సాక్షి, అమరావతి: భారీ పరిశ్రమల్లో ఇంధన సామర్థ్యం, సాంకేతికతను ప్రవేశపెట్టేందుకు ఉద్దేశించిన పెర్ఫార్మ్, అచీవ్, ట్రేడ్ (పాట్) పథకం సత్ఫలితాలనిస్తోంది. రాష్ట్ర ఇంధన శాఖకు చెందిన రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్‌ఈసీఎం) పదేళ్లుగా రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఇంధన శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. పాట్ వల్ల రాష్ట్రంలోని 36 భారీ పరిశ్రమల్లో దాదాపు రూ.5,709 కోట్ల విలువైన బొగ్గు, చమురు, గ్యాస్, లిగ్నైట్‌తో కూడిన 0.818 మిలియన్ టన్ ఆఫ్ ఆయిల్ ఈక్వెలెంట్ (ఎంటీఓఈ) ఇంధనం ఆదా అయింది. అంతేకాదు.. 2.464 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను కూడా తగ్గించింది.
‘బీఈఈ’ ప్రోత్సాహం
పరిశ్రమలకు నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ కరెంటును సమర్థంగా వినియోగించుకోవటం ద్వారా విద్యుత్‌ను ఆదా చేయటమే కాకుండా పారిశ్రామిక ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించవచ్చు. తద్వారా ఉత్పత్తుల నాణ్యత పెరుగుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) పాట్ పథకానికి ప్రోత్సాహం అందిస్తోంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) ఆధారిత పరికరాలను అందిస్తోంది. రాష్ట్రంలో ఏపీఎస్‌ఈసీఎం ద్వారా 65 ఎంఎస్‌ఎంఈల్లో వీటిని అమర్చింది.
ఇవి విద్యుత్ వినియోగాన్ని, యంత్రాల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగిన సూచనలు అందిస్తాయి. తద్వారా ఇంధన ఆదాకు దోహదపడతాయి. పాట్ పథకం లక్ష్యాలను సాధించిన పరిశ్రమలకు ఇంధన పొదుపు సర్టిఫికెట్లను కూడా బీఈఈ ఇస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇలా 4,01,496 సర్టిఫికెట్లను అందించింది. వీటిని పవర్ ఎక్సే్ఛంజ్‌లో విక్రయించడం ద్వారా ఆ పరిశ్రమలు ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. ఇంధన పొదుపు లక్ష్యాలను సాధించని పరిశ్రమలు ఆ సర్టిఫికెట్లను డబ్బులిచ్చి కొనుగోలు చేయాలి. అలా 2,79,667 సర్టిఫికెట్లను పలు పరిశ్రమలు కొన్నాయి.
అన్ని పరిశ్రమలు ‘పాట్’ పరిధిలోకి రావాలి
భారీ పరిశ్రమల్లో ప్రత్యేకంగా విద్యుత్ క్యాప్టివ్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వమే నిరంతర విద్యుత్‌ను సరఫరా చేస్తోంది. దీనివల్ల పరిశ్రమలు విద్యుత్‌పై చేసే వ్యయం తగ్గుతుంది. పరిశ్రమలలో ఆధునిక విధానాల్లో ఇంధనాన్ని సక్రమంగా వినియోగించే సాంకేతికతను ప్రోత్సహించడానికి ప్రభుత్వం పాట్ పథకాన్ని అమలు చేస్తోంది. రాష్ట్రంలో పాట్ పథకం వల్ల భారీ పరిశ్రమలలో ఇంధన సామర్థ్యం పెరిగింది. ఈ పథకం పరిధిలోకి రావాలని అన్ని పరిశ్రమలను కోరుతున్నాం.
–కె.విజయానంద్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి.
Comments
Please login to add a commentAdd a comment