ఏయూ దూరవిద్య పరీక్షల్లో వీసీ అత్యుత్సాహం
మాస్‌మీడియా పరీక్షలో ‘ఈనాడు’ పత్రిక గురించి రాయాలంటూ ప్రశ్న
ప్రభుత్వం మెప్పుకోసమేనంటూ విద్యార్థుల విమర్శ
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నాక్ ర్యాంకింగ్‌తో ఆంధ్రా యూనివర్సిటీని అగ్రస్థానంలో నిలబెట్టగా.. ఇప్పుడు సొంత బాకా కొట్టుకునేందుకే అన్నట్టుగా మార్చేశారు. ఏయూలో ఎంఏ జర్నలిజం దూరవిద్య పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలి రోజు జరిగిన పరీక్షలో ఏయూ వీసీ శశిభూషణరావు అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రభుత్వ మెప్పు పొందేందుకు టీడీపీ కరపత్రికగా ఉన్న ఈనాడు గురించి ప్రశ్నలు సంధించారు.
వీసీ, ఏయూ అధికారుల వ్యవహారంపై విద్యార్థులు నిర్ఘాంతపోయారు. హిస్టరీ ఆఫ్ మాస్ మీడియా పరీక్ష ప్రశ్నపత్రంలో విద్యార్థులకు వింత అనుభవం ఎదురైంది. సెక్షన్–ఏ లో మొదటి ప్రశ్నలో ఏవైనా 5 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటూ 4 మార్కులు ప్రశ్న ఇచ్చారు. ఇందులో ఎనిమిది టాపిక్స్ ఇవ్వగా.. అందులో ఏడు మాత్రం సిలబస్‌లో ఉన్నవే ఇచ్చారు. కానీ.. సిలబస్‌లో లేని ‘ఈనాడు’ గురించి కూడా రాయాలంటూ ప్రశ్నపత్రంలో ఇవ్వడంపై విద్యార్థులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఈనాడు గురించి సిలబస్‌లో ఉంటే కచ్చితంగా ప్రశ్న ఇచ్చినా ప్రిపేరై రాసేవాళ్లమని.. కానీ, ఎక్కడాలేని ప్రశ్నని ఇస్తే.. తాము ఎలా రాస్తామంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు ఎనిమిదింటిలో నాలుగు ప్రశ్నలు మాత్రమే తెలుసనీ.. ఈనాడు బదులు సిలబస్‌లో ఉన్నది ఇచ్చి ఉంటే మరో ప్రశ్న కూడా రాసేవాళ్లమని చెబుతున్నారు. కేవలం ప్రభుత్వం మెప్పు పొందేందుకే వైస్ చాన్సలర్ ఈ విధంగా ప్రశ్నపత్రం తయారు చేయించి ఉంటారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భవిష్యత్తులో పరీక్షలో ఇంకెవరి గురించి రాయమని ప్రశ్నపత్నం తయారు చేస్తారోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment