సాక్షి ప్రతినిధి, వరంగల్: గోదావరి జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం ద్వారా ఆయకట్టు భూములను సస్యశ్యామలం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రాజెక్టుల కోసం భూసేకరణ, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తిపై ఆదివారం హన్మకొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రులతో పాటు సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఈఎన్‌సీ మురళీధర్‌రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, రాజ్యసభ సభ్యులు బండా ప్రకాష్, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు డాక్టర్ టి.రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి ఇందులో పాల్గొన్నారు.
మంత్రులు మాట్లాడుతూ 5.18 టీఎంసీల సామర్థ్యంతో 1,22,700 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు దేవాదుల ప్రాజెక్టుకు రూపకల్పన చేయగా.. ఆ మేరకు పూర్తి చేయకుండా నాటి పాలకులు నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో దేవాదుల ప్రాజెక్టును పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. జనగామ జిల్లా ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణను పూర్తి చేయాలని సూచించారు. ఎత్తైన ప్రదేశంలో ఉన్న వేలేరుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, పాలకుర్తి, ఘన్‌పూర్‌లో ఆగిన 6వ ప్యాకేజీ పనులు ప్రారంభించాలని చెప్పారు.
మధ్యలోనే వెళ్లిపోయిన ముత్తిరెడ్డి
దేవాదులపై సమీక్ష సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. చెరువులకు నీటి విడుదల సంబంధిత సమస్యలను స్మితా సబర్వాల్‌కు ముత్తిరెడ్డి వివరిస్తూ అధికారుల తీరుపై విమర్శలు చేశారు. దీంతో మంత్రి ఎర్రబెల్లి ఆయన్ను వారించారు. ఇందుకు నిరసనగా ఎమ్మెల్యే సమావేశం నుంచి వాకౌట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment