అభినయ్‌ ఓటమి కంటే.. అదే ఎక్కువ బాధించింది: భూమన | YSRCP Leaders Serious On CBN Govt At Titupati | Sakshi
Sakshi News home page

అభినయ్‌ ఓటమి కంటే.. అదే ఎక్కువ బాధించింది: భూమన

Published Wed, Feb 19 2025 2:00 PM | Last Updated on Wed, Feb 19 2025 2:53 PM

YSRCP Leaders Serious On CBN Govt At Titupati

సాక్షి, తిరుపతి: రాష్ట్రంలో పేదల కోసం పాటుపడే వ్యక్తి వైఎస్‌ జగన్ అయితే, పేదల ఓట్లు వాడుకునే వ్యక్తి చంద్రబాబు అని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు. తిరుపతి మున్సిపల్‌ ఎన్నికల్లో అధికారం కోసం ఇన్ని అడ్డదారులు తొక్కుతారా? అని ప్రశ్నించారు. కుట్రలకు తెరలేపిన వాళ్ళను జైలుకు పంపిస్తాం. న్యాయం జరిగే వరకూ ఈ పోరాటం చేస్తాం అని హెచ్చరికలు జారీ చేశారు.

తిరుపతి  ఎస్ఆర్ కళ్యాణ మండపంలో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి సీనియర్‌ నాయకులు భూమన కరుణాకరరెడ్డి, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, మేయర్ డాక్టర్ శిరీష, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. అనంతరం, కూటమి సర్కార్‌ పాలనపై వైఎ‍స్సార్‌పీ నేతలు మండిపడ్డారు.

తిరుపతి జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ..‘జగనన్నను గెలిపించుకోవాలని పేద ప్రజలు అందరూ భావిస్తున్నారు. మనం పోగొట్టుకున్నాం అనే భావన వారిలో ఉంది. జగన్‌ నాయకత్వంలో పనిచేస్తున్నందుకు గర్వంగా ఉంది. వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ ప్రక్రియ సందర్భంగా తొక్కిసలాటలో ఆరుగురు చనిపోయారు. వారిని పరామర్శించేందుకు జగన్ వస్తున్నారని సమాచారం తెలుసుకుని జన ప్రవాహం తరలివచ్చింది. నిన్న విజయవాడలో వంశీని పరామర్శించేందుకు వెళ్లిన జగన్‌ను చూసేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుల్లో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి. అలాంటి నాయకుడి నాయకత్వంలో పనిచేయడం గర్వంగా ఉంది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలైనా ప్రజలకు చేసిందేమీ లేదు. పేదల కోసం పాటుపడే వ్యక్తి జగన్ అయితే, పేదల ఓట్లు వాడుకునే వ్యక్తి చంద్రబాబు. నేను కార్యకర్తలు కోసమే పనిచేస్తాను అని చాలా స్పష్టంగా జగన్‌ చెప్పారు. ఆయన అనుచరులుగా, శిష్యులుగా మేము గర్వపడుతున్నాము. డిప్యూటి మేయర్ ఎన్నిక సందర్భంగా నమ్మకద్రోహం చేసిన వాళ్లం చూశాం. నా కొడుకు ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు బాధ కంటే, నేను నమ్మిన నాయకులు డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా వెళ్ళిపోయినప్పుడు బాధ పడ్డాను. అధికారం కోసం ఇన్ని అడ్డదారులు తొక్కుతారా?. నెత్తిన పైసా పెడితే మారని వ్యక్తుల్ని నాయకుల్ని చేశాను. రాజారెడ్డి సింహం లాంటి వ్యక్తితో నడిచా, వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి యుద్ధ వీరుడుతో పనిచేశా, వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి లాంటి యువ నాయకుడితో పని చేస్తున్నాను. మేయర్ పదవి కోసం అవిశ్వాసం పెడితే త్యాగం చేసైనా కాపాడుకుంటాం. అవసరమైతే జగన్‌ను తిరుపతికి రప్పిస్తాం. వైఎస్‌ జగన్‌ మళ్లీ సీఎం చేసేంత వరకు కష్టపడి పనిచేస్తామన్నారు.

భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ.. ఈరోజు తుని మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ చేస్తున్న అరాచకాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోంది. ఈ పోరాటానికి  తిరుపతి పార్టీ నేతలే స్పూర్తి. స్థానిక సమస్యలపైన రానున్న రోజుల్లో మరింత ఉద్యమం చేస్తాం. మీ పాలనలో తిరుపతి టౌన్ బ్యాంక్ అప్పుల్లో కూరుకు పోయింది. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలపై జరిగిన దాడి ఘటనపై ప్రధాని, హ్యూమన్ రైట్స్, కేంద్ర ఎన్నికలు సంఘం, లోక్‌సభలో ప్రివిలేజ్ మోషన్ కింద పెడతామన్నారు.

తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వానికి నిద్రలేని రాత్రులు గడిపేలా తిరుపతి నుంచి కరుణాకరరెడ్డి నాయకత్వంలో ప్రజల పక్షాన మరింత పోరాటం చేస్తాం. డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా పోలీసులు, రౌడీలు కలిసి పోయి ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి చేశారు. కుట్రలు తెరలేపిన వాళ్లను జైలుకు పంపిస్తాం. న్యాయం జరిగే వరకూ ఈ పోరాటం చేస్తాం. ప్రజాస్వామ్య వేదికలు, రాజ్యాంగ హక్కుల వేదికల దృష్టికి తీసుకు వెళ్తాం. కుట్రలో భాగస్వామ్యం అయిన వారు అందరికీ బుద్ధి చెబుతాం. ఇది  ఖచ్చితంగా ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడి అని అన్నారు.

తిరుపతి మేయర్‌ శిరీష మాట్లాడుతూ.. కూటమి పాలనలో ఎవరిని అరెస్ట్‌ చేస్తారు అనే చర్చ జరుగుతోంది. సంక్షేమం, అభివృద్ధి అనేది రాష్ట్రంలో చర్చ లేదు. ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టాలి.. ఎలా వేధించాలి అనేది చర్చ జరుగుతోంది అంటూ ఘాటు విమర్శలు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement