ఆకాశమే హద్దుగా..
ఎయిర్స్‌ఫోర్స్‌లో లెఫ్టినెంట్ పైలెట్‌గా అరవింద్ చౌహాన్
వాయువేగంతో దూసుకెళ్తున్న దేవరకొండ గిరిజన తేజం
24 ఏళ్ల వయస్సులోనే లెఫ్టినెంట్ హోదా
దేవరకొండ : శ్రమ నీ ఆయుధం అయితే.. విజయం నీ బానిస అవుతుందన్న మాటను వంట బట్టిచ్చుకున్నాడు ఆ యువకుడు. అందరిలా కాకుండా తాను తనలో ఉన్న నైపుణ్యానికి పదును పెట్టి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. చిన్నప్పుడే తన తండ్రి దూరమైనా ఏ మాత్రం తన ఆత్మ విశ్వాసాన్ని కోల్పోకుండా 24 ఏళ్ల వయస్సులోనే లెఫ్టినెంట్ పైలెట్ హోదా దక్కించుకొని తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు దేవరకొండ మండలం ఉమ్మడి ముదిగొండ గ్రామం సీతారాంతండాకు చెందిన కొర్ర కుమార్–బుజ్జి దంపతుల మొదటి కుమారుడు అరవింద్ చౌహాన్. శనివారం హైదరాబాద్ దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ ఫ్లయింగ్ ఆఫీసర్ల పాసింగ్ ఔట్ పరేడ్‌లో అరవింద్ చౌహాన్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆఫ్ ఇండియా ఎయిర్ ఫోర్స్ విఆర్.చౌదరి చేతుల మీదుగా ఆయన లెఫ్టినెంట్ పైలెట్ హోదా పొందారు. దీంతో గ్రామస్తులు అరవింద్‌ను అభినందిస్తున్నారు.
అంచెలంచెలుగా ఎదిగి..
అరవింద్ చౌహాన్ 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు దేవరకొండలో పూర్తి చేశారు. 2013లో కోరుకొండ సైనిక్ స్కూల్‌లో సీటు సంపాదించాడు. 2016లో యూపీఎస్సీ ఆల్ ఇండియా స్థాయిలో నిర్వహించిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్డీయే) పరీక్షలో 175వ ర్యాంకు సాధించాడు. అనంతరం మూడేళ్లు పూణేలో శిక్షణ పొందుతూనే బీటెక్ పూర్తి చేశాడు. అనంతరం నావల్ అకాడమీలో శిక్షణ తీసుకొని 2021మేలో ఇండియన్ నేవీలో సబ్ లెఫ్టినెంట్‌గా ఎంపికయ్యాడు. అనంతరం ఇటీవల ఇండియన్ ఏవియేషన్ బ్రాంచిలో నిర్వహించిన పరీక్షలో ఆయన పైలెట్‌గా ఎంపికై లెఫ్టినెంట్ హోదా పొందారు. అరవింద్‌కు 12 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడే తండ్రి దూరమైనా తల్లి అన్నీ తానై చదివించింది. వారికి కుటుంబ సభ్యులైన బాబాయి విజయ్, మేనమామలు నేనావత్ రంగానాయక్, నేనావత్ జైపాల్ తోడ్పాటు అందించారు.
పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు
యువత పట్టుదలతో సాధించలేనిది ఏమిలేదు. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి నేడు నేను ఈ స్థాయిలో నిలబడ్డాను. ఇందుకు నా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎనలేనిది. దేవరకొండ ప్రాంతానికి చెందిన యువత ఇండియన్ ఆర్మీ, నేవి, ఎయిర్ ఫోర్స్ వంటి ఉద్యోగాలపై దృష్టి సారించాలి. దేశానికి ఎంతో కొంత సేవ చేయాలన్న తలంపుతో యువత ముందుకు రావాలి. – అరవింద్ చౌహాన్
Comments
Please login to add a commentAdd a comment