- వసతి గృహంలో సమస్యలపై ఆగ్రహం
- పరిష్కారానికి రిజిస్ట్రార్ హామీ
ఏయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు ఆకస్మికంగా ఆందోళనబాట పట్టారు. గురువారం రాత్రి భోజన సమయంలో నాగార్జున వసతి గృహంలో భోజనాలను బిహ ష్కరించారు. ఆహారంలో నాణ్యత లోపించిందని, పరిశుభ్రమైన తా గునీరు అందించడం లేదని ఆరోపిస్తూ మెస్ బయట బైఠాయించి ఆందోళన చేపట్టారు. సిబ్బంది పనితీరుపై సైతం వారు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ర్యాలీగా వీసీ నివాసం వరకూ తరలివెళ్లారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. రిజిస్ట్రార్ ఆచార్య కె.రామ్మోహనరావు, చీఫ్ వార్డెన్ విశ్వనాథం విద్యార్థులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. వారిని వసతి గృహానికి తీసుకువచ్చి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తమకు అందిస్తున్న పాలలో నాణ్యత లేదని, సదరు సరఫరాదారుని మార్చాలని విద్యార్థులు కోరారు.
వసతి గృహంలో తాగునీటి శుద్ధియంత్రాలు ఏర్పాటు చేయాలని, నీటి ట్యాంకులను శుభ్రపరచాలని, టాయిలెట్స్ శుభ్రం చేసేందుకు తగినంత సిబ్బందిని నియమించాలని విద్యార్థులు కోరారు. విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న మెస్ సిబ్బందిని వెంటనే బదిలీ చేయాలన్నారు. అనారోగ్య పరిస్థతుల వల్ల విద్యార్థులు రోగాలబారిన పడుతున్నారని ఆరోపించారు. విద్యార్థుల సమస్యలపై రిజిస్ట్రార్ స్పందించారు.
వెంటనే ఏయూ వైద్యాధికారిని పిలిపించి అనారోగ్యంతో ఉన్న విద్యార్థులకు పరీక్షలు చేసి తగిన వైద్యం అందించాలని ఆదేశించారు. డిమాండ్లను సత్వరమే పరిష్కరిస్తామని, విద్యార్థులు కోరిన విధంగా పోషకాహారం అందిస్తామని రిజిస్ట్రార్ హామీ ఇచ్చారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.