వెంకటేశ్వర్లుకు అన్నం తినిపిస్తున్న భార్య నర్మద
మునగాల(కోదాడ): రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇంటి పెద్ద మంచానికే పరిమితమయ్యాడు. అతడి కుటుంబ సభ్యులు అప్పులు చేసి మరీ అతడికి వైద్యం చేయించారు. ప్రస్తుతం కుటుంబ పోషణ భారంగా మారడంతో దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. వివరాలు.. మునగాల మండలంలోని బరాఖత్‌గూడెం గ్రామానికి చెందిన మొలుగూరి నారాయణ, జయమ్మ దంపతుల రెండో కుమారుడు వెంకటేశ్వర్లు(36) డిగ్రీ పూర్తిచేసి ఓ మెడికల్ కంపెనీలో సేల్స్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ 15న తన బైక్‌పై వెళ్తుండగా మరో బైక్ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో వెంకటేశ్వర్లు తలకు బలమైన గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నల్లగొండ పట్టణంలోని ఐకాన్ ఆస్పత్రిలో చేర్పించి తలకు ఆపరేషన్ చేయించారు.
వైద్యం అందిస్తుండగానే వెంకటేశ్వర్లు కోమాలోకి వెళ్లాడు. వైద్యం కోసం కుటుంబ సభ్యులు అప్పు చేసి సుమారు రూ.10 లక్షలు ఖర్చు పెట్టారు. నెల రోజుల చికిత్స అనంతరం ఫిజియోథెరపి చేయించాలని వైద్యులు సూచించడంతో వెంకటేశ్వర్లును హైదరాబాద్‌లోని బ్రినోవా ఆస్పత్రిలో చేర్పించి నెల రోజుల పాటు రూ.2లక్షలు వెచ్చించి చికిత్స అందించారు. అనంతరం వైద్య ఖర్చులు భరించలేక ఇంటికి తీసుకొవచ్చారు. నెల రోజుల క్రితం వెంకటేశ్వర్లు తలకు రెండోసారి ఐకాన్ ఆస్పత్రిలో ఆపరేషన్ జరిగింది.
వెంకటేశ్వర్లు ప్రాణాలైతే దక్కాయి కాని జ్ఞాపకశక్తి కోల్పోయి ఇంటి వద్ద మంచానికే పరిమితమయ్యాడు. దీంతో వెంకటేశ్ల్రు భార్య నర్మద అతడికి సపర్యలు చేస్తుంది. వీరికి పదేళ్ల లోపు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ప్రస్తుతం వెంకటేశ్వర్లు కుటుంబాన్ని అతడి తల్లిదండ్రులు పోషిస్తున్నారు. ప్రతి నెల మందులకు రూ.12వేల ఖర్చవుతుందని, ఇప్పటి వరకు రూ.16.50లక్షలు తమ సోదరుడికి ఖర్చు చేసినట్లు వెంకటేశ్వర్లు అన్న రమేష్ తెలిపాడు. వెంకటేశ్వర్లు ముగ్గురు పిల్లల పోషణ ఆ కుటుంబానికి భారంగా మారింది. దయార్ధ హృదయులు స్పందించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని వెంకటేశ్వర్లు భార్య వేడుకుంటుంది.
ఆర్థికసాయం చేయదలచుకున్న దాతలు సంప్రదించాల్సిన వివరాలు
పేరు: మొలుగూరి నర్మద
బ్యాంకు ఖాతా నంబర్: 7313903356–1
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్,
మునగాల బ్రాంచ్
గూగుల్ పే, ఫోన్ పే నంబర్: 8919526680
పోషణ భారంగా మారింది
రోడ్డు ప్రమాదంలో గాయపడి కోలుకున్న నా భర్త ఐదు నెలలుగా జ్ఞాపకశక్తి కోల్పోయి మంచానికే పరిమితమయ్యాడు. మా కుటుంబ సభ్యులు అప్పు చేసి ఇప్పటివరకు వైద్యం చేయించారు. ప్రస్తుతం మా పిల్లల పోషణ భారంగా మారింది. ప్రతి నెల రూ.12వేలు మందులకు వెచ్చించాల్సి వస్తుంది. నా భర్త తిరిగి మామూలు మనిషి కాగలడన్న నమ్మకంతో జీవిస్తున్నాను. దాతలు స్పందించి మా కుటుంబాన్ని ఆదుకోవాలి.
– మొలుగూరి నర్మద, వెంకటేశ్వర్లు భార్య
Comments
Please login to add a commentAdd a comment