చుక్కల్లో బీఈడీ సీటు | BEd helm seat | Sakshi
Sakshi News home page

చుక్కల్లో బీఈడీ సీటు

Published Wed, Sep 24 2014 1:47 AM | Last Updated on Sat, Sep 2 2017 1:51 PM

చుక్కల్లో బీఈడీ సీటు

చుక్కల్లో బీఈడీ సీటు

సాక్షి, అనంతపురం :
 బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) సీట్లకు ఉన్నట్టుండి డిమాండ్ పెరిగింది. కొన్నేళ్లుగా నిరాదరణకు గురవుతూ వచ్చిన ఈ కోర్సులో చేరేందుకు ప్రస్తుతం విద్యార్థులు ఎగబడుతున్నారు. ప్రజాప్రతినిధులతో ఫోన్లు చేయించినా, సిఫారసు లేఖలు తీసుకెళ్లినా సీటు దొరకని పరిస్థితి ఉంది. ఇదే అదనుగా సొమ్ము చేసుకోవడానికి కళాశాలల యాజమాన్యాలు సిద్ధమయ్యాయి. గత  విద్యా సంవత్సరంలో జిల్లాలోని ఎస్కేయూ క్యాంపస్‌తో పాటు ఒకట్రెండు ప్రైవేటుబీఈడీ కళాశాలల్లో మాత్రమే సీట్లు పూర్తి స్థాయిలో భర్తీ అయ్యాయి. మిగిలిన వాటిలో కన్వీనర్ కోటా సీట్లు కూడా పూర్తిగా నిండలేదు. చివరకు యాజమాన్య కోటా సీటు కూడా కన్వీనర్ కోటా ఫీజుకే ఇస్తామని ప్రకటించినా విద్యార్థులు ఆసక్తి చూపలేదు. అయితే.. ప్రస్తుతం పలు కారణాల వల్ల డిమాండ్ పెరిగిపోయింది.
 జస్టిస్ వర్మ కమిటీ సిఫారసుల మేరకు ఉపాధ్యాయ శిక్షణ కోర్సుల్లో ప్రమాణాలు పెంచేందుకు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా బీఈడీ కోర్సు కాల పరిమితిని వచ్చే ఏడాది నుంచి రెండేళ్లకు పెంచనుంది. ఈ మేరకు ఈ నెల 15న బెంగళూరులో అన్ని రాష్ట్రాల యూనివర్సిటీలు, విద్యా శాఖల అధికారులు, విద్యా సంస్థలు, విద్యారంగ నిపుణులతో నిర్వహించిన సదస్సులో అంగీకారం లభించింది. దీనికితోడు
 ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో టీచర్‌గా పనిచేయాలన్నా బీఈడీ ఉండాలి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఇంటర్మీడియట్ బోర్డును రద్దు చేసి ఆ తరగతులను (10+1, 10+2 ) మాధ్యమిక శిక్షా అభియాన్ పరిధిలోకి తేవాలన్న ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉంది. ఇప్పటికే కేంద్రీయ విద్యాలయాల్లో ఈ విధానం అమలులో ఉంది. రాష్ట్రంలోనూ అమల్లోకి వస్తే జూనియర్ లెక్చరర్లను పోస్టుగ్రాడ్యుయేట్ టీచర్‌లు (పీజీటీ)గా పరిగణిస్తారు. ప్రస్తుతం జూనియర్ లెక్చరర్లకు పీజీ ఉత్తీర్ణత అర్హతగా ఉంది. అదే పీజీటీ కావాలంటే సంబంధిత సబ్జెక్టులో పీజీతో పాటు బీఈడీ ఉత్తీర్ణత తప్పనిసరి. ఈ పరిణామాల నేపథ్యంలో విద్యార్థులు ఈసారే బీఈడీ పూర్తి చేయడానికి ఆత్రుత పడుతున్నారు. ఈ ఏడాది మే 30న జరిగిన ఎడ్‌సెట్‌కు జిల్లా నుంచి 12,159 మంది హాజరయ్యారు. వీరిలో దాదాపు పది వేల మంది అర్హత సాధించారు. ప్రస్తుతం జిల్లాలో 25 బీఈడీ కళాశాలలు ఉన్నాయి. ఎస్కేయూ క్యాంపస్ కళాశాలను మినహాయిస్తే 24 ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. సరస్వతి బీఈడీ కళాశాల(అనంతపురం)లో 160, ఎస్కేయూతో పాటు మరో మూడు కళాశాలల్లో 120 చొప్పున, మిగిలిన 20 కళాశాలల్లో వంద చొప్పున సీట్లు ఉన్నాయి. జిల్లా మొత్తమ్మీద 2,640 సీట్లు ఉన్నాయి. ఎస్కేయూ క్యాంపస్ కాలేజీలో వంద శాతం సీట్లను కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తారు. ప్రైవేటు కళాశాలల్లోని 2,520 సీట్లలో 75 శాతం కన్వీనర్, 25 శాతం యాజమాన్య కోటా కింద భర్తీ చేస్తారు. ఈ లెక్కన కన్వీనర్ 1,890, యాజమాన్య కోటా కింద 630 సీట్లు అందుబాటులో ఉన్నాయి. జిల్లాకు చెందిన విద్యార్థులే ఎడ్‌సెట్‌లో దాదాపు పది వేల మంది అర్హత సాధించగా, పొరుగు జిల్లాల్లో అర్హత సాధించిన విద్యార్థులు సైతం ఇక్కడి కళాశాలల్లో ప్రవేశాల కోసం వస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. జిల్లాకు సంబంధించి ఎస్కేయూలో కౌన్సెలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ నెల 21 నుంచి ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభమైంది. ఈ ప్రక్రియ 28వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ నెల 23 నుంచి అక్టోబర్ 1 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు ఉంటాయి. 6వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.



 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement