‘గేట్’లో మనోళ్లు గ్రేట్
- సత్తా చాటిన సిటీ విద్యార్థులు
- టాప్-10లో రెండు..
- టాప్- 100లో 11 ర్యాంకులు
సాక్షి, సిటీబ్యూరో/ కేపీహెచ్‌బీ, న్యూస్‌లైన్: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) 2014 ఫలితాలలో నగర విద్యార్థులు దుమ్ము దులిపారు. గేట్ ప్రవేశపరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో టాప్ 10 ర్యాంకుల్లో ఇద్దరు, టాప్ 100 లోపు 11మంది విద్యార్థులు హైదరాబాద్ హవాను చాటారు.
నగరానికి చెందిన తాడూరి నవీన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో 8వ ర్యాంకు, ఈఈఈ విభాగంలో రాపోలు జయప్రకాష్ 9వ ర్యాంకుతో సత్తా ప్రదర్శించారు. ఆపై ర్యాంకుల్లో వై.వంశీకృష్ణ(ఈసీఈ) 14వ ర్యాంకు, చంద్ర శ్రీరామ్ కౌషిక్ (ఈఈఈ) 35వ ర్యాంకు, సందీప్(సీఎస్‌ఈ) 69వ ర్యాంకు, పీయుష్ సోని (ఈసీఈ) 75వ ర్యాంకు, వెంకట రమణరావు (ఈఈఈ) 78వ ర్యాంకు, వంశీ (సీఎస్‌ఈ) 86వర్యాంకు, చుండూరి శ్రీహర్ష (ఈఈఈ) 90వ ర్యాంకు సాధించారు.
ఇదిలా ఉంటే.. నగరంలోని జవహర్‌లాల్ నెహ్రు సాంకేతిక విశ్వ విద్యాలయానికి చెందిన ఇద్దరు విద్యార్థులకు వందలోపు రెండు ర్యాంకులు వచ్చాయి. వర్సిటీలో బీటెక్ ఈఈఈ ఫైనలియర్ చదువుతున్న స్టాన్లీ 41వ ర్యాంక్, కె.చాణిక్య 97వ ర్యాంకు సాధించారు. టాప్ ర్యాంకులు రాకున్నా 100 లోపు ర్యాంకులు ఎక్కువమంది నగర విద్యార్థులకు రావడంపై పలువురు ఆచార్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఫలితాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉందని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు తెలిపారు. ర్యాంకులు సాధించిన వారిలో కొందరు ఇతర జిల్లాలకు చెందిన వారైనప్పటికీ వీరు హైదరాబాద్ కేంద్రం నుంచి గేట్ పరీక్షలు రాశారు.
మొదటి నుంచీ కృషి
ఇంజనీరింగ్‌లో చేరినప్పటి నుంచి గేట్‌లో మంచి ర్యాంకులు సాధించాలనే లక్ష్యంతో కృషి చేశా. ఆల్ ఇండియాలో టాప్ 10 లో ఉండాలనుకున్నా. అయినా 100లోపు 41వ ర్యాంక్ రావడంతో సంతోషంగా ఉంది.
- స్టాన్లీ, ఈఈఈ 41వ ర్యాంకర్
ఒత్తిడికి లోనయ్యా..
పరీక్ష రాసేటప్పుడు కొంచెం ఒత్తిడికి గురయ్యా. ఇంత మంచి ర్యాంక్ వస్తుందని ఊహించలేదు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతోనే గేట్ పరీక్షలు రాశా.
- కె. చాణుక్య, ఈఈఈ 97వ ర్యాంకర్