చౌటుప్పల్ : హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం వరకు విజయవాడ మీదుగా జాతీయ రహదారి వెంట హైస్పీడ్ రైలు కారిడార్ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రైల్వేశాఖ ప్రిలిమినరీ ఇంజనీరింగ్ అండ్ ట్రాఫిక్ (పెట్) సర్వే చేపట్టింది. ఇందుకు సంబంధించిన బాధ్యతలను గత సంవత్సరం మే నెలలోనే ఎస్‌ఎం కన్సల్టెన్సీకి అప్పగించింది. మార్చి నెలాఖరు నాటికి ప్రాథమిక సర్వే పూర్తి చేయనున్నట్ల తెలుస్తోంది. ఈ సర్వే ఆధారంగా సమగ్ర నివేదిక (డీపీఆర్) రూపొందించనున్నారు.
హైవేపై తగ్గనున్న రద్దీ
సాధారణంగానే తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల నడుమ విపరీతమైన రద్దీ ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత ట్రాఫిక్ మరింతగా పెరిగింది. సాధారణ ప్రజానీకంతో పాటు ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర పనుల నిమిత్తం లక్షల మంది ప్రయాణిస్తుంటారు. వీరంతా వివిధ ప్రాంతాల నుంచి ఉన్న రైలు, రోడ్డు మార్గాల ద్వారా వెళ్తుంటారు. హైస్పీడ్ రైల్ కారిడార్ ఏర్పాటు చేస్తే రెండు తెలుగు రాష్ట్రాల రాజధానులు అనుసంధానం కావడమే కాకుండా ప్రయాణానికి, సరుకుల ఎగుమతులు, దిగుమతులకు మార్గం సుగమం కానుంది.
రెండు దశాబ్దాల కల
హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారికి అనుసంధానంగా రైల్వేలైన్ ఏర్పాటు చేయాలని ప్రజలు దశాబ్దాలుగా కోరుతున్నారు. ఉమ్మడి నల్ల గొండకుచెందిన అప్పటి ఎంపీలు కేంద్రం దృష్టికి అనేకమార్లు తీసుకెళ్లారు. రాష్ట్ర విభజన అనంతరం ఇరు రాష్ట్రాల అవసరాలను గ్రహించిన కేంద్రం.. రైలు కారిడార్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీని వల్ల రంగారెడ్డి, ఉమ్మడి నల్లగొండ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో జాతీయ రహదారి వెంట ఉన్న ప్రాంతవాసుల కల సాకారం కానుంది.
నాలుగున్నర గంటల్లోనే ప్రయాణం
హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టు పూర్తయితే ప్రయాణికులకు సమయం చాలా ఆదా కానుంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విశాఖపట్టణం వరకు 900 కిలో మీటర్లకు పైగా దూరాన్ని కేవలం నాలుగున్నర గంటల్లోనే చేరుకోవచ్చు. హైస్పీడ్ రైలు గంటకు 220 కిలో మీటర్ల వేగంతో వెళ్తుంది. ప్రయాణికులు వెళ్లిన రోజు తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment