లలో సంతోషం చూడాలన్నదే ఆకాంక్ష మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దోమలపల్లి(నల్లగొండ రూరల్), న్యూస్‌లైన్: ఎన్నికలఅనంతరం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తనకు పిలిచి మంత్రి పదవి ఇచ్చినా తీసుకోను.. నా తమ్ముళ్లకు, అక్కాచెల్లెల్లకు ఉద్యోగాలు కల్పించేందుకు నాలుగు భారీ పరిశ్రమలు కావాలని కోరుతా.. అని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నా రు. నల్లగొండ మండలం దోమలపల్లిలో సర్పంచ్ అమృత ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ఆయన మాట్లాడారు. పదవుల కోసం తాను పోటీ చేయడం లేదు. పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగులకు ఉద్యో గ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ప్రాజెక్టులు నిర్మించి రైతులకు సాగునీరు అందించి వారిలో సంతోషం చూడాలనేదే తన తపన అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తనను లక్ష భారీ మెజార్టీతో గెలిపించి తనపై బాధ్యత పెంచాలన్నారు. ఒక కుటుంబ సభ్యుడిగా అండగా ఉంటా.. అని అన్నారు. పార్టీలకతీ తంగా ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశా రు. వచ్చే ఏడాదిలో బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టు పూర్తి చేసి చెరువులు నింపుతామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఇచ్చిన సోనియా దేవత లాంటిదని, ఆమె రుణం తీర్చుకునేందుకు ఐక్యం గా ఓట్లు వేయాలన్నారు. ఎమ్మెల్యే దామోదర్‌రెడ్డి ఓ రౌడీ సూర్యాపేట ఎమ్మెల్యే దామోదర్‌రెడ్డి ఓ రౌడీ అని, ఆయన తన కొడుకుకు టికెట్ కావాలంటూ బెదిరింపులకు దిగితే ఎవరూ బయపడరని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మంత్రులు వారి నియోజకవర్గాల్లోకి వెళ్తే ప్రజలు వారిని పట్టించుకోవడం లేదు. కనీసం వారికి చప్పట్లు కూడా కొడతలేరన్నారు. జిల్లా అంతటా తన అభిమానులు ఉన్నారని పేర్కొన్నారు. ఎంపీ రాజగోపాల్‌రెడ్డి, దళిత ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను ఎన్ని ఇబ్బందులు పెట్టినా భగవంతుడు చూస్తాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల అనంతరం మెడికల్ కళాశాల నిర్మా ణం కోసమే మొట్టమొదటి శంకుస్థాపన చేస్తానని భరోసా ఇచ్చారు. తెలంగాణకు వ్యతిరేకమైన సీపీఎంకు ఓట్లు వేసి నా, అదే పార్టీలో ఉన్నా అవమానకరం అని అన్నారు. అంతకుముం దు గ్రామం లో స్వాగత ర్యాలీ నిర్వహించారు. పలువురు సీపీఎం, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఈ సందర్భంగా కాంగ్రెస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వంగూరి లక్ష్మయ్య, యువజన కాంగ్రెస్ జిల్లా మాజీ అధ్యక్షుడు జి.మోహన్‌రెడ్డి, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు పనస శంకర్‌గౌడ్, దొనకల్లు సర్పంచ్ అయ్యాడపు ప్రకాశ్‌రెడ్డి, నర్సింగ్‌భట్ల సర్పంచ్ జకీర్ తాజ్, బొబ్బలి మహేందర్‌రెడ్డి, తు మ్మల లింగస్వామి యాదవ్, కల్లూరి వెంకటేశంగౌడ్ పాల్గొన్నారు.