గుడ్‌న్యూస్‌: ముంబై - హైదరాబాద్‌ బుల్లెట్‌ ట్రైన్‌.. నేడే కీలక సమావేశం | Meet To Discuss Detailed Project Report On Mumbai Hyderabad Bullet Train Project | Sakshi
Sakshi News home page

ముంబై - హైదరాబాద్‌ల మధ్య బుల్లెట్‌ రైల్‌.. సిద్ధమైన ప్రతిపాదనలు

Published Mon, Sep 27 2021 8:17 AM | Last Updated on Mon, Sep 27 2021 8:35 AM

Meet To Discuss Detailed Project Report On Mumbai Hyderabad Bullet Train Project - Sakshi

ముంబై : తెలంగాణ వాసులకు శుభవార్త ! త్వరలోనే బుల్లెట్‌ రైలు ఇప్పుడు తెలుగు లోగిళ్లను  పలకరించనుంది. కొత్తగా ముంబై - హైదరాబాద్‌ల మధ్య బుల్లెట్‌ ట్రైన్‌ అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.

ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీ ఆధ్వర్యంలో
యూరప్‌, అమెరికా వంటి దేశాలతో పాటు ఏషియాలో జపాన్‌, చైనాలలో ఇప్పటికే బుల్లెట్‌ రైళ్లు నడుస్తున్నాయి. ఇండియాలో ఇప్పుడే పనులు ప్రారంభమయ్యాయి. బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టులు వేగవంతంగా నిర్మించేందుకు వీలుగా రైల్వే శాఖ నుంచి వీటిని వేరు చేసి కొత్తగా నేషనల్‌ హై స్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీ)ని ఏర్పాటు చేశారు. ఈ సం‍స్థ తొలిసారిగా ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య 508 కిలోమీటర్ల నిడివితో తొలి బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు పనులు చేపట్టింది. 

మరికొన్ని మార్గాల్లో
ఇప్పటికే ముంబై - అహ్మదాబాద్‌ మార్గంలో బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు పనులు సాగుతుండగా మరో కొన్ని ప్రాజెక్టులు చేపట్టాలని ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీ నిర్ణయించింది. అందులో ఢిల్లీ - వారణాసి, ఢిల్లీ - అమృత్‌సర్‌, ఢిల్లీ - అహ్మదాబాద్‌, చెన్నై - బెంగళూరు - మైసూరు, ముంబై - హైదరాబాద్‌ మార్గాలు కూడా ఉన్నాయి. మొత్తంగా రాబోయే రోజుల్లో బుల్లెట్‌ ట్రైన్‌ నిడివిని 4,109 కిలోమీటర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

717 కిలోమీటర్లు
ఇప్పటికే ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీ సిద్ధం చేసిన ప్రాథమిక నివేదిక ప్రకారం ముంబై నుంచి హైదరాబాద్‌ వరకు మొత్తం 717 కిలోమీటర్ల మేరకు బుల్లెట్‌ ట్రైన్‌ ట్రాక్‌ను నిర్మిస్తారు. మార్గమధ్యంలో మొత్తం 11 స్టేషన్లు నిర్మిస్తారు. ఈ మార్గంలో ముంబై, నవీ ముంబై ఎయిర్‌పోర్ట్‌, పూనే, లోనావాలా, పండరీపూర్‌, షోలాపూర్‌ తదితర స్టేషన్లు ఉన్నాయి. 

కేవలం మూడు గంటల్లో
ముంబై - హైదరాబాద్‌ల మధ్య ప్రస్తుతం రైలు ప్రయాణానికి కనీసం 15 గంటల సమయం పడుతోంది. బుల్లెట్‌ రైలు అందుబాటులోకి వస్తే ఈ ప్రయాణ సమయం 3:30 గంటలకు తగ్గిపోతుంది. ఈ మార్గంలో ప్రయాణించే బుల్లెట్ రైలు గరిష్ట వేగం గంటలకు 350 కిలోమీటర్లు ఉండనుండగా సగటు వేగం గంటకు 250 కిలోమీటర్లుగా ఉండేలా ట్రాక్‌ను డిజైన్‌ చేశారు. ఈ మార్గం అందుబాటులోకి వస్తే ఒకేసారి 350 మంది ప్రయాణించవచ్చు. 

బడ్జెట్‌ లెక్కలు 
దేశంలో కొత్తగా ప్రతిపాదిస్తున్న బులెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టుల్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముంబై - హైదరాబాద్‌ మార్గం ఒక్కటే ఉంది. ఈ రైలు ఏ మార్గంలో నిర్మించాలి, ఎంత ఖర్చు వస్తుంది, భూసేకరణ ఎలా చేయాలి తదితర అంశాలపై చర్చించేందుకు ఈ రోజు మహారాష్ట్రలోని థానే జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీ అధికారులు ఉదయం 11 గంటలకు సమావేశం కానున్నట​‍్లు థానే జిల్లా కలెక్టర్‌ వెల్లడించారు. 

ఎలివేటెడ్‌ కారిడార్‌
అహ్మదాబాద్‌ - ముంబై తరహాలోనే హైదరాబాద్‌ - ముంబై బుల్లెట్‌ రైలును కూడా ఎలివేటెడ్‌ కారిడార్‌ పద్దతిలోనే నిర్మించనున్నారు. మేజర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేలు, నేషనల్‌ హైవేలు, గ్రీన్‌ ఫీల్డ్‌ ఏరియాల మీదుగా ముంబై-హైదరాబాద్‌ బుల్లెట్‌ ట్రైన్‌ మార్గం వెళ్లనుంది. 

ప్రతిపాదిత బుల్లెట్‌ రైలు ప్రాజెక్టులు        నిడివి
ముంబై - హైదరాబాద్‌                              717 కి.మీ
చెన్నై - బెంగళూరు - మైసూరు                435 కి.మీ
ఢిల్లీ - వారణాసి                                       865 కి.మీ
ఢిల్లీ - అమృత్‌సర్‌                                  459 కి.మీ
ఢిల్లీ - అహ్మదాబాద్‌                                886 కి.మీ

చదవండి : మన రైలు.. ఇక మరింత వేగం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement