suburban train
-
రాష్ట్రంలో సెమీ హైస్పీడ్ సబర్బన్ రైలు
సాక్షి, అమరావతి: విజయవాడ, గుంటూరు, తెనాలి, అమరావతి నగరాలను కలుపుతూ సెమీ హైస్పీడ్ సబర్బన్ రైలు సర్వీసు ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది. గత ప్రభుత్వం హయాంలో హైస్పీడ్ సబర్బన్ సర్క్యులర్ రైలు పేరుతో దీని ఏర్పాటుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ, అంచనాలను ఆకాశానికంటేలా రూపొందించడంతో అడుగు ముందుకు వేయలేకపోయారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు లభించేలా ఆకర్షణీయంగా ఈ రైలు మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. గతంలో ఎలివేటెడ్ (పిల్లర్లపై) మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు అప్పటి ప్రభుత్వం ఆసక్తి చూపగా, దానివల్ల ఖర్చు ఎక్కువయ్యే పరిస్థితి ఉండడంతో భూమిపైనే రైలు మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్(ఏఎంఆర్‌సీ) అధికారులకు సూచించారు. ఎలివేటెడ్ కంటే భూమిపై నిర్మించడం ద్వారా 20 నుంచి 30 శాతం వ్యయం తగ్గే పరిస్థితి ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం దానిపైనే మొగ్గు చూపింది. పైగా ఈ ప్రాజెక్టుకు ఎలివేటెడ్ మార్గం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయంగా ఇలాంటి ప్రాజెక్టులను తక్కువ ఖర్చుతో ఎంతో ఆకర్షణీయంగా రూపొందిస్తున్నారని, ఇక్కడ కూడా అందమైన డిజైన్లు, గ్రీనరీతో పాటు ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు అందేలా సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) తయారు చేయాలని ఏఎంఆర్సీని ముఖ్యమంత్రి ఆదేశించారు. 104 కిలో మీటర్లు 4 నగరాలు విజయవాడ, నంబూరు, అమరావతి, గుంటూరు, తెనాలి మీదుగా 104 కిలోమీటర్ల మేర సెమీ హైస్పీడ్ సబర్బన్ రైలు మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. విజయవాడ నుంచి నంబూరు, అటు నుంచి అమరావతి, తిరిగి నంబూరు, అక్కడి నుంచి గుంటూరు, తెనాలి, అటు నుంచి విజయవాడ మీదుగా ఈ రైలు మార్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన డీపీఆర్‌ను రూపొందించే బాధ్యతను ఢిల్లీకి చెందిన అర్బన్ మాస్ ట్రాన్సిట్ కంపెనీకు(యూఎంటీసీ) ఏఎంఆర్‌సీ అప్పగించింది. ఇప్పటికే యూఎంటీసీ సాధ్యాసాధ్యాల(ఫీజిబిలిటీ) నివేదికను తయారు చేసింది. ఈ రైలు మార్గం ఏర్పాటుకు అవసరమైన వ్యయం, భూసేకరణ, నిధుల సమీకరణ, డిజైన్లు తదితర అన్ని వివరాలతో నాలుగైదు నెలల్లో సవివర నివేదిక ఇవ్వనుంది. నంబూరు నుంచి అమరావతి వరకూ 18.5 కిలోమీటర్ల మార్గం ఏర్పాటును ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం రైల్వే శాఖ చేపట్టాల్సి ఉంది. మిగిలిన మార్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం, రైల్వే శాఖ సంయుక్తంగా చేపట్టి, మొత్తం ఖర్చులో 40 శాతాన్ని చెరో సగం భరించనున్నాయి. మిగిలిన 60 శాతం నిధులను ఆర్థిక సంస్థల నుంచి రుణాల రూపంలో సమీకరించేందుకు ప్రణాళిక రూపొందించారు. గతంలో కాగితాలపైనే ప్రణాళికలు విజయవాడ, గుంటూరు, తెనాలి మధ్య అవసరమైన రవాణా సౌకర్యాలు అందుబాటులో లేవు. రాష్ట్ర విభజన తర్వాత ఈ ప్రాంతంలోనే రాజధాని ఏర్పాటు చేయడం, అమరావతికి రాకపోకలు పెరగడంతో ఈ రూట్లకు మరింత ప్రాధాన్యం పెరిగింది. హైస్పీడ్ సబర్బన్ సర్క్యులర్ రైలు ప్రతిపాదన వచ్చినా టీడీపీ ప్రభుత్వం దాన్ని పట్టాలెక్కించేందుకు సరైన ప్రయత్నాలు చేయలేదు. తాజాగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ నాలుగు నగరాలను అనుసంధానిస్తూ సెమీ హైస్పీడ్ సబర్బన్ రైలు సర్వీసు ఏర్పాటుకు సిద్ధమైంది. గతంలో మాదిరిగా కాగితాలకే పరిమితం చేయకుండా, ఆచరణ సాధ్యమయ్యేలా ప్రణాళికలు ప్రతిపాదనలు తయారు చేయించి, అమల్లోకి తెచ్చేందుకు కృషి చేస్తోంది. సెమీ హైస్పీడ్ సబర్బన్ రైలు సర్వీసు ఏర్పాటుపై ముఖ్యమంత్రి తమకు స్పష్టమైన సూచనలు చేశారని, వేగంగా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారని, అందుకనుగుణంగా పని చేస్తున్నట్లు అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి చెప్పారు. -
‘నా చావుకు ఎవరూ కారణం కాదు’
ముంబై : నా చావుకు ఎవరూ కారణం కాదంటూ.. సబర్బన్ రైలులో నుంచి దూకి ఆత్మ హత్య చేసుకున్నాడో యువకుడు. థానేలోని కళ్యాణ్పూర్ స్టేషన్ వద్ద గురువారం చోటు చేసుకుంది ఈ దారుణం. వివరాలు.. రోహిత్ పరదేశి(20) అనే వ్యక్తి కదులుతున్న సబర్బన్ రైలులో నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే ట్రాక్ పక్కన ఇతని తలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు రోహిత్ మృత దేహాన్ని పోస్టు మార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం రాజేష్ సెల్‌ఫోన్‌ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. చనిపోయేముందు అతను వీడియో మెసేజ్‌ని రికార్డ్ చేసినట్లు గుర్తించారు. ఈ మెసేజ్‌లో ‘నా చావుకి ఎవరూ కారణం కాదు.. ఎవరి బలవంతం వల్లనో నేను ఈ నిర్ణయం తీసుకోవడం లేదు. నాకు బతకాలని లేదు. నా తదనంతరం ఆస్తి మొత్తం నా సోదరుడికే చేందుతుంది’ అని వీడియో మెసేజ్‌ని రికార్డ్ చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. -
సబర్బన్ రైల్లో ప్రయాణించిన సీఎం
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సోమవారం సబర్బన్ రైల్లో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. దక్షిణ ముంబైలోని కొలబాలో ఓ కార్యక్రమానికి హాజరైన తర్వాత ఛత్రపతి శివాజీ టెర్మినస్(సీఎస్టీ)లో సాయంత్రం 6.29 నిమిషాలకు కళ్యాణ్ ఫాస్ట్ రైలు ఎక్కారు. ప్రయాణికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రద్దీ సమయంలో రైల్లో ఎక్కిన ముఖ్యమంత్రిని చూసి ప్రయాణికులు ఆశ్చర్యానికి లోనయ్యారు. సీఎంతో మాట్లాడేందుకు ఉత్సాహం చూపించారు. మరికొందరైతే తమ బంధువులకు ఫోన్ చేసి ముఖ్యమంత్రితో మాట్లాడించి ఆనందపడ్డారు. -
రైల్వే బడ్జెట్ సదానందమే
- బెంగళూరులో సబర్బన్ రైలు కోసం అధ్యయనానికి ఆదేశం - రాష్ట్రానికి కొత్తగా నాలుగు ఎక్స్‌ప్రెస్, మూడు ప్యాసింజర్ రైళ్లు - హైస్పీడ్ రైలు సంచారానికి ప్రతిపాదన - బయప్పనహళ్లి వద్ద కోచ్ టెర్మినల్ ఏర్పాటు - ఉత్తరాదితో పాటు దేశంలోని పుణ్యక్షేత్రాలకు కొత్తరైళ్లు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : కేంద్రంలో తొలిసారిగా రైల్వే బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన మంత్రి డీవీ. సదానంద గౌడ తన సొంత రాష్ట్రంపై వరాల జల్లు కురిపించారు. బెంగళూరులో సబర్బన్ రైలును ప్రవేశ పెట్టడంపై అధ్యయనానికి పచ్చ జెండా ఊపారు. రాష్ట్రానికి కొత్తగా నాలుగు ఎక్స్‌ప్రెస్ రైళ్లను, మూడు ప్యాసింజర్ రైళ్లను ప్రకటించారు. మైసూరు-బెంగళూరు-చైన్నై మార్గంలో 160-200 కి.మీ. వేగంతో నడిచే హై-స్పీడ్ రైలును ప్రతిపాదించారు. దీనికి అవసరమైన ఏర్పాట్లను చేసుకున్న తర్వాత ఈ రైలును నడుపుతామని తెలిపారు. గబ్బూరు-బళ్లారి, శివమొగ్గ-శృంగేరి-మంగళూరు, శివమొగ్గ జిల్లాలోని తాళగుప్ప-సిద్ధాపుర, గదగ-హరపనహళ్లి, కుశాలనగర-మడికేరి రైల్వే మార్గాలకు సర్వేను చేపట్టనున్నట్లు ప్రకటించారు. మంగళూరు-ఉళ్లాల-సూరత్కల్ మార్గంలో డబ్లింగ్ పనులను ప్రతిపాదించారు. బెంగళూరు-రామనగర మార్గంలో వారానికి ఆరు రోజుల పాటు మెము సర్వీసులు, బెంగళూరు-నెలమంగల (డెయిలీ), యశవంతపు-హొసూరు మార్గంలో వారానికి ఆరు రోజులు డెము సర్వీసులను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. ఇంకా..కామాక్య-బెంగళూరు ప్రీమియం ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-మంగళూరు (డెయిలీ), బెంగళూరు-శివమొగ్గ (బై వీక్లీ), బీదర్-ముంబై (వీక్లీ), టాటా నగర్-బెంగళూరు (వీక్లీ) ఎక్స్‌ప్రెస్‌లను ప్రవేశ పెట్టనున్నట్లు వెల్లడించారు. ధార్వాడ-దండేలి, బైందూరు-కాసరగోడు, యశవంతపుర-తుమకూరుల మధ్య రోజూ ప్యాసింజర్ రైళ్లను నడపనున్నట్లు తెలిపారు. నగర శివారులోని బయప్పనహళ్లి వద్ద కోచ్ టెర్మినల్‌ను నెలకొల్పనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రం నుంచి ఉత్తరాదితో పాటు దేశంలోని పుణ్య క్షేత్రాలకు పలు కొత్త రైళ్లను ప్రకటించారు. ఎంపీ హర్షం రైల్వే బడ్జెట్లో బెంగళూరు సబర్బన్ రైలును ప్రతిపాదించడం హర్షణీయమని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ రాజీవ్ గౌడ పేర్కొన్నారు. కేవలం అధ్యయనం మాత్రమే కాకుండా ప్రయోగాత్మకంగా ఓ రైలు సర్వీసును కూడా ప్రకటించి ఉండే బాగుండేదని తెలిపారు. సబర్బన్ రైలు వల్ల ఎన్నో ఉపయోగాలున్నందున, ఈ ప్రతిపాదనను ప్రతి బడ్జెట్లో పేర్కొనడం ద్వారా త్వరితగతిన పూర్తి చేసి నగర వాసుల కలను సాకారం చేయాలని కోరారు. అసంతృప్తికరం బెంగళూరు-గుత్తి రైలు మార్గం డబ్లింగ్ పనులను బడ్జెట్లో ప్రతిపాదించక పోవడం పట్ల ఆలిండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సీ. సునిష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. హై-స్పీడ్ రైళ్లు అత్యంత వ్యయభరితవైనవని, కాంట్రాక్టర్ల పాలిట కల్పతరువులా మారే ఈ ప్రాజెక్టు ప్రభుత్వానికి ఐరావతంలా తయారవుతుందని హెచ్చరించారు. ప్రాథమిక సదుపాయాల కల్పనకు బడ్జెట్లో సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన పెదవి విరిచారు. రైల్వే మంత్రికి కృతజ్ఞతలు కుశాల నగర-మడికేరి రైల్వే మార్గం సర్వేను బడ్జెట్లో ప్రతిపాదించడం పట్ల మైసూరు ఎంపీ ప్రతాప్ సింహ హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే మైసూరు-కుశాల నగర సర్వే పూర్తయినందున, అక్కడి నుంచి మడికేరికి పొడిగించాలన్న తన విజ్ఞప్తిని మన్నించినందుకు రైల్వే మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ రైల్వే మార్గం నిర్మాణం పూర్తయితే, మైసూరు, కొడగు జిల్లాల్లో పర్యాటక రంగం ఎంతగానే అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. -
సబర్బన్‌కు రైలు
బెంగళూరుతో పాటు చుట్టు పక్కల జిల్లాలకూ రైళ్లు రూ. 10 వేల కోట్లతో ప్రాజెక్టు.. నిధుల సేకరణపై పరిశీలన 12న రైల్వే బడ్జెట్.. పెండింగ్ ప్రాజెక్టులకు ప్రాధాన్యత రైల్వే శాఖ మంత్రి మల్లిఖార్జున ఖర్గే సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ముంబై, చెన్నై తదితర నగరాల్లో మాదిరే బెంగళూరులో సబర్బన్ రైలును ప్రవేశ పెడతామని రైల్వే శాఖ మంత్రి మల్లిఖార్జున ఖర్గే తెలిపారు. నగరంతో పాటు చుట్టు పక్కల జిల్లాలను కూడా ఈ ప్రాజెక్టులో చేర్చుతామని వెల్లడించారు. ఇక్కడి బాణసవాడిలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన బెంగళూరు సిటీ-నాగర్‌కోయిల్, యశవంతపుర-కామాక్యలకు కొత్త రైళ్లతో పాటు సర్జాపుర వద్ద నిర్మించిన ఫ్లైవోవర్, బెంగళూరు రైల్వే స్టేషన్లో నెలకొల్పిన ఎస్కలేటర్లను ప్రారంభించి ప్రసంగించారు. మైసూరు, మండ్య, చిక్కబళ్లాపురం, తుమకూరులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను కూడా రైల్వే సబర్బన్ కింద చేర్చామని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు రూ.10 వేల కోట్ల అవసరమని, నిధులను ఏ విధంగా సమీకరించాలనే విషయమై పరిశీలన జరుగుతోందని వివరించారు. దీని కోసం మహారాష్ట్రలో మాదిరే రైల్వే వికాస్ కార్పొరేషన్‌ను స్థాపిస్తామని వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంలో సబర్బన్ రైలు ప్రాజెక్టును చేపడతామని, దీనిపై రైల్వే ఇంజనీర్లు, రైల్వే బోర్డు సభ్యులతో చర్చించామని వివరించారు. ఈ నెల 12న రైల్వే బడ్జెట్ ఉందంటూ, లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నందున ఓటాన్ అకౌంట్‌ను ప్రవేశ పెడతానని చెప్పారు. ఇందులో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులో ప్రాధాన్యతనిస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రూ. 23,125 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు రామలింగా రెడ్డి, కేజే. జార్జ్, ఎంపీ డీబీ. చంద్రే గౌడ, డిప్యూటీ మేయర్ ఇందిర, బీబీఎంపీ సభ్యులు కోదండ రెడ్డి, ఆర్. రాజేంద్రన్ ప్రభృతులు పాల్గొన్నారు. -
రైలు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి
ముంబై: రైలు పట్టాలను దాటుతున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు సబర్బన్ రైలు ఢీకొట్టడంతో మరణించారు. రాజస్థాన్‌కు చెందిన వీరు భుసావల్ ప్యాసింజర్‌లో ముంబైకి వచ్చారు. రైలు బైకుల్లా స్టేషన్ సమీపంలో ఆగడంతో అక్కడే దిగిపోవాలని నిర్ణయించుకొని దిగిపోయారు. వీరు పట్టాలు దాటుతుండగా ఆ ట్రాక్ మీద వచ్చిన సబర్బన్ రైలు ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడిక్కడే మరణించారు. ఈ సమాచారం అందగానే సీఎస్టీ రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి విచారణ జరపగా మృతులు రాజస్థాన్ భుసావల్‌కు చెందిన వారని తేలింది. మృతులను హుస్సేన్ అబ్దుల్ అలియాస్ హుస్సేన్ హవల్దార్ (60) ఆయన భార్య ఫాతిమా హుస్సేన్ (50), వారి కూతురు జహరా హుస్సేన్ (30)గా గుర్తించారు. వసింద్‌లో నివసించే వారి బంధువుల వద్దకు వెళ్లాలని వచ్చిన వీరు వాస్తవానికి సీఎస్టీలో దిగాల్సి ఉంది. కానీ రైలు ఆగడంతో చివరి నిమిషంలో బైకుల్లా సమీపంలోనే దిగిపోయారు. పోలీసులు ఈ సమాచారాన్ని వారి బంధువులకు అందించారు. అయితే వారు రైల్వే అధికారుల నిర్వహణ లోపం వల్లనే తమవారు మరణించారని ఆరోపించారు. సీఎస్టీలో ఆగాల్సిన రైలు బైకుల్లా సమీపంలో అర్ధగంటకు పైగా నిలుపుతున్నారు.దీంతో ప్రయాణికులు అర్ధంతరంగా దిగి రైలు పట్టాలకు అడ్డంగా దాటి వెళ్తుంటారు. ఈ కారణంగానే తమ బంధువులు మరణించారని మృతుల బంధువులు విమర్శించారు.