తెలుగు గడ్డపై హై స్పీడ్ రైళ్లు
సాక్షి, హైదరాబాద్: మెరుపు వేగంతో పరుగులు తీసే హై స్పీడ్ రైళ్లు నడిపేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అవకాశం ఉందని చైనాకు చెందిన సర్వే బృందం అభిప్రాయపడింది. అయితే ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో గంటకు 160 కి.మీ. వేగంతో మాత్రమే రైళ్లు వెళ్లేలా ట్రాక్ సామర్థ్యం ఉంది. హై స్పీడ్ రైళ్లు నడిపేందుకు గంటకు 350 కి.మీ. వేగంతో నడిచేలా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ గేజ్ (1.435 గేజ్) ట్రాక్ రూపొందించాలని చైనా బృందం సూచించింది.
దేశంలో హై స్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టు చేపట్టేందుకు భారత్, చైనా మధ్య ఇటీవల ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నార్త్-సౌత్ రైల్ కారిడార్‌గా వ్యవహరించే ఢిల్లీ-చెన్నై హై స్పీడ్ రైలు మార్గంపై సాధ్యాసాధ్యాల్ని పరిశీలించేందుకు ఆరుగురు సభ్యులతో కూడిన చైనా బృందం ఆరు రాష్ట్రాల్లో ఈ నెల 23వ తేదీ నుంచి అధ్యయనం చేపట్టింది.
సర్వే, డిజైన్ పనులు ఉచితంగా చేసేందుకు చైనాకి చెందిన సియాయున్ రైల్వే కంపెనీ ముందుకు రావడంతో ఈ బాధ్యతల్ని అప్పగించారు. కో ఆర్డినేటింగ్ ఏజెన్సీగా రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ వ్యవహరిస్తుంది. చైనా బృందంతో ఏపీ రవాణా ముఖ్య కార్యదర్శి శాంబాబ్ చర్చలు జరిపారు. పర్యటనలో భాగంగా విజయవాడ జంక్షన్, ప్రయాణికుల సంఖ్య వివరాలను చైనా బృందం సేకరించింది.