నాణ్యమైన విద్యుత్‌ కోసమే మీటర్లు  | Meters for quality electricity to farmers says Department of Energy | Sakshi
Sakshi News home page

నాణ్యమైన విద్యుత్‌ కోసమే మీటర్లు 

Published Wed, Oct 26 2022 3:22 AM | Last Updated on Wed, Oct 26 2022 12:54 PM

Meters for quality electricity to farmers says Department of Energy - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని వ్యవసాయ విద్యుత్‌ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడంతోపాటు విద్యుత్‌ పంపిణీ నష్టాల తగ్గింపు, పారదర్శకత కోసమే స్మార్ట్‌ మీటర్లను ఏర్పాటుచేస్తున్నట్టు ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ కె.సంతోషరావు, ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీ జె.పద్మజనార్దనరెడ్డి తెలిపారు. ‘రైతు చేనుకు కడప మీటరు’ పేరుతో ఈనాడు దినపత్రికలో సోమవారం ప్రచురితమైన కథనం వాస్తవానికి విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. స్మార్ట్‌ మీటర్ల ప్రాజెక్టులో వాస్తవాలతో వారు మంగళవారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాలు..

రైతుల ప్రయోజనానికే మీటర్లు 
ప్రభుత్వ ఉత్తర్వుల (జీవోఎంఎస్‌ 22, తేదీ 01.09.2020) ప్రకారం పెడుతున్న ఈ మీటర్ల వల్ల మోటార్లు కాలిపోవు. ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవు. రైతులకు నాణ్యమైన విద్యుత్‌ అందుతుంది. ఎంత విద్యుత్‌ వాడుతున్నారో కచ్చితంగా తెలియడం వల్ల సరిపడా కెపాసిటీ ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లు పెట్టేందుకు అవకాశం ఉంటుంది. లోడ్‌ సామర్థ్యాన్ని అంచనా వేసుకుంటూ భవిష్యత్‌ ప్రణాళికను రూపొందించుకోవచ్చు.

మీటర్ల ఏర్పాటుకు రైతులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. రైతులు ఎన్ని యూనిట్లు వినియోగిస్తారో.. దానికయ్యే చార్జీలను మొత్తం ప్రభుత్వమే నేరుగా రైతుల ప్రత్యేక ఖాతాల్లో డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (డీబీటీ) కింద జమచేస్తుంది. ఆ డబ్బు నేరుగా రైతుల ద్వారా డిస్కంలకు బదిలీ అవుతుంది. ఈ ప్రక్రియల వల్ల పూర్తి పారదర్శకత ఉంటుంది. కరెంటు సరఫరా కంపెనీలను ప్రశ్నించేహక్కు  రైతులకు లభిస్తుంది. కంపెనీలకు కూడా బాధ్యత పెరుగుతుంది.

తగ్గుతున్న నష్టాలు 
ప్రస్తుతం ఐఆర్‌డీఏ మీటర్లను మీటరు బోర్డుపై అమర్చాం. రీడర్లు ఐఆర్‌డీఏ పోర్టు ద్వారా రీడింగ్‌ తీయాల్సి ఉంది. ఈ వ్యవసాయ సర్వీసులు దూర ప్రాంతాల్లో విస్తరించి ఉండడం వల్ల ఈ పద్ధతిలో రీడింగ్‌ తీయడం కష్టంగా ఉంది. అందుకే స్మార్ట్‌మీటర్లు ఏర్పాటు చేయాలని విద్యుత్‌ సంస్థలు సంకల్పించాయి. రాష్ట్రంలో పైలెట్‌ ప్రాజెక్టు కింద ఏపీఈపీడీసీఎల్‌ పరిధిలోని శ్రీకాకుళం జిల్లాలో మీటర్లను ఏర్పాటుచేసిన తర్వాత ప్రయాస్‌ ఎనర్జీ గ్రూప్‌ (స్వతంత్ర గ్రూప్‌) సర్వే రిపోర్టు ప్రకారం నష్టాలు 15–20 శాతానికి తగ్గినట్లు నమోదైంది. 

ఆ టెండర్లు ఎప్పుడో రద్దు 
విద్యుత్‌ సంస్థల్లో గ్రామీణ ప్రాంతాల్లోని త్రీఫేజ్‌ మీటర్లకు డీబీటీ విధానం కోసం ఐదేళ్ల కాలపరిమితితో టెండర్లను ఆహ్వానించాం. ఆర్‌డీఎస్‌ఎస్‌ కింద స్మార్ట్‌ మీటర్లను గడువులోపు పూర్తిచేస్తే 22.50 శాతం గ్రాంటు రూపంలో సమకూరుతుంది. మొదటి రీడింగ్‌ తీసిన తర్వాత కాంట్రాక్టర్‌కు ఒక్కో మీటరుకు కెపెక్స్‌ కింద రూ.1,800 చొప్పున చెల్లిస్తాం. తర్వాత మిగిలిన మొత్తంతోపాటు ఆపరేషన్, మెయింటెనెన్స్, రీడింగ్‌ల కోసం అయ్యే మొత్తాన్ని నెలవారీగా ఐదేళ్ల కాంట్రాక్ట్‌ కాలవ్యవధిలో ప్రాజెక్టు వ్యయాన్ని ఇస్తాం.

వీటికి నెలకు రూ.254 చొప్పున గుత్తేదార్లు టెండర్లను దాఖలు చేశారు. కోవిడ్‌–19 సమయంలో రూపొందించిన అంచనాల హెచ్చుతగ్గులను పరిశీలించి ప్రభుత్వం టెండర్లు రద్దుచేసింది. ప్రస్తుత ధరల ప్రకారం ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాం. ప్రభుత్వం నుంచి పరిపాలన అనుమతులు లభించిన తర్వాతే కొత్తగా టెండర్లు పిలుస్తాం. ఇటీవల మహారాష్ట్రలోని పట్టణ ప్రాంతాల్లో బెస్ట్‌ కంపెనీ స్మార్ట్‌ మీటర్ల కోసం ఆఫర్‌ చేసిన బిడ్లలో ఒక్కో మీటరుకు నెలకు వ్యయం రూ.200.96 పైసలుగా ఖరారైంది.

ఏడున్నర సంవత్సరాల కాలవ్యవధి కలిగిన వీటిలో 80 శాతం సింగిల్‌ఫేజ్‌ మీటర్లు కాగా 20 శాతం మాత్రమే త్రీఫేజ్‌ మీటర్లు. కానీ ఏపీలో వ్యవసాయ సర్వీసులన్నీ త్రీఫేజ్‌ మీటర్లే. ఒక్కో మీటరుకు కేంద్రప్రభుత్వ అంచనా ధర పదేళ్ల కాలపరిమితికి రూ.6 వేలు. దీనికి అనుగుణంగా మీటర్లు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు రూపొందిస్తున్నాం. 

వ్యవసాయానికి నిరంతర విద్యుత్‌ 
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ విద్యుత్‌ సర్వీసులకు పగటిపూట తొమ్మిదిగంటల నిరంతర విద్యుత్తును సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏడువేల మెగావాట్ల సౌరవిద్యుత్తు కొనుగోలుకు సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకీ)తో ఒప్పందం కుదుర్చుకుంది. రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడానికి సుమారు రూ.1,700 కోట్లు ఖర్చుచేసి ఫీడర్లను ఏర్పాటు చేశాం.

గడచిన 90 రోజుల్లో కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్ల స్థానంలో 48 గంటల్లోపే కొత్తవాటిని బిగించాం. రానున్నరోజుల్లో నూటికి నూరుశాతం 48 గంటల్లోపే మార్చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఇచ్చిన ఆదేశాలను అమలుచేయడానికి అన్ని రకాల చర్యలను విద్యుత్‌ పంపిణీ సంస్థలు తీసుకుంటున్నాయి.  

అనుబంధ పరికరాలకు రూ.14,455 వ్యయం 
మీటరుకు అనుబంధ పరికరాలు, నిర్వహణకు రూ.29 వేలు ఖర్చవుతోందని ఈనాడు దినపత్రిక రాసిన కథనంలో వాస్తవం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 18.58 లక్షల స్మార్ట్‌ మీటర్ల ద్వారా వ్యవసాయ విద్యుత్‌ సర్వీసుకు అనుబంధ పరికరాలకు రూ.14,455 వ్యయంతో, మీటరు బాక్స్‌తో పాటు, పీఈసీ వైరు, ఎంసీబీ, కెపాసిటర్, ఎర్తింగ్‌ పరికరాలు ఏర్పాటు చేస్తాం.

ఈ విధంగా ఏర్పాటు చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వ పథకం ఆర్‌డీఎస్‌ఎస్‌లో 60 శాతం గ్రాంటు రూపంలో డిస్కంకు సమకూరుతుంది. అనుబంధ పరికరాలను అమర్చడానికి, అవి పాడైపోకుండా ఉండేందుకు వీలుగా మీటరు బాక్సులను ఏర్పాటు చేస్తాం. ఎంసీబీ ద్వారా ఓవర్‌ లోడ్‌ ప్రొటెక్షన్‌ ఉంటుంది. తద్వారా విద్యుత్‌ ప్రమాదాలను తగ్గించడంతోపాటు ట్రాన్స్‌ఫార్మర్‌ ఫెయిల్యూర్స్‌ను కూడా తగ్గించవచ్చు.

వ్యవసాయ పంపుసెట్లకు రక్షణ లభిస్తుంది. ప్రస్తుతం ఏటా సగటున 45,098 వ్యవసాయ విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయి. వాటి మరమ్మతుల కోసం ఏటా రూ.102 కోట్ల వ్యయాన్ని సంస్థలు భరించాల్సి వస్తోంది. కెపాసిటర్లను అమర్చడం ద్వారా నాణ్యమైన వోల్టేజ్‌తో రైతులకు విద్యుత్‌ సరఫరా చేయవచ్చు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement