- బెంగళూరుతో పాటు చుట్టు పక్కల జిల్లాలకూ రైళ్లు
- రూ. 10 వేల కోట్లతో ప్రాజెక్టు.. నిధుల సేకరణపై పరిశీలన
- 12న రైల్వే బడ్జెట్.. పెండింగ్ ప్రాజెక్టులకు ప్రాధాన్యత
- రైల్వే శాఖ మంత్రి మల్లిఖార్జున ఖర్గే
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ముంబై, చెన్నై తదితర నగరాల్లో మాదిరే బెంగళూరులో సబర్బన్ రైలును ప్రవేశ పెడతామని రైల్వే శాఖ మంత్రి మల్లిఖార్జున ఖర్గే తెలిపారు. నగరంతో పాటు చుట్టు పక్కల జిల్లాలను కూడా ఈ ప్రాజెక్టులో చేర్చుతామని వెల్లడించారు. ఇక్కడి బాణసవాడిలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన బెంగళూరు సిటీ-నాగర్‌కోయిల్, యశవంతపుర-కామాక్యలకు కొత్త రైళ్లతో పాటు సర్జాపుర వద్ద నిర్మించిన ఫ్లైవోవర్, బెంగళూరు రైల్వే స్టేషన్‌లో నెలకొల్పిన ఎస్కలేటర్‌లను ప్రారంభించి ప్రసంగించారు.
మైసూరు, మండ్య, చిక్కబళ్లాపురం, తుమకూరులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను కూడా రైల్వే సబర్బన్ కింద చేర్చామని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు రూ.10 వేల కోట్ల అవసరమని, నిధులను ఏ విధంగా సమీకరించాలనే విషయమై పరిశీలన జరుగుతోందని వివరించారు. దీని కోసం మహారాష్ట్రలో మాదిరే రైల్వే వికాస్ కార్పొరేషన్‌ను స్థాపిస్తామని వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంలో సబర్బన్ రైలు ప్రాజెక్టును చేపడతామని, దీనిపై రైల్వే ఇంజనీర్లు, రైల్వే బోర్డు సభ్యులతో చర్చించామని వివరించారు.
ఈ నెల 12న రైల్వే బడ్జెట్ ఉందంటూ, లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నందున ఓటాన్ అకౌంట్‌ను ప్రవేశ పెడతానని చెప్పారు. ఇందులో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులో ప్రాధాన్యతనిస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రూ. 23,125 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు రామలింగా రెడ్డి, కేజే. జార్జ్, ఎంపీ డీబీ. చంద్రే గౌడ, డిప్యూటీ మేయర్ ఇందిర, బీబీఎంపీ సభ్యులు కోదండ రెడ్డి, ఆర్. రాజేంద్రన్ ప్రభృతులు పాల్గొన్నారు.