
వాహనాలు నడిపేటప్పుడు కుటుంబాన్ని గుర్తుచేసుకోవాలి
ఒక్క క్షణం ఆదమరిస్తే...జీవితాంతం క్షోభే : బాబూమోహన్
చౌటుప్పల్: యువత వాహనాలు నడిపేటప్పుడు తమ కుటుంబాన్ని గుర్తుచేసుకోవాలని సినీ నటుడు, మాజీ మంత్రి బాబూమోహన్ సూచించారు. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని అమ్మానాన్న అనాథాశ్రమాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఆశ్రమంలోని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న వారికి భోజనం వడ్డించారు. మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తికి జుట్టు కత్తిరించారు. అనాథలతో ఆప్యాయంగా ముచ్చటించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. వాహనాలు నడిపేటప్పుడు ఒక్క క్షణం ఆలోచన చేయకపోవడం మూలంగా చోటుచేసుకునే ఘటనలతో జీవింతాం క్షోభ అనుభవించాల్సి వస్తుందన్నారు.
ఇదీ చదవండి: నాన్న అంటే అంతేరా...! వైరల్ వీడియో
తాము సరైన పద్ధతిలో వెళ్తే సరిపోదని, ఎదుటి వ్యక్తులు సైతం సరైన పద్ధతిలో వస్తేనే ప్రమాదాలు జరగవన్నారు. గతంలో తన కుమారుడు ఓ పాపను తప్పించే క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై చనిపోయాడని గుర్తుచేసుకున్నారు. అనాథలకు సేవ చేసే భాగ్యం ఊరికనే రాదని, భగవంతుడు సంకల్పిస్తేనే అది సాధ్యమవుతుందన్నారు. ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు అనాథలకు సేవలందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అమ్మనాన్న అనాథాశ్రమాన్ని సందర్శించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. పేదలు, అనాథలు, అభాగ్యులకు సేవ చేస్తే ఎంతగానో సంతృప్తినిస్తుందన్నారు.

తాను కూడా తన కుమారుడైన పవన్ బాబూమోహన్ పేరిట ట్రస్ట్ ఏర్పాటు చేసి పేదలకు సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ, ఆశ్రమ నిర్వాహకుడు గట్టు శంకర్, పవన్ బాబూమోహన్ ట్రస్ట్ ప్రతినిధి రాజ్‌కుమార్, ఆశ్రమ ప్రతినిధులు గట్టు శ్రావణి, గట్టు శ్రావణ్ పాల్గొన్నారు.
చదవండి: ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక దాడి, వెంటిలేటర్‌పై ఉండగానే అమానుషం!