- సీఎం సిద్దరామయ్య
గంగావతి : ఐదేళ్ల అధికార కాలంలో తమ ప్రభుత్వం రూ.5,800 కోట్ల నిధులు కేటాయించి పెండింగ్ ప్రాజెక్ట్‌లు పూర్తి చేసే లక్ష్యంతో పని చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య పేర్కొన్నారు. మంగళవారం కనకగిరి గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ఆయన పాల్గొని వేలాది మంది ప్రజలనుద్దేశించి మాట్లాడారు. తాము అధికారం చేపట్టిన ఒకటిన్నర ఏడాది కాలంలో రూ.2,300 కోట్లు సాగునీరు ప్రాజెక్టుల కోసం నిధులు అందించామని, మిగిలిన మూడున్నర ఏళ్లలో ఏటా రూ.1300 కోట్లు ప్రకారం సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధులు విడుదల చేశామని వెల్లడించారు.
రాష్ట్రంలో హాస్టల్ వసతి కల్పించని 50 వేల మంది పేద విద్యార్థులకు నెలకు రూ.1000లు చొప్పున ఏడాదికి రూ.12 వేలు కల్పించామన్నారు. రాష్ట్రంలో పౌష్టికలోపం ఉన్న 46 వేల మంది విద్యార్థులు ఉన్నారని, వీరికి పౌష్టికత కల్పించేందుకు పాలు, పండ్లు, గుడ్లు, అందిస్తున్నామని, తద్వారా 15 వేల మంది పౌష్టికత పొందారని తెలిపారు. గతంలో నిర్మించిన ఆశ్రయ ఇళ్ల బాకీ 2448 కోట్ల పేదలకు ఒకేసారి మాఫీ చేసిన ఘనత తమ ప్రభుత్వానికే చెందిందన్నారు.
తుంగభద్ర డ్యాంలో 30 టీఎంసీల నీటి పరిమాణం సమానంగా పూడిక పేరుకుని, 2 లక్షల ఎకరాలకు సాగునీటి కొరత సంభవించిందని, దీన్ని పూడిక తీయడం సాధ్యం కాదని దీనికి ప్రత్యమ్నాయ పథకాన్ని రూపొందించి సాగునీరు అందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం యోచిస్తుందన్నారు. రూ.144 కోట్ల నిధులతో చెరువులకు నీరు నింపే పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో చెరుకు, మొక్కజొన్నలకు మద్దతు ధర కల్పించాలన్నారు.
సీఎం సిద్దరామయ్య 11 గంటలకు గిణిగెరకు ప్రత్యేక విమానంలో ఎంఎస్‌పీఎల్ విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గంలో గంగావతి మీదుగా సిద్దాపుర చేరుకుని నూతన బస్టాండ్‌కు ప్రారంభోత్సవం నెరవేర్చి కారటగి మీదుగా నవలి గ్రామం చేరుకుని రైస్ టెక్నాలజీ పార్కుకు శంకుస్థాపన కార్యక్రమాన్ని నెరవేర్చి అనంతరం కనకగిరి చేరుకుని, పూర్తరుున తాగునీటి పనులకు, రహదారుల నిర్మాణాలు, పలు పథకాలకు ప్రారంభోత్సవాలను, శంకుస్థాపనలను చేసి వేదికపై పాల్గొన్నారు.
వేదికపై రాష్ట్ర మంత్రులు హెచ్‌కే.పాటిల్, డీకే.శివకుమార్, కొప్పళ జిల్లా ఇన్‌చార్జి మంత్రి శివరాజ్ తంగడిగి, ఎమ్మెల్యేలు ఇక్బాల్ అన్సారీ, రాఘవేంద్ర హిట్నాళ్, దొడ్డనగౌడ పాటిల్, ఎంపీ కరడి సంగణ్ణ, ఎమ్మెల్సీ హాలప్ప ఆచార్, జెడ్పీ అధ్యక్షుడు అమరేశ్ కుళగి, మాజీ మంత్రి సాలోణి నాగప్ప, మల్లికార్జున నాగప్ప, జిల్లా కలెక్టర్ ఆర్‌ఆర్.జన్ను, తాలూకా పంచాయతీ అధ్యక్షురాలు ఈరమ్మలు పాల్గొన్నారు.