రైల్వే బడ్జెట్ సదానందమే | frist time railway budget | Sakshi
Sakshi News home page

రైల్వే బడ్జెట్ సదానందమే

Published Wed, Jul 9 2014 2:26 AM | Last Updated on Sat, Sep 2 2017 10:00 AM

రైల్వే బడ్జెట్ సదానందమే

రైల్వే బడ్జెట్ సదానందమే

- బెంగళూరులో సబర్బన్ రైలు కోసం అధ్యయనానికి ఆదేశం
- రాష్ట్రానికి కొత్తగా నాలుగు ఎక్స్‌ప్రెస్, మూడు ప్యాసింజర్ రైళ్లు
- హైస్పీడ్ రైలు సంచారానికి ప్రతిపాదన
- బయప్పనహళ్లి వద్ద కోచ్ టెర్మినల్ ఏర్పాటు
- ఉత్తరాదితో పాటు దేశంలోని పుణ్యక్షేత్రాలకు కొత్తరైళ్లు

 సాక్షి ప్రతినిధి, బెంగళూరు : కేంద్రంలో తొలిసారిగా రైల్వే బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన మంత్రి డీవీ. సదానంద గౌడ తన సొంత రాష్ట్రంపై వరాల జల్లు కురిపించారు. బెంగళూరులో సబర్బన్ రైలును ప్రవేశ పెట్టడంపై అధ్యయనానికి పచ్చ జెండా ఊపారు. రాష్ట్రానికి కొత్తగా నాలుగు ఎక్స్‌ప్రెస్ రైళ్లను, మూడు ప్యాసింజర్ రైళ్లను ప్రకటించారు. మైసూరు-బెంగళూరు-చైన్నై మార్గంలో 160-200 కి.మీ. వేగంతో నడిచే హై-స్పీడ్ రైలును ప్రతిపాదించారు. దీనికి అవసరమైన ఏర్పాట్లను చేసుకున్న తర్వాత ఈ రైలును నడుపుతామని తెలిపారు. గబ్బూరు-బళ్లారి, శివమొగ్గ-శృంగేరి-మంగళూరు, శివమొగ్గ జిల్లాలోని తాళగుప్ప-సిద్ధాపుర, గదగ-హరపనహళ్లి, కుశాలనగర-మడికేరి రైల్వే మార్గాలకు సర్వేను చేపట్టనున్నట్లు ప్రకటించారు.

మంగళూరు-ఉళ్లాల-సూరత్‌కల్ మార్గంలో డబ్లింగ్ పనులను ప్రతిపాదించారు. బెంగళూరు-రామనగర మార్గంలో వారానికి ఆరు రోజుల పాటు మెము సర్వీసులు, బెంగళూరు-నెలమంగల (డెయిలీ), యశవంతపు-హొసూరు మార్గంలో వారానికి ఆరు రోజులు డెము సర్వీసులను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. ఇంకా..కామాక్య-బెంగళూరు ప్రీమియం ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-మంగళూరు (డెయిలీ), బెంగళూరు-శివమొగ్గ (బై వీక్లీ), బీదర్-ముంబై (వీక్లీ), టాటా నగర్-బెంగళూరు (వీక్లీ) ఎక్స్‌ప్రెస్‌లను ప్రవేశ పెట్టనున్నట్లు వెల్లడించారు.

ధార్వాడ-దండేలి, బైందూరు-కాసరగోడు, యశవంతపుర-తుమకూరుల మధ్య రోజూ ప్యాసింజర్ రైళ్లను నడపనున్నట్లు తెలిపారు. నగర శివారులోని బయప్పనహళ్లి వద్ద కోచ్ టెర్మినల్‌ను నెలకొల్పనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రం నుంచి ఉత్తరాదితో పాటు దేశంలోని పుణ్య క్షేత్రాలకు పలు కొత్త రైళ్లను ప్రకటించారు.
 
ఎంపీ హర్షం
రైల్వే బడ్జెట్‌లో బెంగళూరు సబర్బన్ రైలును ప్రతిపాదించడం హర్షణీయమని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ రాజీవ్ గౌడ పేర్కొన్నారు. కేవలం అధ్యయనం మాత్రమే కాకుండా ప్రయోగాత్మకంగా ఓ రైలు సర్వీసును కూడా ప్రకటించి ఉండే బాగుండేదని తెలిపారు. సబర్బన్ రైలు వల్ల ఎన్నో ఉపయోగాలున్నందున, ఈ ప్రతిపాదనను ప్రతి బడ్జెట్‌లో పేర్కొనడం ద్వారా త్వరితగతిన పూర్తి చేసి నగర వాసుల కలను సాకారం చేయాలని కోరారు.
 
అసంతృప్తికరం

బెంగళూరు-గుత్తి రైలు మార్గం డబ్లింగ్ పనులను బడ్జెట్‌లో ప్రతిపాదించక పోవడం పట్ల ఆలిండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి  సీ. సునిష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. హై-స్పీడ్ రైళ్లు అత్యంత వ్యయభరితవైనవని, కాంట్రాక్టర్ల పాలిట కల్పతరువులా మారే ఈ ప్రాజెక్టు ప్రభుత్వానికి ఐరావతంలా తయారవుతుందని హెచ్చరించారు. ప్రాథమిక  సదుపాయాల కల్పనకు బడ్జెట్‌లో సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన పెదవి విరిచారు.
 
రైల్వే మంత్రికి కృతజ్ఞతలు

కుశాల నగర-మడికేరి రైల్వే మార్గం సర్వేను బడ్జెట్‌లో ప్రతిపాదించడం పట్ల మైసూరు ఎంపీ ప్రతాప్ సింహ హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే మైసూరు-కుశాల నగర సర్వే పూర్తయినందున, అక్కడి నుంచి మడికేరికి పొడిగించాలన్న తన విజ్ఞప్తిని మన్నించినందుకు రైల్వే మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ రైల్వే మార్గం నిర్మాణం పూర్తయితే, మైసూరు, కొడగు జిల్లాల్లో పర్యాటక రంగం ఎంతగానే అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement