the students
-
ప్రశ్నించే గుణం అలవర్చుకోవాలి
డిచ్పల్లి : విద్యార్థులు ప్రశ్నించే గుణం అలవర్చుకోవాలని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి హరినాథ్ అన్నారు. సోమవారం డిచ్పల్లి ప్రభుత్వ మోడల్ స్కూల్/కాలేజ్‌లో న్యాయ చైతన్య సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన హరినాథ్ మాట్లాడుతూ.. విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, రాజ్యాంగం పట్ల విధేయతతో మెలగాలని, హక్కులతో పాటు, విధులను పాటించాలన్నారు. బాల్య వివాహలు, బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా అన్ని రకాల న్యాయ సేవలు అందిస్తారని తెలిపారు. మహిళలు ప్రస్తుతం పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో దూసుకెళుతున్నారని, ఇందుకు మలావత్ పూర్ణ, పీవీసింధు లను ఉదాహరణగా చెప్పవచ్చన్నారు. కార్యక్రమంలో లీగల్ అథారిటీ సభ్యులు రాజ్‌కుమార్ సుబేదార్, మాణిక్యరాజ్, సుదర్శన్‌రావు తో పాటు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గణేశ్‌కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
విద్యార్థులను ఉత్సాహపరిచేందుకే ‘కళా ఉత్సవ్’
ఖమ్మం: విద్యార్థులకు కళారంగాల పట్ల ఆసక్తి పెంచేందుకు, వారిని ఉత్సాహపరిచేందుకు కళాఉత్సవ్ ఉపయోగపడుతుందని డీఈఓ నాంపల్లి రాజేష్ తెలిపారు. కేంద్ర మానవ వనవరుల అభివద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బుధవారం డైట్ కళాశాలలో కళాఉత్సవ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ఈ కళా ఉత్సవాలు గ్రామీణ స్థాయి నుంచి జాతీయస్థాయి వరకు నిర్వహించబడుతున్నాయని, పాఠశాల, కళాశాలల్లో చదివే విద్యార్థులు వీటిలో పాల్గొనవచ్చునని చెప్పారు. జిల్లాలో 9, 10వ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులు పాల్గొంటారని పేర్కొన్నారు. సమాచార శాఖ ఏడీ మహ్మద్ ముర్తుజా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు ఆయా కళల పట్ల ఆసక్తి పెంపొందించుకునే అవకాశం ఏర్పడుతుందన్నారు. జిల్లాలో జరిగే కళోత్సవాలలో పాల్గొనే విద్యార్థులు జాతీయస్థాయిలో గుర్తింపు పొందాలన్నారు. డైట్ ప్రిన్సిపాల్ బస్వారావు మాట్లాడుతూ కళోత్సవాలలో నత్యం, గానం, చిత్రలేఖనం, నాటకరంగాల గిరిజన సంస్కతి సంప్రదాయాలపై ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాస్థాయిలో మొదటి స్థానం పొందిన వారిని రాష్ట్రస్థాయికి పంపించనున్నట్లు పేర్కొన్నారు. ఖమ్మం ఎంఈఓ శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ క్రాఫ్ట్, పీఈటీ టీచర్లను, విద్యావలంటీర్లను నియమించనున్నట్లు తెలిపారు. అనంతరం గానం, నాటికలు ప్రదర్శించారు. -
చలిలో నిద్ర.. దోమల బెడద
వణికిస్తున్న చలి.. చన్నీళ్ల స్నానం.. దోమల బెడద. రోజూ సగం నిద్ర. కప్పుకుందామంటే దుప్పట్లు లేవు.. పుస్తకాలు, దుస్తులు భద్ర పర్చుకుందామంటే బాక్సుల్లేవు. సన్నబియ్యం అన్నమైనా.. సప్పటి కూరలే.. ఇవి ఎస్సీ బాలుర వసతిగృహం విద్యార్థుల ఇబ్బందులు. హాస్టళ్లలో సమస్యలు తెలుసుకునేందుకు చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ ‘సాక్షి’ తరఫున వీఐపీ రిపోర్టర్‌గా మారారు. గంగాధరలోని ఎస్సీ వసతి గృహ విద్యార్థులతో మాట్లాడారు. అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బొడిగె శోభ: బాబూ.. నీపేరేంటి? విద్యార్థి: నాపేరు సాయికిరణ్ బొడిగె శోభ: ఏ ఊరు? సాయికిరణ్ : తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ బొడిగె శోభ: బాగా చుదువుతున్నావా? సాయికిరణ్ : చదువుతున్నా మేడం. క్లాసులో సెకండ్ వస్తున్నా బొడిగె శోభ: సన్న బియ్యంతో భోజనం పెడుతున్నారా? దొడ్డు బియ్యంతోనా? రాజకుమార్ : సన్న బియ్యంతోనే మేడం బొడిగె శోభ: మెనూ ప్రకారం భోజనం, కూరలు పెడుతున్నారా? ఎ.రాజకుమర్ : ఉదయం టిఫిన్ ఇస్తున్నారు. మధ్యాహ్నం, సాయంత్రం అన్నం పెడుతున్నారు. 5 రోజులు గుడ్లు ఇస్తున్నారు. పండ్లతోపాటు ప్రతి బుధవారం స్వీటు ఇస్తారు బొడిగె శోభ: మీకేమైనా సమస్యలు ఉన్నాయా? వెంకటేశం : రాత్రి పూట దోమల బెడద ఎక్కువ ఉంది. చలికాలం.. ఉదయం చన్నీళ్లతో స్నానం చేయడానికి బాగా ఇబ్బంది పడుతున్నాం. కింద పడుకుంటే నేల చల్లగా ఉంటుంది, బెడ్లు ఇస్తమన్నారు కానీ.. రాలేదు బొడిగె శోభ: ప్రభుత్వం దోమ తెరలు అందజేయలేదా? వార్డెన్ : మూడు సంవత్సరాల క్రితం అందించిన దోమ తెరలు చినిగి పోయినయ్ బొడిగె శోభ: ఇంకేమైనా సమస్యలున్నాయా? సంతోష్ : చలికాలం బాగా చలి పెడుతుంది. బెడ్ షీట్లు కావాలి బొడిగె శోభ: వసతి గృహంలోని విద్యార్థులందరికీ నేనే శాలువాలు ఇస్తా. (45 మంది విద్యార్థులకు శాలువాలు పంపిణీ చేశారు) బొడిగె శోభ: వార్డెన్ రోజూ వస్తున్నాడా? విద్యార్థులు: వస్తున్నారు మేడం రాంబాబు : తినడానికి ప్లేట్లు లేవు మేడం. బొడిగె శోభ: ప్లేట్లు ఇస్తే బాగా చదువుకుంటారా.. క్లాస్ ఫస్ట్ వస్తారా? రాంబాబు: తప్పకుండా మేడం బొడిగె శోభ: కొండన్నపల్లి మాజీ సర్పంచ్ రేండ్ల రాజిరెడ్డి మీకు ప్లేట్లు అందజేస్తారు. వంశీకృష్ణ: జ్వరం, దగ్గు వంటి సమస్యలు వస్తే హాస్పిటల్‌కు వెళ్లడానికి ఇబ్బందిగా ఉంది. హాస్పిటల్ బాగా దూరంగా ఉంది బొడిగె శోభ: వైద్యాధికారితో మాట్లాడి వారానికి రెండుసార్లు వసతి గృహానికి వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించే ఏర్పాట్లు చేస్తా బొడిగె శోభ: వార్డెన్ గారూ.. విద్యార్థుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారా ? వార్డెన్: సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లా మేడం. హాస్టల్లో నీటి సమస్య పరిష్కారానికి సబ్ మెర్సిబుల్ పంపు కావాలి. దోమ తెరల కోసం కలెక్టర్‌తో మాట్లాడుతా.. బొడిగె శోభ, చొప్పదండి ఎమ్మెల్యే గత ప్రభుత్వాలు వసతిగృహ విద్యార్థుల సమస్యలు పట్టించుకోలేదు. పేద విద్యార్థులు కడుపు నిండా భోజనం చేయాలని ప్రస్తుత ప్రభుత్వం హాయాంలో సన్నబియ్యం అందిస్తున్నాం. వసతిగృహ సందర్శనలో విద్యార్థులు దృష్టికి తీసుకువ చ్చిన సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటా. దోమల బెడద నివారణకు పంపిణీ చేసే దోమ తెరల విషయం కలెక్టర్‌తో మాట్లాడుతా. ఐఏఎస్, ఐపీఎస్‌లు అందరూ ప్రభుత్వ పాఠశాలలు, వ సతిగృహాల్లో చదువుకున ్న వారే. అలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి. తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురాావాలి. -
ఐదేళ్లలో పెండింగ్ ప్రాజెక్ట్‌లకు మోక్షం
సీఎం సిద్దరామయ్య గంగావతి : ఐదేళ్ల అధికార కాలంలో తమ ప్రభుత్వం రూ.5,800 కోట్ల నిధులు కేటాయించి పెండింగ్ ప్రాజెక్ట్‌లు పూర్తి చేసే లక్ష్యంతో పని చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య పేర్కొన్నారు. మంగళవారం కనకగిరి గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ఆయన పాల్గొని వేలాది మంది ప్రజలనుద్దేశించి మాట్లాడారు. తాము అధికారం చేపట్టిన ఒకటిన్నర ఏడాది కాలంలో రూ.2,300 కోట్లు సాగునీరు ప్రాజెక్టుల కోసం నిధులు అందించామని, మిగిలిన మూడున్నర ఏళ్లలో ఏటా రూ.1300 కోట్లు ప్రకారం సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధులు విడుదల చేశామని వెల్లడించారు. రాష్ట్రంలో హాస్టల్ వసతి కల్పించని 50 వేల మంది పేద విద్యార్థులకు నెలకు రూ.1000లు చొప్పున ఏడాదికి రూ.12 వేలు కల్పించామన్నారు. రాష్ట్రంలో పౌష్టికలోపం ఉన్న 46 వేల మంది విద్యార్థులు ఉన్నారని, వీరికి పౌష్టికత కల్పించేందుకు పాలు, పండ్లు, గుడ్లు, అందిస్తున్నామని, తద్వారా 15 వేల మంది పౌష్టికత పొందారని తెలిపారు. గతంలో నిర్మించిన ఆశ్రయ ఇళ్ల బాకీ 2448 కోట్ల పేదలకు ఒకేసారి మాఫీ చేసిన ఘనత తమ ప్రభుత్వానికే చెందిందన్నారు. తుంగభద్ర డ్యాంలో 30 టీఎంసీల నీటి పరిమాణం సమానంగా పూడిక పేరుకుని, 2 లక్షల ఎకరాలకు సాగునీటి కొరత సంభవించిందని, దీన్ని పూడిక తీయడం సాధ్యం కాదని దీనికి ప్రత్యమ్నాయ పథకాన్ని రూపొందించి సాగునీరు అందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం యోచిస్తుందన్నారు. రూ.144 కోట్ల నిధులతో చెరువులకు నీరు నింపే పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో చెరుకు, మొక్కజొన్నలకు మద్దతు ధర కల్పించాలన్నారు. సీఎం సిద్దరామయ్య 11 గంటలకు గిణిగెరకు ప్రత్యేక విమానంలో ఎంఎస్‌పీఎల్ విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గంలో గంగావతి మీదుగా సిద్దాపుర చేరుకుని నూతన బస్టాండ్‌కు ప్రారంభోత్సవం నెరవేర్చి కారటగి మీదుగా నవలి గ్రామం చేరుకుని రైస్ టెక్నాలజీ పార్కుకు శంకుస్థాపన కార్యక్రమాన్ని నెరవేర్చి అనంతరం కనకగిరి చేరుకుని, పూర్తరుున తాగునీటి పనులకు, రహదారుల నిర్మాణాలు, పలు పథకాలకు ప్రారంభోత్సవాలను, శంకుస్థాపనలను చేసి వేదికపై పాల్గొన్నారు. వేదికపై రాష్ట్ర మంత్రులు హెచ్‌కే.పాటిల్, డీకే.శివకుమార్, కొప్పళ జిల్లా ఇన్చార్జి మంత్రి శివరాజ్ తంగడిగి, ఎమ్మెల్యేలు ఇక్బాల్ అన్సారీ, రాఘవేంద్ర హిట్నాళ్, దొడ్డనగౌడ పాటిల్, ఎంపీ కరడి సంగణ్ణ, ఎమ్మెల్సీ హాలప్ప ఆచార్, జెడ్పీ అధ్యక్షుడు అమరేశ్ కుళగి, మాజీ మంత్రి సాలోణి నాగప్ప, మల్లికార్జున నాగప్ప, జిల్లా కలెక్టర్ ఆర్ఆర్.జన్ను, తాలూకా పంచాయతీ అధ్యక్షురాలు ఈరమ్మలు పాల్గొన్నారు. -
క్యాంపస్ అంబాసిడర్స్ - చలమలశెట్టి సురేఖ
ఉన్నత విద్య కోసం ప్రతి ఏటా విదేశాలకు వెళ్లే భారతీ య విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఈ కోవలోనే యూఎస్ లోని రైట్ స్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుతున్నారు చలమలశెట్టి సురేఖ. యూఎస్ విద్య, క్యాంపస్ ప్రత్యేకతలను వివరిస్తున్నారిలా.. ప్రవేశాలు ఫాల్, స్ప్రింగ్‌లో: క్యాంపస్‌లో దాదాపు 200 మంది వరకు భారతీయ విద్యార్థులున్నారు. అమెరికా విద్యార్థులు భారతీయ విద్యార్థులతో స్నేహంగా ఉంటారు. క్యాంపస్‌లో జాతివివక్షత లేదు. అలా ఎవరైనా ర్యాగింగ్ చేస్తూ దొరికితే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ప్రవేశాలు ప్రతి ఏటా వేసవిలోనూ, శీతకాలంలో ఉంటాయి. పరీక్ష విధానం కోర్సు, ప్రొఫెసర్ల ఇష్టాయిష్టాలను బట్టి ఉంటుంది. మిడ్ టర్మ్, ఫైనల్ ఎగ్జామ్స్ లేదా ప్రాజెక్ట్ వర్క్‌తోపాటు వీక్లీ టెస్టులు, క్విజ్, క్లాస్రూమ్ ఎక్సర్‌సెజైస్ కూడా ఉంటాయి. క్యుములేటివ్ గ్రేడ్ పా యింట్ ఏవరేజ్(సీజీపీఏ)ఆధారంగా పాయింట్లు కేటాయిస్తారు. యూఎస్ విద్యా విధానం ప్రత్యేకం: మిగిలిన దేశాలతో పోలిస్తే యూఎస్ విద్యావిధానం ప్రత్యేకంగా ఉంటుంది. విద్యార్థులకు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ లభిస్తోంది. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా టెక్నికల్ హబ్‌గా ఉన్న దేశం అమెరికా. థియరీ కంటే ప్రాక్టికల్స్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ప్రాబ్లం సాల్వ్డ్ లెర్నింగ్‌తో ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చు. కరిక్యులం, బోధ న కూడా పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా ఉంటుంది. లేబొరేట రీలు అత్యాధునికంగా అత్యుత్తమ స్థాయిలో ఉంటాయి. నిష్ణాతులైన ఫ్యాకల్టీ: హాస్టల్ వసతి కూడా ఉంది. అమెరికన్ ఫుడ్ మాత్రమే ఉంటుంది. చాలాచోట్ల భారతీయ రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. కాబట్టి ఆహారం విషయంలో ఆందోళన అనవసరం. ఫ్యాకల్టీ అంతా కూడా వారివారి సబ్జెక్టులలో డాక్టరేట్ చేసినవాళ్లే. అంతేకాకుండా ఎంతో అనుభవజ్ఞులు. ఇండియన్ సొసైటీ ఉంది: నేను ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు. యూఎస్కొచ్చే భారతీయ విద్యార్థుల కు సహాయం చేయడానికి ఇండియన్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఉంది. వీరు విద్యార్థులు విమానం దిగిన దగ్గర నుంచి యూనివర్సి టీలో చేరేవరకు అన్ని విధాలా సహాయం అందిస్తారు. ఎంచుకున్న కోర్సును బట్టి ఫీజులుంటాయి. ప్రతిభావంతులైన భారతీయ విద్యార్థులకు స్కాలర్షిప్స్, ఫెలోషిప్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రవేశ పరీక్షల స్కోర్ తప్పనిసరి: అమెరికాలో చదవాలను కునేవారు ఆయా కోర్సులకు అనుగుణంగా శాట్/జీఆర్ఈ/ టోఫెల్/ఐఈఎల్టీఎస్/జీమ్యాట్ వంటి పరీక్షల్లో మంచి స్కోర్ సాధించాలి. ఇందుకోసం రెండేళ్ల ముందుగానే తమ సన్నాహాలు ప్రారంభించాలి. ఆయా టెస్టులకు సంబంధించి ఎన్నో వెబ్‌పోర్టళ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని వినియోగించుకోవాలి. ఆయా అంశాలను వీలైనన్ని ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయాలి. దరఖాస్తు ఇలా: యూనివర్సిటీ వెబ్సైట్ (www.wright.edu) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్ సర్టిఫికెట్లు, రికమండేష న్స్ లెటర్స్, రెజ్యూమే, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, పని అనుభవం వివరాలతో దరఖాస్తు చేయాలి. తర్వాత వీసాకు దరఖాస్తు చేసుకో వాలి. అప్లికేషన్‌తో పాటు అకడమిక్ సర్టిఫికెట్లు, యూఎస్‌లో ప్రవే శం లభించినట్లు కన్ఫర్మేషన్ లెటర్, ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్, ఐ-20, వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ సమర్పించాలి. వీసా ఆఫీసర్‌తో మాట్లాడేటప్పుడు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, బాడీ లాంగ్వేజ్ ఉండాలి. -
చుక్కల్లో బీఈడీ సీటు
సాక్షి, అనంతపురం : బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) సీట్లకు ఉన్నట్టుండి డిమాండ్ పెరిగింది. కొన్నేళ్లుగా నిరాదరణకు గురవుతూ వచ్చిన ఈ కోర్సులో చేరేందుకు ప్రస్తుతం విద్యార్థులు ఎగబడుతున్నారు. ప్రజాప్రతినిధులతో ఫోన్లు చేయించినా, సిఫారసు లేఖలు తీసుకెళ్లినా సీటు దొరకని పరిస్థితి ఉంది. ఇదే అదనుగా సొమ్ము చేసుకోవడానికి కళాశాలల యాజమాన్యాలు సిద్ధమయ్యాయి. గత విద్యా సంవత్సరంలో జిల్లాలోని ఎస్కేయూ క్యాంపస్‌తో పాటు ఒకట్రెండు ప్రైవేటుబీఈడీ కళాశాలల్లో మాత్రమే సీట్లు పూర్తి స్థాయిలో భర్తీ అయ్యాయి. మిగిలిన వాటిలో కన్వీనర్ కోటా సీట్లు కూడా పూర్తిగా నిండలేదు. చివరకు యాజమాన్య కోటా సీటు కూడా కన్వీనర్ కోటా ఫీజుకే ఇస్తామని ప్రకటించినా విద్యార్థులు ఆసక్తి చూపలేదు. అయితే.. ప్రస్తుతం పలు కారణాల వల్ల డిమాండ్ పెరిగిపోయింది. జస్టిస్ వర్మ కమిటీ సిఫారసుల మేరకు ఉపాధ్యాయ శిక్షణ కోర్సుల్లో ప్రమాణాలు పెంచేందుకు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా బీఈడీ కోర్సు కాల పరిమితిని వచ్చే ఏడాది నుంచి రెండేళ్లకు పెంచనుంది. ఈ మేరకు ఈ నెల 15న బెంగళూరులో అన్ని రాష్ట్రాల యూనివర్సిటీలు, విద్యా శాఖల అధికారులు, విద్యా సంస్థలు, విద్యారంగ నిపుణులతో నిర్వహించిన సదస్సులో అంగీకారం లభించింది. దీనికితోడు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో టీచర్‌గా పనిచేయాలన్నా బీఈడీ ఉండాలి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఇంటర్మీడియట్ బోర్డును రద్దు చేసి ఆ తరగతులను (10+1, 10+2 ) మాధ్యమిక శిక్షా అభియాన్ పరిధిలోకి తేవాలన్న ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉంది. ఇప్పటికే కేంద్రీయ విద్యాలయాల్లో ఈ విధానం అమలులో ఉంది. రాష్ట్రంలోనూ అమల్లోకి వస్తే జూనియర్ లెక్చరర్లను పోస్టుగ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ)గా పరిగణిస్తారు. ప్రస్తుతం జూనియర్ లెక్చరర్లకు పీజీ ఉత్తీర్ణత అర్హతగా ఉంది. అదే పీజీటీ కావాలంటే సంబంధిత సబ్జెక్టులో పీజీతో పాటు బీఈడీ ఉత్తీర్ణత తప్పనిసరి. ఈ పరిణామాల నేపథ్యంలో విద్యార్థులు ఈసారే బీఈడీ పూర్తి చేయడానికి ఆత్రుత పడుతున్నారు. ఈ ఏడాది మే 30న జరిగిన ఎడ్‌సెట్‌కు జిల్లా నుంచి 12,159 మంది హాజరయ్యారు. వీరిలో దాదాపు పది వేల మంది అర్హత సాధించారు. ప్రస్తుతం జిల్లాలో 25 బీఈడీ కళాశాలలు ఉన్నాయి. ఎస్కేయూ క్యాంపస్ కళాశాలను మినహాయిస్తే 24 ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. సరస్వతి బీఈడీ కళాశాల(అనంతపురం)లో 160, ఎస్కేయూతో పాటు మరో మూడు కళాశాలల్లో 120 చొప్పున, మిగిలిన 20 కళాశాలల్లో వంద చొప్పున సీట్లు ఉన్నాయి. జిల్లా మొత్తమ్మీద 2,640 సీట్లు ఉన్నాయి. ఎస్కేయూ క్యాంపస్ కాలేజీలో వంద శాతం సీట్లను కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తారు. ప్రైవేటు కళాశాలల్లోని 2,520 సీట్లలో 75 శాతం కన్వీనర్, 25 శాతం యాజమాన్య కోటా కింద భర్తీ చేస్తారు. ఈ లెక్కన కన్వీనర్ 1,890, యాజమాన్య కోటా కింద 630 సీట్లు అందుబాటులో ఉన్నాయి. జిల్లాకు చెందిన విద్యార్థులే ఎడ్‌సెట్‌లో దాదాపు పది వేల మంది అర్హత సాధించగా, పొరుగు జిల్లాల్లో అర్హత సాధించిన విద్యార్థులు సైతం ఇక్కడి కళాశాలల్లో ప్రవేశాల కోసం వస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. జిల్లాకు సంబంధించి ఎస్కేయూలో కౌన్సెలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ నెల 21 నుంచి ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభమైంది. ఈ ప్రక్రియ 28వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ నెల 23 నుంచి అక్టోబర్ 1 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు ఉంటాయి. 6వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. -
క్రీడలతో అధికారుల ’ఆటలు’
అయిదు నెలలుగా ఆగిన శిక్షణ జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్‌కు కోచ్‌లు లేరు మూలనపడ్డ లక్షల విలువైన పరికరాలు తెలంగాణ రాష్ట్రానికి తరలించే యోచనలో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న క్రీడాకారులు తిరుపతి స్పోర్ట్స్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) తిరుపతిలో శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్(స్పోర్ట్స్ హాస్టల్) ఏర్పాటు చేసింది. జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్, స్విమ్మింగ్ వంటి క్రీడల్లో రాష్ట్రస్థాయిలో రాణించే క్రీడాకారులను గుర్తిస్తూ, వారికి స్పోర్ట్స్ హాస్టల్లో అడ్మిషన్లు ఇస్తారు. తద్వారా 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యతోపాటు రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడం దీని ముఖ్య ఉద్దేశం. అయితే అధికారుల ఆధిపత్య పోరుతో ఇక్కడ అయిదు నెలలుగా శిక్షణ ఆగిపోయింది. ప్రస్తుతం రీజనల్ స్పోర్ట్స్ హాస్టల్‌ను మూసివేయడంతో క్రీడా విద్యార్థులు లేక బోసిపోతోంది. పైగా స్థానిక క్రీడాకారులకు ఇక్కడ శిక్షణ ఇచ్చేందుకు శిక్షకులు లేకపోవడంతో విద్యార్థులు రావడం మానేశారు. దీంతో నిర్వహణ లేక, కాంప్లెక్స్ ఆదరణ కోల్పోయి నిర్మానుష్యంగా దర్శనమిస్తోంది. దయనీయమైన స్థితిలో ఉన్న స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ఆదుకునేందుకు అటు స్థానిక ఎమ్మెల్యే కానీ, జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కానీ, కలెక్టర్ కానీ స్పందించక పోవడం క్రీడాకారులకు శాపంగా మారింది. దీనిపై క్రీడా సంఘాలు సైతం నోరు మెదపడం లేదు. ప్రయివేట్ పరం కానున్న కాంప్లెక్స్..! ఇది వరకు స్పోర్ట్స్ హాస్టల్లో ఉన్న క్రీడాకారులకు జిమ్నాస్టిక్, అథ్లెటిక్స్‌తోపాటు స్విమ్మింగ్‌లో ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేవారు. ఇక్కడ డీఎస్డీవోగా ఉన్న సయ్యద్, ఏవోగా ఉన్న వెంకటరమణ మధ్య ఆధిపత్య పోరుతో గతంలో కోచ్‌గా ఉన్న దేవకిని ప్రాంతీయ భేదంతో ఇక్కడి నుంచి పంపించివేశారు. ఆపై వచ్చిన చందూ అధికారుల తీరుతో మూడు నెలలకే వెళ్లిపోయారు. ఇక అథ్లెటిక్స్ కోచ్‌గా ఉన్న వెంకటేశ్వర్లు విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడంటూ గతంలో క్రీడా విద్యార్థినులు ఆందోళన చేశారు దీంతో రెండు నెలలకే ఆ కోచ్ వెళ్లిపోయాడు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్ క్రీడలకు కోచ్‌లు లేకపోవడంతో ఈ విద్యా సంవత్సరానికి ఈ క్రీడలకు శిక్షణ ఆగిపోయింది. ఒక్కొక్కరు రూ.1000 చొప్పున డిపాజిట్ చెల్లించి జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్‌లో శిక్షణ పొందుతున్న స్థానిక క్రీడాకారులకు ఐదు నెలలుగా శిక్షణ అందడం లేదు. దీనికితోడు మరో నెలలో స్విమ్మింగ్‌పూల్ కోచ్ శ్రీనివాస్‌ను శాప్ ఉన్నతాధికారులు తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేయనున్నట్టు తెలిసింది. అదే జరిగితే స్విమ్మింగ్‌పూల్‌కు కొత్త కోచ్‌ను ఇవ్వరు. కారణం రాష్ట్ర విభజన నేపథ్యంలో కోచ్‌లను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఏపీ ప్రభుత్వానిది. కానీ ప్రభుత్వం క్రీడలకు నిధులు కేటాయించక పోవడంతో నియామకం ఈ ఏడాది ఉండకపోవచ్చని క్రీడాకారులు అంటున్నారు. ఇక అవుట్ సోర్సింగ్ కింద శిక్షకులను నియమించి నిర్వహిస్తున్న షటిల్ బ్యాడ్మింటన్, టెన్నిస్, స్కేటింగ్ క్రీడలను క్రీడాకారులు లేరన్న సాకుతో రద్దు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. తద్వారా మొత్తం స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్వహణను ప్రయివేట్ సంస్థలకు అప్పగించేందుకు అధికారులు వేగంగా కసరత్తు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఆ పరికరాలు తెలంగాణ రాష్ట్రానికా... ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటైన స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో శాప్ జిమ్నాస్టిక్ క్రీడాకారుల కోసం రూ.10 లక్షలకు పైగా విలువైన క్రీడాపరికరాలు కొనుగోలు చేసింది. అందులో వాల్థింగ్, బీమ్ వాక్, ఫ్లోర్ మ్యాట్, ట్రామ్ప్లిన్ చిన్నది, పెద్దది, స్విమ్ బోర్డు వంటి అనేక పరికరాలు ఉన్నాయి. ప్రస్తుతం విద్యార్థులు, కోచ్‌లు లేక హాస్టల్ మూతబడింది. క్రీడాపరికరాలు తుప్పు పట్టి, నిరుపయోగంగా మారాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉంటే పనికిరాకుండా పోతాయన్న భావనతో ఈ క్రీడాపరికరాలను తెలంగాణకు తరలించేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. అవి కొనుగోలు చేసింది శాప్ కాబట్టి, ప్రస్తుతం శాప్ తెలంగాణ రాష్ట్రం లోని హైదబాద్‌లో ఉండటంతో వారికే ఇచ్చేందుకు అధికారులు లేఖ రాసినట్టు సమాచారం. దీనిపై క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ పరికరాలు మనవే ప్రభుత్వ నిధులతో జిమ్నాస్టిక్ పరికరాలు కొనుగోలు చేశాం. అవి ఎప్పటి కీ మనవే. శాప్‌కు తరలిస్తామని చెప్పడంలో వాస్తవం లేదు. గిట్టని వాళ్లు చేస్తున్న ప్రచారమే ఇది. అయినా లేఖ రాసే అధికారం నాకులేదు. స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు నేను వచ్చాక మొత్తం ప్రక్షాళన చేశా. సిబ్బందికి వేతనాలు పెంచాను. విద్యుత్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాను. రాష్ట్ర విభజన నేపథ్యంలో అనుమతి లేకనే హాస్టల్ మూసివేశాం. తిరిగి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే విద్యార్థులను ఎంపికచేసి హాస్టల్ సౌకర్యం కల్పిస్తాం. స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ప్రయివేట్ పరం చేసే సమస్య ఉండదు. -సయ్యద్ సాహెబ్, డీఎస్డీవో, చిత్తూరు. -
‘గేట్’లో మనోళ్లు గ్రేట్
సత్తా చాటిన సిటీ విద్యార్థులు టాప్-10లో రెండు.. టాప్- 100లో 11 ర్యాంకులు సాక్షి, సిటీబ్యూరో/ కేపీహెచ్‌బీ, న్యూస్‌లైన్: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) 2014 ఫలితాలలో నగర విద్యార్థులు దుమ్ము దులిపారు. గేట్ ప్రవేశపరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో టాప్ 10 ర్యాంకుల్లో ఇద్దరు, టాప్ 100 లోపు 11మంది విద్యార్థులు హైదరాబాద్ హవాను చాటారు. నగరానికి చెందిన తాడూరి నవీన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో 8వ ర్యాంకు, ఈఈఈ విభాగంలో రాపోలు జయప్రకాష్ 9వ ర్యాంకుతో సత్తా ప్రదర్శించారు. ఆపై ర్యాంకుల్లో వై.వంశీకృష్ణ(ఈసీఈ) 14వ ర్యాంకు, చంద్ర శ్రీరామ్ కౌషిక్ (ఈఈఈ) 35వ ర్యాంకు, సందీప్(సీఎస్ఈ) 69వ ర్యాంకు, పీయుష్ సోని (ఈసీఈ) 75వ ర్యాంకు, వెంకట రమణరావు (ఈఈఈ) 78వ ర్యాంకు, వంశీ (సీఎస్ఈ) 86వర్యాంకు, చుండూరి శ్రీహర్ష (ఈఈఈ) 90వ ర్యాంకు సాధించారు. ఇదిలా ఉంటే.. నగరంలోని జవహర్లాల్ నెహ్రు సాంకేతిక విశ్వ విద్యాలయానికి చెందిన ఇద్దరు విద్యార్థులకు వందలోపు రెండు ర్యాంకులు వచ్చాయి. వర్సిటీలో బీటెక్ ఈఈఈ ఫైనలియర్ చదువుతున్న స్టాన్లీ 41వ ర్యాంక్, కె.చాణిక్య 97వ ర్యాంకు సాధించారు. టాప్ ర్యాంకులు రాకున్నా 100 లోపు ర్యాంకులు ఎక్కువమంది నగర విద్యార్థులకు రావడంపై పలువురు ఆచార్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఫలితాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉందని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు తెలిపారు. ర్యాంకులు సాధించిన వారిలో కొందరు ఇతర జిల్లాలకు చెందిన వారైనప్పటికీ వీరు హైదరాబాద్ కేంద్రం నుంచి గేట్ పరీక్షలు రాశారు. మొదటి నుంచీ కృషి ఇంజనీరింగ్‌లో చేరినప్పటి నుంచి గేట్లో మంచి ర్యాంకులు సాధించాలనే లక్ష్యంతో కృషి చేశా. ఆల్ ఇండియాలో టాప్ 10 లో ఉండాలనుకున్నా. అయినా 100లోపు 41వ ర్యాంక్ రావడంతో సంతోషంగా ఉంది. - స్టాన్లీ, ఈఈఈ 41వ ర్యాంకర్ ఒత్తిడికి లోనయ్యా.. పరీక్ష రాసేటప్పుడు కొంచెం ఒత్తిడికి గురయ్యా. ఇంత మంచి ర్యాంక్ వస్తుందని ఊహించలేదు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతోనే గేట్ పరీక్షలు రాశా. - కె. చాణుక్య, ఈఈఈ 97వ ర్యాంకర్ -
ఏయూ విద్యార్థుల ఆందోళన
వసతి గృహంలో సమస్యలపై ఆగ్రహం పరిష్కారానికి రిజిస్ట్రార్ హామీ ఏయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు ఆకస్మికంగా ఆందోళనబాట పట్టారు. గురువారం రాత్రి భోజన సమయంలో నాగార్జున వసతి గృహంలో భోజనాలను బిహ ష్కరించారు. ఆహారంలో నాణ్యత లోపించిందని, పరిశుభ్రమైన తా గునీరు అందించడం లేదని ఆరోపిస్తూ మెస్ బయట బైఠాయించి ఆందోళన చేపట్టారు. సిబ్బంది పనితీరుపై సైతం వారు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ర్యాలీగా వీసీ నివాసం వరకూ తరలివెళ్లారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. రిజిస్ట్రార్ ఆచార్య కె.రామ్మోహనరావు, చీఫ్ వార్డెన్ విశ్వనాథం విద్యార్థులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. వారిని వసతి గృహానికి తీసుకువచ్చి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తమకు అందిస్తున్న పాలలో నాణ్యత లేదని, సదరు సరఫరాదారుని మార్చాలని విద్యార్థులు కోరారు. వసతి గృహంలో తాగునీటి శుద్ధియంత్రాలు ఏర్పాటు చేయాలని, నీటి ట్యాంకులను శుభ్రపరచాలని, టాయిలెట్స్ శుభ్రం చేసేందుకు తగినంత సిబ్బందిని నియమించాలని విద్యార్థులు కోరారు. విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న మెస్ సిబ్బందిని వెంటనే బదిలీ చేయాలన్నారు. అనారోగ్య పరిస్థతుల వల్ల విద్యార్థులు రోగాలబారిన పడుతున్నారని ఆరోపించారు. విద్యార్థుల సమస్యలపై రిజిస్ట్రార్ స్పందించారు. వెంటనే ఏయూ వైద్యాధికారిని పిలిపించి అనారోగ్యంతో ఉన్న విద్యార్థులకు పరీక్షలు చేసి తగిన వైద్యం అందించాలని ఆదేశించారు. డిమాండ్లను సత్వరమే పరిష్కరిస్తామని, విద్యార్థులు కోరిన విధంగా పోషకాహారం అందిస్తామని రిజిస్ట్రార్ హామీ ఇచ్చారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.