Pending project
-
గోదావరి జలాలతో సస్యశ్యామలం
సాక్షి ప్రతినిధి, వరంగల్: గోదావరి జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం ద్వారా ఆయకట్టు భూములను సస్యశ్యామలం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రాజెక్టుల కోసం భూసేకరణ, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తిపై ఆదివారం హన్మకొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రులతో పాటు సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఈఎన్సీ మురళీధర్‌రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, రాజ్యసభ సభ్యులు బండా ప్రకాష్, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు డాక్టర్ టి.రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి ఇందులో పాల్గొన్నారు. మంత్రులు మాట్లాడుతూ 5.18 టీఎంసీల సామర్థ్యంతో 1,22,700 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు దేవాదుల ప్రాజెక్టుకు రూపకల్పన చేయగా.. ఆ మేరకు పూర్తి చేయకుండా నాటి పాలకులు నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో దేవాదుల ప్రాజెక్టును పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. జనగామ జిల్లా ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణను పూర్తి చేయాలని సూచించారు. ఎత్తైన ప్రదేశంలో ఉన్న వేలేరుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, పాలకుర్తి, ఘన్‌పూర్‌లో ఆగిన 6వ ప్యాకేజీ పనులు ప్రారంభించాలని చెప్పారు. మధ్యలోనే వెళ్లిపోయిన ముత్తిరెడ్డి దేవాదులపై సమీక్ష సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. చెరువులకు నీటి విడుదల సంబంధిత సమస్యలను స్మితా సబర్వాల్‌కు ముత్తిరెడ్డి వివరిస్తూ అధికారుల తీరుపై విమర్శలు చేశారు. దీంతో మంత్రి ఎర్రబెల్లి ఆయన్ను వారించారు. ఇందుకు నిరసనగా ఎమ్మెల్యే సమావేశం నుంచి వాకౌట్ చేశారు. -
ఎంఎంటీఎస్ రెండో దశకు అడ్డంకులు తొలగించాలి
- నిలిచిన సనత్‌నగర్-మౌలాలి రైల్వే లైను డబ్లింగ్ పనులు - పెండింగ్ ప్రాజెక్ట్‌లపై పార్లమెంటరీ స్థాయీ సంఘం నివేదిక సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ (ఎంఎంటీఎస్) రెండో దశ అమలులో జాప్యంపై రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన పార్లమెంటరీ స్థాయీ సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 2012-13 లో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి అడ్డంకిగా ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ప్రాజెక్ట్‌ల అమలు, పర్యవేక్షణ విభాగాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ క్రియాశీలకం చేయాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం సూచించింది. దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్ట్‌లపై పార్లమెంటరీ స్థాయీ సంఘం ఇటీవల లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు నివేదిక సమర్పించింది. 2012-13లో రూ.272 కోట్ల అంచనా వ్యయంతో ఎంఎంటీఎస్ రెండో దశను ప్రారంభించగా గత మార్చి నెలాఖరు వరకూ రూ. 58.30 కోట్ల మేరకు వ్యయం చేశారు. అయితే ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా ఉన్న సనత్‌నగర్-మౌలాలి మధ్య 21.5 కిలోమీటర్ల రైల్వే లైను డబ్లింగ్ పనులు నవంబర్ 2014 నుంచి నిలిచిపోయాయి. రక్షణ మంత్రిత్వ శాఖ అధీనంలో ఉన్న ఒకప్పటి రైఫిల్ రేంజ్లో ఉన్న 4 కిలోమీటర్ల మేరకు పనులను రక్షణ శాఖ అధికారులు నిలిపివేశారు. ఈ ప్రాజెక్ట్ అమలుకు అనువుగా ప్రత్యామ్నాయంగా రైఫిల్ రేంజ్ ఏర్పాటు కోసం రూ.1.18 కోట్ల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి 1979 లోనే రైల్వే మంత్రిత్వ శాఖ అందించింది. అయితే 1990 లో 37 ఎకరాల 32 కుంటల భూమిని రెవెన్యూ అధికారులు సేకరించారని, అందుకు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు అంగీకరించ లేదని.. అంతేకాకుండా గత 35 సంవత్సరాలుగా రైఫిల్ రేంజ్ వాడుకలో లేదని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపిందని పార్లమెంటరీ స్థాయీ సంఘం నివేదికలో పేర్కొంది. ఈ సమస్యపై గత జూలై 15 వ తేదీన రక్షణ శాఖ మంత్రితో రైల్వే శాఖ మంత్రి చర్చించారని, నిలిచిపోయిన పనులను ప్రారంభించడానికి అనుమతించాలని ఒక లేఖ కూడా రాశారని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమస్య పరిష్కారమయ్యే వరకూ ఎంఎంటీఎస్ రెండో దశ ఎప్పటికల్లా పూర్తవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడిందని రైల్వే అధికారులు అందించిన సమాచారం వల్ల అర్థమవుతోందని స్థాయీ సంఘం అభిప్రాయపడింది. ఈ సమస్య పరిష్కారానికి ఉన్నత స్థాయి చర్చలు జరిగాయని, అందువల్ల ప్రాజెక్ట్‌ల అమలు, పర్యవేక్షణ విభాగం చొరవ తీసుకొని ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తయ్యే విధంగా ప్రతిబంధకాలు తొలగించాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం సూచించింది. -
పెండింగ్ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి
కర్నూలు(అర్బన్) : కృష్ణా నది నుంచి ప్రతి ఏడాది వృథాగా సముద్రంలో కలుస్తున్న 72 టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకునేందుకు పెండింగ్ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు చెప్పారు. జిల్లాలోని ప్రాజెక్టులను పరిశీలించేందుకు ఆయన గురువారం ఉదయం కర్నూలుకు వచ్చారు. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతు శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను పోతిరెడ్డిపాడు ద్వారా 44 వేల క్యూసెక్కుల నీటిని ఎస్ఆర్బీసీ, తెలుగుగంగ, అవుకు, గాలేరు-నగరి, బానకచెర్ల రిజర్వాయర్ల నుంచి గండికోట వరకు మళ్లించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ నేపథ్యంలోనే ఎస్ఆర్బీసీ కాలువను వెడల్పు చేస్తున్నామన్నారు. అలాగే కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని రైతులకు ఉపయోగపడుతున్న హంద్రీనీవా సుజల స్రవంతి ఫేజ్-1, 2 పనులను పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఈ పనులు పూర్తి అయితే ఆయా జిల్లాల్లోని రైతులకు సాగునీరు, తాగునీటి అవసరాలు తీరనున్నాయని తెలిపారు. తెలుగుగంగ, తుంగభద్ర దిగువ కాలువల్లో చేపడుతున్న పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. వ్యవసాయం, జలవనరులకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో వున్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు రూ.17,969 కోట్లు అవసరమవుతాయని నీటి పారుదల రంగ నిపుణులు నివేదికలు అందించారని చెప్పారు. ఈ కమిటీ రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు నెలల పాటు క్షేత్ర స్థాయిలో పర్యటించి నివేదికలు అందించాయన్నారు. చెరువుల్లో పూడికతీతకు ప్రతి జిల్లాకు రూ.10 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నీరు - చెట్టు కార్యక్రమానికి సంబంధించి ప్రతి జిల్లాకు రూ.10 కోట్లను మంజూరు చేశామని మంత్రి దేవినేని చెప్పారు. ఇప్పటికే మొదటి విడతగా ప్రతి జిల్లాకు రూ.5 కోట్లను విడుదల చేశామన్నారు. ఈ కార్యక్రమం కింద చెరువుల్లో పూడికతీత పనులు చేపడతారన్నారు. చెరువుల్లో తీసిన పూడిక మట్టిని రైతులు ఉచితంగా తమ పొలాలకు తీసుకువెళ్లవచ్చన్నారు. ఈ కార్యక్రమం పూర్తి అయితే ఆయా చెరువుల్లో ఎక్కువ మోతాదులో వర్షపు నీరు నిల్వ వుంటుందన్నారు. పనులు చేపట్టని పాత ఏజెన్సీలపై క్లాజ్-61 ప్రయోగం జిల్లాలో పలు ప్రాజెక్టుల కింద పెండింగ్‌లో వున్న పనులకు సంబంధించి వివిధ కారణాల వల్ల పనులు చేయలేక చేతులెత్తేసిన ఆయా ఏజెన్సీలే పనులను పూర్తి చేయాల్సి ఉందని మంత్రి పేర్కొన్నారు. ఇందుకు ప్రభుత్వం జీఓ నెంబర్‌ను 22ను విడుదల చేసిందని చెప్పారు. ఒకవేళ చేపట్టిన పనులను పూర్తి చేసేందుకు ఆయా ఏజెన్సీలు ముందుకు రాని పక్షంలో క్లాజ్-61ను ప్రయోగిస్తామని హెచ్చరించారు. అలాగే వారి నుంచి అపరాధ రుసుము వసూలు చేయడంతో పాటు వెంటనే షార్ట్ టెండర్లను పిలిచి పనులను అప్పగిస్తామన్నారు. పెండింగ్‌లో వున్న పనులను పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి చెప్పారు. ఈ సమావేశంలో జిల్లాపరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్, జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్, ఎస్పీ ఆకె రవికృష్ణ, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, నీటి పారుదల శాఖ ఈఎన్సీ వెంకటేశ్వరరావు, సీఈ జీ చిట్టిబాబు, ఎస్ఈ కే శ్రీనివాసరావు, హెచ్ఎన్ఎస్ఎస్ సీఈ జలంధర్, ఎస్ఈ శ్యాంసుందరం, తెలుగుగంగ ఎస్ఈ సన్యాసినాయుడుతో పాటు ఈఈ, డీఈఈలు పాల్గొన్నారు. -
కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయండి
రెండు రాష్ట్రాల్లో పెండింగ్ ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తిచేయండి వచ్చే బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించండి కొత్త ప్రాజెక్టుల మంజూరులోనూ ఉదారంగా వ్యవహరించండి రైల్వే మంత్రికి వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం వినతి సురేష్ ప్రభుతో పార్టీ అధ్యక్షుడు జగన్, ఎంపీల భేటీ సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభును కోరింది. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేసింది. రైల్వే బడ్జెట్లో ఈ మేరకు తగినన్ని నిధులు విడుదల చేయాలని విన్నవించింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో.. పార్టీ పార్లమెంటరీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వెలగపల్లి వరప్రసాద్‌రావు, బుట్టా రేణుక, పీవీ మిథున్‌రెడ్డి, వై.ఎస్.అవినాష్‌రెడ్డిలతో కూడిన బృందం సోమవారం రైల్వేభవన్‌లో మంత్రిని కలిసింది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఒక వినతిపత్రం సమర్పించింది. అందులోని ముఖ్యాంశాలు.. ‘‘రైల్వేకు సంబంధించిన కొత్త ప్రాజెక్టులు, రైళ్లు, లైన్లు, డివిజన్ల మంజూరు విషయంలో, అమలులో ఉన్న ప్రాజెక్టులకు బడ్జెట్ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే శాఖ ఏటా మొండిచెయ్యి చూపుతుండడంతో చాలా ఏళ్లుగా రాష్ట్ర ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మంజూరైన ప్రాజెక్టులకు కూడా అరకొరగా నిధులు కేటాయించడంతో అవి ఏళ్లుగా పెండింగ్‌లోనే ఉన్నాయి. 2014-15 రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి తన ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులను ప్రస్తావించారు. ‘ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం రూ.20,680 కోట్ల అంచనా వ్యయం కలిగిన 29 ప్రాజెక్టులు ప్రస్తుతం అమలులో ఉన్నాయి. రెండు కొత్త రాష్ట్రాల అధికారులతో సమన్వయ సమావేశాలు జరిపి వాటి అవసరాలను తెలుసుకుని వాటిని పరిగణనలోకి తీసుకుంటాం..’ అని పేర్కొన్నారు. ఇంత స్పష్టంగా హామీ ఇచ్చినప్పటికీ.. మాకు తెలిసినంతవరకు రైల్వే శాఖ ఈ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఈ ప్రాజెక్టుల అమలులో ఇప్పటికే తీవ్ర జాప్యం జరిగింది. ఇప్పటికైనా ఈ పరిస్థితిని చక్కదిద్దాలని ఏపీ ప్రజలు కోరుతున్నారు. ప్రత్యేక దృష్టితో మా రాష్ట్రంలో రైల్వే నెట్‌వర్క్‌ను అభివృద్ధి పరచడం ద్వారా రైల్వేల పరంగా వెనుక బాటుతనం నుంచి మమ్మల్ని బయటకు తెస్తారని ఆశిస్తున్నాం. 2015-16 రైల్వే బడ్జెట్ సందర్భంగా మా రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు మంజూరు చేయడంలోనూ, ఉన్న ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయడంలోనూ ఉదారంగా వ్యవహరించాలని కోరుతున్నాం. విశాఖపట్నం రైల్వే డివిజన్‌ను దక్షిణ మధ్య రైల్వే పరిధిలో చేర్చాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. కానీ అది నెరవేరలేదు. అయితే ఆంధ్రప్రదేశ్ పునర్వ వ్యవస్థీకరణ చట్టం-2014లోని 13వ షెడ్యూలు సీమాంధ్రలో కొత్త రైల్వే జోన్ ఏర్పాటుకు హామీ ఇచ్చింది. ఏపీ కొత్త రాజధాని నుంచి హైదరాబాద్‌కు, తెలంగాణలోని ముఖ్యమైన నగరాలకు ర్యాపిడ్ రైల్ అండ్ రోడ్ కనెక్టివిటీ ఏర్పాటుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని కూడా 13వ షెడ్యూలు పేర్కొంది. కానీ ఇంతవరకు ఆ దిశగా అడుగు వేయలేదు. బెంగళూరు, కడప మధ్య రైల్వే లైన్ లింక్‌కు చాలినంత నిధులు కేటాయించకపోవడంతో దాని నిర్మాణం నత్తనడకన సాగుతోంది. ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేసేందుకు రానున్న రైల్వే బడ్జెట్లో గరిష్ట మొత్తంలో నిధులు కేటాయించాలని కోరుతున్నాం. వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమలోని వెనుకబడిన ప్రాంతాలైన వైఎస్సార్, చిత్తూరు జిల్లాల అభివృద్ధిలో ఈ రైల్వే లైను కీలకపాత్ర పోషిస్తుంది. 2013 రైల్వే బడ్జెట్లో ప్రొద్దుటూరు, కంభం (వయా మైదుకూరు, పోరుమామిళ్ల) మధ్య రైల్వే లైను మంజూరు చేశారు. కానీ ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదు. బెంగళూరు, గుంటూరు, విజయవాడల మధ్య దూరాన్ని తగ్గించేందుకు ఈ లైను చాలా ఉపయోగపడుతుంది. అలాగే బొగ్గు, ఐరన్ ఓర్, జిప్సం, సిమెంట్ రవాణాకు ఉపకరిస్తుంది. మిర్యాలగూడ, జగ్గయ్యపేట మధ్య కొత్త రైల్వే లైను పనులు షెడ్యూలుకు అనుగుణంగా జరగడం లేదు. గత బడ్జెట్లలో తగినన్ని నిధులు మంజూరు కాకపోవడమే ఇందుకు కారణం. ఈ లైను పూర్తయితే ఈ ప్రాంతంలో ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుంది. బియ్యం, ఖనిజ వనరులకు ఆలవాలంగా ఉన్న ఈ రెండు పట్టణాలు.. ఈ రైల్వే లైను పూర్తయితే దేశంలోని ఇతర ప్రాంతాల్లో తమ వర్తకాన్ని మెరుగుపరుచుకోగలుగుతాయి. శ్రీకాళహస్తి, ప్రకాశం, గుంటూరు, నల్గొండ జిల్లాలను కలిపే నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైను సామాజికంగా, ఆర్థికంగా వాంఛనీయమైన ప్రాజెక్టు. గత రాష్ట్ర ప్రభుత్వం, రైల్వే శాఖ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును పూర్తిచేయాలని భావించాయి. తుపాన్ల వేళ అంతరాయం ఏర్పడే కోల్‌కతా-చెన్నై వయా విజయవాడ మార్గానికి ఇది ప్రత్యామ్నాయంగా కూడా ఉపయోగపడుతుంది. 2013 మేలో రాష్ట్ర ప్రభుత్వం ఈ మార్గానికి స్థలాన్ని ఉచితంగా సేకరించి ఇస్తామని, ప్రాజెక్టు వ్యయంలో 50 శాతం భరిస్తామని చెప్పింది. అయినప్పటికీ ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. ఈ ప్రాజెక్టులన్నిటికీ తగిన నిధులు కేటాయించాలని కోరుతున్నాం. ప్రస్తుతం ఎర్రగుంట్ల-నంద్యాల సెక్షన్లో ఎర్రగుంట్ల-బనగానపల్లి మధ్య ట్రాక్, సిగ్నలింగ్ పనులు స్టేషన్, మౌలిక వసతుల ఏర్పాటు పూర్తయ్యాయి. ట్రయల్ రన్ కూడా పూర్తయింది. కానీ ఎర్రగుంట్ల నుంచి నంద్యాలకు రైళ్లు నడిపించేందుకు ఈ 93 కి.మీ. రైల్వే మార్గాన్ని ఉపయోగించుకోవడం లేదు. ఇందుకు కారణం మరో 30 కి.మీ. ట్రాక్ అసంపూర్ణంగా ఉంది. దీనిని 2015 మార్చి కల్లా పూర్తి చేయాల్సి ఉంది. ఇందుకు రూ. 100 కోట్లు కూడా కేటాయించారు. ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేసేందుకు అధికారులకు తగిన సూచనలు ఇవ్వగలరు. రానున్న బడ్జెట్లో బనగానపల్లి కర్నూలు మధ్య కొత్త రైల్వే లైను మంజూరు చేయాలని కోరుతున్నాం. ఈ లైన్ మంజూరై, ఎర్రగుంట్ల-నంద్యాల లైన్ నిర్మాణం పూర్తయితే తిరుపతి-హైదరాబాద్ మధ్య ఉన్న దూరం దాదాపు 130 కి.మీ. మేర తగ్గుతుంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలు ఖనిజ సంపదతో కూడుకున్నవి. భారీగా సిమెంట్ పరిశ్రమలు నెలకొన్న ప్రాంతం ఇది. ఈ పరిశ్రమలకు అవసరమైన ముడి సరుకును ఈ కొత్త రైల్వే లైను మార్గం ద్వారా రవాణా చేసుకునే వీలు కలుగుతుంది. రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటుకు అవసరమైన బొగ్గును కూడా ఈ మార్గం ద్వారా రవాణా చేసుకోవచ్చు. సరిపడా నిధులు మంజూరు కాక భద్రాచలం-కొవ్వూరు రైల్వే లైన్ పెండింగ్‌లో ఉంది. దీని నిర్మాణం పూర్తయితే హైదరాబాద్-వైజాగ్ మధ్య దూరం 130 కి.మీ. మేర తగ్గుతుంది. బొగ్గు నిల్వలు విస్తారంగా ఉన్న కొత్తగూడెం, ఇల్లెందు, పాల్వంచ తదితర ప్రాం తాలను ఈ రైల్వే మార్గం దేశంలోని తూర్పు ప్రాంతాలతో కలుపుతుంది. పుణ్యక్షేత్రమైన భద్రాచలంను యాత్రికులు సులభంగా దర్శించుకునేందుకు వీలు కలుగుతుంది. తుపాన్ల వేళ ఈ మార్గం ప్రత్యామ్నా య మార్గంగా కూడా ఉపయోగపడుతుంది. అందువల్ల ఈ ప్రాజెక్టుకు కూడా అధిక నిధులు కేటాయించి షెడ్యూలు ప్రకారం పూర్తిచేయాలని కోరుతున్నాం. తెలంగాణ వ్యాప్తంగా రైల్వే ఓవర్ బ్రిడ్జీలు, రైల్వే అండర్ బ్రిడ్జీలు మంజూరు చేయాల్సిన అవసరం ఉంది. ప్రమాదాల నివారణకు, ట్రాఫిక్ రద్దీని తట్టుకునేందుకు ఇవి ఉపయోగపడతాయి. అందువల్ల వీటిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం..’’ -
ఐదేళ్లలో పెండింగ్ ప్రాజెక్ట్‌లకు మోక్షం
సీఎం సిద్దరామయ్య గంగావతి : ఐదేళ్ల అధికార కాలంలో తమ ప్రభుత్వం రూ.5,800 కోట్ల నిధులు కేటాయించి పెండింగ్ ప్రాజెక్ట్‌లు పూర్తి చేసే లక్ష్యంతో పని చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య పేర్కొన్నారు. మంగళవారం కనకగిరి గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ఆయన పాల్గొని వేలాది మంది ప్రజలనుద్దేశించి మాట్లాడారు. తాము అధికారం చేపట్టిన ఒకటిన్నర ఏడాది కాలంలో రూ.2,300 కోట్లు సాగునీరు ప్రాజెక్టుల కోసం నిధులు అందించామని, మిగిలిన మూడున్నర ఏళ్లలో ఏటా రూ.1300 కోట్లు ప్రకారం సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధులు విడుదల చేశామని వెల్లడించారు. రాష్ట్రంలో హాస్టల్ వసతి కల్పించని 50 వేల మంది పేద విద్యార్థులకు నెలకు రూ.1000లు చొప్పున ఏడాదికి రూ.12 వేలు కల్పించామన్నారు. రాష్ట్రంలో పౌష్టికలోపం ఉన్న 46 వేల మంది విద్యార్థులు ఉన్నారని, వీరికి పౌష్టికత కల్పించేందుకు పాలు, పండ్లు, గుడ్లు, అందిస్తున్నామని, తద్వారా 15 వేల మంది పౌష్టికత పొందారని తెలిపారు. గతంలో నిర్మించిన ఆశ్రయ ఇళ్ల బాకీ 2448 కోట్ల పేదలకు ఒకేసారి మాఫీ చేసిన ఘనత తమ ప్రభుత్వానికే చెందిందన్నారు. తుంగభద్ర డ్యాంలో 30 టీఎంసీల నీటి పరిమాణం సమానంగా పూడిక పేరుకుని, 2 లక్షల ఎకరాలకు సాగునీటి కొరత సంభవించిందని, దీన్ని పూడిక తీయడం సాధ్యం కాదని దీనికి ప్రత్యమ్నాయ పథకాన్ని రూపొందించి సాగునీరు అందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం యోచిస్తుందన్నారు. రూ.144 కోట్ల నిధులతో చెరువులకు నీరు నింపే పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో చెరుకు, మొక్కజొన్నలకు మద్దతు ధర కల్పించాలన్నారు. సీఎం సిద్దరామయ్య 11 గంటలకు గిణిగెరకు ప్రత్యేక విమానంలో ఎంఎస్‌పీఎల్ విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గంలో గంగావతి మీదుగా సిద్దాపుర చేరుకుని నూతన బస్టాండ్‌కు ప్రారంభోత్సవం నెరవేర్చి కారటగి మీదుగా నవలి గ్రామం చేరుకుని రైస్ టెక్నాలజీ పార్కుకు శంకుస్థాపన కార్యక్రమాన్ని నెరవేర్చి అనంతరం కనకగిరి చేరుకుని, పూర్తరుున తాగునీటి పనులకు, రహదారుల నిర్మాణాలు, పలు పథకాలకు ప్రారంభోత్సవాలను, శంకుస్థాపనలను చేసి వేదికపై పాల్గొన్నారు. వేదికపై రాష్ట్ర మంత్రులు హెచ్‌కే.పాటిల్, డీకే.శివకుమార్, కొప్పళ జిల్లా ఇన్చార్జి మంత్రి శివరాజ్ తంగడిగి, ఎమ్మెల్యేలు ఇక్బాల్ అన్సారీ, రాఘవేంద్ర హిట్నాళ్, దొడ్డనగౌడ పాటిల్, ఎంపీ కరడి సంగణ్ణ, ఎమ్మెల్సీ హాలప్ప ఆచార్, జెడ్పీ అధ్యక్షుడు అమరేశ్ కుళగి, మాజీ మంత్రి సాలోణి నాగప్ప, మల్లికార్జున నాగప్ప, జిల్లా కలెక్టర్ ఆర్ఆర్.జన్ను, తాలూకా పంచాయతీ అధ్యక్షురాలు ఈరమ్మలు పాల్గొన్నారు. -
పాలమూరు అభివృద్ధికి పెద్దపీట
శాంతినగర్/మానవపాడు: వచ్చే ఐదేళ్లలో పాలమూరు జిల్లా అభివృద్ధికి పెద్దపీట వేస్తామని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. వచ్చే ఖరీఫ్ సీజన్‌నాటికి జిల్లా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసి తద్వారా ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు యుద్ధప్రాతిపదికన పనులు చేపడతామని వెల్లడించారు. మంగళవారం ఆయన వడ్డేపల్లి, మానపాడు మండలాల్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా శాంతినగర్‌లో మాజీ ఎంపీ మందా జగన్నాథం అధ్యక్షతన జరిగిన బహిరంగసభలో మంత్రి ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తరువాత కూడా సీమాంధ్రుల శని మాత్రం వీడటం లేదన్నారు. ఆర్డీఎస్ ఆయకట్టు కింద ఉన్న 87,500 ఎకరాలకు సాగునీరందిస్తామని, ఆనకట్టదగ్గర సీఆర్పీఎఫ్, కేంద్ర బలగాలను మోహరింపజేసైనా ఆనకట్ట అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. బచావత్ తీర్పు ప్రకారం ఆర్డీఎస్ను నీటివాటాను అలంపూర్ వాసులకు అందించేందుకు సీఎం కేసీఆర్ అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. అదేవిధంగా తుమ్మిళ్ల గ్రామం వద్ద ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేస్తే 26వేల ఎకరాలకు సాగునీరందే అవకాశం ఉందని ప్రముఖులు తెలిపారని, ఆ పనుల నివేదికను తయారుచేసేందుకు అధికారులకు ఆదేశాలు జారీచేశామన్నారు. మరోసారి పాలమూరు జిల్లాకు వచ్చి మూడురోజులపాటు ఇక్కడే ఉండి పర్యటించి ప్రత్యేకమైనా బడ్జెట్ కేటాయించి పాల మూరుకు ఉన్న వలస జిల్లా పేరును రూపుమాపుతామని పునరుద్ఘాటించారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చుతామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పామని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన అలంపూర్ చౌరస్తా నుంచి అయిజ వరకు బీటీ డబుల్‌రోడ్డు నిర్మాణానికి రూ.38 కోట్ల నిధులు కేటాయించినట్లు మంత్రి చెప్పారు. పూర్తిస్థాయిలో శాంతినగర్‌కు చేరుకున్న మంత్రి హరీశ్వర్‌రావు ముందుగా రామాలయ చౌరస్తాలో ఉన్న అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. శాంతినగర్ నుంచి అయిజ మం డలం తుమ్మలపల్లి వరకు రూ.22.32 కోట్లతో మంజూరైన ఆర్అండ్బీ రోడ్డు పనులకు శంకుస్థాపనచేశారు. టీఆర్ఎస్లో చేరిక.. వడ్డేపల్లి మండల జెట్పీటీసీ సభ్యురాలు వెంకటేశ్వరమ్మ, ఎంపీపీ ఎన్.సుజాతమ్మ, వైస్ ఎంపీపీ శ్రీనివాసులు, మరో 13 మంది ఎంపీటీసీ సభ్యులు, 14 మంది సర్పంచ్‌లు మంత్రి హరీశ్‌రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో జెడ్పీ చైరపర్సన్ బండారి భాస్కర్, ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, సి.లక్ష్మారెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, గువ్వలబాలరాజు, మర్రి జనార్దన్‌రెడ్డి, అంజయ్య యాదవ్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విఠల్‌రావుఆర్యా, మందా శ్రీనాథ్, జిల్లాలీగల్సెల్ కన్వీనర్ విష్ణువ ర్దన్‌రెడ్డి, గద్వాల ఇన్చార్జి కృష్ణమోహన్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు గట్టు తిమ్మప్ప, మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు, కేశవ్ తదితరులు ఉన్నారు. -
పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేస్తాం: హరీశ్‌రావు
అలంపూర్ : మహబూబ్‌నగర్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి వచ్చే ఖరీఫ్ నాటికి ఐదులక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. మంగళవారం ఆయన మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో పలు అభివద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆర్డీఎస్ పనులను న్యాయ నిపుణుల కమిటీ నివేదిక మేరకు కేంద్రబలగాలను రప్పించైనా చేయిస్తామని తెలిపారు. పొరుగు రాష్ట్రాల నుంచి కరెంట్‌ను కొనుగోలు చేసి రైతులు ఇబ్బం దులు పడకుండా చూస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. వ్యవసాయానికి ఏడుగంటల కరెంట్‌ను అందించనున్నామన్నారు. -
సయోధ్యకే సర్కారు మొగ్గు
ఎగువ రాష్ట్రాలతో సాగునీటి పేచీలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం పెండింగ్ ప్రాజెక్టులపై చర్చలకు సుముఖం నేడు మహారాష్ర్ట సర్కారుతో భేటీ కానున్న హరీశ్, జోగురామన్న పలు అంశాల్లో పరస్పర సహకారంపై ఆశలు హైదరాబాద్: సాగునీటి వ్యవహారాలకు సంబంధించి ఎగువ రాష్ట్రాలతో తెలంగాణ ప్రభుత్వం సయోధ్యను కోరుకుంటోంది. ఈ దిశగా ప్రయత్నాలు కూడా మొదలుపెట్టింది. పరస్పర చర్చల ద్వారా పరిష్కారమయ్యే చిన్న విషయాలపైనా ఎగువ రాష్ట్రాలతో ఘర్షణాత్మక వైఖరి సరికాదని రాష్ర్ట ప్రభుత్వం భావిస్తోంది. చిన్న సమస్యలపై ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తే.. ప్రాజెక్టులకు కేంద్ర అనుమతులు, నదీ జలాల పంపిణీ వంటి క్లిష్ట సమస్యల విషయంలో ఆ రాష్ట్రాల సహకారాన్ని పొందవచ్చని విశ్వసిస్తోంది. ప్రస్తుతం జూరాల కేంద్రంగా రాష్ర్టం ప్రతిపాదిస్తున్న జూరాల-పాకాల, పాలమూరు ఎత్తిపోతల వంటి ప్రాజెక్టులకు కర్ణాటక సహకారం, అలాగే జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలని కోరుతున్న ప్రాణహిత-చేవెళ్లకు మహారాష్ట్ర సహకారం అవసరం. ఈ ప్రాజెక్టు విషయంలో తలెత్తే ముంపు సమస్య విషయంలో మహారాష్ర్ట నుంచి, కృష్ణా ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులకు సంబంధించి కర్ణాటక నుంచి సానుకూల ధోరణిని తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో.. నీటి విడుదల, బాబ్లీ వంటి అక్రమ ప్రాజెక్టులు, నదీ జలాల కేటాయింపులు, పాత ట్రిబ్యునళ్ల అవార్డులపై అభ్యంతరాలు వంటి చిక్కులను పక్కనబెడితే... మిగతా చిన్న చిన్న పేచీల విషయంలో మాత్రం ఎగువ రాష్ట్రాలతో సామరస్యంగా మెలిగి వాటిని పరిష్కరించుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. మహారాష్ట్రతో చర్చలు! మహారాష్ట్రతో కలిసి అంతర్రాష్ట్ర ప్రాజెక్టుగా ముద్కేడ్ ప్రాం తంలో చేపట్టే లెండి ప్రాజెక్టు ద్వారా 6.36 టీఎంసీల నీటిని వాడుకోవచ్చు. ఇందులో 2.34 టీఎంసీలను తెలంగాణ వాడుకోవాలి. దీని అంచనా వ్యయం రూ. 800 కోట్లు దాటుతోంది. నీటి వాటాను బట్టి ఇరు రాష్ట్రాలూ నిధులు వెచ్చిం చాల్సి ఉంటుంది. దీని ప్రగతిపై సమీక్షతోపాటు ఇతర అంశాలపై మహారాష్ర్ట ప్రభుత్వంతో చర్చించేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమైంది. ముఖ్యంగా 5.11టీఎంసీలు వాడుకునే వీలున్న పెన్‌గంగ ప్రాజెక్టు విషయంలో ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదు. దీనికి అడ్డంకిగా మారిన అంశాలపై ఎగువ రాష్ర్టంతో చర్చించాలని భావిస్తోంది. అలాగే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు వల్ల మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో ఆ రాష్ర్ట ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించి కేంద్రానికి నివేదిక పంపిం చాల్సి ఉంది. దీన్ని కేంద్రమే చేపట్టే పక్షంలో పునర్నిర్మాణం, పునరావాసం పెద్దగా ప్రతిబంధకం కాబోదని, ఈ విషయంలో తామూ ఉదారంగా వ్యవహరిస్తామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ఈ విషయాన్ని కూడా మహారాష్ర్టతో చర్చించడానికి అంతర్రాష్ట్ర వివాదాల విభాగం ఉన్నతాధికారులతోపాటు సాగునీటి మంత్రి హరీశ్‌రావు, అటవీ మంత్రి జోగురామన్న బుధవారం మహారాష్ట్రకు వెళ్తున్నారు. సాయంత్రం 4 గంటలకు ఆ రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి హసన్ మిశ్రీతో సమావేశం కానున్నారు. పలు అటవీ అనుమతులపై చర్చిం చడానికి ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎంతోనూ భేటీకి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. కాగా, వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు విషయంలో మాత్రం ప్రస్తుతానికి రాష్ర్ట ప్రభుత్వం మౌనాన్నే ఆశ్రయిస్తోంది. కర్ణాటకతోనూ సఖ్యత: ఇటు రాజోలిబండ డైవర్షన్ (ఆర్డీఎస్) పనులకు సంబంధించి ఆరేడేళ్ల క్రితమే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్ణాటకకు డబ్బు చెల్లించింది. కానీ ఆ పనుల వల్ల తమ ప్రాంతానికి రావల్సిన నీరు త గ్గిపోతుందంటూ కర్నూలు ప్రాంత రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మహబూబ్‌నగర్ ప్రాంత రైతులేమో పనుల కోసం ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ పనులపై తాత్సారం పనికిరాదని, పోలీసు రక్షణలో పనులు చేపట్టాలని, తమ ప్రభుత్వం కూడా ఈ పనులకు సహకరిస్తుందని కర్ణాటక ప్రభుత్వానికి ఇటీవలే తెలంగాణ సర్కారు లేఖ రాసింది. దీంతో ఆ రాష్ర్ట ప్రభుత్వం పోలీసులను కూడా నియమించింది. అయితే కర్నూలు రైతుల నుంచి ప్రతిఘటన తగ్గడం లేదు. దీంతో ఈ వ్యవహారం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాల నడుమ వివాదంగా మారుతోంది. అయితే కర్ణాటక స్పందనతో తెలంగాణ ప్రభుత్వం సంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఆ రాష్ర్టంతోనూ సఖ్యతగా ఉండేందుకు ప్రయత్నిస్తోంది. 264 మెగావాట్ల జూరాల జల విద్యుత్ కేంద్రంలో చెరిసగం వాటాలను పంచుకునేలా రాష్ట్ర విభ జన ప్రక్రియ సమయంలోనే కర్ణాటకతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక దాన్ని తిరగదోడే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. -
గౌడ బండి కూత పెట్టేనా ?
- నేడు రైల్వే బడ్జెట్ - గుంతకల్లు డివిజన్‌కు ఈసారైనా న్యాయం జరిగేనా? - అందరి చూపు పెండింగ్ ప్రాజెక్టులపైనే గుంతకల్లు టౌన్ :రైల్వే బడ్జెట్ అనగానే సాధారణంగా ప్రజలకు అమితమైన ఆసక్తి ఉంటుంది. రైలు చార్జీలు పెరుగుతాయా లేక తగ్గుతాయా, తమ ప్రాంతానికి కొత్త ప్రాజెక్టులేవైనా వస్తాయని అని ప్రజలు ఆత్రుతతో ఎదురుచూస్తుంటారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మంగళవారం పార్లమెంటులో రైల్వేబడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈసారి కూడా గుంతకల్లు డివిజన్ ప్రజల్లో అలాంటి ఆసక్తే నెలకొంది. డివిజన్‌కు ఈసారైనా న్యాయం జరిగేనా అని ఎదురుచూస్తున్నారు. కేంద్ర రైల్వే మంత్రి సదానంద గౌడ్ సొంత రాష్ట్రం కర్ణాటక కావడం, గుంతకల్లు డివిజన్ పరిధిలో ఆ రాష్ట్రంలోని ప్రాంతాలు కూడా కొన్ని ఉండటంతో ఈసారి డివిజన్‌కు ఎంతోకొంత మేలు జరిగే అవకాశముందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా పెండింగ్ ప్రాజెక్టులపైన అందరి దృష్టి ఉంది. వాటిని పూర్తి చేయడం కోసం ఏమేరకు నిధులు కేటాయిస్తారోనని అటు రైల్వే డివిజన్ అధికారులు, ఇటు ప్రజలు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా యూపీఏ ప్రభుత్వ హయాంలో పలు ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉండిపోయాయి. అప్పట్లో వాటికి నిధులు కేటాయించకపోవడంతో ముందుకు సాగలేదు. రూ.100 కోట్లతో గుంతకల్లులో విద్యుత్ లోకోషెడ్డు నిర్మాణం, నంచర్ల- మద్దికెర బైపాస్ లైన్, గుత్తి డీజిల్‌షెడ్డులో డబ్ల్యూడీజీ-4 పనులు, నంద్యాల- గాజులపల్లి, రామలింగపల్లి-నందిపల్లి, కృష్ణమ్మ కోన వద్ద క్రాసింగ్ స్టేషన్లు వంటివి పెండింగ్‌లో ఉండిపోయాయి. -
పెద్దపీట
గద్వాల, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రంలో పాలమూరు జిల్లా అభివృద్ధికి పెద్దపీట వేస్తామని, జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను సత్వరంగా పూర్తిచేయడంతో పాటు 14 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తామని టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. జిల్లాలో కృష్ణా, తుంగభద్ర నదులు ఉన్నప్పటికీ ఆంధ్ర నేతల పాలనలో ఇన్నాళ్లూ ప్రాజెక్టులను పూర్తిచేసుకోలేకపోయామన్నారు. ప్రభుత్వం రాగానే పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి కృషిచేస్తామన్నారు. గురువారం గద్వాలలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రెండునదుల మధ్య నడిగడ్డలో కరువు ఉందంటే పాలకుల చేతగానితనమే కారణమన్నారు. ఇది ఆంధ్ర ప్రభుత్వాల నిర్లక్ష్యమేనని కేసీఆర్ అన్నారు. 2002లో ఆర్డీఎస్ సమస్యపై తాను అలంపూర్ నియోజకవర్గంలో పాదయాత్ర చేశానని, అసెంబ్లీలో చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసి జూరాల లింక్ కాల్వ మంజూరయ్యేలా చేశానని ఆయన గుర్తుచేశారు. 12 ఏళ్లు గడచినా ఆర్డీఎస్ చివరి భూములకు నీళ్లు వెళ్లడం లేదని, మనరాష్ట్రంలో మన ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఏడాదిలోగా ఆర్డీఎస్ చివరి భూములకు నీళ్లందించేలా చేస్తామన్నారు. గుర్రంగడ్డ వద్ద కృష్ణానదిపై మరో ప్రాజెక్టును చేపట్టి వనపర్తి, కొల్లాపూర్ ప్రాంతాలకు సాగునీటిని అందిస్తామన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడంతోపాటు షాద్‌నగర్ ప్రాంతంలోని లక్ష్మింపల్లి వద్ద ఎత్తయిన ప్రాంతంలో రిజర్వాయర్‌ను నిర్మించి కృష్ణానది జలాలను లక్షలాది ఎకరాలకు అందిస్తామన్నారు. ఆర్డీఎస్ తూంలను పగులగొడుతామని ైబె రెడ్డి ప్రకటిస్తే తాను సుంకేసుల సంగతి చూస్తానని హెచ్చరించానన్నారు. రాయలసీమ ప్రాంతానికి పక్కనే ఉన్న గద్వాల ప్రాంతం కొన్ని పల్లెల్లో ఇంకా ఫ్యాక్షనిజం ఉందని, ఇక దానికి జోలికి వెళ్లకుండా అందరు ప్రేమతో ఉండి అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. బూట్లు తూడిచే నాయకుల వల్లే.. తాను పాలమూరు ఎంపీగా ఉన్న సమయంలోనే తెలంగాణ రాష్ట్రం రావడం ఈ జిల్లా ప్రజలకు గర్వకారణమన్నారు. ఆంధ్ర మాయా మశ్చింధ్రుల బూట్లు తూడిచే నాయకులు ఉన్నారన్నారు. వారివల్లే సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. జిల్లాలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నా ఇంకా ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కారణమేమిటన్నారు. ‘కృష్ణానది బ్రిడ్జిపై తాను ఆగి కృష్ణమ్మకు మొక్కి వచ్చాను. ఇన్నాళ్లూ కృష్ణమ్మ కరుణించింది. ఇక మన ప్రభుత్వం, మన పాలనలో కృష్ణమ్మ నీళ్లు పాలమూరును పచ్చగా మారుస్తాయని’ అని కేసీఆర్ అన్నారు. గద్వాల అభ్యర్థిగా కృష్ణమోహన్‌రెడ్డి సభా వేదికపై నుంచే గద్వాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కృష్ణమోహన్‌రెడ్డి, మునిసిపల్ చైర్మన్ అభ్యర్థిగా మారూ. చైర్మన్ బీఎస్ కేశవ్‌ను కేసీఆర్ ప్రకటించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కే. కేశవరావు, పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎస్.నిరంజన్‌రెడ్డి, ఎంపీ మందా జగన్నాథం, ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు, మారూ. ఎమ్మెల్యే గట్టు భీముడు, డీసీసీబీ మారూ. చైర్మన్ గట్టు తిమ్మప్ప, నాయకులు బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి, ఉత్తనూరు తిరుమల్‌రెడ్డి, వైండింగ్ రాములు, నాగశంకర్, తదితరులు పాల్గొన్నారు. -
సబర్బన్‌కు రైలు
బెంగళూరుతో పాటు చుట్టు పక్కల జిల్లాలకూ రైళ్లు రూ. 10 వేల కోట్లతో ప్రాజెక్టు.. నిధుల సేకరణపై పరిశీలన 12న రైల్వే బడ్జెట్.. పెండింగ్ ప్రాజెక్టులకు ప్రాధాన్యత రైల్వే శాఖ మంత్రి మల్లిఖార్జున ఖర్గే సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ముంబై, చెన్నై తదితర నగరాల్లో మాదిరే బెంగళూరులో సబర్బన్ రైలును ప్రవేశ పెడతామని రైల్వే శాఖ మంత్రి మల్లిఖార్జున ఖర్గే తెలిపారు. నగరంతో పాటు చుట్టు పక్కల జిల్లాలను కూడా ఈ ప్రాజెక్టులో చేర్చుతామని వెల్లడించారు. ఇక్కడి బాణసవాడిలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన బెంగళూరు సిటీ-నాగర్‌కోయిల్, యశవంతపుర-కామాక్యలకు కొత్త రైళ్లతో పాటు సర్జాపుర వద్ద నిర్మించిన ఫ్లైవోవర్, బెంగళూరు రైల్వే స్టేషన్లో నెలకొల్పిన ఎస్కలేటర్లను ప్రారంభించి ప్రసంగించారు. మైసూరు, మండ్య, చిక్కబళ్లాపురం, తుమకూరులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను కూడా రైల్వే సబర్బన్ కింద చేర్చామని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు రూ.10 వేల కోట్ల అవసరమని, నిధులను ఏ విధంగా సమీకరించాలనే విషయమై పరిశీలన జరుగుతోందని వివరించారు. దీని కోసం మహారాష్ట్రలో మాదిరే రైల్వే వికాస్ కార్పొరేషన్‌ను స్థాపిస్తామని వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంలో సబర్బన్ రైలు ప్రాజెక్టును చేపడతామని, దీనిపై రైల్వే ఇంజనీర్లు, రైల్వే బోర్డు సభ్యులతో చర్చించామని వివరించారు. ఈ నెల 12న రైల్వే బడ్జెట్ ఉందంటూ, లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నందున ఓటాన్ అకౌంట్‌ను ప్రవేశ పెడతానని చెప్పారు. ఇందులో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులో ప్రాధాన్యతనిస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రూ. 23,125 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు రామలింగా రెడ్డి, కేజే. జార్జ్, ఎంపీ డీబీ. చంద్రే గౌడ, డిప్యూటీ మేయర్ ఇందిర, బీబీఎంపీ సభ్యులు కోదండ రెడ్డి, ఆర్. రాజేంద్రన్ ప్రభృతులు పాల్గొన్నారు.