► పక్షం రోజుల్లో ప్రతిపాదనలు పూర్తి
► రామాయపట్నంపై ప్రత్యేక దృష్టి
► బాబు సమర్థత చూసి ప్రధాని మోదీనే ఆశ్చర్యపోతున్నారు
► నవ నిర్మాణ దీక్ష సభలో మంత్రి శిద్దా రాఘవరావు
ఒంగోలు: జిల్లాలోని దొనకొండలో స్పెయిన్ కంపెనీలు ఏర్పాటు చేయనున్న భారీ పరిశ్రమలకు సంబంధించిన ప్రతిపాదనలు మరో పక్షం రోజుల్లో పూర్తికానున్నాయని రాష్ట్ర రవాణా శాఖామంత్రి శిద్దా రాఘవరావు చెప్పారు. రామాయపట్నం ఓడరేవుపై కూడా ముఖ్యమంత్రి విస్తృత చర్చలు నిర్వహిస్తున్నారని, త్వరలోనే అది కూడా సాధించుకుంటామని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పిలుపులో భాగంగా జిల్లా కేంద్రం ఒంగోలులోని ప్రకాశం భవనం వద్ద గురువారం నిర్వహించిన నవనిర్మాణ దీక్షకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి ర్యాలీని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు.
స్వయం సహాయక సంఘాల మహిళలతో స్థానిక డీఆర్‌ఆర్‌ఎం మున్సిపల్ ఉన్నత పాఠశాల నుంచి డీఆర్‌డీఏ పీడీ మురళి నేతృత్వంలో ర్యాలీ నిర్వహించారు. ప్రకాశం భవనం వద్ద జరిగిన కార్యక్రమంలో మంత్రి శిద్దా మాట్లాడుతూ రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రానికి సమర్థమైన నాయకుడు చంద్రబాబేనని గుర్తించి ప్రజలు ఆయనను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని, చంద్రబాబు పాలన చూసి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం ఆశ్చర్యపోతున్నారని పేర్కొన్నారు. దేశంలోనే ఎక్కడా జరగని విధంగా చంద్రబాబు నదుల అనుసంధానం చేసి చూపించారని, ఇది చూసి ప్రధాని సైతం ఎలా సాధ్యమైందంటూ ఆశ్చర్యపోతున్నారన్నారు. విద్యుత్ సమస్య లేకుండా చర్యలు చేపట్టడంతోపాటు రాష్ట్రంలో ఆదాయ వనరులు పెంచుకునేందుకు 24గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు.
హోదాతోపాటు ప్యాకేజీ ఇవ్వాలి..
శాసనమండలి సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ విభజన హేతుబద్దంగా జరగలేదని, పార్లమెంట్‌లో తలుపులు మూసి ఏకపక్షంగా విభజించారని ఆరోపించారు. కేంద్రప్రభుత్వం ప్రత్యేకహోదాతో పాటు ప్యాకేజీ కూడా ఇచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిచేలా చూడాలన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావు మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబాటుకు గురైన ఏపీని అభివృద్ధి చేసేందుకు కేంద్రప్రభుత్వం సైతం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు. రాష్ట్రానికి కేంద్రం అందించాల్సిన సాయం చాలా ఉందన్నారు. కష్టదశలో సైతం రాష్ర్ట అభివృద్ధి కోసం తపిస్తున్న ముఖ్యమంత్రికి అండగా నిలిచేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ సుజాతశర్మ మాట్లాడుతూ జిల్లాలో జరిగే నవనిర్మాణ దీక్షా కార్యక్రమాల్లో ప్రజలందరు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈనెల 8న ముఖ్యమంత్రి మహా సంకల్పదీక్షలో భాగంగా ఒంగోలుకు వస్తున్నారని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు.
ఉద్యమకారులకు సత్కారం..
ఈ కార్యక్రమంలో భాగంగా సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న ఎన్ జీవో సంఘం జిల్లా అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, కార్యదర్శి శరత్‌బాబు, రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు కె.ఎల్.నరశింహారావు, జేఏసీ సభ్యులు ఆర్.జగదీష్, ఎన్‌జీవో సంఘం నగర అధ్యక్షులు మస్తాన్‌వలి, ఆర్‌సీహెచ్ కృష్ణారెడ్డి, శెట్టిగోపి, డీఆర్‌డీఎ పీడీ మురళి తదితరులను దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు, పీడీపీపీబీ చైర్మన్ ఈదర మోహన్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.హరిజవహర్‌లాల్, ప్రకాష్‌కుమార్, డీఆర్‌వో నూర్‌భాషా ఖాశిం తదితరులు పాల్గొన్నారు.
దొనకొండలో భారీ పరిశ్రమలు
Published Fri, Jun 3 2016 9:16 AM | Last Updated on Mon, Sep 4 2017 1:35 AM
Advertisement