పెట్టుబడుల ఉపసంహరణ కింద విక్రయిస్తున్నారు
ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను పునరుద్ధరించాలి
కేంద్ర పరిశ్రమల మంత్రికి శ్రీధర్‌బాబు వినతిపత్రం
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు (పీఎస్‌యూ) రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేటాయించిన భూములను తిరిగి వెనక్కి ఇవ్వాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి శ్రీధర్‌బాబు కాంగ్రెస్, బీజేపీ నేతలతో కలిసి కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి తో భేటీ అయ్యారు. పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను విక్రయిస్తోందని, వీటి ఆ«దీనంలో ఉన్న మిగులు భూములను రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి అప్పగించాలని శ్రీధర్‌బాబు కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన 70 ఏళ్లలో అనేక ప్రభుత్వరంగ సంస్థలను ఏర్పాటు చేసిందని, వాటి ఏర్పాటు కోసం అప్పట్లో వేలాది ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఇదిలా ఉంటే ఆదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరా రు. ఖాయిలా పడిన ఆదిలాబాద్ సీసీఐ పునరుద్ధరణ ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు. 4 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి సామ ర్ధ్యం కలిగిన సీసీఐ ఆదిలాబాద్ యూనిట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 2,100 ఎకరాల సున్నపురాతి గనులతో పాటు మొత్తం 2,290 ఎకరాల భూమిని ఉచితంగా ఇచి్చన విషయాన్ని గుర్తు చేశారు.
రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అత్యంత అనుకూల వాతావరణం ఉందని, సులభతర వాణిజ్యంలోనూ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములు, నీరు, విద్యుత్ తదితర మౌలిక వసతులు ఉన్నాయని, వీటితో పాటు నైపుణ్యం కలిగిన మానవ వనరులు కూడా ఉన్నాయని, పరిశ్రమల ఏర్పాటుకు సహకరించాలని శ్రీధర్‌బాబు కోరారు. త్వరలో హైదరాబాద్‌లో పర్యటించి శ్రీధర్‌బాబు ప్రస్తావించిన అంశాలపై అధికారులతో చర్చిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. ఈ భేటీలో ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేశ్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment