క్రీడలతో అధికారుల ’ఆటలు’ | Sports officials 'Games' | Sakshi
Sakshi News home page

క్రీడలతో అధికారుల ’ఆటలు’

Published Tue, Aug 26 2014 1:45 AM | Last Updated on Mon, Jul 29 2019 7:35 PM

క్రీడలతో అధికారుల ’ఆటలు’ - Sakshi

క్రీడలతో అధికారుల ’ఆటలు’

  •   అయిదు నెలలుగా ఆగిన శిక్షణ
  •   జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్‌కు కోచ్‌లు లేరు
  •   మూలనపడ్డ లక్షల విలువైన పరికరాలు
  •   తెలంగాణ రాష్ట్రానికి తరలించే యోచనలో అధికారులు
  •   ఆందోళన వ్యక్తం చేస్తున్న క్రీడాకారులు
  • తిరుపతి స్పోర్ట్స్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) తిరుపతిలో శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్(స్పోర్ట్స్ హాస్టల్) ఏర్పాటు చేసింది. జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్, స్విమ్మింగ్ వంటి క్రీడల్లో రాష్ట్రస్థాయిలో రాణించే క్రీడాకారులను గుర్తిస్తూ, వారికి స్పోర్ట్స్ హాస్టల్లో అడ్మిషన్లు ఇస్తారు. తద్వారా 6వ తరగతి నుంచి ఇంటర్‌మీడియట్ వరకు విద్యతోపాటు రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడం దీని ముఖ్య ఉద్దేశం. అయితే అధికారుల ఆధిపత్య పోరుతో ఇక్కడ అయిదు నెలలుగా శిక్షణ ఆగిపోయింది.

    ప్రస్తుతం రీజనల్ స్పోర్ట్స్ హాస్టల్‌ను మూసివేయడంతో క్రీడా విద్యార్థులు లేక బోసిపోతోంది. పైగా స్థానిక క్రీడాకారులకు ఇక్కడ శిక్షణ ఇచ్చేందుకు శిక్షకులు లేకపోవడంతో విద్యార్థులు రావడం మానేశారు. దీంతో నిర్వహణ లేక, కాంప్లెక్స్ ఆదరణ కోల్పోయి నిర్మానుష్యంగా దర్శనమిస్తోంది. దయనీయమైన స్థితిలో ఉన్న స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ఆదుకునేందుకు అటు స్థానిక ఎమ్మెల్యే కానీ, జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కానీ, కలెక్టర్ కానీ స్పందించక పోవడం క్రీడాకారులకు శాపంగా మారింది. దీనిపై క్రీడా సంఘాలు సైతం నోరు మెదపడం లేదు.
     
    ప్రయివేట్ పరం కానున్న కాంప్లెక్స్..!

    ఇది వరకు స్పోర్ట్స్ హాస్టల్లో ఉన్న క్రీడాకారులకు జిమ్నాస్టిక్, అథ్లెటిక్స్‌తోపాటు స్విమ్మింగ్‌లో ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేవారు. ఇక్కడ డీఎస్‌డీవోగా ఉన్న సయ్యద్, ఏవోగా ఉన్న వెంకటరమణ మధ్య ఆధిపత్య పోరుతో గతంలో కోచ్‌గా ఉన్న దేవకిని ప్రాంతీయ భేదంతో ఇక్కడి నుంచి పంపించివేశారు. ఆపై వచ్చిన చందూ అధికారుల తీరుతో మూడు నెలలకే వెళ్లిపోయారు. ఇక అథ్లెటిక్స్ కోచ్‌గా ఉన్న వెంకటేశ్వర్లు విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడంటూ గతంలో క్రీడా విద్యార్థినులు ఆందోళన చేశారు దీంతో రెండు నెలలకే ఆ కోచ్ వెళ్లిపోయాడు.

    దీంతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్ క్రీడలకు కోచ్‌లు లేకపోవడంతో ఈ విద్యా సంవత్సరానికి ఈ క్రీడలకు శిక్షణ ఆగిపోయింది. ఒక్కొక్కరు రూ.1000 చొప్పున డిపాజిట్ చెల్లించి జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్‌లో శిక్షణ పొందుతున్న స్థానిక క్రీడాకారులకు ఐదు నెలలుగా శిక్షణ అందడం లేదు. దీనికితోడు మరో నెలలో స్విమ్మింగ్‌పూల్ కోచ్ శ్రీనివాస్‌ను శాప్ ఉన్నతాధికారులు తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేయనున్నట్టు తెలిసింది. అదే జరిగితే స్విమ్మింగ్‌పూల్‌కు కొత్త కోచ్‌ను ఇవ్వరు. కారణం రాష్ట్ర విభజన నేపథ్యంలో కోచ్‌లను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఏపీ ప్రభుత్వానిది.

    కానీ ప్రభుత్వం క్రీడలకు నిధులు కేటాయించక పోవడంతో నియామకం ఈ ఏడాది ఉండకపోవచ్చని క్రీడాకారులు అంటున్నారు. ఇక అవుట్ సోర్సింగ్ కింద శిక్షకులను నియమించి నిర్వహిస్తున్న షటిల్ బ్యాడ్మింటన్, టెన్నిస్, స్కేటింగ్ క్రీడలను క్రీడాకారులు లేరన్న సాకుతో రద్దు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. తద్వారా మొత్తం స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్వహణను ప్రయివేట్ సంస్థలకు అప్పగించేందుకు అధికారులు వేగంగా కసరత్తు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.
     
    ఆ పరికరాలు తెలంగాణ రాష్ట్రానికా...

    ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటైన స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో శాప్ జిమ్నాస్టిక్ క్రీడాకారుల కోసం రూ.10 లక్షలకు పైగా విలువైన క్రీడాపరికరాలు కొనుగోలు చేసింది. అందులో వాల్‌థింగ్, బీమ్ వాక్, ఫ్లోర్ మ్యాట్, ట్రామ్‌ప్లిన్ చిన్నది, పెద్దది, స్విమ్ బోర్డు వంటి అనేక పరికరాలు ఉన్నాయి. ప్రస్తుతం విద్యార్థులు, కోచ్‌లు లేక హాస్టల్ మూతబడింది. క్రీడాపరికరాలు తుప్పు పట్టి, నిరుపయోగంగా మారాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉంటే పనికిరాకుండా పోతాయన్న భావనతో ఈ క్రీడాపరికరాలను తెలంగాణకు తరలించేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. అవి కొనుగోలు చేసింది శాప్ కాబట్టి, ప్రస్తుతం శాప్ తెలంగాణ రాష్ట్రం లోని హైదబాద్‌లో ఉండటంతో వారికే ఇచ్చేందుకు అధికారులు లేఖ రాసినట్టు సమాచారం. దీనిపై క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
     
    ఆ పరికరాలు మనవే
     
    ప్రభుత్వ నిధులతో జిమ్నాస్టిక్ పరికరాలు కొనుగోలు చేశాం. అవి ఎప్పటి కీ మనవే. శాప్‌కు తరలిస్తామని చెప్పడంలో వాస్తవం లేదు. గిట్టని వాళ్లు చేస్తున్న ప్రచారమే ఇది. అయినా లేఖ రాసే అధికారం నాకులేదు. స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు నేను వచ్చాక మొత్తం ప్రక్షాళన చేశా. సిబ్బందికి వేతనాలు పెంచాను. విద్యుత్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాను. రాష్ట్ర విభజన నేపథ్యంలో అనుమతి లేకనే హాస్టల్ మూసివేశాం. తిరిగి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే విద్యార్థులను ఎంపికచేసి హాస్టల్ సౌకర్యం కల్పిస్తాం. స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ప్రయివేట్ పరం చేసే సమస్య ఉండదు.            
    -సయ్యద్ సాహెబ్, డీఎస్‌డీవో, చిత్తూరు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement