high speed train
-
నేలపైనే.. విమాన వేగం!
ఆటోమొబైల్ పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న చైనా ఎప్పటికప్పుడు కొత్త వాహనాలను ఆవిష్కరించడంలో బిజీగా ఉంది. ఇందులో భాగంగానే ఈ సంవత్సరంలో ఫిబ్రవరిలో 'ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్' సూపర్ సోనిక్ హై స్పీడ్ ట్రైన్ (లో వాక్యూమ్ ట్యూబ్ హైపర్‌లూప్ స్టైల్ మాగ్లెవ్ అల్ట్రా హై-స్పీడ్ ట్రైన్)ను టెస్ట్ చేసింది.ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఈ హైస్పీడ్ ట్రైన్‌ను టెస్ట్ చేయడం ఇదే మొదటిసారి. చూడటానికి ట్రైన్ మాదిరిగా ఉన్నప్పటికీ వేగంలో విమానానికి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంటుంది. మొదటి దశలో దీనిని 2 కిమీ దూరం టెస్ట్ చేశారు. టెస్టింగ్ సమయంలో ఈ ట్రైన్ స్పీడ్ 623 కిమీ/గం వేగాన్ని తాకింది.2012లో జపాన్ నిర్మించిన L0 సిరీస్ మాగ్లెవ్.. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలుగా రికార్డు క్రియేట్ చేసింది. దీని టాప్ స్పీడ్ గంటకు 602 కిమీ. కాగా ఇప్పుడు చైనా నిర్మిస్తున్న ట్రైన్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ట్రైన్‌గా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయడానికి సిద్ధమవుతోంది.ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ ట్రైన్‌కు చక్రాలు ఉండవు. చక్రాలు లేకుండా ఎలా నడుస్తుందనుకుంటున్నారా? ఇది ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ శక్తితో ట్రాక్‌పై గాలిలో తేలియాడుతూ నడుస్తుంది. దీంతో పట్టాలు, చక్రాలమధ్య ఘర్షణ అనే సమస్యే ఉండకపోవడంతో గరిష్ట వేగాన్ని సులభంగా అందుకోగలదు.సూపర్ సోనిక్ హై స్పీడ్ ట్రైన్ ఎయిరో డైనమిక్స్ సూత్రాలకు అనుగుణంగా ప్యాసింజర్ల కోసం రైక్లెన్డ్ సీట్లును పొందుతుంది. ఈ ట్రైన్ గరిష్ట వేగం గంటకు 1000 కిమీ. కాబట్టి ఈ వేగంథియో వూహాన్ నుంచి బీజింగ్ చేరుకోవడానికి కేవలం 30 నిముషాలు మాత్రమే పడుతుందని తెలుస్తోంది.ఈ ట్రైన్ మీద సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా ట్రైన్‌కు అవసరమైన పవర్ లభిస్తుంది. ప్రస్తుతం ఈ రైలును 623 కిమీ వేగంలో మాత్రమే టెస్ట్ చేశారు. దీనిని పూర్తిగా అభివృద్ధి చేశాక గంటకు 2000 కిమీ వేగంతో ప్రయాణిస్తుంది సమాచారం. ఈ ట్రైన్ కోసం చైనా ఎంత ఖర్చు చేసిందనే విషయం అధికారికంగా వెల్లడించలేదు. -
Paris Olympics: ఫ్రాన్స్‌లో దుండగుల దుశ్చర్య
పారిస్: ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇస్తున్న ఫ్రాన్స్‌లో గుర్తు తెలియని వ్యక్తులు విధ్వంసానికి పాల్పడ్డారు. హైస్పీడ్ రైలు నెట్‌వర్క్‌ను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 11 గంటలకు క్రీడోత్సవాలు ప్రారంభం కాగా, దుండగుల దుశ్చర్య కారణంగా ఉదయం నుంచే పలు ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని ఆలస్యంగా నడిచాయి. మారుమూల ప్రాంతాల్లో సిగ్నల్ సబ్స్టేషన్లపై దాడి చేశారు. కేబుళ్లు తెంపేశారు. ఫలితంగా ఫ్రాన్స్‌తోపాటు యూరప్‌లోని పలు ప్రాంతాల నుంచి పారిస్‌కు రైల్వే సేవలు నిలిపివేయాల్సి వచి్చంది. వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైళ్లలో వెళ్లాల్సిన ఒలింపిక్ క్రీడాకారులను బస్సుల్లో పారిస్‌కు తరలించారు. ఒలింపిక్స్ ప్రారంభమైన రోజే పథకం ప్రకారం జరిగిన ఈ చర్యల వెనుక కుట్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారు. వామపక్షవాద మిలిటెంట్లు లేదా పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారులు ఈ దాడులకు పాల్పడినట్లు భావిస్తున్నారు. తమ డిమాండ్లను ప్రపంచం దృష్టికి తీసుకురావాలన్నదే వారి ఎత్తుగడ కావొచ్చని చెబుతున్నారు. అయితే, ఒలింపిక్ క్రీడలతో ఈ దాడులకు ప్రత్యక్ష సంబంధం లేదని భావిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. క్రీడలను అడ్డుకోవాలన్నది దుండగుల ఆలోచన కాకపోవచ్చని తెలిపారు. హైస్పీడ్ రైలు నెట్‌వర్క్‌ను స్తంభింపజేసిన దుండుగులను గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు. నేరం రుజువైతే వారికి పదేళ్ల నుంచి 20 ఏళ్ల దాకా జైలు శిక్షపడే అవకాశం ఉందని చెప్పారు. తాజా ఘటనలపై ఫ్రాన్స్ ప్రధానమంత్రి గాబ్రియెల్ అటాల్ స్పందించారు. ఇవి ముందస్తు పథకం ప్రకారం జరిగిన దాడులేని చెప్పారు. ఉత్తర, తూర్పు, పశ్చిమ ప్రాంతాల నుంచి పారిస్‌కు దారితీసే రైలు మార్గాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడ్డారని తెలిపారు. పారిస్‌కు వెళ్లే రైళ్లను అడ్డుకోవాలన్నదే వారి ఉద్దేశంగా కనిపిస్తోందన్నారు. దుండగుల కోసం గాలింపు ప్రారంభమైందన్నారు. మధ్యాహ్నం తర్వాత రైళ్ల రాకపోకలు కొనసాగాయని రవాణా మంత్రి పాట్రిస్ వెర్‌గ్రిటే చెప్పారు. ఒలింపిక్స్ సందర్భంగా ముష్కరులు విధ్వంసానికి పాల్పడే అవకాశం ఉందని ఫ్రాన్స్ నిఘా వర్గాలు నెల రోజుల క్రితమే హెచ్చరించాయి. -
విమానం కంటే వేగంగా వెళ్లే రైలు.. ప్రత్యేకతలివే..
హైస్పీడ్ ట్రైన్స్ తయారుచేయడంలో చైనా మరో అడుగు ముందుకేసింది. తాజాగా అత్యాధునిక సూపర్ సోనిక్ అల్ట్రా హైస్పీడ్ ట్రైన్‌ను అభివృద్ధి చేసినట్లు ఆ దేశ పరిశోధకులు ప్రకటించారు. ఆకృతిలో రైలును పోలి, వేగంలో విమానానికి తీసిపోని ఈ ట్రైన్‌కు ‘టీ-ఫ్లైట్’ అని పేరు పెట్టారు. ప్రత్యేకతలు.. ఈ ట్రైన్‌కు చక్రాలు ఉండవు. ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ శక్తితో ట్రాక్‌పై గాలిలో తేలియాడుతూ నడుస్తుంది. దీంతో పట్టాలు, చక్రాలమధ్య ఘర్షణ అనే సమస్యే ఉండకపోవడంతో లక్షిత వేగాన్ని రైలు సులభంగా అందుకోగలదు. ఎయిరో డైనమిక్స్ సూత్రాలకు అనుగుణంగా ప్యాసింజర్ల కోసం ఏర్పాటు చేసిన రైక్లెన్డ్ సీట్లును ఏర్పాటు చేశారు. టాప్ స్పీడ్‌లో వుహాన్ నుంచి బీజింగ్ (వెయ్యి కిలోమీటర్లు)కు అరగంటలో చేరుకొంటుంది. రైలుపైన ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్స్ ద్వారా దానికి అవసరమైన శక్తి అందుతుంది. ప్రస్తుత వేగం – గంటకు 623 కి.మీ ప్రయాణిస్తుందని పరిశోధకులు చెప్పారు. మరింత అభివృద్ధి చేశాక గంటకు 2 వేల కి.మీ ప్రయాణిస్తుంది. ప్రత్యేక ట్యూబ్ గుండా ప్రయాణించే టీ-ఫ్లైట్‌లో మాగ్లెవ్ సాంకేతికత సాయంతో ఘర్షణ లేకుండా ప్రయాణించవచ్చు. ఇదీ చదవండి: ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్లు.. చివరి తేదీ ఎప్పుడంటే.. -
హైదరాబాద్ టు వైజాగ్
చౌటుప్పల్ : హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం వరకు విజయవాడ మీదుగా జాతీయ రహదారి వెంట హైస్పీడ్ రైలు కారిడార్ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రైల్వేశాఖ ప్రిలిమినరీ ఇంజనీరింగ్ అండ్ ట్రాఫిక్ (పెట్) సర్వే చేపట్టింది. ఇందుకు సంబంధించిన బాధ్యతలను గత సంవత్సరం మే నెలలోనే ఎస్ఎం కన్సల్టెన్సీకి అప్పగించింది. మార్చి నెలాఖరు నాటికి ప్రాథమిక సర్వే పూర్తి చేయనున్నట్ల తెలుస్తోంది. ఈ సర్వే ఆధారంగా సమగ్ర నివేదిక (డీపీఆర్) రూపొందించనున్నారు. హైవేపై తగ్గనున్న రద్దీ సాధారణంగానే తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల నడుమ విపరీతమైన రద్దీ ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత ట్రాఫిక్ మరింతగా పెరిగింది. సాధారణ ప్రజానీకంతో పాటు ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర పనుల నిమిత్తం లక్షల మంది ప్రయాణిస్తుంటారు. వీరంతా వివిధ ప్రాంతాల నుంచి ఉన్న రైలు, రోడ్డు మార్గాల ద్వారా వెళ్తుంటారు. హైస్పీడ్ రైల్ కారిడార్ ఏర్పాటు చేస్తే రెండు తెలుగు రాష్ట్రాల రాజధానులు అనుసంధానం కావడమే కాకుండా ప్రయాణానికి, సరుకుల ఎగుమతులు, దిగుమతులకు మార్గం సుగమం కానుంది. రెండు దశాబ్దాల కల హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారికి అనుసంధానంగా రైల్వేలైన్ ఏర్పాటు చేయాలని ప్రజలు దశాబ్దాలుగా కోరుతున్నారు. ఉమ్మడి నల్ల గొండకుచెందిన అప్పటి ఎంపీలు కేంద్రం దృష్టికి అనేకమార్లు తీసుకెళ్లారు. రాష్ట్ర విభజన అనంతరం ఇరు రాష్ట్రాల అవసరాలను గ్రహించిన కేంద్రం.. రైలు కారిడార్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీని వల్ల రంగారెడ్డి, ఉమ్మడి నల్లగొండ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో జాతీయ రహదారి వెంట ఉన్న ప్రాంతవాసుల కల సాకారం కానుంది. నాలుగున్నర గంటల్లోనే ప్రయాణం హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టు పూర్తయితే ప్రయాణికులకు సమయం చాలా ఆదా కానుంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విశాఖపట్టణం వరకు 900 కిలో మీటర్లకు పైగా దూరాన్ని కేవలం నాలుగున్నర గంటల్లోనే చేరుకోవచ్చు. హైస్పీడ్ రైలు గంటకు 220 కిలో మీటర్ల వేగంతో వెళ్తుంది. ప్రయాణికులు వెళ్లిన రోజు తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది. -
సముద్ర గర్భం గుండా ‘బుల్లెట్ ట్రైన్’.. దేశంలోనే తొలిసారి!
న్యూఢిల్లీ: దేశంలోనే మొట్టమొదటి సముద్ర గర్భ సొరంగం మార్గం అందుబాటులోకి రానుంది. ఈ టన్నెల్ నిర్మాణం ముంబై-అహ్మదాబాద్ మధ్య హైస్పీడ్ రైల్ కారిడార్‌లో భాగంగా నిర్మిస్తోంది కేంద్ర ప్రభుత్వం. సముద్ర గర్భంలో సొరంగం పనులకు నేషనల్ హైస్పీడ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్) బిడ్లను ఆహ్వానిస్తోంది. హైస్పీడ్ రైల్ కారిడార్‌లో భాగంగా మొత్తం 21 కిలోమీటర్ల మేర సొరంగాన్ని నిర్మించనుండగా.. 7 కిలోమీటర్లు సముద్రగర్భంలో తవ్వాల్సి ఉంది. మహారాష్ట్రలోని బంద్రా-కుర్లా కాంప్లెక్స్ మధ్య సాధారణ సొరంగాన్ని తవ్వాల్సి ఉండగా.. థానే జిల్లాలోని శిల్ఫాటా ప్రాంతంలో సముద్రంలో నిర్మించాల్సి ఉంది. గతంలో అండర్‌వాటర్ టన్నెల్ నిర్మాణం కోసం ఢిల్లీ-ముంబై మధ్య యమునా నది కింద తవ్వాలని ప్రతిపాదనలు వచ్చాయి. అయితే, అది సాధ్యపడలేదు. మరోవైపు.. బ్రహ్మపుత్ర నది కింద అన్ని వాహనాలు వెళ్లేందుకు వీలుగా సొరంగ మార్గం ఏర్పాటు కోసం రోడ్డు, రైల్వే మంత్రిత్వ శాఖలు ఇప్పటికే చర్యలు చేపట్టాయి. 2019లోనే హైస్పీడ్ ట్రైన్ టన్నెల్ నిర్మాణానికి ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్ టెండర్లు ఆహ్వానించింది. ఆ తర్వాత గత నవంబర్లోనూ మరోసారి బిడ్లను ఆహ్వానించింది. కానీ, అది కార్యరూపం దాల్చలేదు. తాజాగా మహారాష్ట్రలో ప్రభుత్వం మారిన తర్వాత ప్రాజెక్టు నిర్మాణ ప్రక్రియలో కదలిక వచ్చింది. వచ్చే ఏడాది జనవరి 29 నాటికి బిడ్లు దాఖలు చేయాలని గడువు విధించారు అధికారులు. ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య చేపడుతోన్నఈ రైలు కారిడార్ మొత్తం 508.17 కిలోమీటర్లు పొడవు ఉంటుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే.. అహ్మదాబాద్ నుంచి ముంబై కేవలం 2.58 గంటల్లో చేరుకోవచ్చు. గుజరాత్లో మొత్తం 8 స్టేషన్లు ఉండగా.. మహారాష్ట్రలో నాలుగు స్టేషన్లు ఉన్నాయి. ప్రాజెక్టును పూర్తిచేసి 2026లో తొలిదశ ట్రయల్స్‌ను నిర్వహించాలని రైల్వే మంత్రిత్వ శాఖ ఆశాభావంతో ఉంది. ఇదీ చదవండి: Viral Video: మేడ్ ఇన్ ఇండియా వ్యవసాయం అంటే ఇదే.. రైతు తెలివికి సలాం! -
గుడ్‌న్యూస్: ముంబై - హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్.. నేడే కీలక సమావేశం
ముంబై : తెలంగాణ వాసులకు శుభవార్త ! త్వరలోనే బుల్లెట్ రైలు ఇప్పుడు తెలుగు లోగిళ్లను పలకరించనుంది. కొత్తగా ముంబై - హైదరాబాద్‌ల మధ్య బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఎన్హెచ్ఎస్ఆర్సీ ఆధ్వర్యంలో యూరప్, అమెరికా వంటి దేశాలతో పాటు ఏషియాలో జపాన్, చైనాలలో ఇప్పటికే బుల్లెట్ రైళ్లు నడుస్తున్నాయి. ఇండియాలో ఇప్పుడే పనులు ప్రారంభమయ్యాయి. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు వేగవంతంగా నిర్మించేందుకు వీలుగా రైల్వే శాఖ నుంచి వీటిని వేరు చేసి కొత్తగా నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ (ఎన్హెచ్ఎస్ఆర్సీ)ని ఏర్పాటు చేశారు. ఈ సంస్థ తొలిసారిగా ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య 508 కిలోమీటర్ల నిడివితో తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు చేపట్టింది. మరికొన్ని మార్గాల్లో ఇప్పటికే ముంబై - అహ్మదాబాద్ మార్గంలో బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు సాగుతుండగా మరో కొన్ని ప్రాజెక్టులు చేపట్టాలని ఎన్హెచ్ఎస్ఆర్సీ నిర్ణయించింది. అందులో ఢిల్లీ - వారణాసి, ఢిల్లీ - అమృత్సర్, ఢిల్లీ - అహ్మదాబాద్, చెన్నై - బెంగళూరు - మైసూరు, ముంబై - హైదరాబాద్ మార్గాలు కూడా ఉన్నాయి. మొత్తంగా రాబోయే రోజుల్లో బుల్లెట్ ట్రైన్ నిడివిని 4,109 కిలోమీటర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 717 కిలోమీటర్లు ఇప్పటికే ఎన్హెచ్ఎస్ఆర్సీ సిద్ధం చేసిన ప్రాథమిక నివేదిక ప్రకారం ముంబై నుంచి హైదరాబాద్ వరకు మొత్తం 717 కిలోమీటర్ల మేరకు బుల్లెట్ ట్రైన్ ట్రాక్‌ను నిర్మిస్తారు. మార్గమధ్యంలో మొత్తం 11 స్టేషన్లు నిర్మిస్తారు. ఈ మార్గంలో ముంబై, నవీ ముంబై ఎయిర్పోర్ట్, పూనే, లోనావాలా, పండరీపూర్, షోలాపూర్ తదితర స్టేషన్లు ఉన్నాయి. కేవలం మూడు గంటల్లో ముంబై - హైదరాబాద్‌ల మధ్య ప్రస్తుతం రైలు ప్రయాణానికి కనీసం 15 గంటల సమయం పడుతోంది. బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే ఈ ప్రయాణ సమయం 3:30 గంటలకు తగ్గిపోతుంది. ఈ మార్గంలో ప్రయాణించే బుల్లెట్ రైలు గరిష్ట వేగం గంటలకు 350 కిలోమీటర్లు ఉండనుండగా సగటు వేగం గంటకు 250 కిలోమీటర్లుగా ఉండేలా ట్రాక్‌ను డిజైన్ చేశారు. ఈ మార్గం అందుబాటులోకి వస్తే ఒకేసారి 350 మంది ప్రయాణించవచ్చు. బడ్జెట్ లెక్కలు దేశంలో కొత్తగా ప్రతిపాదిస్తున్న బులెట్ ట్రైన్ ప్రాజెక్టుల్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముంబై - హైదరాబాద్ మార్గం ఒక్కటే ఉంది. ఈ రైలు ఏ మార్గంలో నిర్మించాలి, ఎంత ఖర్చు వస్తుంది, భూసేకరణ ఎలా చేయాలి తదితర అంశాలపై చర్చించేందుకు ఈ రోజు మహారాష్ట్రలోని థానే జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఎన్హెచ్ఎస్ఆర్సీ అధికారులు ఉదయం 11 గంటలకు సమావేశం కానున్నట్లు థానే జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ఎలివేటెడ్ కారిడార్ అహ్మదాబాద్ - ముంబై తరహాలోనే హైదరాబాద్ - ముంబై బుల్లెట్ రైలును కూడా ఎలివేటెడ్ కారిడార్ పద్దతిలోనే నిర్మించనున్నారు. మేజర్ ఎక్స్‌ప్రెస్ హైవేలు, నేషనల్ హైవేలు, గ్రీన్ ఫీల్డ్ ఏరియాల మీదుగా ముంబై-హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ మార్గం వెళ్లనుంది. ప్రతిపాదిత బుల్లెట్ రైలు ప్రాజెక్టులు నిడివి ముంబై - హైదరాబాద్ 717 కి.మీ చెన్నై - బెంగళూరు - మైసూరు 435 కి.మీ ఢిల్లీ - వారణాసి 865 కి.మీ ఢిల్లీ - అమృత్సర్ 459 కి.మీ ఢిల్లీ - అహ్మదాబాద్ 886 కి.మీ చదవండి : మన రైలు.. ఇక మరింత వేగం! -
మన రైలు.. ఇక మరింత వేగం!
సాక్షి, హైదరాబాద్: మన రైలు వేగం మరింత పెరగనుంది. గరిష్టంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో పరుగు పెట్టనుంది. భారతీయ రైల్వే చరిత్రలోనే ఇది సరికొత్త మైలురాయి కావడం విశేషం. స్వర్ణ చతుర్భుజి, స్వర్ణ వికర్ణ కారిడార్లను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేయడంతో అక్కడ రైళ్లు వేగంగా వెళ్లడానికి మార్గం సుగమమైంది. లాక్డౌన్ సమయంలో... స్వర్ణ చతుర్భుజి, స్వర్ణ వికర్ణ పేరుతో దేశవ్యాప్తంగా రెండు కారిడార్లను కేంద్రం అభివృద్ధి చేసింది. డబ్లింగ్ లైన్ ఉన్న మార్గాలను అనుసంధానిస్తూ ఉత్తర–దక్షిణ భారత రాష్ట్రాలను కలుపుతూ ఈ మార్గాలు విస్తరించాయి. వీటిలో ప్రమాదకర మలుపులు లేకుండా చేయటంతోపాటు కొత్త సిగ్నలింగ్ వ్యవస్థ, 260 మీటర్ల పొడవున్న పట్టాలను పటిష్టమైన రీతిలో ఏర్పాటు చేశారు. లాక్డౌన్ సమయం లో ఈ పనులు పూర్తి చేశారు. అనంతరం జూలై నుంచి దశలవారీగా ఆర్డీఎస్ఓ పర్యవేక్షణలో కన్ఫర్మేటరీ అసిలోగ్రాఫ్ కార్‌తో ప్రయోగాత్మకంగా పరీక్షలు నిర్వహించారు. తర్వాత పూర్తిస్థాయి రైళ్లను గరిష్ట వేగంతో నడిపి పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకపోవటంతో ఆ పరీక్షలు విజయవంతమైనట్టు ప్రకటించారు. తాజాగా రైల్వే సేఫ్టీ కమిషనర్ కొన్ని చిన్నచిన్న సూచనలు చేస్తూ రైళ్లను గరిష్ట వేగంతో నడిపేందుకు అనుమతి మంజూరు చేశారు. దీంతో రెండుమూడు వారాల్లో ఆ మార్పులు పూర్తిచేసి రైళ్ల వేగాన్ని పెంచనున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 1,280 కి.మీ. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 1,612 కిలోమీటర్ల మేర కొత్త కారిడార్ విస్తరించి ఉండగా.. ప్రస్తుతానికి 1,280 కిలోమీటర్ల మేర ఈ తరహా ట్రాక్ అందుబాటులోకి వచ్చింది. స్వర్ణ వికర్ణ కారిడార్‌కు సంబంధించి బల్లార్షా నుంచి కాజీపేట వరకు 234 కి.మీ., కాజీపేట నుంచి విజయవాడ, గుంటూరు వరకు 510 కి.మీ., స్వర్ణ చతుర్భుజి కారిడార్‌లో (చెన్నై–ముంబై సెక్షన్) 536 కి.మీ. ఈ మార్గం ఉంటుంది. ఇప్పటికే సికింద్రాబాద్–కాజీపేట మార్గంలో 130 కిలోమీటర్ల గరిష్ట వేగంతో రైళ్లను నడుపుతున్నారు. ఇకపై మిగతా మార్గాల్లో కూడా ఇది అమలవుతుంది. ప్రస్తుతం ఆ మార్గాల్లో 90 కి.మీ. నుంచి 110 కి.మీ. గరిష్ట వేగంగా ఉంది. కొన్ని మార్గాల్లో పరిమిత దూరం 120 కి.మీ. వరకు నడుపుతున్నారు. సింగిల్ లైన్లు, సరైన ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థ లేని మార్గాల్లో మాత్రం రైళ్లు ఇప్పటిలాగానే సాధారణ వేగంతో నడుస్తాయి. ఇందులో కొన్ని ప్రధాన మార్గాలు కూడా ఉన్నాయి. వీటిలో హైదరాబాద్–నిజామాబాద్ మార్గం ఒకటి. -
‘బుల్లెట్’ కోసం పోటీ
సాక్షి, న్యూఢిల్లీ: భారత తొలి బుల్లెట్ రైలుకు గుర్తింపు తీసుకొచ్చేందుకు జాతీయ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్) ప్రయత్నాలు ప్రారంభించింది. 2022 నుంచి ముంబయి–అహ్మదాబాద్ మధ్య పరుగులు పెట్టే ఈ హైస్పీడ్ రైలుకు పేరును సూచించడంతో పాటు మస్కట్‌ను రూపొందిం చేందుకు దేశవ్యాప్తంగా పోటీ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మస్కట్ ప్రభావవంతంగా ఉండటంతో పాటు ఎన్హెచ్ఎస్ ఆర్సీఎల్ విలువలను ప్రతిబింబించేలా ఉండాలని సూచించింది. అలాగే ప్రజలు బుల్లెట్ ట్రైన్‌తో మమేకమయ్యేలా పేరు ఉండాలని పేర్కొంది. విజేతలకు నగదు బహుమతి అందజేస్తామని, ఆసక్తి గల వ్యక్తులు మార్చి 25 నాటికి పేర్లను, మస్కట్ డిజైన్లను పంపించాలని తెలిపిం ది. మరిన్ని వివరాల కోసం mygot.in చూడాలని సూచించింది. 2017లో ఇలాం టి పోటీనే నిర్వహించి ఎన్హెచ్ఎస్ ఆర్సీఎల్ లోగో అయిన ‘చీతా’ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. -
రెండో రోజే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ బ్రేక్ డౌన్
వారణాసి : ప్రతిష్టాత్మకంగా ప్రారంభం అయిన తొలి సెమీ హైస్పీడ్ రైలు ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’ రెండోరోజే బ్రేక్ డౌన్ అయింది. శనివారం ఉదయం వారణాసి నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఈ రైలు తుండ్లా రైల్వే స్టేషన్ వద్ద నిలిచిపోయింది. ఇంజిన్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో రైలు నిలిచిపోయింది. నాలుగు కోచ్‌లలో బ్రేక్‌లు పట్టేయడం వల్ల రైలు నుంచి భారీ శబ్ధాలు వచ్చాయి. ఈ సంఘటన ఇవాళ ఉదయం 5.30 గంటలకు చోటుచేసుకుంది. దీంతో రైలులో ఉన్నావారిని మరో రెండు రైళ్లలో తరలించారు. అయితే ఓ గేదె పట్టాలు దాటుతున్న సమయంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఢీకొన్నట్లు సమాచారం. దీంతో రైలు చివరి బోగీ దెబ్బతినడంతో పాటు చిన్నపాటి పొగతో పాటు దుర్వాసన కూడా రావడంతో అప్రమత్తమైన లోకో పైలెట్లు రైలును నిలిపివేశారు. అనంతరం గేదె కళేబరం రైలు చక్రాలకు చుట్టుకోవడంతో వాటిని తొలగించారు. సుమారు మూడు గంటల అనంతరం రైలు తిరిగి బయల్దేరింది. ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’ను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జెండా ఊపి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ రైలు రేపటి నుంచి (ఆదివారం) నుంచి కమర్షియల్ రన్ మొదలు కానున్నది. -
చైనీయులకు తిరుగులేదన్నారు ఇందుకే..!
లొంగ్యాన్, చైనా : అతికొద్ది సమయంలో భారీ ప్రాజెక్టులను పూర్తి చేయగల సత్తా తమ సొంతమని చైనీయులు ప్రపంచానికి మరోసారి చాటి చెప్పారు. కేవలం తొమ్మిది గంటల్లో కొత్త రైల్వే స్టేషన్‌కు హై స్పీడ్ రైలు ట్రాక్(గంటకు 200 కి.మీ వేగం)ను నిర్మించి రికార్డు సృష్టించారు. రైల్వే ట్రాక్ నిర్మాణంలో 1,500 మంది వర్కర్లు పాల్గొన్నారు. వీరికి అవసరమైన వస్తువులను సరఫరా చేసేందుకు ఏడు రైళ్లను వినియోగించారు. దక్షిణ చైనాలోని ఫుజియన్ ప్రావిన్సులో గల లొంగ్యాన్ పట్టణంలోని రైల్వే స్టేషన్‌కు హైస్పీడ్ సర్వీసులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కొత్త రైల్వే స్టేషన్‌ను నిర్మించారు. స్టేషన్‌కు హైస్పీడ్ రైల్వే ట్రాక్‌ను యుద్ధప్రాతిపదికన నిర్మించాలని ఆదేశాలు జారీ కావడంతో కేవలం తొమ్మిది గంటల్లో నిర్మించి రికార్డు సృష్టించారు. కొత్తగా నిర్మించిన ‘నాన్‌లాంగ్ రైల్వే లైను’ను మరో మూడు లైన్లకు అనుసంధానించడంతో టాస్క్ పూర్తైంది. అంతేకాకుండా స్టేషన్‌కు రైళ్ల సమాచారాన్ని చేరవేసే ట్రాఫిక్ మానిటరింగ్ సిస్టంను సైతం అమర్చారు. 2018 చివర కల్లా 246 కిలోమీటర్ల మేర నాన్‌లాంగ్ రైల్వే లైనును విస్తరించాలని చైనా యోచిస్తోంది. ఇది పూర్తైతే ఈశాన్య చైనా నుంచి సెంట్రల్ చైనాకు ప్రయాణం సులభతరమవుతుంది. -
వరల్డ్ వైడ్.. ఫాస్టెస్ట్ ట్రైన్స్
ఆధునిక కాలంలో ప్రతిది వేగవంతమే.. తినడం దగ్గరనుంచీ రాత్రి నిద్రపోయే పరకూ మనిషి కాలంతో పందెం వేస్తూ పరిగెడుతున్నాడు. కాలంతో పరిగెత్తేందుకు మనిషి అన్ని సదుపాయాలు సిద్ధం చేసుకున్నాడు.. అందులో భాగంగానే వచ్చినవే.. హై స్పీడ్ ట్రైన్స్.. వీటినే కొన్ని ప్రాంతాల్లో బుల్లెట్ ట్రైన్స్ అని కూడా పిలుస్తారు.. పేర్లు ఏవైనా.. వేగంతో మాత్రం.. గాలితో సమానంగా దూసుకు వెళతాయి. సంప్రదాయ రైళ్లకు ఇవి పూర్తి భిన్నంగా ఉంటాయి.. ఆహార్యం నుంచి లోపల ఉండే సదుపాయాలతో సహా అన్నింటా కొత్తదనమే. అత్యంత వేగంతో ప్రయాణించే ఈ రైళ్లకు ట్రాక్‌పై బ్యాలెన్స్ కోసం ఏరోడైనమిక్స్‌ను వినియోగిస్తారు. హైస్పీడ్ ట్రైన్స్ కోసం ట్రాక్‌లను ప్రత్యేకంగా నిర్మిస్తారు. వీటిపై బుల్లెట్ ట్రైన్స్ గరిష్ట వేగంతో ప్రయాణిస్తాయి. హైస్పీడ్/బుల్లెట్ ట్రైన్స్ గంటకు 250 నుంచి 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. వీటి నిర్మాణంలో ఐరోపా దేశాలు, జర్మనీ, జపాన్, చైనాలు ముందున్నాయి. తక్కువ ఖర్చుతో.. వందల మంది ప్రయాణికులును సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో వీటి పాత్ర అధికం. ఈ కారణంతోనే నేడు పలు దేశాలు హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్స్ వైపు చూస్తున్నాయి. చైనా రికార్డ్ బుల్లెట్ ట్రైన్ల నిర్మాణంలోనూ, నిర్వహణలోనూ చైనా మిగిలిన దేశాలకన్నా చాలా ముందుంది. తాజాగా ప్రపంచంలోనే అత్యంత వేగంగా అంటే గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే హైస్పీడ్ రైలుకు పచ్చజెండా ఊపింది. చైనా కొత్తగా రూపొందించిన ఫక్సింగ్ బుల్లెట్ ట్రైన్ బీజింగ్-షాంఘైల మధ్య ప్రయాణిస్తుంది. ఈ రెండు నగరాల మధ్య దూరం.. 1310 కిలోమీటర్లు.. దీనిని ఈ రైలు కేవలం 4.30 నిమిషాల్లోనూ పూర్తి చేస్తుంది. చైనా 2011లోనే 350 కిలోమీటర్ల వేగంతో నడిచే రైలును ప్రవేశపెట్టినా.. 2011లో జరిగిన హైస్పీడ్ ట్రైన్ యాక్సిడెంట్‌తో నిలిపేసింది. అంతేకాక పలు రైళ్ల వేగాన్ని 25 నుంచి 300 కిలోమీటర్లకు తగ్గించింది. వెన్జెహు ప్రాంతంలో జరిగిన ఆ ప్రమాదంలో 40 మంది చనిపోగా.. 191 మంది గాయపడ్డారు. వేగం.. జపాన్ సొంతం హైస్పీడ్ ట్రైన్స్‌కు పర్యాయపదంలా జపాన్ నిలిచింది. ఇప్పటికే అత్యంత వేగంతో హైస్పీడ్ రైల్ నడిపిన చరిత్ర జపాన్‌దే. ఎస్సీ మాగ్లేవ్ ట్రైన్ పరీక్షల దశలోనే.. గంటకు 603 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి చరిత్ర సృష్టించింది. అయితే జపాన్ వాటిని ఫక్సింగ్ ట్రైన్కంటే తక్కవ వేగంతోనే నేటికి నడుపుతోంది. ఫ్రాన్స్ కూడా..! బుల్లెట్ ట్రైన్స్ నిర్మాణంలో ఫ్రాన్స్ కూడా చాలా ముందుంది. ఫ్రాన్స్‌లోని టీజీవీ ట్రైన్స్ గంటకి 575 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు.. అయితే అధికారులు వాటిని 320 కిలోమీటర్ల వేగానికి పరిమితం చేశారు. భారత్: భారత్‌లో ఇప్పటివరకూ హైస్పీడ్ ట్రైన్స్ లేవు.. అయితే ఈ మధ్యే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌కు భారత్ శంఖుస్థాపన చేసింది. ఈ బుల్లెట్ రైల్ 2022 నాటికి పట్టాలెక్కుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ రైలు గరిష్టంగా గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ముంబై-గాంధీనగర్ మధ్య ప్రయాణించనుంది. టాప్‌టెన్ హైస్సీడ్ ట్రైన్స్ దేశం ట్రైన్ ప్రస్తుత వేగం రికార్డు వేగం జపాన్ ఎస్సీ మాగ్లేవ్ 320 603 ఫ్రాన్స్ టీజీవీ 320 575 చైనా షాంఘై మాగ్లేవ్ 350 501 ద.కొరియా కేటీఎక్స్ 300 421 స్పెయిన్ ఏవీఈ 320 404 ఇటలీ ప్రెకెసిరోసా1000 300 400 జర్మనీ-నెదర్లాండ్ ఐసీఈ 320 368 ఇటలీ ఇటాలో 300 300 టర్కీ వైహెచ్టీ 250 303 స్వీడన్ ఎస్జే 200 303 -
ఆ రైళ్లతో పోలిస్తే మన గతిమాన్ ఎక్కడ?
న్యూఢిల్లీ: గతిమాన్ హైస్పీడ్ రైలు ప్రారంభంతో భారతీయ రైల్వే సంస్థ ఆధ్వర్యంలో నడిచే రైల్లు ఇక మున్ముందు మరింత వేగంగా, తక్కువ సమయంలో దూరాలకు చేరవేస్తాయని సంకేతాలు వెలువడ్డాయి. ప్రస్తుతం దేశంలోనే వేగవంతమైన రైలుగా గతిమాన్ ఎక్స్ ప్రెస్ ను పేర్కొంటూ భారతీయ రైల్వే మంగళవారం ప్రారంభించింది. ఇది ఢిల్లీ నుంచి ఆగ్రా మధ్య ఉన్న 188 కిలోమీటర్ల దూరాన్ని 100 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. ఈ రైలు వేగం గంటకు 160 కిలోమీటర్లు. అయితే, దేశంలోనే అత్యధిక వేగంగా ప్రయాణించే రైలుగా చెప్పుకునే ఈ గతిమాన్ ఎక్స్ ప్రెస్ ప్రపంచ దేశాల్లోని కొన్ని రైళ్లతో పోల్చి చూస్తే ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిస్తే.. షాంఘై మాగ్లేవ్: ఇది చైనాలో ప్రయాణించే అత్యంత వేగవంతమైన రైలు. దీని వేగం గంటకు 430 కిలోమీటర్లు. షాంఘై పుడాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సెంట్రల్ పుడాంగ్ కి మధ్య 30 కిలోమీటర్లు కవర్ చేసేందుకు దీనిని ఏర్పాటుచేశారు. ఈ 30 కిలోమీటర్ల దూరాన్ని ఈ రైలు కేవలం 8 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. ఇండియాలోని గతిమాన్ స్థానంలో ఈ రైలును పెడితే ఢిల్లీ నుంచి ఆగ్రాకు మధ్య 25 నుంచి 27 నిమిషాల్లో ప్రయాణిస్తుంది. గ్రండే విటెస్సీ: ఫ్రాన్స్‌కు చెందిన గ్రండే విటెస్సీ అనే రైలు వేగం గంటకు 300 కిలోమీటర్లు. దీనిని గతి మాన్ ప్లేస్ లో పెడితే 20 నుంచి 21 నిమిషాల్లో పూర్తి చేస్తుందట. ఏజీవీ ఇటాలో: ఇది ఇటలీలోని వేగవంతమైన రైలు. దీని వేగం గంటకు 300 కిలోమీటర్లు. దీనిని న్యూఢిల్లీ ఆగ్రా మధ్య పరుగులు పెట్టిస్తే 25 నుంచి 30 నిమిషాల్లో పరుగు పూర్తి చేస్తుందంటున్నారు. యూరోస్టార్: ఇది ఇంగ్లాండ్‌లోని వేగవంతమైన రైలు. దీని వేగం కూడా గంటకు 300 కిలోమీటర్లు. ఇది కూడా గతి మాన్ ప్లేస్‌లోకి వస్తే 25 నుంచి 30 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరుకుంటుందట. ఏసిలా ఎక్స్ ప్రెస్: ఇది అమెరికాలోని వేగవంతమైన రైలు. దీని వేగం గంటకు 240 కిలోమీటర్లు. ఈ రైలును గతిమాన్ తో పోలిస్తే ఢిల్లీ-ఆగ్రాల మధ్య ప్రయాణం 48 నిమిషాల్లో పూర్తి చేస్తుందట. -
తెలుగు గడ్డపై హై స్పీడ్ రైళ్లు
సాక్షి, హైదరాబాద్: మెరుపు వేగంతో పరుగులు తీసే హై స్పీడ్ రైళ్లు నడిపేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అవకాశం ఉందని చైనాకు చెందిన సర్వే బృందం అభిప్రాయపడింది. అయితే ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో గంటకు 160 కి.మీ. వేగంతో మాత్రమే రైళ్లు వెళ్లేలా ట్రాక్ సామర్థ్యం ఉంది. హై స్పీడ్ రైళ్లు నడిపేందుకు గంటకు 350 కి.మీ. వేగంతో నడిచేలా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ గేజ్ (1.435 గేజ్) ట్రాక్ రూపొందించాలని చైనా బృందం సూచించింది. దేశంలో హై స్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టు చేపట్టేందుకు భారత్, చైనా మధ్య ఇటీవల ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నార్త్-సౌత్ రైల్ కారిడార్‌గా వ్యవహరించే ఢిల్లీ-చెన్నై హై స్పీడ్ రైలు మార్గంపై సాధ్యాసాధ్యాల్ని పరిశీలించేందుకు ఆరుగురు సభ్యులతో కూడిన చైనా బృందం ఆరు రాష్ట్రాల్లో ఈ నెల 23వ తేదీ నుంచి అధ్యయనం చేపట్టింది. సర్వే, డిజైన్ పనులు ఉచితంగా చేసేందుకు చైనాకి చెందిన సియాయున్ రైల్వే కంపెనీ ముందుకు రావడంతో ఈ బాధ్యతల్ని అప్పగించారు. కో ఆర్డినేటింగ్ ఏజెన్సీగా రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ వ్యవహరిస్తుంది. చైనా బృందంతో ఏపీ రవాణా ముఖ్య కార్యదర్శి శాంబాబ్ చర్చలు జరిపారు. పర్యటనలో భాగంగా విజయవాడ జంక్షన్, ప్రయాణికుల సంఖ్య వివరాలను చైనా బృందం సేకరించింది. -
నవంబర్ 10 నాటికి హైస్పీడ్ రైలు!
న్యూఢిల్లీ: ఢిల్లీ-ఆగ్రాల మధ్య నవంబర్ 10వ తేదీ నాటికి హైస్పీడ్ రైలు పట్టాలపై పరుగు తీసే అవకాశం ఉంది. కపర్తలా రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో ఈ రైలు తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఈ రైలుకు 17 బోగీలు ఉంటాయి. ఈ రైలు 90 నిమిషాలలో ఢిల్లీ నుంచి ఆగ్రా వెళుతుంది. వచ్చే నెల తొలివారానికి ఈ బోగీలు అన్నీ సిద్ధమవుతాయని రైల్వే కోచ్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ ప్రమోద్ కుమార్ చెప్పారు. గంటకు 160 కిలో మీటర్ల వేగంతో ఈ రైలు పరుగులు తీస్తుంది. ** -
రైల్వే బడ్జెట్ సదానందమే
- బెంగళూరులో సబర్బన్ రైలు కోసం అధ్యయనానికి ఆదేశం - రాష్ట్రానికి కొత్తగా నాలుగు ఎక్స్‌ప్రెస్, మూడు ప్యాసింజర్ రైళ్లు - హైస్పీడ్ రైలు సంచారానికి ప్రతిపాదన - బయప్పనహళ్లి వద్ద కోచ్ టెర్మినల్ ఏర్పాటు - ఉత్తరాదితో పాటు దేశంలోని పుణ్యక్షేత్రాలకు కొత్తరైళ్లు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : కేంద్రంలో తొలిసారిగా రైల్వే బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన మంత్రి డీవీ. సదానంద గౌడ తన సొంత రాష్ట్రంపై వరాల జల్లు కురిపించారు. బెంగళూరులో సబర్బన్ రైలును ప్రవేశ పెట్టడంపై అధ్యయనానికి పచ్చ జెండా ఊపారు. రాష్ట్రానికి కొత్తగా నాలుగు ఎక్స్‌ప్రెస్ రైళ్లను, మూడు ప్యాసింజర్ రైళ్లను ప్రకటించారు. మైసూరు-బెంగళూరు-చైన్నై మార్గంలో 160-200 కి.మీ. వేగంతో నడిచే హై-స్పీడ్ రైలును ప్రతిపాదించారు. దీనికి అవసరమైన ఏర్పాట్లను చేసుకున్న తర్వాత ఈ రైలును నడుపుతామని తెలిపారు. గబ్బూరు-బళ్లారి, శివమొగ్గ-శృంగేరి-మంగళూరు, శివమొగ్గ జిల్లాలోని తాళగుప్ప-సిద్ధాపుర, గదగ-హరపనహళ్లి, కుశాలనగర-మడికేరి రైల్వే మార్గాలకు సర్వేను చేపట్టనున్నట్లు ప్రకటించారు. మంగళూరు-ఉళ్లాల-సూరత్కల్ మార్గంలో డబ్లింగ్ పనులను ప్రతిపాదించారు. బెంగళూరు-రామనగర మార్గంలో వారానికి ఆరు రోజుల పాటు మెము సర్వీసులు, బెంగళూరు-నెలమంగల (డెయిలీ), యశవంతపు-హొసూరు మార్గంలో వారానికి ఆరు రోజులు డెము సర్వీసులను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. ఇంకా..కామాక్య-బెంగళూరు ప్రీమియం ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-మంగళూరు (డెయిలీ), బెంగళూరు-శివమొగ్గ (బై వీక్లీ), బీదర్-ముంబై (వీక్లీ), టాటా నగర్-బెంగళూరు (వీక్లీ) ఎక్స్‌ప్రెస్‌లను ప్రవేశ పెట్టనున్నట్లు వెల్లడించారు. ధార్వాడ-దండేలి, బైందూరు-కాసరగోడు, యశవంతపుర-తుమకూరుల మధ్య రోజూ ప్యాసింజర్ రైళ్లను నడపనున్నట్లు తెలిపారు. నగర శివారులోని బయప్పనహళ్లి వద్ద కోచ్ టెర్మినల్‌ను నెలకొల్పనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రం నుంచి ఉత్తరాదితో పాటు దేశంలోని పుణ్య క్షేత్రాలకు పలు కొత్త రైళ్లను ప్రకటించారు. ఎంపీ హర్షం రైల్వే బడ్జెట్లో బెంగళూరు సబర్బన్ రైలును ప్రతిపాదించడం హర్షణీయమని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ రాజీవ్ గౌడ పేర్కొన్నారు. కేవలం అధ్యయనం మాత్రమే కాకుండా ప్రయోగాత్మకంగా ఓ రైలు సర్వీసును కూడా ప్రకటించి ఉండే బాగుండేదని తెలిపారు. సబర్బన్ రైలు వల్ల ఎన్నో ఉపయోగాలున్నందున, ఈ ప్రతిపాదనను ప్రతి బడ్జెట్లో పేర్కొనడం ద్వారా త్వరితగతిన పూర్తి చేసి నగర వాసుల కలను సాకారం చేయాలని కోరారు. అసంతృప్తికరం బెంగళూరు-గుత్తి రైలు మార్గం డబ్లింగ్ పనులను బడ్జెట్లో ప్రతిపాదించక పోవడం పట్ల ఆలిండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సీ. సునిష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. హై-స్పీడ్ రైళ్లు అత్యంత వ్యయభరితవైనవని, కాంట్రాక్టర్ల పాలిట కల్పతరువులా మారే ఈ ప్రాజెక్టు ప్రభుత్వానికి ఐరావతంలా తయారవుతుందని హెచ్చరించారు. ప్రాథమిక సదుపాయాల కల్పనకు బడ్జెట్లో సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన పెదవి విరిచారు. రైల్వే మంత్రికి కృతజ్ఞతలు కుశాల నగర-మడికేరి రైల్వే మార్గం సర్వేను బడ్జెట్లో ప్రతిపాదించడం పట్ల మైసూరు ఎంపీ ప్రతాప్ సింహ హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే మైసూరు-కుశాల నగర సర్వే పూర్తయినందున, అక్కడి నుంచి మడికేరికి పొడిగించాలన్న తన విజ్ఞప్తిని మన్నించినందుకు రైల్వే మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ రైల్వే మార్గం నిర్మాణం పూర్తయితే, మైసూరు, కొడగు జిల్లాల్లో పర్యాటక రంగం ఎంతగానే అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు.