apepdcl
-
కూటమి నేతలకు మేతగా...!
సాక్షి, అమరావతి: కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో సంపద సృష్టిస్తామనే మాటను పక్కన పెట్టి ప్రజలపై విద్యుత్ చార్జీల భారం మోపుతోంది. అంతటితో ఆగకుండా విద్యుత్ శాఖ ఆస్తులను కార్పొరేట్లకు అప్పగించి కొందరు నేతలకు లబ్ధి కలిగించాలని భావిస్తోంది. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న కార్యాలయాలను సైతం కాల్చివేసి ఖాళీ స్థలాలను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోంది. విశాఖలో రూ.100 కోట్లకుపైగా విలువైన 2.20 ఎకరాల స్థలాన్ని బహుళ అంతస్తుల భవనం పేరిట కార్పొరేట్ సంస్థకు అప్పగించేందుకు చేస్తున్న ప్రయత్నాలే ఇందుకు నిదర్శనం. సొంత లాభమే లక్ష్యంగా..విశాఖపట్నం నగరంలోని గ్రీన్ పార్క్ హోటల్ ఎదురుగా రోడ్డును ఆనుకుని సుమారు 2.20 ఎకరాల్లో ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) కార్యాలయాలు, ఉద్యోగుల అతిథి గృహం ఉన్నాయి. అక్కడ ప్రస్తుతం ఉన్న రెండు అంతస్తుల భవనంలో విశాఖపట్నం పర్యవేక్షక ఇంజనీర్ (ఎస్ఈ) ఆపరేషన్స్ సర్కిల్ కార్యాలయం కొనసాగుతోంది. అదేవిధంగా విశాఖలోని ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో పనుల కోసం 11 జిల్లాల నుంచి వచ్చే అధికారులు, సిబ్బందికి ఇక్కడ ఉన్న అతిథి గృహం ఒక్కటే వసతి కల్పిస్తోంది. అయితే, ఆ భవనాలను నేలమట్టం చేసి రూ.100 కోట్లకు పైగా విలువ చేసే స్థలాన్ని బహుళ అంతస్తుల భారీ భవన సముదాయాన్ని నిర్మించేందుకు కార్పొరేట్ సంస్థలకు కేటాయించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. దీనిద్వారా రాష్ట్ర ప్రభుత్వంలోని కొందరు నేతలకు ఆర్థికంగా భారీ లబ్ధి చేకూరేలా ప్రణాళికలు రూపొందిస్తోంది.ఇందులో భాగంగా కొత్తగా నిర్మించే భారీ భవనంలోని ఒకటి, రెండు అంతస్తుల్లో ఏపీఈపీడీసీఎల్ విశాఖ సర్కిల్ కార్యకలాపాలకు అవకాశం కల్పించడం, లేదా నగరంలోనే సాగర్‌నగర్ వద్ద నిర్మిస్తున్న మరో భవనంలోకి విశాఖ సర్కిల్ ఆఫీసును తరలించడం అనే రెండు ప్రతిపాదనలను కూటమి ప్రభుత్వం తయారు చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫైళ్లను సిద్ధం చేయాల్సిందిగా సర్కిల్ అధికారులను ఆదేశించింది. మరోవైపు తమ కార్యాలయాన్ని కాల్చివేసి విలువైన స్థలాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే వార్తలతో సర్కిల్ పరిధిలోని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారిలా మారి కంపెనీ స్థలాలను ఇలా లాక్కొని ప్రైవేట్ డెవలపర్లకు అప్పగించడం ఏమిటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
సెలవులో రెండు డిస్కంల డైరెక్టర్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్)లో ఫైనాన్స్ డైరెక్టర్‌గానూ, ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) ఇన్చార్జ్ ఫైనాన్స్ డైరెక్టర్‌గానూ ఉన్న దండగల చంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు సెలవు మంజూరు చేసింది. వ్యక్తిగత కారణాల రీత్యా ఆయన కోరిన మేరకు ఈ నెల 15 నుంచి 30వ తేదీ వరకు 17 రోజులు సెలవు ఇస్తున్నట్లు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే డిసెంబర్ 1వ తేదీన పబ్లిక్ హాలిడేని వినియోగించుకోవడానికి కూడా చంద్రంకు అనుమతినిచ్చారు. అయితే వాస్తవానికి ఈ నెల 15తోనే చంద్రం పదవీకాలం ముగుస్తోంది. ఇటీవల విద్యుత్ సంస్థల్లో పదిమంది డైరెక్టర్ల చేత బలవంతంగా కూటమి ప్రభుత్వం రాజీనామా చేయించింది. వారితో పాటు ఈ నెలలో పదవీ విరమణ చేయనున్న డైరెక్టర్ల పోస్టుల భర్తీకి విద్యుత్ సంస్థలు నోటిఫికేషన్‌ను జారీ చేశాయి. కానీ చంద్రం కొనసాగింపుపై నిర్ణయం వెలువడనప్పటికీ ఆ పోస్టుకు మాత్రం నోటిఫికేషన్ ఇవ్వలేదు. చంద్రంపై ఎందుకంత ప్రేమ.. ప్రభుత్వం మారిన వెంటనే చంద్రం టీడీపీ నేతలతో మంచి సంబంధాలు ఏర్పరచుకున్నారు. ఢిల్లీకి వెళ్లి మరీ కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడిని కలిసి ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయించుకున్నారు. వ్యాపార వేత్త అయిన తన మామ సాయంతో రాష్ట్ర మంత్రులను తరచుగా కలుస్తూ తన పోస్టును పదిలం చేసుకోవడానికి అవసరమైన అన్ని ప్రయత్నాలు చేశారు.ఏపీసీపీడీసీఎల్‌లో ఫైనాన్స్ డైరెక్టర్ పోస్టును తనకు ఇవ్వాల్సిందిగా కూటమి మంత్రులను చంద్రం కోరారు. వారి ఆశీస్సులతో ఫుల్ అడిషనల్ చార్జ్ (ఎఫ్ఏసీ)తో నియమితులయ్యారు. మునుపెన్నడూ లేని విధంగా రెండు డిస్కంలకు ఒక్కరే ఫైనాన్స్ డైరెక్టర్ అనే కొత్త సంప్రదాయానికి తెరదీశారు. అయితే చంద్రాన్ని ఇంకా కొనసాగించడానికి నిబంధనలు అడ్డురావడంతో ఏం చేయాలనేదానిపై ఇంధన శాఖ కసరత్తు చేస్తోంది. -
విద్యుత్ సంస్థల్లో కొత్త సర్కిళ్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల్లో కొత్తగా 13 సర్కిళ్లు(జిల్లా కార్యాలయాలు) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. గత ప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలు చేసింది. కొత్తగా వచ్చిన జిల్లాలకు ఇన్‌చార్జ్‌లను నియమించింది. అనంతరం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ, జిల్లాల్లో సర్కిల్, డివిజన్, ఏఈ కార్యాలయాల ఏర్పాటుతోపాటు వాటికి అధికారులు, సిబ్బందిని నియమించడంపై దృష్టి సారించలేదు. దీంతో దాదాపు 1.92 కోట్ల మంది విద్యుత్ వినియోగదారులకు మూడు డిస్కంలు పాత పద్ధతిలోనే విద్యుత్ పంపిణీ, బిల్లుల జారీ వంటి అన్ని కార్యకలాపాలు కొనసాగిçÜ్తున్నాయి.చివరికి సర్కిళ్ల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్లు ఆగస్టు 21వ తేదీన, ఏపీసీపీడీసీల్ అదే నెల 27న ప్రభుత్వాన్ని కోరాయి. అయినప్పటికీ ప్రభుత్వం ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోలేదు.‘సాక్షి’ కథనంతో కదలికఈ నేపథ్యంలో ‘కొత్త సర్కిళ్లు ఎంతెంత దూరం?’ శీర్షికతో గత నెల 30న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఆ కథనంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఇంధన శాఖ అధికారులతో నివేదికలు తెప్పించుకుని చర్చించింది. తాజాగా 13 కొత్త సర్కిల్స్ ఏర్పాటుకు అనుమతిచ్చింది. రాష్ట్రంలోని మూడు డిస్కంలలో సుమారు 23 వేల మంది శాశ్వత సిబ్బంది పనిచేస్తున్నారు. ఎటువంటి ఆర్థక భారం పడకుండా ఇప్పుడు ఉన్నవారినే పాత, కొత్త సర్కిళ్లకు సర్దుబాటు చేయాల్సిందిగా ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. ఈ ప్రక్రియను పూర్తిచేసి ప్రభుత్వానికి తుది ప్రతిపాదనలను పంపాలని సీఎండీలకు సూచించారు. కొత్త సర్కిళ్లు ఏర్పడితే ప్రజలకు విద్యుత్ సేవలు మరింత చేరువవుతాయి. అదేవిధంగా ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. దూరం(కిలో మీటర్లు), హెచ్‌టీ సర్వీసులు, ఎల్టీ సర్వీసులు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, వాటి సామర్థ్యం, సబ్ స్టేషన్ల సంఖ్య, నెలకు వచ్చే సగటు ఆదాయం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని విద్యుత్ సర్కిళ్ల విస్తరణకు చర్యలు చేపట్టాలని డిస్కంలు భావిస్తున్నాయి. -
చినబాబు చెప్పారు చేయాల్సిందే
సాక్షి, అమరావతి : చేతికొచ్చిన అధికారాన్ని అడ్డు పెట్టుకుని తాము చెప్పిన పని క చ్చితంగా చేసి తీరాల్సిందేని కూటమి నేతలు ఉన్నతాధికారులకు హుకుం జారీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) సీఎండీ.. ‘చినబాబు’ చెప్పారని రాత్రికి రాత్రే రాజమహేంద్రవరం ఎస్ఈ పోస్టుకు సంబంధించిన ఆదేశాలను మార్చేయడం విద్యుత్ శాఖలో తీవ్ర చర్చకు దారితీసింది. కాకినాడ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తున్న గొర్లె ప్రసాద్‌ను రాజమహేంద్రవరం ఎస్ఈగా పదోన్నతిపై నియమిస్తూ డిస్కం సీఎండీ ఐ.పృధ్వీతేజ్ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయం సీఎంఓలోని ఓ ఉన్నతాధికారి ద్వారా మంత్రి లోకేశ్‌కు తెలియడంతో వెంటనే ఆ ఆదేశాలు రద్దు చేసి, తాను చెప్పిన అధికారిని ఆ పోస్టులో నియమించాలని చెప్పారు. ఈ మేరకు ఆ ఉన్నతాధికారి ఏపీఈపీడీసీఎల్ సీఎండీని ఫోన్లో దీనిపై హెచ్చరించారు. సీఎంఓ ఆగ్రహాం వ్యక్తం చేయడంతో ప్రసాద్‌ను కార్పొరేట్ కార్యాలయంలో జనరల్ మేనేజర్(ఆపరేషన్స్)గా పంపి, ఆ స్థానంలో ఉన్న కె.తిలక్ కుమార్‌ను రాజమహేంద్రవరం ఎస్ఈగా నియమిస్తూ అర్ధరాత్రి 11.30 గంటల తర్వాత ఆదేశాలు ఇచ్చారు. ఈ సంఘటన విద్యుత్ ఉద్యోగ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఇందుకు కారణం ఏమంటే.. ఎన్నికల ముందు అవినీతి కేసులో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడు ప్రభుత్వ వైద్యురాలిగా తిలక్ భార్య ఆయనకు చికిత్స అందించారని తెలిసింది. బాబు సూచనల మేరకు వైద్యం అందించినందుకే ఆమెకు నజరానాగా ఆమె భర్తకు ఎస్ఈ పోస్టును కట్టబెట్టారని సమాచారం. కాగా, ఇంధన శాఖలో ఇప్పటికే జేఎండీలు, ఎండీలు, డైరెక్టర్లు అంటూ పది మందికి పైగా ఉన్నతాధికారుల చేత బలవంతంగా రాజీనామాలు చేయించారు. వారి స్థానంలో తమ వారిని నియమించేందుకు రూ.కోట్లల్లో బేరసారాలు సాగిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఈ పోస్టుకు రూ.50 లక్షల వరకు, ఎలక్ట్రికల్ ఇంజనీర్ పోస్టుకు రూ.10 లక్షలు వసూలు చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. -
విద్యుత్‌శాఖలో వింత ఆచారం
సాక్షి, అమరావతి: విద్యుత్‌శాఖలో డిప్యుటేషన్లపై పనిచేస్తున్నవారి విషయంలో ఆ శాఖ ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయం ఉద్యోగవర్గాల్లో సంచలనం సృష్టించింది. డిప్యుటేషన్‌పై వచ్చినవారు శాశ్వతంగా అక్కడే పనిచేసేలా జారీచేసిన ఈ ఉత్తర్వులు.. సంస్థ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి రగిలించాయి. ఒక ప్రభుత్వ విభాగంలో ఒక అధికారినిగానీ, సిబ్బందిగానీ వారి సొంత కారణాలతోనో, ఆ శాఖ అవసరానికో ఒకచోటు నుంచి మరోచోటుకి, ఒక శాఖ నుంచి మరో శాఖకు డిప్యుటేషన్‌పై పంపడం సాధారణంగా జరుగుతుంటుంది. దీనికి కాలాన్ని కూడా చాలా తక్కువగా నిర్ణయిస్తారు. అంటే మూడునెలల నుంచి ఏడాది పాటు తాత్కాలిక విధుల్లో కొనసాగేలా ఆ ఆదేశాలు ఇస్తుంటారు.అయితే ఒకసారి ఒక చోటుకిగానీ, ఒక శాఖకుగానీ వెళ్లిన వారిలో కొందరు అక్కడి నుంచి తిరిగిరావడానికి ఇష్టపడరు. మరికొందరు ఎప్పుడు వెనక్కి వచ్చేద్దామా అని చూస్తుంటారు. వారికిచ్చిన గడువు ప్రకారం డిప్యుటేషన్‌ను పొడిగించడం, రద్దుచేయడం వంటివి ఉన్నతాధికారులు చేస్తుంటారు. ఇదీ సాధారణంగా జరిగేది. రాష్ట్రంలో 11 జిల్లాలకు విద్యుత్ సరఫరా చేస్తున్న ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్)లో మాత్రం ఇందుకు విరుద్ధంగా సరికొత్త ఆచారం పుట్టుకొచ్చి0ది. ఇచ్చిపడేశారంతే.. ఏపీఈపీడీసీఎల్ ప్రధాన కార్యాలయం (కార్పొరేట్ ఆఫీస్) విశాఖపట్నంలో ఉంది. అక్కడ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్స్, జూనియర్ అసిస్టెంట్స్ హోదాల్లో 35 మంది ఉద్యోగులు డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు. వీరిలో వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి దాదాపు తొమ్మిదేళ్లు పూర్తిచేసుకున్న వారు ఉన్నారు. 2015 నుంచి 2023 వరకు ఏటా కొంతమంది చొప్పున వీరంతా వచ్చారు. ఏటా వీరి విజ్ఞప్తిని, సంస్థ అవసరాలను దృష్టిలో ఉంచుకుని డిప్యుటేషన్లు పొడిగిస్తున్నారు. కానీ సడన్‌గా ఏమైందో ఏమోగానీ.. ఇకపై వీరు ఎన్నాళ్లయినా కార్పొరేట్ ఆఫీసులోనే ఉండేలా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఈ 35 మందికి ఇకపై ఏటేటా డిప్యుటేషన్ పొడించాలా, రద్దుచేయాలా అనే చర్చే రాకుండా చేసేశారు. ఇకపై వీరంతా పర్మినెంట్‌గా కార్పొరేట్ కార్యాలయంలోనే విధులు నిర్వర్తించేలా సంస్థ ఫైనాన్స్, హెచ్ఆర్డీ విభాగం డైరెక్టర్ డి.చంద్రం తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. దీంతో జిల్లాల నుంచి ఎవరైనా ఉద్యోగి విశాఖకు డిప్యుటేషన్‌పై వెళ్లాలంటే ఇప్పుడున్నవారు ఉద్యోగ విరమణ చేస్తేగానీ కుదరదు. ఇలాంటి ముఖ్యమైన విధాన నిర్ణయాలు సీఎండీ స్థాయిలోనే తీసుకుంటారు. అలా కాకుండా డైరెక్టర్ స్థాయి అధికారి ఉత్తర్వులు ఇవ్వడం కూడా చర్చనీయాంశమైంది. ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం వెనుక ఏవో బలమైన కారణాలున్నాయనే చర్చ విద్యుత్ ఉద్యోగుల మధ్య జరుగుతోంది. ఏటా ఎందుకని.. డిప్యుటేషన్లపై ఏటా ఫైలు నడపడం పెద్ద ప్రాసెస్‌గా ఉంటోంది. అలాంటిదేం లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నాం. అయినప్పటికీ ఈ డిప్యుటేషన్లను ఎప్పుడైనా రద్దుచేసే అధికారం సంస్థకు ఉంది. – ఐ.పృధ్వీతేజ్, సీఎండీ, ఏపీఈపీడీసీఎల్ -
విశాఖలో ‘అండర్ కరెంట్’
సాక్షి, అమరావతి: విశాఖలో విద్యుత్ వ్యవస్థను సంపూర్ణంగా మారుస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన అత్యంత సురక్షిత విద్యుత్ సరఫరాకు భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. తుపానులు, వరదలు వంటి ప్రకృతి విపత్తులు వచ్చినా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా నిరంతరం వెలుగులు ప్రసరించేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఆంధ్రప్రదేశ్ తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) రూ.720 కోట్లతో ఈ పనులు చేపట్టింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పనులు పూర్తయ్యాయి. నగరంలో విద్యుత్ వ్యవస్థ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో భూగర్భ విద్యుత్ లైన్లతో రీప్లేస్ చేయాలని ఏపీఈపీడీసీఎల్ భావిస్తోంది. సగానికి తగ్గనున్న ప్రసార నష్టాలు భూగర్భ విద్యుత్ కేబుల్ ప్రాజెక్టులో భాగంగా విశాఖ సముద్రతీర ప్రాంతంలోని 28 సబ్స్టేషన్ల పరిధిలో ఇప్పటివరకు 115 కిలోమీటర్ల 33 కేవీ లైన్లు, 349 కిలోమీటర్ల 11 కేవీ లైన్లు, 940 కిలోమీటర్ల ఎల్టీ లైన్లు, 660 రింగ్ మెయిన్ యూనిట్ (ఆర్ఎంయు)లు, 986 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు (డీటీఆర్లు), 1,498 ఫీడర్ పిల్లర్లు, 9,179 సర్వీస్ పిల్లర్లు నిర్మించారు. 1,03,281 సర్వీసులను భూగర్భ విద్యుత్ వ్యవస్థతో అనుసంధానించారు. దీంతో ఎంవీపీ కాలనీ, పాండురంగాపురం, సాగర్‌నగర్, బీచ్ రోడ్, జాతీయ రహదారి–16 ప్రాంతాల్లో ఇటీవల తుపాన్ల సమయంలోను నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉంది. నగరంలోని మిగతా ప్రాంతాల్లో బహిరంగంగా ఉన్న విద్యుత్ స్తంభాలు, లైన్లను తొలగించి భూగర్భంలోకి మార్చనున్నారు. ఇందుకోసం రూ.157 కోట్లతో మూడు గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్ (జీఐఎస్)లు, 35 ఇండోర్ 33/11 కేవీ సబ్స్టేషన్లను నిర్మించాల్సి ఉంది. వీటికోసం 613.31 కిలోమీటర్ల మేర కొత్తగా 33 కేవీ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం ప్రాజెక్టును నాలుగు భాగాలుగా విభజించారు. ఏపీఈపీడీసీఎల్ ప్రస్తుత ప్రసార నష్టాలు 6 శాతంగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ నష్టాల శాతాన్ని సగానికి తగ్గించవచ్చని విద్యుత్ అధికారులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు.. కరెంటు తీగలకు తగులుతున్నాయని చెట్లను నరికేయాల్సిన అవసరం ఉండదు. కొత్త మొక్కలను కూడా నాటి నగరాన్ని పచ్చదనంతో నింపవచ్చు. ఈ కేబుళ్లు ప్రత్యేకం నేషనల్ ఎలక్ట్రిక్ కోడ్ ప్రమాణాలకు అనుగుణంగా భూగర్భ విద్యుత్ లైన్లు ఉండాలి. సరైన వైర్, కేబుల్ ఎంచుకోవడంపైనే ప్రాజెక్టు ఆధారపడి ఉంటుంది. అందువల్ల వాటి ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కేబుల్‌ను ఎక్కడ ఉపయోగిస్తారు, గేజ్ పరిమాణం, స్ట్రాండ్డ్ సాలిడ్, వోల్టేజ్ రేటింగ్, ఇన్సులేషన్, జాకెట్ రంగు వంటివి పరిగణనలోకి తీసుకోవాలి. వైర్లు, కేబుల్స్ రెండింటినీ భూగర్భ నిర్మాణంలో ఉపయోగించవచ్చు. భూగర్భ తీగను రాగి, అల్యూమినియంతో తయారు చేస్తారు. రాగి తీగ సురక్షితంగా భూమిలో మనగలుగుతుంది. దీనిచుట్టూ అత్యంత భద్రతనిచ్చే పొర ఉంటుంది. ఈ కేబుళ్లు కఠినమైన వాతావరణ పరిస్థితులను తట్టుకోగలవు. వైర్‌కు మట్టికి మధ్య ఒక కండ్యూట్ (గొట్టం) యాంత్రిక అవరోధంగా పనిచేస్తుంది. సరికొత్త విశాఖను చూస్తాం విశాఖ సాగరతీర ప్రాంతంలో ఇప్పటికే భూగర్భ విద్యుత్ కేబుల్ వ్యవస్థ ఏర్పాటు చాలా వరకు పూర్తయింది. నగరంలో మిగిలిన ప్రాంతాల్లోను భూగర్భ విద్యుత్ లైన్లు వేస్తున్నాం. మొత్తం పనులు పూర్తయితే విశాఖలో విద్యుత్ సరఫరా వ్యవస్థ స్వరూపమే మారిపోతుంది. సరికొత్త విశాఖను చూస్తాం. ప్రజలకు అత్యంత సురక్షితంగా, నాణ్యమైన నిరంతర విద్యుత్ అందుతుంది. డిస్కం పరిధిలోని ఉత్తరాంధ్ర జిల్లా శ్రీకాకుళంలోను 33 కేవీ, 11 కేవీ విద్యుత్ లైన్లను భూగర్భ విద్యుత్ కేబుల్ వ్యవస్థలోకి మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – కె.సంతోషరావు, సీఎండీ, ఏపీఈపీడీసీఎల్ -
ప్రగతి బాటలో విద్యుత్ రంగం
సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యుత్ రంగం ప్రగతి బాటలో పయనిస్తోందని ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. చేసిన పనులు, సాధించిన ఫలితాలు, అవార్డులే ఇందుకు నిదర్శనమన్నారు. ట్రాన్స్‌కో, జెన్కో, ఏపీసీపీడీసీఎల్, ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్, ఏపీఎస్ఈసీఎం సంస్థలకు సంబంధించిన డైరీలు, క్యాలెండర్లను మంత్రి పెద్దిరెడ్డి బుధవారం విజయవాడలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర పురోగాభివృద్ధి విద్యుత్ రంగంపైనే ఆధారపడి ఉంటుందన్నారు. 99 శాతం మంచి చేసి, ఎక్కడో ఒక శాతం పొరపాటు జరిగితే దానినే పనిగట్టుకొని కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. సీఎం జగన్ ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నామని మంత్రి ఉద్ఘాటించారు. విద్యుత్ సమర్థ వినియోగానికి సంబంధించి రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్‌కు రాష్ట్రపతి అవార్డుతో పాటు, ఏపీ ట్రాన్స్‌కో, డిస్కం, నెడ్కాప్లకు జాతీయ అవార్డులు రావడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే రాష్ట్ర వినియోగానికి పోగా.. మిగిలిన మొత్తాన్ని ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తామన్నారు. వచ్చే మార్చిలో ఆర్టీపీఎస్ 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్‌ను ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. ఉద్యోగుల న్యాయమైన కోర్కెలను పరిశీలించి ప్రభుత్వం తప్పకుండా పరిష్కరిస్తుందని మంత్రి ప్రకటించారు. కార్యక్రమంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఉన్నతాధికారులు బి.శ్రీధర్, మల్లారెడ్డి, పద్మా జనార్దన్‌రెడ్డి, సంతోష్‌రావు, రమణారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. ఫ్లైయాష్ ఉత్పత్తిదారులు, వినియోగదారుల కోసం పోర్టల్ రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. విజయవాడలోని ఏపీ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ(పర్యావరణం) నీరబ్‌కుమార్ ప్రసాద్, కార్పొరేషన్ ఎండీ ఖజూరియా, చైర్మన్ గుబ్బా చంద్రశేఖర్‌తో కలిసి బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. కాలుష్య కారక వ్యర్థాల నిర్వహణకు ఏర్పాటు చేసిన పోర్టల్‌ను మంత్రి ప్రారంభించారు. -
అన్నదాత అడిగిందే తడవుగా విద్యుత్ కనెక్షన్
సాక్షి, అమరావతి: వ్యవసాయాన్ని పండుగలా మార్చాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా విద్యుత్ పంపిణీ సంస్థలు వ్యవసాయ విద్యుత్ సర్వీసులను వేగంగా మంజూరు చేస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 57,420 వ్యవసాయ సర్వీసులు అందజేశారు. డిస్కంల వారీగా పరిశీలిస్తే ఏపీ ఎస్పీడీసీఎల్ పరిధిలోని చిత్తూరు, నెల్లూరు, వైఎస్సార్, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఈ ఏడాది (2022–23 ఆర్థిక సంవత్సరం) ఇప్పటివరకూ 33,794 వ్యవసాయ విద్యుత్ సర్వీసులను అధికారులు అందజేశారు. మరో 33,099 సర్వీసులకు ఈ నెలాఖరుకల్లా కనెక్షన్లు ఇవ్వనున్నారు. ఏపీ ఈపీడీసీఎల్ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఏలూరు జిల్లాల్లో ఈ ఏడాది 4,525 సర్వీసులను రైతులకు అందించారు. 3,687 సర్వీసులను ఈ నెలలో మంజూరు చేయనున్నట్టు ఏపీ ఈపీడీసీఎల్, ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ కె.సంతోషరావు వెల్లడించారు. ఇక ఏపీ సీపీడీసీఎల్ పరిధిలో ఇప్పటివరకూ 19,101 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను రైతులకు మంజూరు చేశారు. విజయవాడ సర్కిల్ పరిధిలో 6,411, గుంటూరు సర్కిల్ పరిధిలో 2,064, ఒంగోలుæ సర్కిల్ పరిధిలో 11,479, సీఆర్డీఏ పరిధిలో 88 చొప్పున మరో 20,042 కొత్త కనెక్షన్లు ఇచ్చేందుకు మౌలిక సదుపాయాల పనులు జరుగుతున్నాయని ఏపీ సీపీడీసీఎల్ సీఎండీ జె.పద్మజనార్దనరెడ్డి తెలిపారు. రూ.1,700 కోట్ల ఖర్చు వచ్చే ఏడాది నుంచి వ్యవసాయానికి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ (సెకీ) ద్వారా తీసుకునే సౌర విద్యుత్‌ను 9 గంటలపాటు పగటిపూటే పంపిణీ చేయనున్నారు. ఇందులో భాగంగా వ్యవసాయ సర్వీసులకు విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైన విద్యుత్ వ్యవస్థను ఆధునికీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.1,700 కోట్లను ఖర్చు చేసింది. అంతేకాకుండా హై–ఓల్టేజి డిస్ట్రిబ్యూషన్ సిస్టం (హెచ్‌వీడీఎస్) పథకం ద్వారా రైతులకు ట్రాన్స్ఫార్మర్లను పంపిణీ చేయనున్నారు. బోరు దగ్గరకు 180 మీటర్ల వరకు ఉచితంగా విద్యుత్ లైన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ మొత్తం ప్రక్రియకు ఒక్కో వ్యవసాయ సర్వీసుకు అయ్యే దాదాపు రూ.1.20 లక్షల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. ఏటా సగటున 45,098 వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. వీటిని బాగుచేయడం కోసం రూ.102 కోట్లు ఖర్చవుతోంది. అయినప్పటికీ ట్రాన్స్ఫార్మర్ దెబ్బతింటే 48 గంటల్లోనే బాగు చేయడం లేదా కొత్తది ఇవ్వడం జరగాలని ఇటీవల సీఎం వైఎస్ జగన్ ఆదేశించడంతో ఆ మేరకు అవసరమైన మెటీరియల్ కూడా ఆయా జిల్లాల స్టోర్లలో అధికారులు సిద్ధంగా ఉంచారు. -
నాణ్యమైన పరికరాలనే కొంటున్నాం..
సాక్షి, అమరావతి: డిస్కమ్ పరిధిలో వివిధ పనుల కోసం నాణ్యమైన పరికరాలనే కొనుగోలు చేస్తున్నామని ఏపీ తూర్పు, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల సీఎండీ కె.సంతోషరావు తెలిపారు. డిస్కంలో నాసిరకం తీగలు, పరికరాలను కొనుగోలు చేస్తున్నారంటూ ఓ వర్గం మీడియా ప్రచారం చేయడం అవాస్తవమన్నారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. వివిధ పనులకు టెండర్ల స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్ రూపొందించే ప్రక్రియలో భాగంగా బిడ్డర్ అర్హతను తెలుసుకోవడం కోసం కూడా టెక్నికల్ స్పెసిఫికేషన్స్‌ను ఇండియన్ స్టాండర్డ్స్ స్పెసిఫికేషన్‌కు అనుగుణంగా తయారు చేస్తారని తెలిపారు. ఈ–ప్రొక్యూర్మెంట్ ప్రక్రియలో రివర్స్ బిడ్డింగ్ ద్వారా పారదర్శకంగా కాంట్రాక్టర్‌కు టెండరు దక్కాక సంబంధిత ఫ్యాక్టరీలో పరికరాల నాణ్యతను ఐఎస్ నాణ్యత ప్రమాణాలననుసరించి థర్డ్ పార్టీ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్‌తో పరీక్షిస్తామని ఆయన వెల్లడించారు. ఆఫీసర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా పరికరాల తరలింపునకు అనుమతించి, ఆయా ఫ్యాక్టరీల నుంచి సంస్థ పరిధిలోని స్టోర్లకు తరలిస్తామని తెలిపారు. స్టోర్లకు చేరిన పరికరాల నాణ్యతను ఐఎస్ నాణ్యత ప్రమాణాలననుసరించి మరోసారి పరీక్షించాకే వాటిని స్టాక్‌లోకి తీసుకుని క్షేత్ర స్థాయిలో అమర్చేందుకు చర్యలు చేపడతామన్నారు. ఈ పనుల్లో, పరికరాల్లో నాణ్యత ప్రమాణాలను పరీక్షించేందుకు డిస్కంలలో ప్రత్యేకంగా క్వాలిటీ కంట్రోల్ విభాగాలు పని చేస్తున్నాయని వెల్లడించారు. అలాగే, డిస్కంలో లైన్మెన్ పోస్టులను కుదించేశారని పేర్కొనడంలో కూడా వాస్తవం లేదని తెలిపారు. 2014 నుంచి 2019 వరకు క్షేత్రస్థాయిలో నియామకాలు జరగలేదన్నారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే.. క్షేత్రస్థాయి సిబ్బంది నియామకాలకు ఆమోద ముద్ర వేశారని గుర్తు చేశారు. దీంతో 2019 అక్టోబర్‌లో ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో 3,088, ఏపీఈపీడీసీఎల్ పరిధిలో 2,859 ఎనర్జీ అసిస్టెంట్లను నియమించినట్లు వివరించారు. -
ప్రజలపై పైసా భారం లేకుండా స్మార్ట్ మీటర్లు
సాక్షి, అమరావతి: ప్రజలపై పైసా భారం పడకుండా, పూర్తి పారదర్శకంగా స్మార్ట్ మీటర్ల టెండర్ల ప్రక్రియ నిర్వహించేందుకు విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు రంగం సిద్ధం చేశాయి. రాష్ట్రంలోని గృహాలకు, వ్యవసాయ సర్వీసులకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని ఇంధన శాఖ సంకల్పించింది. బోర్లకు మీటర్లు అమర్చడం వల్ల డిస్కంల సమర్థత పెంచవచ్చని, విద్యుత్ చౌర్యాన్ని అరికట్టవచ్చని, రైతులకు బాధ్యత పెంచవచ్చనే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేయనుంది. ఈ వివరాలతో టెండర్ డాక్యుమెంట్లను అక్టోబర్ 21న విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు న్యాయ సమీక్షకు పంపించాయి. వాటిపై ప్రజలు, వినియోగదారులు సూచనలు, సలహాలు, అభ్యంతరాలను వ్యక్తం చేసేందుకు ఇచ్చిన గడువు మంగళవారంతో ముగుస్తుంది. డాక్యుమెంట్ల పరిశీలన పూర్తికాగానే రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి డిస్కంలు దరఖాస్తు చేయనున్నాయి. ఏపీఈఆర్సీ తుది నిర్ణయం తరువాత మీటర్ల ఏర్పాటు ప్రక్రియ మొదలవుతుందని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. అది అవాస్తవం మీటరుకు రూ. 6 వేలు, నిర్వహణకు రూ.29వేలు చొప్పున మొత్తం రూ.35 వేలను డిస్కంలు ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అది పూర్తిగా అవాస్తవమని డిస్కంలు స్పష్టం చేశాయి. నిజానికి టెండర్లు కోట్ చేసిన రేటు ప్రకారం ఒక నెలకు ఒక్కో మీటరుకు రూ. 255 చొప్పున అన్ని నిర్వహణ బాధ్యతలు, దొంగతనం జరిగిన, మీటర్లు కాలిపోయిన టెండర్ బిడ్ చేసేవారే మీటర్లు మార్చే విధంగా డాక్యుమెంట్ పొందుపరిచారు. దీని ప్రకారం ఐదేళ్లకు రూ. 15,300 మాత్రమే ఖర్చుఅవుతోంది. వ్యవసాయ విద్యుత్ మీటర్లకు డీఓఎల్ స్టార్టర్లు వాడటం వల్ల 4 నుంచి 5 రెట్లు ఎక్కువ విద్యుత్ డ్రా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీటరు సామర్థ్యం దానికి తగ్గట్టుగా ఉండాలి. వ్యవసాయ క్షేత్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ సరిగ్గా ఉండదు. అందువల్ల దానికి తగ్గట్టు కమ్యూనికేషన్ వ్యవస్థను టెండర్స్ బిడ్ చేసే వారే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. మీటర్లతో ప్రయోజనం స్మార్ట్ మీటర్లు వస్తే విద్యుత్ వృథా, చౌర్యాన్ని అరికట్టడం సాధ్యమవుతుంది. సరఫరాలో లోపాలుంటే డిస్కంలను ప్రశ్నించే హక్కు వినియోగదారులకు లభిస్తుంది. పంపిణీ వ్యవస్థలో లోపాలను సకాలంలో గుర్తించడం వల్ల విద్యుత్ అంతరాయాలను వెంటనే పరిష్కరించే వీలుంటుంది. స్మార్ట్ మీటర్లు ‘టూ వే కమ్యూనికేషన్’ను సపోర్ట్ చేస్తాయి. అంటే వినియోగదారుల మొబైల్‌కు అనుసంధానమై ఉంటాయి. విద్యుత్ పంపిణీ సంస్థల నుంచి విద్యుత్ ధరలు, బిల్లు గడువు వంటి సందేశాలను ఎప్పటికప్పుడు వినియోగదారుల మొబైల్ ఫోన్లకు పంపుతాయి. – కె.సంతోషరావు, సీఎండీ, ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్ -
నాణ్యమైన విద్యుత్ కోసమే మీటర్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడంతోపాటు విద్యుత్ పంపిణీ నష్టాల తగ్గింపు, పారదర్శకత కోసమే స్మార్ట్ మీటర్లను ఏర్పాటుచేస్తున్నట్టు ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కె.సంతోషరావు, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ జె.పద్మజనార్దనరెడ్డి తెలిపారు. ‘రైతు చేనుకు కడప మీటరు’ పేరుతో ఈనాడు దినపత్రికలో సోమవారం ప్రచురితమైన కథనం వాస్తవానికి విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. స్మార్ట్ మీటర్ల ప్రాజెక్టులో వాస్తవాలతో వారు మంగళవారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాలు.. రైతుల ప్రయోజనానికే మీటర్లు ప్రభుత్వ ఉత్తర్వుల (జీవోఎంఎస్ 22, తేదీ 01.09.2020) ప్రకారం పెడుతున్న ఈ మీటర్ల వల్ల మోటార్లు కాలిపోవు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవు. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందుతుంది. ఎంత విద్యుత్ వాడుతున్నారో కచ్చితంగా తెలియడం వల్ల సరిపడా కెపాసిటీ ఉన్న ట్రాన్స్ఫార్మర్లు పెట్టేందుకు అవకాశం ఉంటుంది. లోడ్ సామర్థ్యాన్ని అంచనా వేసుకుంటూ భవిష్యత్ ప్రణాళికను రూపొందించుకోవచ్చు. మీటర్ల ఏర్పాటుకు రైతులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. రైతులు ఎన్ని యూనిట్లు వినియోగిస్తారో.. దానికయ్యే చార్జీలను మొత్తం ప్రభుత్వమే నేరుగా రైతుల ప్రత్యేక ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) కింద జమచేస్తుంది. ఆ డబ్బు నేరుగా రైతుల ద్వారా డిస్కంలకు బదిలీ అవుతుంది. ఈ ప్రక్రియల వల్ల పూర్తి పారదర్శకత ఉంటుంది. కరెంటు సరఫరా కంపెనీలను ప్రశ్నించేహక్కు రైతులకు లభిస్తుంది. కంపెనీలకు కూడా బాధ్యత పెరుగుతుంది. తగ్గుతున్న నష్టాలు ప్రస్తుతం ఐఆర్డీఏ మీటర్లను మీటరు బోర్డుపై అమర్చాం. రీడర్లు ఐఆర్డీఏ పోర్టు ద్వారా రీడింగ్ తీయాల్సి ఉంది. ఈ వ్యవసాయ సర్వీసులు దూర ప్రాంతాల్లో విస్తరించి ఉండడం వల్ల ఈ పద్ధతిలో రీడింగ్ తీయడం కష్టంగా ఉంది. అందుకే స్మార్ట్‌మీటర్లు ఏర్పాటు చేయాలని విద్యుత్ సంస్థలు సంకల్పించాయి. రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టు కింద ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని శ్రీకాకుళం జిల్లాలో మీటర్లను ఏర్పాటుచేసిన తర్వాత ప్రయాస్ ఎనర్జీ గ్రూప్ (స్వతంత్ర గ్రూప్) సర్వే రిపోర్టు ప్రకారం నష్టాలు 15–20 శాతానికి తగ్గినట్లు నమోదైంది. ఆ టెండర్లు ఎప్పుడో రద్దు విద్యుత్ సంస్థల్లో గ్రామీణ ప్రాంతాల్లోని త్రీఫేజ్ మీటర్లకు డీబీటీ విధానం కోసం ఐదేళ్ల కాలపరిమితితో టెండర్లను ఆహ్వానించాం. ఆర్డీఎస్ఎస్ కింద స్మార్ట్ మీటర్లను గడువులోపు పూర్తిచేస్తే 22.50 శాతం గ్రాంటు రూపంలో సమకూరుతుంది. మొదటి రీడింగ్ తీసిన తర్వాత కాంట్రాక్టర్‌కు ఒక్కో మీటరుకు కెపెక్స్ కింద రూ.1,800 చొప్పున చెల్లిస్తాం. తర్వాత మిగిలిన మొత్తంతోపాటు ఆపరేషన్, మెయింటెనెన్స్, రీడింగ్‌ల కోసం అయ్యే మొత్తాన్ని నెలవారీగా ఐదేళ్ల కాంట్రాక్ట్ కాలవ్యవధిలో ప్రాజెక్టు వ్యయాన్ని ఇస్తాం. వీటికి నెలకు రూ.254 చొప్పున గుత్తేదార్లు టెండర్లను దాఖలు చేశారు. కోవిడ్–19 సమయంలో రూపొందించిన అంచనాల హెచ్చుతగ్గులను పరిశీలించి ప్రభుత్వం టెండర్లు రద్దుచేసింది. ప్రస్తుత ధరల ప్రకారం ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాం. ప్రభుత్వం నుంచి పరిపాలన అనుమతులు లభించిన తర్వాతే కొత్తగా టెండర్లు పిలుస్తాం. ఇటీవల మహారాష్ట్రలోని పట్టణ ప్రాంతాల్లో బెస్ట్ కంపెనీ స్మార్ట్ మీటర్ల కోసం ఆఫర్ చేసిన బిడ్లలో ఒక్కో మీటరుకు నెలకు వ్యయం రూ.200.96 పైసలుగా ఖరారైంది. ఏడున్నర సంవత్సరాల కాలవ్యవధి కలిగిన వీటిలో 80 శాతం సింగిల్‌ఫేజ్ మీటర్లు కాగా 20 శాతం మాత్రమే త్రీఫేజ్ మీటర్లు. కానీ ఏపీలో వ్యవసాయ సర్వీసులన్నీ త్రీఫేజ్ మీటర్లే. ఒక్కో మీటరుకు కేంద్రప్రభుత్వ అంచనా ధర పదేళ్ల కాలపరిమితికి రూ.6 వేలు. దీనికి అనుగుణంగా మీటర్లు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు రూపొందిస్తున్నాం. వ్యవసాయానికి నిరంతర విద్యుత్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు పగటిపూట తొమ్మిదిగంటల నిరంతర విద్యుత్తును సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏడువేల మెగావాట్ల సౌరవిద్యుత్తు కొనుగోలుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో ఒప్పందం కుదుర్చుకుంది. రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడానికి సుమారు రూ.1,700 కోట్లు ఖర్చుచేసి ఫీడర్లను ఏర్పాటు చేశాం. గడచిన 90 రోజుల్లో కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో 48 గంటల్లోపే కొత్తవాటిని బిగించాం. రానున్నరోజుల్లో నూటికి నూరుశాతం 48 గంటల్లోపే మార్చేయాలని సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన ఆదేశాలను అమలుచేయడానికి అన్ని రకాల చర్యలను విద్యుత్ పంపిణీ సంస్థలు తీసుకుంటున్నాయి. అనుబంధ పరికరాలకు రూ.14,455 వ్యయం మీటరుకు అనుబంధ పరికరాలు, నిర్వహణకు రూ.29 వేలు ఖర్చవుతోందని ఈనాడు దినపత్రిక రాసిన కథనంలో వాస్తవం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 18.58 లక్షల స్మార్ట్ మీటర్ల ద్వారా వ్యవసాయ విద్యుత్ సర్వీసుకు అనుబంధ పరికరాలకు రూ.14,455 వ్యయంతో, మీటరు బాక్స్‌తో పాటు, పీఈసీ వైరు, ఎంసీబీ, కెపాసిటర్, ఎర్తింగ్ పరికరాలు ఏర్పాటు చేస్తాం. ఈ విధంగా ఏర్పాటు చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వ పథకం ఆర్డీఎస్ఎస్లో 60 శాతం గ్రాంటు రూపంలో డిస్కంకు సమకూరుతుంది. అనుబంధ పరికరాలను అమర్చడానికి, అవి పాడైపోకుండా ఉండేందుకు వీలుగా మీటరు బాక్సులను ఏర్పాటు చేస్తాం. ఎంసీబీ ద్వారా ఓవర్ లోడ్ ప్రొటెక్షన్ ఉంటుంది. తద్వారా విద్యుత్ ప్రమాదాలను తగ్గించడంతోపాటు ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్స్‌ను కూడా తగ్గించవచ్చు. వ్యవసాయ పంపుసెట్లకు రక్షణ లభిస్తుంది. ప్రస్తుతం ఏటా సగటున 45,098 వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. వాటి మరమ్మతుల కోసం ఏటా రూ.102 కోట్ల వ్యయాన్ని సంస్థలు భరించాల్సి వస్తోంది. కెపాసిటర్లను అమర్చడం ద్వారా నాణ్యమైన వోల్టేజ్‌తో రైతులకు విద్యుత్ సరఫరా చేయవచ్చు. -
సరికొత్త సాంకేతికత.. ఇక ఫ్యూజులు కాలవు!
సాక్షి, అమరావతి: సీరియస్‌గా టీవీ సీరియల్ చూస్తున్నప్పుడు కరెంటు పోతే వచ్చే అసహనం అంతా ఇంతా కాదు. గాలిలేదు.. వానలేదు.. కరెంటెందుకు పోయిందోననుకుంటూ వెంటనే పక్కింటివాళ్లకు ఉందోలేదో చూస్తుంటాం. తీరా వీధిలో కొందరికి ఉండి మనతోపాటు కొందరికి లేదని గుర్తించాక అప్పుడు అర్థమవుతుంది.. ఫ్యూజు కాలిపోయిందని. వెంటనే కరెంట్ ఆఫీసుకు ఫోన్‌చేస్తే విద్యుత్ సిబ్బంది వచ్చి ఫ్యూజ్ ఏ ట్రాన్స్ఫార్మర్ వద్ద పోయిందో పరిశీలిస్తారు. కానీ ఎందుకు కాలిపోయిందో తెలియాలంటే మాత్రం ఆ లైన్లన్నీ వెదకాలి. దానికి చాలా సమయం పడుతుంది. ఇలాంటి ఇబ్బందులను తప్పించేందుకు, ప్రమాదాలను అరికట్టేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే మినియేచర్ కాంటాక్ట్ సర్క్యూట్ బ్రేకర్ (ఎంసీసీబీ). విజయవాడలో ఎంసీసీబీల ఏర్పాటును మొదలుపెట్టారు. ప్రస్తుతం 40 వేల ట్రాన్స్ఫార్మర్ల వద్ద వీటిని ఏర్పాటు చేస్తామని, దశలవారీగా డిస్కం పరిధిలోని అన్ని జిల్లాల్లో ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఏర్పాటు చేస్తామని ఏపీసీపీడీసీఎల్ చెబుతోంది. నాణ్యత, రక్షణ విజయవాడలోని ముఖ్యకూడళ్లలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల ఫ్యూజు బాక్సుల స్థానంలో రెండువైపుల ఎంసీసీబీ ఉండే కేబుళ్లు అమర్చారు. విద్యుత్ సరఫరాలో సమస్య ఏర్పడినప్పుడు ఇవి యాక్టివేట్ అవుతాయి. సమస్య ఉన్న లైనుకు మాత్రమే విద్యుత్ సరఫరా నిలిపేస్తాయి. లైనులో ఎక్కడ సమస్య వచ్చిందనే విషయాన్ని కూడా సూచిస్తాయి. దీంతో వెంటనే సమస్యను పరిష్కరించి విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు అవకాశం కలుగుతుంది. మరోవైపు ప్రస్తుతం ఉన్న ట్రాన్స్ఫార్మర్ల వద్ద ప్రమాదాల నివారణకు రక్షణ కంచె ఏర్పాటు చేయడం ఒక్కటే పరిష్కారమార్గంగా ఉంది. ఆ కంచె కూడా వివిధ కారణాల వల్ల పాడైపోతోంది. అది గమనించకుండా అటు వెళ్లిన మనుషులు, మూగజీవాలు మృత్యువాత పడాల్సి వస్తోంది. ఎంసీసీబీ వ్యవస్థలో రెండువైపులా ఇన్సులేటెడ్ కేబుళ్లు ఉండటం వల్ల ప్రమాదాలకు అవకాశం ఉండదు. మేమే ముందు ఒక్కో ఎంసీసీబీకి దాదాపు రూ.10 వేలు ఖర్చవుతోంది. వీటిని అతి తక్కువ ప్రదేశంలో ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు రక్షణ లభించడంతోపాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడానికి వీలు కలుగుతుంది. దీంతో లైన్‌లాస్ తగ్గి అంతిమంగా డిస్కంకు, వినియోగదారులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. అదీగాకుండా తుప్పుపట్టిన ఇనుప ఫ్యూజుబాక్సుల స్థానంలో ఎంసీసీబీతో కూడిన ట్రాన్ఫ్‌ఫార్మర్లు చూడ్డానికి బాగుంటాయి. నగర సుందరీకరణలో ఇవి కూడా భాగమవుతున్నాయి. ఏపీ, తెలంగాణల్లో ఎంసీసీబీలను మా డిస్కంలోనే తొలిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చాం. – జె.పద్మాజనార్ధనరెడ్డి, సీఎండీ, ఏపీసీపీడీసీఎల్ -
విశాఖలో ఏపీఈఆర్సీ క్యాంపు కార్యాలయం!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) క్యాంపు కార్యాలయం విశాఖపట్నంలో ఏర్పాటు కానుంది. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) కార్పొరేట్ కార్యాలయ ఆవరణలో ఏపీఈఆర్సీ క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ నిర్మాణానికి టెండర్లను ప్రభుత్వం ఆహ్వానించింది. ప్రస్తుతం హైదరాబాద్ రెడ్‌హిల్స్‌లోని సింగరేణి భవన్ నుంచే ఏపీఈఆర్సీ కార్యాకలాపాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి కొద్దిరోజుల క్రితం 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విద్యుత్ చార్జీల టారిఫ్‌పై కూడా విశాఖపట్నం నుంచే ఆన్లైన్ ద్వారా ఏపీఈఆర్సీ విచారణ జరిపింది. ఇదే నేపథ్యంలో విశాఖపట్నంలో క్యాంపు కార్యాలయం ఏర్పాటైతే ఇక్కడి నుంచి ఈఆర్సీ ఏడాదిలో కొద్దిరోజుల పాటు కార్యకలాపాలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. విద్యుత్‌రంగంలో విద్యుత్ చార్జీల నిర్ణయంతో పాటు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) వంటి ముఖ్యమైన నిర్ణయాల్లో ఈఆర్సీ పాత్ర కీలకమైంది. అటువంటి ఈఆర్సీ క్యాంపు కార్యాలయం విశాఖలో ఏర్పాటైతే.. విశాఖ కాస్తా విద్యుత్‌రంగ కార్యకలాపాలకు వేదికగా మారే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
మారనున్న డిస్కంలు
సాక్షి, అమరావతి: కొత్త జిల్లాల ఏర్పాటు నేపధ్యంలో విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల్లోనూ మార్పులు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడుతోంది. జిల్లాల పరిధుల మేరకు డిస్కంల పరిధులను కూడా మార్చాల్సి ఉంటుంది. ఈ మేరకు విద్యుత్ సంస్థలు కసరత్తు మొదలుపెట్టాయి. కొత్త జిల్లాల్లో సర్కిల్, డివిజన్, ఏఈ కార్యాలయాల ఏర్పాటుతో పాటు వాటికి అధికారులు, సిబ్బందిని నియమించడంపై దృష్టి సారించాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు అనుగుణంగానే మార్పులు చేపట్టాలని డిస్కంలు నిర్ణయించాయి. కొత్తగా వ్యవసాయ డిస్కం : రాష్ట్రంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు ఉన్నాయి. కొత్తగా వ్యవసాయానికి పాతికేళ్ల పాటు పగటిపూట తొమ్మిది గంటలు విద్యుత్‌ను ఉచితంగా అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రూరల్ అగ్రికల్చర్ పవర్ సప్లై కంపెనీ లిమిటెడ్ (ఏపీఆర్‌ఏపీఎస్‌సీఎల్)ను ఏర్పాటు చేస్తోంది. దీంతో నాలుగు అవుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 1,91,29,441 విద్యుత్ సర్వీసులు ఉన్నాయి. వీటిలో దాదాపు 18.37 లక్షల వ్యవసాయ విద్యుత్ సర్వీసులున్నాయి. వీటిని ప్రత్యేకంగా వ్యవసాయ డిస్కం పరిధిలోకి తెస్తారు. ఈ డిస్కం కోసం ప్రత్యేకంగా కొందరు అధికారులు, సిబ్బందిని నియమించాలి. మారుతున్న పరిధులు ప్రస్తుతం ఏపీఈపీడీసీఎల్ పరిధిలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలున్నాయి. ఎస్పీడీసీఎల్లో చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం, కర్నూలు, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలున్నాయి. రాష్ట్ర విభజన తరువాత 2019లో ఏపీసీపీడీసీఎల్ పేరుతో మూడో డిస్కంను ఏర్పాటు చేశారు. దీని పరిధిలోకి ప్రకాశం, గుంటూరు, కృష్ణా, సీఆర్డీఏ పరిధిలోని సర్వీసులను తీసుకువచ్చారు. ఇప్పుడు ఈ మూడును నాలుగు చేశారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణతో వీటి పరిధిలోకి ప్రస్తుతం ఉన్న జిల్లాల్లో కొత్త ప్రాంతాలు కొన్ని వస్తాయి. కొన్ని ప్రాంతాలు వేరుపడతాయి. దీంతో వీటి పరిధులూ మారతాయి. వాటికి అనుగుణంగా కార్యాలయాలు, సిబ్బందిని మార్చాలి. మూడు డిస్కంలలో సుమారు 23 వేల మంది శాశ్వత సిబ్బంది ఉన్నారు. ప్రతి జిల్లాలోనూ సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్ఈ) నేతృత్వంలో ఆపరేషన్ సర్కిల్ కార్యాలయం ఉంది. రెవెన్యూ డివిజన్ల వారీగా డివిజన్ ఇంజనీర్(డీఈ) కార్యాలయాలున్నాయి. ప్రతి డివిజన్లో నాగులుకు పైగా సెక్షన్ (ఏఈ) కార్యాలయాలున్నాయి. పునర్వ్యవస్థీకరణతో మొత్తం జిల్లాల సంఖ్య 26 అవుతుంది. వీటికి అనుగుణంగా ఎస్ఈ, డీఈ, ఏఈ కార్యాలయాలను కూడా డిస్కంలు పునర్వ్యవస్థీకరించాలి. ప్రస్తుతం 13 ఉన్న ఎస్ఈ స్థాయి అధికారుల సంఖ్య 26 అవుతుంది. వీటన్నింటికీ ఎస్ఈ స్థాయి అధికారులను నియమించాలి. దీంతోపాటు డీఈ, ఏఈ కార్యాలయాల్లోనూ మార్పులు రానున్నాయి. దీని కోసం డిస్కంలు కసరత్తు మొదలుపెట్టాయి. అర్హులైన వారికి ప్రమోషన్ ఇచ్చి కొత్త జిల్లాలకు పంపాలని డిస్కంలు భావిస్తున్నట్లు సమాచారం. -
కృష్ణపట్నం ప్లాంటుకు కన్సల్టెన్సీ
సాక్షి, అమరావతి: శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని (కృష్ణపట్నం ప్లాంటును) మూడో యాజమాన్యానికి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో టెండర్ ప్రక్రియను అధ్యయనం చేయడానికి ఓ కన్సల్టెన్సీని నియమించనున్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ అభివృద్ధి కంపెనీ లిమిటెడ్ (ఏపీఈపీడీసీఎల్) బోర్డు సమావేశం గురువారం విజయవాడలోని విద్యుత్ సౌధలో జరిగింది. ఏడుగురు సభ్యులున్న బోర్డులో ఇద్దరు తెలంగాణ అధికారులు ఉన్నారు. వీరు మాత్రం కృష్ణపట్నం ప్లాంటు నిర్వహణపై ఏపీ నిర్ణయానికి అభ్యం తరం తెలిపినట్లు సమాచారం. కానీ మెజారిటీ సభ్యులు ఏపీ నుంచి ఉండటంతో వారు కన్సల్టెన్సీ నియామకానికి మొగ్గుచూపారు. -
APEPDCL ఎవరి ఇంటి మీటర్‌కు వారే రీడింగ్!
సాక్షి, అమరావతి: విద్యుత్ రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవానికి ఏపీ రాష్ట్ర ఇంధన శాఖ శ్రీకారం చుడుతోంది. ఎవరి ఇంటి మీటర్‌కు వారే రీడింగ్ తీసి బిల్లులు పొందేలా సాంకేతికతను అభివృద్ధి చేసింది. స్మార్ట్ ఫోన్‌తో కరెంటు బిల్లు కడుతున్నట్లుగానే అదే ఫోన్‌తో మీటర్ రీడింగ్ కూడా తీసేయొచ్చు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ బిల్లులు తీసే ప్రక్రియ స్పాట్ బిల్లింగ్ రీడర్ల ద్వారా జరుగుతోంది. కరోనా నేపథ్యంలో మీటర్ రీడింగ్ తీసేందుకు సిబ్బంది ఇళ్లకు రావడంపై కొందరు అభ్యంతరం తెలుపుతున్నారు. అయినా, మరో మార్గం లేకపోవడంతో వారే రీడింగ్ తీస్తున్నారు. గత రెండు వేవ్‌లలో కరోనా బారిన పడి పలువురు స్పాట్ బిల్లింగ్ రీడర్లు ప్రాణాలు కూడా కోల్పోయారు. మూడో వేవ్ వస్తున్న నేపధ్యంలో మళ్లీ ఇప్పుడు రీడింగ్‌పై ఆందోళన మొదలైంది. అంతేకాకుండా రీడింగ్ తీయడం కాస్త ఆలస్యమైతే స్లాబు మారి, బిల్లు ఎంత వస్తుందోననే భయం వినియోగదారుల్లో ఉంది. దీనికి పరిష్కారంగా ఎవరికి వారు మీటరు రీడింగ్ సకాలంలో తీసుకుని పంపితే ఈ–బిల్లు మీ కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. ఈ విధానాన్ని ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) అందుబాటులోకి తెచ్చింది. దీనిని మిగతా రెండు డిస్కంలు ఏపీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్‌లు కూడా అమలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. రీడింగ్ ఇలా.. ఈపీడీసీఎల్ అనుసరిస్తున్న విధానం ప్రకారం.. గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఈస్టర్న్ పవర్ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలి. కొత్త వారైతే పేరు, చిరునామా, సెల్ ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ నమోదు చేయాలి. ఐడీ, పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవ్వాలి. 16 నంబర్ల విద్యుత్తు సర్వీస్ మీటరును నమోదు చేయాలి. ఆ వెంటనే సెల్‌ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. మీటరు ఐకాన్ రిజిస్ట్టర్ సర్వీస్ నంబర్‌పై క్లిక్ చేసి కెమెరా ఐకాన్ ద్వారా మీటర్ రీడింగ్ స్కాన్ చేయాలి. దానిని సబ్మిట్ చేస్తే అధికారి నిర్ధారణ చేసిన తరువాత మొబైల్‌కు సమాచారం వస్తుంది. ఈ యాప్‌లోనే బకాయిలు, బిల్లు కట్టే విధానం, వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. అందరి క్షేమం కోరి వినియోగదారులకు ఎప్పటికప్పుడు నూతన సాంకేతికతను అందుబాటులోకి తెస్తున్నాం. విద్యుత్ అంతరాయాల షెడ్యూల్‌ను ముందే తెలుసుకునేలా రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ సిస్టం (ఆర్టీఎఫ్ఎంఎస్)ను కూడా మా డిస్కం అభివృద్ధి చేసింది. వినియోగదారులు, సిబ్బంది క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఇటువంటి మీటర్‌కు రీడింగ్ వెసులుబాటు కల్పించాం. దీనివల్ల భద్రతతో పాటు స్లాబులు మారకుండా ఉంటాయి. –కె.సంతోషరావు, సీఎండీ, ఏపీఈపీడీసీఎల్ -
విద్యుత్ కొనుగోలు లెక్కలు సిద్ధం
సాక్షి, అమరావతి: విద్యుత్ పంపిణీ సంస్థలు 2017 నుంచి 2020 వరకు విద్యుత్ కొనుగోలుకు చేసిన ఖర్చుల లెక్కలను సమర్పించేందుకు అనుమతి ఇ వ్వాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)ని ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్), ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) కోరాయి. 2017–18 సంవత్సరంలో చేసిన ఖర్చును 2018–19 సంవత్సరానికి, 2018–19లో చేసిన ఖర్చును 2019–20కి అన్వయించమని విజ్ఞప్తి చేశాయి. యూనిట్‌కు రూ.3.68 నుంచి రూ.4.62 వరకు వెచ్చించినట్లు ఈపీడీసీఎల్, రూ.3.68 నుంచి రూ.4.63 వెచ్చించినట్లు ఎస్పీడీసీఎల్ వెల్లడించాయి. వీటి ఆధారంగా పూర్తిస్థాయిలో ‘పూల్డ్ కాస్ట్ ఆఫ్ పవర్ పర్చేజ్’ గణాంకాలను సమర్పిస్తామని తెలిపాయి. డిస్కంలు చెప్పిన ధరలపై అభ్యంతరాలుంటే తమకు తెలియజేయాలని ఏపీఈఆర్సీ వివిధ వర్గాల విద్యుత్ వినియోగదారులను కోరింది. డిస్కంల ప్రతిపాదనలపై ఫిబ్రవరి 2వ తేదీన వర్చువల్‌గా విచారించనున్నట్లు తెలిపింది. బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలుకు డిస్కంలకు అవకాశం! ఆంధ్రప్రదేశ్ స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఏపీఎస్ ఎల్డీసీ) ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ రెగ్యులేషన్–2006కి సంబంధించి కొన్ని మార్పులను ప్రతిపాదించింది. విద్యుత్ పంపిణీ సంస్థల ద్వారా బహిరంగ మార్కెట్లో చౌక విద్యుత్ కొనుగోలుకు అవకాశం కల్పించేలా వీటిని రూపొందించారు. రాష్ట్రం విడిపోయినప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న నిబంధనలతోనే ఏపీఈఆర్సీ నడుస్తోంది. నియామకాలు, కార్యకలాపాలకు సంబంధించి రాష్ట్రానికి ప్రత్యేకంగా నిబంధనలు తయారు చేయాల్సి ఉంది. కేంద్ర విద్యుత్ చట్టం–2003 ప్రకారం నిబంధనలు తయారు చేస్తున్నట్లు ఏపీఈఆర్సీ గతంలోనే తెలిపింది. తాజాగా డిస్కంలకు సంబంధించి రెగ్యులేషన్స్‌లోని 7వ నిబంధనను సవరించాలని ఏపీఎస్‌ఎల్‌డీసీ కోరింది. దీనివల్ల డిస్కంలు పరస్పరం తమ సమస్యలు పరిష్కరించుకోవడంతో పాటు విద్యుత్ కొనుగోలులో జరిగే ఆలస్యాన్ని అరికట్టవచ్చు. దీనికి సంబంధించిన ప్రతిదీ లోడ్ డిస్పాచ్ సెంటర్‌కు తెలపాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ సవరణపై జనవరి 12వ తేదీలోగా ప్రజలు తమ అభ్యంతరాలు, అభిప్రాయాలు తెలపాలని ఏపీఈఆర్సీ కోరింది. అనంతరం కొత్త రెగ్యులేషన్స్‌ను ప్రకటించనుంది. -
‘ఏపీఈపీడీసీఎల్’ ఆదాయానికి ‘చెక్’!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంసలో చెక్కుల మాటున సాగుతున్న గోల్మాల్ మరోసారి తెరపైకొచ్చింది. కొద్ది రోజుల కిందట శ్రీకాకుళం సర్కిల్లో చెక్కులు చెల్లించిన హెచ్‌టీ వినియోగదారులపై సర్‌చార్జి వేసి, వసూలైన సొమ్మును పక్కదారి పట్టించిన వైనం వెలుగులోకొచ్చిన విషయం తెలిసిందే. అలానే విశాఖ సర్కిల్ పరిధిలో జరిగిన అవకతవకలపై సర్కిల్ రెవెన్యూ అధికారులు తాజాగా అవినీతి నిరోధక శాఖకు, ట్రాన్స్‌కో విజిలెన్స్‌కు 62 పేజీల సమగ్ర నివేదికను అందజేశారు. 13 మందిపై ఆరోపణలు విశాఖపట్నంలోని ఓ భారీ పరిశ్రమ ప్రతినెలా విశాఖ సర్కిల్ కార్యాలయానికి అందజేసిన తమ విద్యుత్ బిల్లులకు సంబంధించిన చెక్కులు 2017, 2018 సంవత్సరాల్లో సకాలంలో నగదుగా మారలేదు. గడువు తేదీ ముగిశాక ఒక రోజు నుంచి ఐదు రోజులకు జమ అయ్యేవి. నిజానికి నిర్ణీత గడువు పూర్తయ్యాక చెల్లించే బిల్లులపై లేట్ పేమెంట్(ఎల్పీ) చార్జి వసూలు చేయాలి. కానీ అలా జరగకుండా నగదు వచ్చినట్టుగానే అప్పట్లో విశాఖ సర్కిల్ అధికారులు రికార్డుల్లో నమోదు చేసేశారు. దీంతో డిస్కంకు రావాల్సిన ఎల్పీ ఆదాయం పోయింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలికి ఫిర్యాదు అందడంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు, ట్రాన్స్‌కో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. దీనికి సంబంధించిన సమగ్ర నివేదికను విశాఖ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్(సీవీవో) ప్రసన్నకుమార్‌కు విశాఖ సర్కిల్ అధికారులు తాజాగా అందించారు. దాదాపు రూ.15 లక్షలు ఎల్పీ నష్టం జరిగినట్టు ఆ నివేదికలో స్పష్టం చేశారు. ఆ రెండేళ్ల కాలంలో పనిచేసిన సీనియర్, జూనియర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్లతో సహా మొత్తం 13 మంది ఉద్యోగులను బాధ్యులుగా తేల్చారు. కేసు విచారణను వారంలోగా పూర్తి చేస్తామని చీఫ్ విజిలెన్స్ అధికారి ఏవీఎల్ ప్రసన్నకుమార్ చెప్పారు. కాగా, ఈ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని కొంత మంది కార్పొరేట్ కార్యాలయంలోని ఉన్నతాధికారులు లబ్ధి పొందాలని చూస్తున్నట్టు.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ అధికారి చెప్పాడు. ఓ కంపెనీకి కొన్ని వెసులుబాట్లు కల్పించిన మాట వాస్తవమని తెలిపారు. కానీ అవి కేవలం కార్పొరేట్ కార్యాలయంలోని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే చేసినట్టు తెలిపాడు. శ్రీకాకుళం వ్యవహారంలో త్వరలో చర్యలు ఇదిలా ఉండగా, శ్రీకాకుళం రెవెన్యూ కార్యాలయం(ఈఆర్వో)లో హెచ్‌టీ వినియోగదారుల నుంచి చెక్కులు తీసుకుని సకాలంలో బ్యాంకులో డిపాజిట్ చేయలేదు. ఫలితంగా వారిపై ఎల్పీ పడింది. కొంత మంది గొడవెందుకని ఆ మొత్తాన్ని చెల్లించేశారు. కానీ ఆ సొమ్ము సంస్థకు చేరలేదు. దీనిపై అక్కడి ఎస్ఈ మహేందర్‌తో పాటు విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. మరికొన్ని అవకతవకలు జరిగినట్టు గుర్తించారు. బాధ్యులపై చర్యలకు డిస్కం సీఎండీకి సిఫారసు చేశారు. ఒకట్రెండు రోజుల్లో ఈఆర్వో అక్రమార్కులపై వేటు పడే అవకాశం ఉంది. బాధ్యులపై కఠిన చర్యలు.. బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకుంటాం. విశాఖపట్నం సర్కిల్లో జరిగిన చెక్కుల వ్యవహారం గత సీఎండీల కాలంలోనిది. దానిపైనా పూర్తి స్థాయి విచారణ జరిపిస్తాం. తప్పుచేసిన వారెవరినీ ఉపేక్షించేది లేదు. – కె.సంతోషరావు, సీఎండీ, ఏపీఈపీడీసీఎల్ -
విద్యుత్ వినియోగదారులకు భారీ ఊరట
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు భారీ ఊరట లభించింది. ఇంధన సర్దుబాటు చార్జీల (ట్రూఅప్) కింద వసూలు చేసిన సొమ్మును విద్యుత్ పంపిణీ సంస్థలు వినియోగదారులకు తిరిగిచ్చేస్తున్నాయి. డిసెంబర్ నెల (నవంబర్‌లో వినియోగానికి సంబంధించి) బిల్లుల్లో ఆ మేరకు చార్జీలు తగ్గాయి. ట్రూఅప్ చార్జీల కింద వసులు చేసిన మొత్తాన్ని విద్యుత్ బిల్లులో సర్దుబాటు చేస్తున్నారు. తాజాగా విద్యుత్ బిల్లులను పరిశీలించిన వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీఈఆర్సీ ఆదేశాలతో వెనక్కి.. 2014–15 నుంచి 2018–19 కాలానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్), ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) సమర్పించిన రూ.7,224 కోట్ల ట్రూఅప్ చార్జీల పిటిషన్ల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) గత ఆగష్టు 27న రూ.3,669 కోట్ల ఇంధన సర్దుబాటు చార్జీల వసూలుకు అనుమతినిచ్చింది. ఏపీఎస్పీడీసీఎల్ రూ.3,060 కోట్లు, ఏపీఈపీడీసీఎల్ రూ.609 కోట్ల మేర ట్రూఅప్ చార్జీలను ఎనిమిది నెలల్లో వసూలు చేసుకునేందుకు సిద్ధమయ్యాయి. సెప్టెంబర్, అక్టోబర్ బిల్లులలో ఆ మేరకు చార్జీలు విధించాయి. అయితే పలు న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తడంతో ఏపీఈఆర్సీ తన ఆదేశాలను వెనక్కి తీసుకుంది. దీంతో విద్యుత్ బిల్లులు ట్రూఅప్ చార్జీలు లేకుండానే వినియోగదారులకు అందుతున్నాయి. వినియోగదారులు ఇప్పటికే చెల్లించిన ట్రూఅప్ చార్జీలను బిల్లులో సర్దుబాటు చేస్తున్నారు. వినియోగదారులకు రూ.196.28 కోట్లు ట్రూఅప్ చార్జీలను ఏపీఈపీడీసీఎల్ పరిధిలో యూనిట్‌కు రూ.0.45 పైసలు ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో రూ.1.27 పైసలు చొప్పున వినియోగదారుల నుంచి వసూలు చేశారు. ఇలా ఏపీఈపీడీసీఎల్ రూ.126 కోట్లు, ఏపీఎస్పీడీసీఎల్ రూ.70 కోట్లు చొప్పున ట్రూఅప్ కింద వసూలు చేశాయి. ఐదేళ్ల క్రితం నాటి ట్రూఅప్ చార్జీలు కావడంతో అప్పటికి ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్న సర్వీసులు కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ మధ్యప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) పరిధిలోకి వచ్చాయి. వీటికి ఏపీసీపీడీసీఎల్ బాధ్యత తీసుకుని రూ.28 లక్షలు వసూలు చేసింది. ఈ క్రమంలో మొత్తం రూ.196.28 కోట్లను వినియోగదారులకు డిస్కంలు వెనక్కి ఇస్తూ విద్యుత్ బిల్లుల్లో సర్దుబాటు చేస్తున్నాయి. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో నవంబర్ నెల బిల్లుల నుంచే ట్రూఅప్ చార్జీలను వినియోగదారులకు తిరిగి వెనక్కి చెల్లిస్తూ సర్దుబాటు ప్రక్రియ ప్రారంభం కాగా ఏపీఈపీడీసీఎల్ డిసెంబర్ నుంచి చేపట్టింది. ఫలితంగా రాష్ట్రంలో 1.86 కోట్ల మంది వినియోగదారులకు ఊరట దక్కింది. -
ఐదేళ్ల ‘ట్రూ అప్’పై విచారణ
సాక్షి, అమరావతి: ఇంధన సర్దుబాటు (ట్రూ అప్) చార్జీల వసూలు సబబేనని కొందరు, ఆ భారం ప్రజలపై వేయరాదని మరికొందరు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి సూచించారు. రాష్ట్ర ప్రజలపై సెప్టెంబర్ నెల విద్యుత్ బిల్లుల నుంచి మొదలుపెట్టిన ఐదేళ్ల ఇంధన సర్దుబాటు చార్జీలపై ఏపీఈఆర్సీ సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ నిర్వహించింది. 2014–15 నుంచి 2018–19 వరకు విద్యుత్ పంపిణీ వ్యవస్థ నిర్వహణ, ఆదాయ అవసరాలు, వాస్తవ ఖర్చుల ఆధారంగా రూ.7,224 కోట్లను అదనపు వ్యయంగా నిర్ధారించాలని ఆంధ్రప్రదేశ్ తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్), ఆంధ్రప్రదేశ్ దక్షిణప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) మండలిని కోరాయి. దీన్లో రూ.3,669 కోట్ల వసూలుకు అనుమతి ఇస్తూ ఏపీఈఆర్సీ ఆగస్టు 27న ఉత్తర్వులిచ్చింది. ట్రూ అప్ చార్జీలపై ప్రజలకు సరైన సమాచారం ఇవ్వలేదని, అవగాహన కల్పించలేదని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ను సుమోటోగా తీసుకున్న ఏపీఈఆర్సీ ఆగస్టు 27న ఇచ్చిన ఉత్తర్వులను నిలిపేసి, ట్రూఅప్ చార్జీలపై ప్రజల అభిప్రాయాలు మరోసారి సేకరించాలని నిర్ణయించింది. గతనెల 19న నిర్వహించిన విచారణలో 86 మంది అభిప్రాయాలు వెల్లడించారు. సోమవారం ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ నాగార్జునరెడ్డి పారిశ్రామిక, వాణిజ్య, ఉద్యోగసంఘాల ప్రతినిధులు, వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాలు సేకరించారు. 45 మంది విచారణకు హాజరుకాగా 15 మంది తమ అభిప్రాయాలు తెలిపారు. ట్రూ అప్ చార్జీలు విధించడాన్ని కొందరు సమర్థించారు. విచారణలో ఏపీఈఆర్సీ సభ్యులు రాజగోపాలరెడ్డి, ఠాకూర్ రామాసింగ్, కార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ శాఖలో వేధింపులు!
సాక్షి, అమరావతి: జనరల్ మేనేజర్ స్థాయి అధికారి, మరో అధికారి తమను వేధిస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్)లోని ముగ్గురు మహిళా ఉద్యోగులు ఉన్నతాధికారులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. తమను రాత్రి 11 గంటల వరకు కార్యాలయంలోనే ఉంచేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని, విధి నిర్వహణలో ఉండగా అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని లేఖలో వారు పేర్కొన్నారు. పరస్పర అంగీకార బదిలీలకూ అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఇదే జనరల్ మేనేజర్ వేధింపులు తట్టుకోలేక గతంలో విశాఖ సర్కిల్ కార్యాలయంలో ఓ మహిళా ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేశారని, ఈ ఘటనలో జనరల్ మేనేజర్‌పై కేసు నమోదైందని, మరో అధికారిపై కూడా రాజమండ్రి, విశాఖపట్నంలో వేధింపుల ఫిర్యాదులు ఉన్నాయని వారు గుర్తు చేశారు. సీజీఎం స్థాయి అధికారి వారికి వత్తాసు పలుకుతుండటం తమను మరింతగా బాధిస్తోందని, తమను గానీ, వారిని గానీ బదిలీ చేసి ఈ వేధింపుల నుంచి విముక్తి కలిగించాలని, లేదంటే ఆత్మహత్యలే శరణ్యమని వారు సీఎండీని, ఇతర ఉన్నతాధికారులను విజ్ఞప్తి చేశారు. డిస్కంలో అధికారుల వేధింపులపై తమకు అందిన లిఖిత పూర్వక ఫిర్యాదు మేరకు విచాణకు ఆదేశించినట్లు ఏపీ ట్రాన్స్‌కో విజిలెన్స్ జాయింట్ మేనేజర్ కర్రి వెంకటేశ్వరరావు తెలిపారు. -
విద్యుత్ శాఖలో ఉద్యోగాల వెలుగులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్)లో ఎనర్జీ అసిస్టెంట్ (జూనియన్ లైన్మెన్ గ్రేడ్–2) పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. తన పరిధిలోని ఐదు సర్కిళ్లలో మొత్తం 398 పోస్టుల భర్తీకి "https://www.apeasternpower.com/' ఏపీఈపీడీసీఎల్ ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 2019లో భర్తీ చేయగా.. మిగిలిన 398 పోస్టులను ఇప్పుడు భర్తీ చేస్తోంది. ఎలక్ట్రికల్, వైరింగ్ విభాగంలో ఐటీఐ లేదా ఎలక్ట్రికల్ డొమెస్టిక్ అప్లయెన్సెస్ విభాగంలో రెండేళ్ల ఒకేషనల్ ఇంటర్మీడియెట్ కోర్సు చేసిన పురుష అభ్యర్థులు అర్హులు. అలాగే అభ్యర్థులకు ఈ ఏడాది జూలై 1 నాటికి 18 ఏళ్లు నిండి 35 ఏళ్ల లోపు వయసు ఉండాలి. గతంలో పదో తరగతి మార్కుల ఆధారంగా జరిగిన ఎంపిక విధానంలో ఎదురైన ఇబ్బందుల దృష్ట్యా ఈసారి రాతపరీక్ష నిర్వహిస్తున్నారు. దీనిలో ఉత్తీర్ణులైనవారిని మాత్రమే శారీరక సామర్థ్య పరీక్ష (ఫిజికల్ టెస్ట్)కు పిలుస్తారు. ముఖ్యమైన తేదీలు ఇలా.. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 24 ► రాత పరీక్ష: అక్టోబర్ 10 (ఉదయం 11 గంటల నుంచి 12.45 గంటల వరకు) ► రాత పరీక్ష ఫలితాలు: అక్టోబర్ 22 ► ఫిజికల్ టెస్ట్ (విద్యుత్ స్తంభం ఎక్కడం, మీటర్ రీడింగ్ చూడటం, సైకిల్ తొక్కడం): నవంబర్ 1 – 6 ► ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా: నవంబర్ 15 ► నియామక పత్రాలు అందజేత: నవంబర్ 17 ► పత్రాలు అందుకున్నవారు ఏఈలకు రిపోర్ట్ చేయాల్సింది: నవంబర్ 29 ► ఓరియెంటేషన్ కార్యక్రమం: నవంబర్ 30 – డిసెంబర్ 1 వరకు ► గ్రామ, వార్డు సచివాలయాల్లో సెక్రటరీలకు రిపోర్ట్ చేసి విధుల్లో చేరిక: డిసెంబర్ 2 -
ఏపీఈపీడీసీఎల్: జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విశాఖపట్నంలోని ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్(ఏపీఈపీడీసీఎల్).. ఎనర్జీ అసిస్టెంట్లు(జూనియర్ లైన్మెన్ గ్రేడ్ 2) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. (మరిన్ని ఉద్యోగ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► పోస్టులు: ఎనర్జీ అసిస్టెంట్లు(జూనియర్ లైన్మెన్ గ్రేడ్ 2) ► మొత్తం పోస్టుల సంఖ్య: 398 ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 30.08.2021 ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 10.09.2021 ► వెబ్సైట్: https://apeasternpower.com -
ఆంధ్రప్రదేశ్‌లో లైన్మెన్ ఉద్యోగాలు
విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏపీసీపీడీసీఎల్).. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా గ్రామ/వార్డు సెక్రటేరియట్స్‌లో ఉన్న 86 ఎనర్జీ అసిస్టెంట్(జూనియర్ లైన్మెన్ గ్రేడ్–2) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఐటీఐ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు. రాత పరీక్ష, పోల్ క్లైబింగ్, మీటర్ రీడింగ్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఆసక్తిగల అభ్యర్థులు మే 3వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హతలు జూనియర్ లైన్మెన్ గ్రేడ్–2 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. పదోతరగతితోపాటు ఎలక్ట్రికల్/వైర్‌మెన్ ట్రేడ్‌ల్లో ఐటీఐ పూర్తిచేసి ఉండాలి. లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్(ఎలక్ట్రికల్ డొమెస్టిక్ అప్లియెన్సెస్ అండ్ రివైండింగ్ /ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ కాంట్రాక్టింగ్/ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ సర్వీసింగ్)లో ఉత్తీర్ణత సాధించాలి. వయసు: 31.01.2021 నాటికి 18–35 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్థులకు ఐదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం ► ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి ఫిజికల్ టెస్ట్(పోల్/టవర్ క్లైబింగ్ టెస్ట్), మీటర్ రీడింగ్ టెస్టుల ద్వారా ఎంపిక ఉంటుంది. రాత పరీక్ష ► పరీక్ష మొత్తం 100 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. ఐటీఐలో సంబంధిత ట్రేడ్ నుంచి ప్రశ్నలుంటాయి. ఈ పరీక్షల్లో జనరల్ అభ్యర్థులు కనీసం 40శాతం మార్కులు, బీసీ అభ్యర్థులు కనీసం 35శాతం మార్కులు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు కనీసం 30 శాతం మార్కులు సాధించాలి. పోల్ క్లైబింగ్ ► పోల్ క్లైబింగ్ టెస్ట్‌లో భాగంగా.. 15 నిమిషాల వ్యవధిలో పోల్ ఎక్కి దిగాల్సి ఉంటుంది. రాత పరీక్షలో అర్హత సాధించి.. పోల్ క్లైబింగ్‌లో విఫలమైతే ఈ పోస్టులకు అనర్హులుగా ప్రకటిస్తారు. మీటర్ రీడింగ్ ► రాత పరీక్షతోపాటు పోల్‌క్లైబింగ్‌లో అర్హత సాధించిన అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో మీటర్ రీడింగ్ పరీక్షలకు పిలుస్తారు. ఎంపిక తర్వాత ► ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల పాటు నెలకు రూ.15000 చొప్పున వేతనంగా అందిస్తారు. వీరు గ్రామ పంచాయతీ/వార్డులలో ఏర్పాటు చేసిన సెక్రటేరియట్స్/వార్డు సెక్రటేరియట్స్‌లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు ► ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ఓసీ/బీసీ అభ్యర్థులు రూ.700, అలాగే ఎస్సీ/ఎస్టీ వారు రూ.350 దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ముఖ్యమైన సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి: 03.05.2021 ► వెబ్సైట్: www.apcpdcl.in టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్: జూనియర్ అసిస్టెంట్ కొలువులు -
ఎంత వాడితే అంతే బిల్లు : నాగలక్ష్మి
సాక్షి, విశాఖ: రాష్ట్రంలో విద్యుత్ బిల్లులు పెరిగాయనడంలో వాస్తవం లేదని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ నాగలక్ష్మి అన్నారు. కరెంట్ బిల్లులు పెరిగినట్లు వస్తున్న వార్తలను ఆమె తోసిపుచ్చారు. లాక్డౌన్ కారణంగానే గత నెల రీడింగ్ తీయలేదని నాగలక్ష్మి శుక్రవారం తెలిపారు. ఈ నెలలో రెండు నెలల రీడింగ్ తీసుకున్నామని, అయినప్పటికీ ఏ నెలకా నెల బిల్లుగానే లెక్కించి వేశామని, ఏ బిల్లు కూడా పెరగలేదని ఆమె స్పష్టం చేశారు. వేసవి కాలంతో విద్యుత్ ఎక్కువగా వినియోగించడంతోనే బిల్లులలో పెరుగుదల వచ్చిందన్నారు. ప్రజలు అపోహలకు గురి కావద్దని సూచించారు. ఒకవేళ కరెంట్ బిల్లులు పెరిగినట్లు ఎవరికైనా సందేహం వస్తే వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చని తెలిపారు. కాల్ సెంటర్ 1912కి కాల్ చేసి అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చని, కరెంట్ బిల్లులు చెల్లించడానికి జూన్ 30వరకూ అవకాశం ఇచ్చినట్లు చెప్పారు. టారిఫ్‌లలో కూడా గతంలో పోలిస్తే ప్రజలకు ఉపయోగపడే విధంగా డైనమిక్ విధానంలోకి తీసుకు వచ్చామన్నారు. వినియోగదారులు ఎంత వాడితే అంతే బిల్లు వచ్చేవిధంగా టారిఫ్ తీసుకువచ్చినట్లు చెప్పారు. గతంలో అయితే ఏడాది మొత్తం ఒకటే టారిఫ్ ఉండటం వల్ల తక్కువ వాడినప్పటికీ ప్రతి నెల ఒకటే టారిఫ్ అమల్లో ఉండేదని నాగలక్ష్మి తెలిపారు.