ఆత్మకూరు(ఎం): అమెరికాలోని న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా) కొత్త అధ్యక్షురాలిగా ఏనుగు వాణి ఎన్నికయ్యారు. ఏనుగు వాణి స్వగ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలంలోని సిద్దాపురం. న్యూయార్క్ నగరంలోని రాడిసన్ హోటల్‌లో భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం సమావేశమై నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
నైటా కార్యవర్గాన్ని ఏడాదికొకసారి ఎన్నుకుంటారు. నైటాలో మొత్తం వెయ్యి మంది సభ్యులు ఉన్నారు. నైటా ఎగ్జిక్యూటివ్ కమిటీ అధ్యక్షురాలిగా ఏనుగు వాణితో పాటు మరో 8 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ వింగ్ నుంచి చైర్మన్‌తో సహా 12 మందితో కార్యవర్గం ఎన్నికైంది. నలుగురిని సలహాదారులుగా ఎన్నుకున్నారు. ఏనుగు వాణి భర్త ఏనుగు లక్ష్మణ్‌రెడ్డి ‘నైటా’ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ వింగ్ నుంచి వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.
ఏనుగు వాణి పుట్టినిల్లు యాదాద్రి జిల్లాలోని వలిగొండ మండలం సుంకిశాల గ్రామం కాగా.. ఇదే జిల్లాలోని ఆత్మకూరు(ఎం) మండలం సిద్దాపురం మెట్టినిల్లు. 25 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ‘నైటా’ ఆధ్వర్యంలో న్యూయార్క్ నగరంలో తెలంగాణ సంప్రదాయాలను చాటిచెప్పే పండుగలను ఘనంగా నిర్వహిస్తుంటారు. అంతే కాకుండా కరోనా సమయంలో, వరదలు వచ్చినప్పుడు న్యూయార్క్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలో సేవా కార్యక్రమాలను చేపట్టారు. సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment