Graduate Aptitude Test in Engineering
-
గేట్–2022: ఈ మార్పులు గమనించారా?
గేట్.. గ్రాడ్యుయేట్ అప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్! ఐఐటీలు, ఎన్ఐటీలు, ఇతర ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల్లో.. ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, పీహెచ్డీ తదితర కోర్సుల్లో.. ప్రవేశానికి తొలి మెట్టు! అంతేకాదు గేట్ స్కోర్‌తో ప్రభుత్వ రంగ సంస్థల్లో.. కొలువులు సైతం సొంతం చేసుకోవచ్చు. అందుకే.. ప్రతి ఏటా గేట్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. తాజాగా గేట్–2022 నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల(ఆగస్టు) 30న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో.. గేట్–2022లో మార్పులు.. పరీక్ష విధానం.. ప్రిపరేషన్‌పై ప్రత్యేక కథనం.. గేట్–2022లో పలు మార్పులు జరిగాయి. ముఖ్యంగా కొత్తగా రెండు పేపర్లను చేర్చారు. అవి..నావల్ ఆర్కిటెక్చర్ అండ్ మెరైన్ ఇంజనీరింగ్; జియోమాటిక్స్ ఇంజనీరింగ్. దీంతో గేట్లో మొత్తం సబ్జెక్ట్ పేపర్ల సంఖ్య 29కి చేరింది. వీటిలో ఒకటి లేదా రెండు పేపర్లకు హాజరయ్యే అవకాశం కూడా ఉంది. రెండు పేపర్లకు హాజరు విధానాన్ని గేట్–2021 నుంచి కొత్తగా అమల్లోకి తెచ్చారు. అనుమతించిన(రెండు పేపర్ల కాంబినేషన్) జాబి తా నుంచి అభ్యర్థులు తాము రాయాల్సిన పేపర్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. రెండు పేపర్లకు హాజరవ్వాలనుకునే విద్యార్థులు.. ఈ విషయాన్ని దరఖాస్తు సమయంలోనే పేర్కొనాల్సి ఉంటుంది. అర్హత ఇంజనీరింగ్/టెక్నాలజీ/ఆర్కిటెక్చర్/కామర్స్ /సైన్స్/ఆర్ట్స్ విభాగాల్లో.. బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఆయా కోర్సుల చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థులు సైతం దరఖాస్తుకు అర్హులే. దరఖాస్తుకు ఎలాంటి గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు. ఆన్లైన్ పరీక్ష ► గేట్ పరీక్ష ఆన్లైన్(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో 3 గంటల వ్యవధిలో జరుగుతుంది. ► మొత్తం 65 ప్రశ్నలు–100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ► రెండు విభాగాలుగా జరిగే గేట్లో.. పార్ట్–ఏ జనరల్ అప్టిట్యూడ్. ఈ విభాగం 15 మార్కులకు ఉంటుంది. ఇందులో ఒక మార్కు ప్రశ్నలు అయిదు, రెండు మార్కుల ప్రశ్నలు అయిదు ఉంటాయి. ► పార్ట్–బీ అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్ట్‌పై ఉంటుంది. ఈ విభాగంలో మొత్తం 55 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో 25 ప్రశ్నలు ఒక మార్కు, 30 ప్రశ్నలు రెండు మార్కులకు ఉంటాయి. ► పార్ట్–బీలోనే ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ నుంచి 10–15 మార్కులకు ప్రశ్నలుంటాయి. ప్రశ్నలు.. మూడు రకాలు ► గేట్ పరీక్షలో మూడు రకాల ప్రశ్నలను అడుగుతారు. అవి.. మల్టిపుల్ ఛాయిస్ కొశ్చన్స్(ఎంసీక్యూలు)గా పేర్కొనే ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు. రెండో రకం ప్రశ్నలు.. మల్టిపుల్ సెలక్ట్ కొశ్చన్స్(ఎంఎస్క్యూ). మూడో విధానంలో న్యూమరికల్ ఆన్సర్ టైప్(ఎన్ఏటీ) ప్రశ్నలు. ► ఎంసీక్యూ ప్రశ్నల విధానంలో.. నాలుగు లేదా అయిదు ఆప్షన్లలో ఏదో ఒక ఆప్షన్‌ను సరైన సమాధానంగా గుర్తించాల్సి ఉంటుంది. ► మల్టిపుల్ సెలక్ట్ కొశ్చన్స్‌లో.. ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్లు సరైన సమాధానాలుగా ఉంటాయి. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే.. అభ్యర్థులకు సంబంధిత అంశంపై సమగ్ర అవగాహన ఉండాలి. ► న్యూమరికల్ ఆన్సర్ టైప్ ప్రశ్నలు కొంత కాలిక్యులేషన్స్‌తో కూడినవిగా ఉంటాయి. వీటికి వర్చువల్ కీ ప్యాడ్ ద్వారా సమాధానం టైప్ చేయాల్సి ఉంటుంది. సిలబస్ విశ్లేషణ ముందుగా అభ్యర్థులు గేట్ పరీక్ష విధానంపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. అందుకోసం తాము ఎంచుకున్న సబ్జెక్ట్‌కు సంబంధించి సిలబస్‌ను పరిశీలించాలి. గత ప్రశ్న పత్రాలను విశ్లేషించాలి. గత ప్రశ్న పత్రాల్లో ఆయా టాపిక్స్‌కు లభిస్తున్న వెయిటేజీని గుర్తించాలి. ఆ తర్వాత గేట్ సిలబస్‌ను అకడమిక్ సిలబస్‌తో అనుసంధానం చేసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. దానికి అనుగుణంగా తమ ప్రిపరేషన్ వ్యూహాలు రూపొందించుకోవాలి. ముఖ్యంగా బీటెక్ చివరి సంవత్సరం విద్యార్థులు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ప్రారంభించడం మేలు అంటున్నారు నిపుణలు. వెయిటేజీని అనుసరిస్తూ గేట్–2022 పరీక్ష తేదీలను పరిగణనలోకి తీసుకుంటే.. అభ్యర్థులకు ఆరు నెలలకు పైగా సమయం అందుబాటులో ఉంది. సీరియస్ అభ్యర్థులకు విజయ సాధన దిశగా ఈ సమయం సరిపోతుందనే చెప్పొచ్చు. ఇందుకోసం కొన్ని ముఖ్యమైన వ్యూహాలను అనుసరించాలి. ప్రధానంగా ఆయా సబ్జెక్ట్‌లలో తమ బలాలు, బలహీనతలపై స్వీయ విశ్లేషణ చేసుకోవాలి. గత అయిదారేళ్లుగా గేట్లో లభిస్తున్న వెయిటేజీ, అకడమిక్ వెయిటేజీ ప్రాధాన్యాన్ని అనుసరిస్తూ ప్రిపరేషన్ సాగించాలి. డిసెంబర్ చివరి వారం లేదా జనవరి మొదటి వారానికి ప్రిపరేషన్ పూర్తి చేసుకునేలా టైమ్ ప్లాన్ రూపొందించుకోవాలి. బేసిక్స్, అప్లికేషన్ అప్రోచ్ గేట్లో మంచి స్కోర్ సాధించి ఐఐటీల్లో ప్రవేశం పొందాలంటే.. అభ్యర్థులు తాము ఎంచుకున్న సబ్జెక్ట్‌లో బేసిక్స్‌పై గట్టి పట్టు సాధించాలి. ఆ తర్వాత అడ్వాన్స్డ్ టెక్నిక్స్‌పై అవగాహన పెంచుకోవాలి. ప్రతి టాపిక్‌ను చదివేటప్పుడు అందులో ప్రశ్నార్హమైన అంశాలను గుర్తించాలి. వాటికి సంబం«ధించి ప్రాథమిక భావనలపై స్పష్టత తెచ్చుకోవాలి. ఒక టాపిక్ నుంచి ఎన్ని రకాలుగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉందో అంచనావేయాలి. ఆ మేరకు సాధన చేయాలి. దీంతో పరీక్షలో ప్రశ్నను ఎలా అడిగినా.. సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది. దాంతోపాటు వీక్లీ టెస్ట్‌లు, మాక్ టెస్ట్‌లు, మోడల్ టెస్ట్‌లకు హాజరు కావాలి. సమయ పాలన గేట్ విజయంలో సమయ పాలన ఎంతో ముఖ్యం. ప్రస్తుత సమయంలో విద్యార్థులు రోజుకు కనీసం ఐదారు గంటలు గేట్ ప్రిపరేషన్‌కు కేటాయించేలా ప్లాన్ చేసుకోవాలి.వాస్తవానికి ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు.. ఇది కొంత కష్టమైన విషయమే. అయినా సమయం కేటాయించే ప్రయత్నం చేయాలి. గేట్ పరీక్ష పూర్తిగా ఆన్లైన్ విధానంలో జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు ఇప్పటి నుంచే ఆన్లైన్ పరీక్ష తీరుపై అవగాహన పెంచుకోవాలి. వర్చువల్ కాలిక్యులేటర్ వినియోగం, ఆన్‌స్క్రీన్ ఆన్సర్స్ రికగ్నిషన్ వంటి వాటి గురించి తెలుసుకోవాలి. ఇందుకోసం వీలైతే ఆన్లైన్ మోడల్ టెస్ట్‌లకు హాజరవడం ఉపయుక్తంగా ఉంటుంది. ఇంజనీరింగ్ సర్వీసెస్ పరీక్ష పాత ప్రశ్న పత్రాల సాధన కూడా గేట్లో విజయానికి దోహదపడుతుంది. అకడమిక్స్ ఆలంబనగా గేట్ విద్యార్థులు అకడమిక్ పుస్తకాలను ఆలంబనగా చేసుకుని ముందడుగేయాలి. ఎందుకంటే.. గేట్ గత ప్రశ్నలు, పరీక్ష తీరుతెన్నులను పరిశీలిస్తే.. అకడమిక్ పుస్తకాల నుంచే ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్న విషయం స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఇంటర్ రిలేటెడ్ టాపిక్స్ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. ఏదైనా ఒక టాపిక్‌ను చదివేటప్పుడు.. దానికి సంబంధించి పూర్వాపరాలు ఉన్న పుస్తకాలను అధ్యయనం చేయాలి. అంతేకాకుండా ప్రతి అంశానికి సంబంధించి.. మూల భావనలు, కాన్సెప్ట్‌లు, అప్లికేషన్స్‌ను క్షుణ్నంగా తెలుసుకోవాలి. మలి దశలో ఇలా గేట్ స్కోర్ అనేది.. ఐఐటీలు, ఎన్ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశానికి తొలి మెట్టు మాత్రమే. తర్వాత దశలో అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకున్న ఐఐటీలు నిర్వహించే ప్రత్యేక ప్రవేశ ప్రక్రియలోనూ విజయం సాధించాల్సి ఉంటుంది. ఆయా ఐఐటీలు పర్సనల్ టాస్క్, గ్రూప్ డిస్కషన్స్ పేరిట పరీక్షలను నిర్వహిస్తున్నాయి. కొన్ని ఐఐటీలు.. ఎస్సే రైటింగ్‌ను కూడా నిర్వహిస్తున్నాయి. వీటిలో విజయం సాధించిన వారికే అడ్మిషన్ ఖరారవుతోంది. పీఎస్‌యూలు.. మలిదశ గేట్ స్కోర్ ఆధారంగా ఎంట్రీ లెవల్ నియామకాలను చేపడుతున్న ప్రభుత్వ రంగ సంస్థలు(పీఎస్‌యూలు).. మలి దశలో రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్స్ వంటివి నిర్వహిస్తున్నాయి. వీటిలో విజయం సాధించిన వారికి చివరగా పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. గేట్ స్కోర్‌కు 70 శాతం, మలి దశ ఎంపిక ప్రక్రియకు 30 శాతం వెయిటేజీ లభిస్తోంది. స్కోర్ సాధిస్తేనే గేట్లో విజయం ద్వారా ఐఐటీల్లో సీట్లు, పీఎస్‌యూ కాల్స్ ఆశించే అభ్యర్థులు... గేట్లో కనీసం 650కు పైగా స్కోర్ సాధించేందుకు కృషి చేయాలి. పలు ఇన్స్టిట్యూట్లు కనీస కటాఫ్‌ను 600గా నిర్దేశిస్తున్నాయి. తుది ఎంపికలో కోర్ బ్రాంచ్‌లలో ఫైనల్ కటాఫ్ 800 వరకు ఉంటోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని సీఎస్ఈ, ఈసీఈ, ఐటీ, ఈఈఈ, మెకానికల్ వంటి బ్రాంచ్‌ల విద్యార్థులు.. ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో ప్రిపరేషన్ సాగించాలి. గేట్–2022 సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఆగస్ట్ 30, 2021 ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 24, 2021 ► గేట్ పేపర్ మార్పు, కేటగిరీ, పరీక్ష కేంద్రం మార్పునకు చివరి తేది: నవంబర్ 12, 2021 ► గేట్–2022 ఆన్లైన్ పరీక్ష తేదీలు: 2022 ఫిబ్రవరి 5, 6, 12, 13 తేదీల్లో రోజుకు రెండు స్లాట్లలో పరీక్ష ఉంటుంది. ► గేట్ పరీక్ష ఫలితాల వెల్లడి: మార్చి 17, 2022 ► తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: విజయవాడ, అనంతపురం, కర్నూలు, ఏలూరు, కాకినాడ, మచిలీపట్నం, రాజమండ్రి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, విశాఖపట్నం, చీరాల, చిత్తూరు, గూడూరు, గుంటూరు, కడప, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, వరంగల్. ► పూర్తి వివరాలకు వెబ్సైట్: https://gate.iitkgp.ac.in/index.html -
పీజీఈసెట్‌లో 85 శాతం మంది అర్హత
* ఫలితాలు విడుదల చేసిన ఉన్నత విద్యామండలి చైర్మన్ * త్వరలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీల ప్రకటన సాక్షి, హైదరాబాద్: పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ పీజీఈసెట్-2016 ఫలితాల్లో 85.01 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరిలో అబ్బాయిలు 85.38 శాతం.. అమ్మాయిలు 84.48 శాతం. గతనెల 30 నుంచి ఈ నెల 3 వరకు రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్ రీజియన్ సెంటర్లలో పీజీఈసెట్ నిర్వహించారు. మొత్తం 18 వేర్వేరు సబ్జెక్టులకు జరిగిన పరీక్షలకు 41,281 మంది అభ్యర్థులు హాజరు కాగా.. 35,093 మంది అర్హత పొందారు. పీజీఈసెట్ చైర్మన్ ఇ.సురేష్‌కుమార్, కన్వీనర్ ఎస్.రామచంద్రంతో కలసి ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో గురువారం ఫలితాలను విడుదల చేశారు. 17,222 మంది అమ్మాయిలకు 14,550 మంది, 24,059 మంది అబ్బాయిలకు 20,543 మంది పీజీ ప్రవేశాలకు అర్హత పొందారని చెప్పారు. ఫలితాలను www.tspgecet.org, www.osmania.ac.in వెబ్సైట్లలో పొందుపరిచారు. వీటి నుంచి అభ్యర్థులు ర్యాంక్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. గతేడాది సీట్లు ఇలా... రాష్ట్రంలోని వివిధ వర్సిటీలు, అనుబంధ గుర్తింపు పొందిన కళాశాలల్లో గతేడాది దాదాపు 17,500 సీట్లు ఉన్నాయి. ఇందులో వర్సిటీ కళాశాలల్లో 1,200, కన్వీనర్ కోటా కింద 15,756, మేనేజ్మెంట్ కోటా కింద 500 సీట్లు ఉన్నట్లు తెలిసింది. ఈ ఏడాది వర్సిటీల అనుబంధ గుర్తింపు ప్రక్రియ త్వరలో కొలిక్కి రానుంది. అలాగే కళాశాలల వారీగా ఉండే బ్రాంచ్‌లు, సీట్ల సంఖ్య తేలనుంది. దాదాపు ఇదే స్థాయిలో ఈసారి సీట్లు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటాచలం, కో కన్వీనర్ రమేశ్‌బాబు, కోఆర్డినేటర్ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ‘గేట్’వారికి తొలి ప్రాధాన్యం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ తేదీలను త్వరలో ప్రకటిస్తామని పాపిరెడ్డి తెలిపారు. అలాగే వర్సిటీల వారీగా అనుబంధ గుర్తింపు పొందిన కళాశాలల జాబితా ఖరారయ్యాక అడ్మిషన్ షెడ్యూ ల్, అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేస్తామన్నారు. ప్రవేశాల్లో మొదటి ప్రాధాన్యం.. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) అభ్యర్థులకు ఉంటుందన్నారు. ఆ తర్వాత పీజీ ఈసెట్‌లో అర్హత సాధించినవారికి సీట్లు కేటాయిస్తామన్నారు. ఇప్పటివరకు 1,700 దరఖాస్తులు గేట్ అభ్యర్థుల నుంచి అందాయన్నారు. కాగా, ఒక్కో సబ్జెక్ట్‌లో 120 మార్కులకు పరీక్ష నిర్వహించారు. గతేడాది కంటే ఈసారి పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్య, ఉత్తీర్ణత శాతం తగ్గాయి. గతేడాది 48,482 మంది పరీక్ష రాయగా.. 88.82 శాతం అభ్యర్థులు అర్హత సాధించారు. -
గేట్-2016
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) స్కోర్ సహాయంతో ప్రతిష్టాత్మక ఐఐఎస్సీ, ఐఐటీ, నిట్లు వంటి సంస్థల్లో ఎంఈ/ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశించొచ్చు. అంతేకాకుండా మెరుగైన గేట్ స్కోర్‌తో ఓఎన్జీసీ, ఐవోసీఎల్, ఎన్టీపీసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలనూ చేజిక్కించుకోవచ్చు. ఉన్నత విద్య, ఉద్యోగం... రెండిటికీ బాటలు వేసే గేట్-2016 షెడ్యూల్ విడుదలైంది. దీనిపై ప్రత్యేక కథనం... అర్హత బీటెక్/ బీఆర్క్/ నాలుగేళ్ల బీఎస్/ సైన్స్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ అప్లికేషన్స్‌లో పీజీ/ నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ (పోస్ట్ బీఎస్సీ)/ ఇంజనీరింగ్‌లో ఐదేళ్ల డ్యూయల్ డిగ్రీ ఉత్తీర్ణత, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ. కోర్సుల చివరి సంవత్సరం అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష విధానం గేట్-2016ను బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) నిర్వహిస్తుంది. ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. 2016, జనవరి 30 నుంచి ఫిబ్రవరి 7 వరకు ప్రతి శనివారం, ఆదివారాల్లో పరీక్ష జరుగుతుంది. మొత్తం 23 పేపర్లకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నపత్రంలో 65 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి మూడు గంటలు. ప్రశ్నపత్రంలో జనరల్ ఆప్టిట్యూడ్ నుంచి పది ప్రశ్నలు ఇస్తారు. మిగిలినవి అభ్యర్థి ఎంపిక చేసుకున్న సబ్జెక్టు స్పెషలైజేషన్ నుంచి ఉంటాయి. మార్పులు పరీక్ష సమయంలో ఆన్లైన్ వర్చువల్ కాలిక్యులేటర్ అందుబాటులో ఉంటుంది. సాధారణ కాలిక్యులేటర్‌ను అనుమతించరు. ప్రాక్టీస్ కోసం ఈ కాలిక్యులేటర్‌ను వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. పరీక్ష తర్వాత ‘కీ’లను అందుబాటులో ఉంచుతారు. సమాధానాలపై ఫిర్యాదు చేయొచ్చు. దీనికి నామమాత్రపు ఫీజు చెల్లించాలి. గేట్-2016లో కొత్తగా పెట్రోలియం ఇంజనీరింగ్ (పీఈ) పేపర్‌ను ప్రవేశపెట్టారు. ముందంజలో 5 బ్రాంచ్‌లు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. గేట్‌కు ఏటా పది లక్షలకు పైగా విద్యార్థులు పోటీపడుతున్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్ ఇంజనీరింగ్ నుంచి రెండు లక్షల మంది చొప్పున హాజరవుతున్నారు. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ల నుంచి దాదాపు 3.5 లక్షల మంది హాజరవుతున్నారు. పరీక్ష రాసేవారిలో తెలుగు విద్యార్థులదే అగ్రస్థానం. ముఖ్యాంశాలు దరఖాస్తు: గేట్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానంలో. దరఖాస్తు తేదీలు: 2015, సెప్టెంబరు 1- అక్టోబరు 1. అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్: డిసెంబరు 17, 2015. పరీక్ష తేదీలు: 2016, జనవరి 30 నుంచి 2016, ఫిబ్రవరి 7 వరకు ప్రతి శని, ఆదివారాలు. పరీక్ష కేంద్రాలు ఏపీ: కర్నూలు, భీమవరం, ఏలూరు, కాకినాడ, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, బాపట్ల, చిత్తూరు, గుంటూరు, కడప, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి. పరీక్ష కేంద్రాలు టీఎస్: హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, వరంగల్. ఫలితాల వెల్లడి: మార్చి 19, 2016. వెబ్సైట్: gate.iisc.ernet.in -
ఉన్నత కొలువులకు ‘గేట్’వే!
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్).. ఇంజనీరింగ్ చదివే ప్రతి విద్యార్థిరాయాలనుకునే పరీక్ష! ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ), ఐఐటీలు, నిట్లు తదితర ప్రతిష్టాత్మక సంస్థల్లో ఇంజనీరింగ్ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ప్రామాణికంగానిలిచే ఈ పరీక్ష.. గత కొన్నేళ్ల నుంచి ప్రభుత్వ రంగ సంస్థల ఎంట్రీ లెవల్ నియామకాలకు గేట్వేగా నిలుస్తోంది. 2015 గేట్ స్కోర్‌తో నియామకాల కోసం నోటిఫికేషన్లు వెలువడిన నేపథ్యంలో సంబంధిత వివరాలు.. ఇంజనీరింగ్ విద్యార్థుల నుంచి పరిశ్రమలు ఆశిస్తున్న అన్వయ సామర్థ్యం, సమస్యా సాధన, విశ్లేషించే గుణం, తార్కిక వివేచన వంటి నైపుణ్యాలను పరీక్షించడంలో గేట్‌కు మించిన పరీక్ష మరొకటి లేదని చెప్పొచ్చు. అంతేకాకుండా గతంలో ప్రభుత్వ రంగ సంస్థలు.. సొంతంగా నిర్వహించే నియామక ప్రక్రియలో ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో ఈ అంశాలను పరీక్షించడం సాధ్యమయ్యేది కాదు. గేట్ వంటి పరీక్షల్లో విజయం సాధించాలంటే సంబంధిత సబ్జెక్ట్‌లో ప్రాథమిక భావనలపై పట్టు ఉండాలి. ఈ విషయాలన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటే ప్రతిభ ఉన్న విద్యార్థులు మాత్రమే గేట్లో మంచి స్కోర్ సాధించగలుగుతున్నారు. గేట్‌ను దేశంలోని అత్యున్నత సాంకేతిక సంస్థలైన ఐఐటీలు, ఐఐఎస్సీ అత్యంత ప్రతిష్టాత్మకంగా, పారదర్శకంగా నిర్వహిస్తుంటాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ)లు గేట్ స్కోర్ ఆధారంగా ఎంట్రీ లెవల్ ఉద్యోగ నియామకాలు చేపడుతున్నాయి. వేర్వేరుగా ప్రకటనలు: ఉద్యోగ నియామకాలకు సంబంధించి పీఎస్‌యూలు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేస్తాయి. వాటికనుగుణంగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నియామక ప్రక్రియలో గేట్ స్కోర్‌కు ప్రాధాన్యం ఇస్తారు. గేట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులకు తర్వాతి దశలో బృంద చర్చలు, వ్యక్తిగత ఇంటర్వ్యూలు (కంపెనీని బట్టి ఇవి మారుతుంటాయి) నిర్వహించి నియామకాన్ని ఖరారు చేస్తారు. హెచ్‌పీసీఎల్, పవర్ గ్రిడ్, ఎన్సీఎల్, గెయిల్ వంటి సంస్థలు గ్రూప్ డిస్కషన్ లేదా గ్రూప్ టాస్క్ పేరుతో బృంద చర్చలు సైతం నిర్వహించి అందులోనూ రాణించిన వారిని మాత్రమే ఇంటర్వ్యూ దశకు ఎంపిక చేస్తాయి. ఈ క్రమంలో దాదాపు 75 శాతం వెయిటేజీని గేట్ స్కోరుకు ఇచ్చి మిగతా 25 శాతం వెయిటేజీని ఇంటర్వ్యూ/ గ్రూప్ డిస్కషన్లకు కేటాయిస్తున్నాయి. కాబట్టి గేట్లో మంచి స్కోర్ సాధించడం కీలకమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ముందుగా గేట్: ఈ కంపెనీలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ముందుగా గేట్-2015కు దరఖాస్తు చేసుకోవాలి. గేట్ అడ్మిట్ కార్డ్‌పై ఉన్న రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా ఆయా కంపెనీలకు దరఖాస్తు చేసుకోవాలి. గ్రూప్ డిస్కషన్/గ్రూప్ టాస్క్/ఇంటర్వ్యూకు ఎంపికైతే గేట్ దరఖాస్తు ప్రింటవుట్, అడ్మిట్ కార్డ్, స్కోర్ కార్డ్ తీసుకువెళ్లాలి. దరఖాస్తు చేసుకునేటప్పుడు గేట్ దరఖాస్తులో ఏ వివరాలైతే (పేరు, పుట్టిన తేదీ, చిరునామా) నింపారో అవే వివరాలను సంబంధిత కంపెనీల దరఖాస్తులోనూ నింపాలి. అయా కంపెనీల్లో ఏ విభాగాల్లో అయితే నియామక ప్రకటనలు వెలువడ్డాయో అదే ఇంజనీరింగ్ బ్రాంచ్ పేపర్‌తో గేట్ రాయాలి. ఎంపిక ప్రక్రియ: తొలుత పీఎస్‌యూలు గేట్ నిర్వహణ తేదీ కంటే ముందుగానే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు విడుదల చేస్తాయి. అభ్యర్థులు వీటికి ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. గేట్ ఫలితాలు వెలువడ్డాక ర్యాంకుల ఆధారంగా అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తాయి. ఆ జాబితాలో ఉన్న అభ్యర్థులు ఎంపిక ప్రక్రియలో తదుపరి దశలకు హాజరయ్యేందుకు తమ సంసిద్ధతను తెలియజేయాల్సి ఉంటుంది. అప్పుడే వారికి మలి దశలకు అనుమతి లభిస్తుంది. ఇంటర్వ్యూ కాల్: గేట్ స్కోర్ 500లోపు (ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు) ఉండాలి. ఓబీసీ అభ్యర్థులు 700 నుంచి 800 ర్యాంకులోపు, ఎస్సీ/ఎస్టీ అభ్యరులు 1500 నుంచి మూడు వేల మధ్య ర్యాంకు సాధిస్తే ఇంటర్వ్యూ కాల్ ఆశించొచ్చు. ఇంటర్వ్యూలో రెండు ముఖ్యమైన అంశాలు: ఎంపిక ప్రక్రియ తుది దశ ఇంటర్వ్యూలో రెండు ముఖ్యమైన అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. అవి.. వ్యక్తిగత నేపథ్యం, టెక్నికల్ స్కిల్స్. టెక్నికల్ స్కిల్స్‌కు సంబంధించి సైద్ధాంతిక అవగాహనతో పాటు బీటెక్ స్థాయిలో అభ్యర్థులు చేసిన ప్రాజెక్ట్ వర్క్స్, ఇంటర్న్షిప్స్, మినీ ప్రాజెక్ట్ వర్క్స్ వంటి వాటిపైనా ప్రశ్నలు అడుగుతారు. ఇందులోనూ విజయం సాధించిన అభ్యర్థులకు గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ వంటి హోదాలతో ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు లభిస్తాయి. సర్వీస్ అగ్రిమెంట్: కొన్ని పీఎస్‌యూలు ఎంపికైన అభ్యర్థుల నుంచి నిర్ణీత కాలానికి సర్వీస్ అగ్రిమెంట్ కూడా తీసుకుంటున్నాయి. ప్రస్తుతం ఇది ఒక ఏడాది వ్యవధిలో ఉంటోంది. అంటే ఎంపికైన వారు తప్పనిసరిగా ఏడాది పాటు సంస్థలో విధులు నిర్వర్తించాల్సిందే. శిక్షణ: ఎంపికైన అభ్యర్థులు మొదట కొంత కాలంపాటు శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఈ సమయంలో వీరికి మేనేజ్మెంట్ ట్రైనీ, ట్రైనీ ఇంజనీర్, గ్రాడ్యుయేట్ ఇంజనీర్ వంటి హోదాలు కేటాయిస్తారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారిని శాశ్వత ఉద్యోగులుగా తీసుకుంటారు. ఈ సమయంలో వీరికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా వేతనాలు, సౌకర్యాలు, భత్యాలు లభిస్తాయి. వేతనాల విషయానికొస్తే.. ప్రారంభ వేతనం ఏడాదికి సగటున ఏడు నుంచి ఎనిమిది లక్షల రూపాయల వరకు ఉంటుంది. భవిష్యత్తుపై స్పష్టతతో.. తగిన ప్రణాళిక గేట్ ర్యాంకు ఇప్పుడు ఐఐటీల్లో ఉన్నత విద్యకు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలకు సాధనంగా మారిన నేపథ్యంలో అభ్యర్థులు భవిష్యత్తుపై స్పష్టతతో తగిన ప్రణాళిక రూపొందించుకోవాలి. ఉన్నత విద్య లేదా ఇతర ఉద్యోగాలు లక్ష్యంగా ఆలోచించే అభ్యర్థులు పీఎస్‌యూల్లో దరఖాస్తు విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఆయా సంస్థల నియామక నిబంధనలపై పూర్తి స్థాయి అవగాహన ఏర్పడిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యంగా సర్వీస్ అగ్రిమెంట్, ఇతర సర్వీస్ నిబంధనలు అమలు చేస్తున్న సంస్థలకు దరఖాస్తు చేసుకునేందుకు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇక.. పీఎస్‌యూల్లో ఉద్యోగమే లక్ష్యంగా నిర్దేశించుకున్న అభ్యర్థులు, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ వంటి వాటిపై ఆందోళన చెందక్కర్లేదు. ఇవి సాధారణంగా బీటెక్ స్థాయిలో తమ బ్రాంచ్‌కు సంబంధించిన అంశాలపైనే ఉంటాయి. ఈ నేపథ్యంలో గేట్లో టాప్-500లోపు ర్యాంకు లక్ష్యంగా కృషి చేస్తే.. పీఎస్‌యూ ఆఫర్ గ్యారెంటీ. - ఎ. రవితేజ, గేట్-2013 ఆల్ ఇండియా 2వ ర్యాంకు (ఎలక్ట్రికల్) -
‘గేట్’ ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్(గేట్)-2015 రాసేందుకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమైంది. ఈ రిజిస్ట్రేషన్లను, పరీక్షను ఆన్లైన్ విధానంలో మాత్రమే నిర్వహిస్తారు. అభ్యర్థులు గేట్ వెబ్సైట్ ద్వారా అక్టోబర్ 1లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎన్రోల్మెంట్, దరఖాస్తును నింపడం, పంపించడం వంటివి ఆన్లైన్లోనే పూర్తిచేయాలి. దీంతోపాటు ఫోటో, ఇతర ధ్రువపత్రాలను కూడా ఆన్లైన్లో ఆప్‌లోడ్ చేయాలి. గేట్ జోనల్ కార్యాలయాలకు హార్డ్‌కాపీలను పంపించాల్సిన అవసరం లేదు. నెట్ బ్యాంకింగ్, డెబిట్/క్రెడిట్ కార్డు, ఈ-చలాన్ విధానాల్లో దరఖాస్తు రుసుం చెల్లించవచ్చు. జనరల్, ఓబీసీ(పురుష) అభ్యర్థులు రూ.1500, మహిళలు రూ.750, ఎస్సీ/ఎస్టీ/వికలాంగ అభ్యర్థులు రూ.750 చెల్లించాలి. ఎగ్జామినేషన్ సిటీ ఛాయిస్‌ను నవంబర్ 21లోగా మార్చుకోవచ్చు. గేట్-2015ను వచ్చే ఏడాది జనవరి 31, ఫిబ్రవరి 1, ఫిబ్రవరి 7, ఫిబ్రవరి 8, ఫిబ్రవరి 14 తేదీల్లో ఉదయం 9 నుంచి 12, సాయంత్రం 2 నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తారు. ఫలితాలు మార్చి 12, 2015న వెలువడే అవకాశాలున్నాయి. వివరాలకు వెబ్సైట్: http://gate.iitk.ac.in/GATE2015/ -
‘గేట్’ దాటితే.. గెటప్ మారినట్టే..!
మార్కాపురం : ఇంజినీరింగ్ విద్యార్థుల కల గేట్ (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్). ఈ పరీక్షకు దాదాపు ఆరు నెలల పాటు నిరంతర శిక్షణ తీసుకుంటే మంచి ర్యాంక్ సాధించడం సులభమంటున్నారు అధ్యాపకులు. గేట్లో విజయం సాధిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ఎంటెక్‌లో చేరేందుకు అవకాశాలు ఎదురు చూస్తుంటాయి. 100 మార్కులకు ఉండే ఈ పరీక్ష ఆన్లైన్లో జరుగుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. జనవరిలో పరీక్ష ఉంటుంది. మార్చి రెండవ వారంలో ఫలితాలు ప్రకటిస్తారు. బీటెక్ చదివిన ప్రతి విద్యార్థి గేట్లో ర్యాంక్ సాధించడానికి ఉత్సాహపడుతుంటాడు. 2014లో జరిగిన పరీక్షల్లో సుమారు 15 లక్షల మంది విద్యార్థులు దేశ వ్యాప్తంగా పోటీ పడ్డారు. ఇందులో 2.10 లక్షల మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. గేట్ పరీక్ష రాయడానికి ప్రస్తుతం ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులతో పాటు బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు కూడా అర్హులే. ఈసీఈ, ఈఈఈ, మెకానికల్, సివిల్, సీఎస్ఈ, ఇన్స్ట్రుమెంటల్ బ్రాంచ్ విద్యార్థులతో పాటు బీటెక్‌లో ఇతర కోర్సులు చేసిన వారు పరీక్ష రాయవచ్చు. గేట్లో ఉత్తీర్ణులైతే ఐఐటీ, నిట్, ఐఐఎస్ఈలో సీటు పొందవచ్చు. అర్హత పరీక్ష రాయకుండా బీఎస్ఎన్ఎల్, పీఆర్ డీఓ, ఇస్రో, బీహెచ్ఈఎల్, బీఈఎల్ఎల్, ఎన్టీపీసీ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలకు నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. -
సెప్టెంబర్ 1నుంచి ఆన్లైన్లో ‘గేట్’ దరఖాస్తులు
నోటిఫికేషన్ జారీ చేసిన కాన్పూర్ ఐఐటీ మూడేళ్లదాకా పరిగణనలోకి స్కోర్ హైదరాబాద్: ఎన్ఐటీ, ఐఐటీల్లో ఎంటెక్‌లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్టు ఇన్ ఇంజనీరింగ్ (గేట్-2015) నోటిఫికేషన్‌ను ఐఐటీ కాన్పూర్ జారీ చేసింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 1 వరకు దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించనున్నట్టు పేర్కొంది. ఆన్లైన్ పరీక్షలను వచ్చే ఏడాది జనవరి 31వ తే దీ, ఫిబ్రవరి 1, 7, 8, 14 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోనూ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. అభ్యర్థులు పరీక్ష కేంద్రాన్ని నవంబర్ 21 తేదీ వరకు మార్పు చేసుకోవచ్చు. డిసెంబర్ 17 వరకు ఆన్లైన్ ద్వారా హాల్‌టికెట్లను (అడ్మిట్ కార్డులు) డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్షను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనుంది. ఫలితాలను మార్చి 12న విడుదల చేయనుంది. మరోవైపు స్కోర్ వ్యాలిడిటీకి సంబంధించిన మార్పులు చేసింది. ఇప్పటివరకు గేట్లో అర్హత సాధించిన విద్యార్థి ఆయా సంస్థల్లో ఎంటెక్‌లో చేరేందుకు రెండేళ్ల వరకు అవకాశం ఉంది. దానిని ఇపుడు మూడేళ్లకు పెంచింది. ఒకసారి పరీక్ష రాస్తే ఆ స్కోర్ వ్యాలిడిటీ మూడేళ్ల వరకు ఉంటుంది. -
‘గేట్’లో మనోళ్లు గ్రేట్
సత్తా చాటిన సిటీ విద్యార్థులు టాప్-10లో రెండు.. టాప్- 100లో 11 ర్యాంకులు సాక్షి, సిటీబ్యూరో/ కేపీహెచ్‌బీ, న్యూస్‌లైన్: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) 2014 ఫలితాలలో నగర విద్యార్థులు దుమ్ము దులిపారు. గేట్ ప్రవేశపరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో టాప్ 10 ర్యాంకుల్లో ఇద్దరు, టాప్ 100 లోపు 11మంది విద్యార్థులు హైదరాబాద్ హవాను చాటారు. నగరానికి చెందిన తాడూరి నవీన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో 8వ ర్యాంకు, ఈఈఈ విభాగంలో రాపోలు జయప్రకాష్ 9వ ర్యాంకుతో సత్తా ప్రదర్శించారు. ఆపై ర్యాంకుల్లో వై.వంశీకృష్ణ(ఈసీఈ) 14వ ర్యాంకు, చంద్ర శ్రీరామ్ కౌషిక్ (ఈఈఈ) 35వ ర్యాంకు, సందీప్(సీఎస్ఈ) 69వ ర్యాంకు, పీయుష్ సోని (ఈసీఈ) 75వ ర్యాంకు, వెంకట రమణరావు (ఈఈఈ) 78వ ర్యాంకు, వంశీ (సీఎస్ఈ) 86వర్యాంకు, చుండూరి శ్రీహర్ష (ఈఈఈ) 90వ ర్యాంకు సాధించారు. ఇదిలా ఉంటే.. నగరంలోని జవహర్లాల్ నెహ్రు సాంకేతిక విశ్వ విద్యాలయానికి చెందిన ఇద్దరు విద్యార్థులకు వందలోపు రెండు ర్యాంకులు వచ్చాయి. వర్సిటీలో బీటెక్ ఈఈఈ ఫైనలియర్ చదువుతున్న స్టాన్లీ 41వ ర్యాంక్, కె.చాణిక్య 97వ ర్యాంకు సాధించారు. టాప్ ర్యాంకులు రాకున్నా 100 లోపు ర్యాంకులు ఎక్కువమంది నగర విద్యార్థులకు రావడంపై పలువురు ఆచార్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఫలితాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉందని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు తెలిపారు. ర్యాంకులు సాధించిన వారిలో కొందరు ఇతర జిల్లాలకు చెందిన వారైనప్పటికీ వీరు హైదరాబాద్ కేంద్రం నుంచి గేట్ పరీక్షలు రాశారు. మొదటి నుంచీ కృషి ఇంజనీరింగ్‌లో చేరినప్పటి నుంచి గేట్లో మంచి ర్యాంకులు సాధించాలనే లక్ష్యంతో కృషి చేశా. ఆల్ ఇండియాలో టాప్ 10 లో ఉండాలనుకున్నా. అయినా 100లోపు 41వ ర్యాంక్ రావడంతో సంతోషంగా ఉంది. - స్టాన్లీ, ఈఈఈ 41వ ర్యాంకర్ ఒత్తిడికి లోనయ్యా.. పరీక్ష రాసేటప్పుడు కొంచెం ఒత్తిడికి గురయ్యా. ఇంత మంచి ర్యాంక్ వస్తుందని ఊహించలేదు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతోనే గేట్ పరీక్షలు రాశా. - కె. చాణుక్య, ఈఈఈ 97వ ర్యాంకర్