బాలిక జీవితాన్ని చిదిమేసిన రోడ్డు ప్రమాదం
మంచానికే పరిమితమైన అక్షయ
ఏడాదికి రూ.3లక్షలకు పైగా ఖర్చు
ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు
దకురవి: అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఆడబిడ్డ బంగారు భవిష్యత్‌ను రోడ్డు ప్రమాదం చిదిమేసింది.. కళ్లెదుట ఆడుతూ.. పాడుతూ.. చదువులో రాణిస్తున్న కన్న బిడ్డను చూసి మురిసిపోతున్న ఆ తల్లిదండ్రులకు పెద్దకష్టం వచ్చింది.. రోడ్డు ప్రమాదం కారణంగా నరాల బలహీనతతో కాళ్లు చేతులు పడిపోయి మంచానికే పరిమితమైంది ఆ పసిప్రాణం. ప్రమాదం మిగిల్చిన గాయం నరాల బలహీనతతో 14ఏళ్లకే మాటలు కూడా రాక ఆచేతన స్థితిలో పడిపోయింది. ఏడాదికి రూ.3లక్షలకు పైగా ఖర్చు చేసినా.. కోలుకోలేని స్థితిలో ఉన్న బాలిక దీనగాథపై ‘సాక్షి’ కథనం.
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కొత్తూరు(సీ) శివారు గుజిలి తండాకు చెందిన జాటోత్ శంకర్– సుజాత దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. అక్షయ వయసు 14 ఏళ్లు. బయ్యారం మండల కేంద్రంలోని ఏకలవ్య గురుకులంలో చదువుకుంటుంది. ఈ క్రమంలో 2022లో భద్రాద్రి కొత్తగూడెంలోని బంధువుల ఇంటికి శుభకార్యానికి వెళ్లారు. కొత్తగూడెం సమీపంలోని చుంచుపల్లి పోలీస్‌స్టేషన్ సమీపంలో రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్షయకు తీవ్రగాయాలయ్యాయి. కొత్తగూడెం పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రికి, అక్కడి నుంచి ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
ఈ మేరకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించి అక్షయ మెదడులోని రక్తనాళాలు పనిచేయడం లేదని, ఆపరేషన్ చేయడం కుదరదని తెలిపారు. కే వలం మందులతో నయం అవుతుందని చెప్పారు. దీంతో అక్షయను ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చారు. నరాలబలహీనత తీవ్రం కావడంతో కాళ్లు, చేతులు పడిపోయి మంచానికే పరిమితమైంది. దీంతో నెలనెలా మందుల కోసం తల్లిదండ్రులు అప్పు చేస్తున్నారు. ప్రస్తుతం బాలిక మాట్లాడలేని పరిస్థితికి చేరుకుంది. నెలకు రూ.25వేల ఖర్చు భరించడం కష్టంగా మారిందని దాతలు ఆదుకోవాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. కూలి పనిచేస్తే వచ్చే డబ్బుతో బతకడం కష్టంగా మారిందని, బిడ్డ జబ్బు నయం కోసం రూ.25వేలు వెచ్చించడం పెనుభారంగా మారిందని విలపిస్తున్నారు.
సాయం అందించాల్సిన ఫోన్ నంబర్ 93466 20224
Comments
Please login to add a commentAdd a comment