1912తో విద్యుత్ సమస్యల సత్వర పరిష్కారం
– సీజీఆర్‌ఎఫ్ అధ్యక్షుడు డి.ధర్మారావు
– రాజమహేంద్రవరంలో విద్యుత్ వినియోగదారుల పరిష్కారవేదిక
దానవాయిపేట(రాజమహేంద్రవరం) : విద్యుత్ సరఫరాలో వచ్చే అంతరాయాలు, విద్యుత్ సమస్యల సత్వర పరిష్కారం కోసం వినియోగదారులు 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేస్తే తక్షణమే సంబంధిత అధికారులు వారి సమస్యలను పరిష్కరిస్తారని, ఈ నంబర్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (సీజీఆర్‌ఎఫ్) అధ్యక్షుడు డి.ధర్మారావు తెలిపారు. బుధవారం రాజమహేంద్రవరంలోని ఆపరేషన్ సర్కిల్ ఎస్‌ఈ కార్యాలయంలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. కార్యక్రమంలో పరిష్కార వేదిక అధ్యక్షుడు, విశ్రాంత జిల్లా జడ్జి డి.ధర్మారావు పాల్గొన్ని వినియోగదారుల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ 2016 సెప్టెంబర్ నుంచి ఐదు జిల్లాలో(శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ)లో వినియోగదారుల సౌకర్యార్థం విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక నిర్వహించామన్నారు. 2016లో 336 ఫిర్యాదులు వస్తే 332 విద్యుత్ సమస్యలను పరిష్కారించామని, 2017లో 370 ఫిర్యాదులు 235 సమస్యలను పరిష్కారించామని తెలిపారు. కోన్ని ఫిర్యాదుల్లో సంస్థ అధికారుల నుంచి వినియోగదారులకు నష్టపరిహారం అందజేసినట్టు వెల్లడించారు. విద్యుత్ షాక్‌తో మృతి చెందిన, శాశ్వత అంగవైకల్యం పొందిన బాధితుడికి సంస్థ ద్వారా రూ.ఐదు లక్షలు నష్టపరిహారం అందజేస్తామన్నారు. కార్యక్రమంలో పరిష్కార వేదిక సభ్యులు కె.బాలాజీ, పి.వి.రమణరావు, బాలాజీ ప్రసాద్ పాండే, రాజమహేంద్రవరం టౌన్–1 ఏడిఈ శ్రీధర్ వర్మ తదితరులు పాల్గొన్నారు.