ఆధునిక కాలంలో ప్రతిది వేగవంతమే.. తినడం దగ్గరనుంచీ రాత్రి నిద్రపోయే పరకూ మనిషి కాలంతో పందెం వేస్తూ పరిగెడుతున్నాడు. కాలంతో పరిగెత్తేందుకు మనిషి అన్ని సదుపాయాలు సిద్ధం చేసుకున్నాడు.. అందులో భాగంగానే వచ్చినవే.. హై స్పీడ్ ట్రైన్స్.. వీటినే కొన్ని ప్రాంతాల్లో బుల్లెట్ ట్రైన్స్ అని కూడా పిలుస్తారు.. పేర్లు ఏవైనా.. వేగంతో మాత్రం.. గాలితో సమానంగా దూసుకు వెళతాయి. సంప్రదాయ రైళ్లకు ఇవి పూర్తి భిన్నంగా ఉంటాయి.. ఆహార్యం నుంచి లోపల ఉండే సదుపాయాలతో సహా అన్నింటా కొత్తదనమే. అత్యంత వేగంతో ప్రయాణించే ఈ రైళ్లకు ట్రాక్‌పై బ్యాలెన్స్ కోసం ఏరోడైనమిక్స్‌ను వినియోగిస్తారు. హైస్పీడ్ ట్రైన్స్ కోసం ట్రాక్‌లను ప్రత్యేకంగా నిర్మిస్తారు. వీటిపై బుల్లెట్ ట్రైన్స్ గరిష్ట వేగంతో ప్రయాణిస్తాయి.
హైస్పీడ్/బుల్లెట్ ట్రైన్స్ గంటకు 250 నుంచి 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. వీటి నిర్మాణంలో ఐరోపా దేశాలు, జర్మనీ, జపాన్, చైనాలు ముందున్నాయి. తక్కువ ఖర్చుతో.. వందల మంది ప్రయాణికులును సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో వీటి పాత్ర అధికం. ఈ కారణంతోనే నేడు పలు దేశాలు హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్స్ వైపు చూస్తున్నాయి.
చైనా రికార్డ్
బుల్లెట్ ట్రైన్ల నిర్మాణంలోనూ, నిర్వహణలోనూ చైనా మిగిలిన దేశాలకన్నా చాలా ముందుంది. తాజాగా ప్రపంచంలోనే అత్యంత వేగంగా అంటే గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే హైస్పీడ్ రైలుకు పచ్చజెండా ఊపింది. చైనా కొత్తగా రూపొందించిన ఫక్సింగ్ బుల్లెట్ ట్రైన్ బీజింగ్-షాంఘైల మధ్య ప్రయాణిస్తుంది. ఈ రెండు నగరాల మధ్య దూరం.. 1310 కిలోమీటర్లు.. దీనిని ఈ రైలు కేవలం 4.30 నిమిషాల్లోనూ పూర్తి చేస్తుంది. చైనా 2011లోనే 350 కిలోమీటర్ల వేగంతో నడిచే రైలును ప్రవేశపెట్టినా.. 2011లో జరిగిన హైస్పీడ్ ట్రైన్ యాక్సిడెంట్‌తో నిలిపేసింది. అంతేకాక పలు రైళ్ల వేగాన్ని 25 నుంచి 300 కిలోమీటర్లకు తగ్గించింది. వెన్‌జెహు ప్రాంతంలో జరిగిన ఆ ప్రమాదంలో 40 మంది చనిపోగా.. 191 మంది గాయపడ్డారు.
వేగం.. జపాన్ సొంతం
హైస్పీడ్ ట్రైన్స్‌కు పర్యాయపదంలా జపాన్ నిలిచింది. ఇప్పటికే అత్యంత వేగంతో హైస్పీడ్ రైల్ నడిపిన చరిత్ర జపాన్‌దే. ఎస్‌సీ మాగ్లేవ్ ట్రైన్ పరీక్షల దశలోనే.. గంటకు 603 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి చరిత్ర సృష్టించింది. అయితే జపాన్ వాటిని ఫక్సింగ్ ట్రైన్‌కంటే తక్కవ వేగంతోనే నేటికి నడుపుతోంది.
ఫ్రాన్స్ కూడా..!
బుల్లెట్ ట్రైన్స్ నిర్మాణంలో ఫ్రాన్స్ కూడా చాలా ముందుంది. ఫ్రాన్స్‌లోని టీజీవీ ట్రైన్స్ గంటకి 575 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు.. అయితే అధికారులు వాటిని 320 కిలోమీటర్ల వేగానికి పరిమితం చేశారు.
భారత్:
భారత్‌లో ఇప్పటివరకూ హైస్పీడ్ ట్రైన్స్ లేవు.. అయితే ఈ మధ్యే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌కు భారత్ శంఖుస్థాపన చేసింది. ఈ బుల్లెట్ రైల్ 2022 నాటికి పట్టాలెక్కుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ రైలు గరిష్టంగా గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ముంబై-గాంధీనగర్ మధ్య ప్రయాణించనుంది.
టాప్‌టెన్ హైస్సీడ్ ట్రైన్స్
దేశం | ట్రైన్ | ప్రస్తుత వేగం | రికార్డు వేగం |
జపాన్ | ఎస్‌సీ మాగ్లేవ్ | 320 | 603 |
ఫ్రాన్స్ | టీజీవీ | 320 | 575 |
చైనా | షాంఘై మాగ్లేవ్ | 350 | 501 |
ద.కొరియా | కేటీఎక్స్ | 300 | 421 |
స్పెయిన్ | ఏవీఈ | 320 | 404 |
ఇటలీ | ప్రెకెసిరోసా1000 | 300 | 400 |
జర్మనీ-నెదర్లాండ్ | ఐసీఈ | 320 | 368 |
ఇటలీ | ఇటాలో | 300 | 300 |
టర్కీ | వైహెచ్‌టీ | 250 | 303 |
స్వీడన్ | ఎస్‌జే | 200 | 303 |