Telanganga Bathukamma celebrations at Dallas USA
తెలంగాణ సంస్కృతిని అమెరికా గడ్డపై వికసింపజేస్తున్న తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ (TPAD).. ఈ ఏడాది మరింత ఉత్సాహంతో బతుకమ్మ వేడుకలకు శ్రీకారం చుట్టింది. దాదాపు వేయి మంది మహిళలు అందంగా తీర్చిదిద్దిన తమ బతుకమ్మలతో కుటుంబసభ్యులను వెంటబెట్టుకుని వచ్చి డాలస్‌లోని ఆండ్రివ్ బ్రోన్ పార్క్ ఈస్ట్‌లో సందడి చేశారు. మహిళలందరూ బృందవలయాలుగా ఏర్పడి పాటలు పాడుతూ బతుకమ్మను కొలుస్తూ పులకించిపోయారు. తెలంగాణ నేల నుంచి పూల పండుగే తరలివచ్చిందన్న చందంగా వేడుక సాగింది.
పండుగ నిర్వహణకు ప్రత్యేక కమిటీలు
చిన్నబతుకమ్మ పండుగను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఫౌండేషన్ కమిటీ చైర్ రఘువీర్ బండారు, బీవోటీ చైర్ సుధాకర్ కలసాని, ప్రెసిడెంట్ లింగారెడ్డి అల్వ, కోఆర్డినేటర్ రోజా ఆడెపు నేతృత్వం వహించారు. టీపాడ్ పూర్వ అధ్యక్షులు రమణ లష్కర్, ఉపాధ్యక్షులు అనురాధ మేకల, కార్యదర్శి రత్న ఉప్పల సూచనలు సలహాలు అందించారు. చిన్నబతుకమ్మ పండుగకు చైర్‌గా గాయత్రి గిరి, కో-చైర్‌గా అనుషా వనం, అడ్వయిజర్‌గా ఇంద్రాణి పంచెర్పుల తమ సేవలందించారు. హరిశంకర్‌రెడ్డి రేసు, ప్రశాంత్ నిమ్మని.. హాజరైన ప్రతి ఒక్కరికి పులిహోర, దద్దోజనం, మిఠాయిలు వడ్డించి తాము పుట్టిపెరిగిన ప్రాంతపు మధురజ్ఞాపకాలను గుర్తుకొచ్చేలా చేయడమే కాకుండా అందరి మన్ననలు అందుకున్నారు. ఆడియో, సౌండ్ సిస్టమ్ బాధ్యతలు స్వీకరించిన బాల గణపవరపు, నరేశ లింగంపల్లి.. మూడు గంటల పాటు బతుకమ్మ పాటలతో హుషారు నింపి హోరెత్తించారు. బతుకమ్మల నిమజ్జనం కోసం శ్రావణ్ నిడిగంటి, సుచేంద్రబాబు ప్రత్యేకంగా టబ్‌లు ఏర్పాటు చేయడం, నీటి సదుపాయం కల్పించడం వంటి పనులు చూసుకున్నారు. రవాణా వ్యవహారాలను సంతోష్ రేగొండ, భోజన సదుపాయాలను సంతోష్, సోషల్ మీడియా వ్యవహారాలను మధుమతి వైశ్యరాజు, ఆదిత్య గాదె చూసుకున్నారు. రిసెప్షన్ బాధ్యతలు మాధవి మెంట, దీపికారెడ్డి చూసుకోగా, శశిరెడ్డి, మాధవి ఓంకార్ డెకరేషన్ దగ్గరుండి చేయించారు.
అక్టోబర్ 21న సద్దుల బతుకమ్మ, దసరా వేడుకలకు ఏర్పాటు
అక్టోబర్ 15 ఆదివారం రోజున చిన్న బతుకమ్మ పండుగతో బతుకమ్మ-దసరా వేడుకలకు అంకురార్పణ చేసిన టీపాడ్.. అక్టోబర్ 21న మెగా వేడుకలకు సన్నద్ధమవుతున్నది. ఏటా పదివేల మందితో సద్దుల బతుకమ్మ పండుగను నిర్వహిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని ఆకర్షించిన టీపాడ్.. ఈ దఫా మరింత వైభవంగా ఆర్గనైజ్ చేస్తున్నది. ఈ వేడుకలకు డాలస్‌లోని కొమెరికా సెంటర్ (పెప్పర్ ఎరెనా) వేదికగా నిలుస్తున్నది. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకలు అర్ధరాత్రి వరకు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు.
విశేష అతిథిగా సంయుక్తామీనన్, రాఫెల్ ప్రైజ్‌గా బీఎండబ్ల్యూ బైక్
సినీ కథానాయిక సంయుక్తామీనన్ విశేష అతిథిగా హాజరవనున్న ఈ పండుగలో సుప్రసిద్ధ గాయకులు తమ గాత్రంతో వీనులవిందు చేయనున్నారు. వేడుకల్లో భాగంగా రాఫెల్ ప్రైజ్‌లను అందజేయనున్నారు. వీటిలో బీఎండబ్ల్యు బైక్, బంగారు నాణేలు, పట్టు చీరలు, డ్రెస్ మెటీరియల్, ఆర్టిఫిషియల్ జువెల్లరీతో పాటు గిఫ్ట్ ఓచర్లు ఉన్నాయి. బీఎండబ్ల్యు బైక్ మరియు రాఫెల్ ప్రైజ్‌లను మాధవి లోకిరెడ్డి, హారిక పాల్వాయి అనౌన్స్ చేశారు. వేడుకల వివరాల కోసం టీపాడ్ వెబ్‌సైట్ టీపాడ్‌యూఎస్.ఓఆర్‌జీను బ్రౌజ్ చేయొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment