distance education exams
-
ఇదేనా ‘దూర’దృష్టి!
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాక్ ర్యాంకింగ్‌తో ఆంధ్రా యూనివర్సిటీని అగ్రస్థానంలో నిలబెట్టగా.. ఇప్పుడు సొంత బాకా కొట్టుకునేందుకే అన్నట్టుగా మార్చేశారు. ఏయూలో ఎంఏ జర్నలిజం దూరవిద్య పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలి రోజు జరిగిన పరీక్షలో ఏయూ వీసీ శశిభూషణరావు అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రభుత్వ మెప్పు పొందేందుకు టీడీపీ కరపత్రికగా ఉన్న ఈనాడు గురించి ప్రశ్నలు సంధించారు.వీసీ, ఏయూ అధికారుల వ్యవహారంపై విద్యార్థులు నిర్ఘాంతపోయారు. హిస్టరీ ఆఫ్ మాస్ మీడియా పరీక్ష ప్రశ్నపత్రంలో విద్యార్థులకు వింత అనుభవం ఎదురైంది. సెక్షన్–ఏ లో మొదటి ప్రశ్నలో ఏవైనా 5 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటూ 4 మార్కులు ప్రశ్న ఇచ్చారు. ఇందులో ఎనిమిది టాపిక్స్ ఇవ్వగా.. అందులో ఏడు మాత్రం సిలబస్‌లో ఉన్నవే ఇచ్చారు. కానీ.. సిలబస్‌లో లేని ‘ఈనాడు’ గురించి కూడా రాయాలంటూ ప్రశ్నపత్రంలో ఇవ్వడంపై విద్యార్థులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఈనాడు గురించి సిలబస్‌లో ఉంటే కచ్చితంగా ప్రశ్న ఇచ్చినా ప్రిపేరై రాసేవాళ్లమని.. కానీ, ఎక్కడాలేని ప్రశ్నని ఇస్తే.. తాము ఎలా రాస్తామంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు ఎనిమిదింటిలో నాలుగు ప్రశ్నలు మాత్రమే తెలుసనీ.. ఈనాడు బదులు సిలబస్‌లో ఉన్నది ఇచ్చి ఉంటే మరో ప్రశ్న కూడా రాసేవాళ్లమని చెబుతున్నారు. కేవలం ప్రభుత్వం మెప్పు పొందేందుకే వైస్ చాన్సలర్ ఈ విధంగా ప్రశ్నపత్రం తయారు చేయించి ఉంటారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భవిష్యత్తులో పరీక్షలో ఇంకెవరి గురించి రాయమని ప్రశ్నపత్నం తయారు చేస్తారోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
‘అనంత’లో చూచిరాత బాగోతం..
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘‘మీకు డిగ్రీ సర్టిఫికెట్ కావాలా! అయితే, మా సెంటర్లో చేరండి.. కచ్చితంగా పాస్’’ తరహా ప్రకటనలతో దూరవిద్య కేంద్రాలు డబ్బు పోగేసుకుంటున్నాయి. జిల్లాలో నాగార్జున యూనివర్సిటీ దూర విద్య పరీక్షలు అక్టోబర్ 26వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. సుమారు 3వేల మంది విద్యార్థుల వరకూ పరీక్షలకు హాజరవుతున్నారు. అయితే, పరీక్షల్లో పాస్ చేస్తామని ముందుగానే అడ్మిషన్లు తీసుకున్న సెంటర్లు .. పరీక్షల సమయంలో పుస్తకాలు పెట్టి మరీ పరీక్షలు రాపిస్తామంటూ అదనంగా ఒక్కో విద్యార్థి నుంచి సగటున రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకూ వసూలు చేశారు. ఈ విధంగా వసూలు చేసి.. ఇందులో యూనివర్సిటీ అధికారులకు కూడా మామూళ్లు ఇచ్చి ఇష్టారాజ్యంగా పరీక్షలను నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఏఎన్‌యూకు అనుబంధంగా అనంతపురంతో పాటు తాడిపత్రి, ధర్మవరం, పామిడిల్లో కేంద్రాలుండగా..ఆయా చోట్ల పరీక్షలు జరుగుతున్నాయి. ముందుగానే ఆయా సెంటర్లలో ఎవరు కూడా నేరుగా రాకుండా గేట్లు వేసి మరీ పరీక్షలు కొనసాగిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా వస్తున్నట్టు తెలిస్తే లోపల ఉన్న వారిని అలర్ట్ చేస్తున్నారు. తద్వారా ఆ సమయంలో కాపీయింగ్ జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. ఆ తర్వాత యథావిధిగా తమ పని కానిస్తున్నారు. మొత్తంగా దూరవిద్య పేరుతో కొన్ని సెంటర్లు డబ్బుల దందాకు తెరలేపి చదువుకు మరీ విలువ లేకుండా చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రూ.60 లక్షలకు పైమాటే.. జిల్లాలో మొత్తం 3వేల మంది వరకూ ఏఎన్‌యూ దూర విద్యకు హాజరువుతున్నారు. వీరికి కనీసం పుస్తకాలు కూడా సకాలంలో అందించలేదు. దీంతో పరీక్షకు ఎవ్వరూ సిద్ధమయ్యే పరిస్థితి లేదు. తీరా పరీక్షలు వచ్చిన తర్వాత ఇప్పుడు పరీక్షల్లో పాసు కావాలన్నా.. చూసి రాయలన్నా ఒక్కో విద్యార్థి రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకూ ఇవ్వాలని సదరు దూరవిద్య కేంద్రాల నిర్వాహకులు తేల్చి చెబుతున్నారు. ఫలితంగా జిల్లాలో పరీక్షలు రాస్తున్న 3వేల మంది విద్యార్థులు కాస్తా రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకూ చెల్లించాల్సి వచ్చింది. ఒకవేళ ఎవరైనా డబ్బులు ఇవ్వకపోతే వారు చూచి రాసేందుకు అనుమతించడం లేదు. అంతేకాకుండా ప్రత్యేకంగా పక్కన కూర్చోబెట్టి చూసిరాసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా 3 వేల మంది విద్యార్థుల నుంచి రూ.2 వేల నుంచి రూ.3 వేల చొప్పున లెక్కిస్తే రూ.60 లక్షల నుంచి రూ.90 లక్షల వరకూ వసూలు చేసినట్టు సమాచారం. ఇందులో యూనివర్సిటీ దూరవిద్య అధికారులకు కూడా భారీగానే ముట్టచెబుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. యూనివర్సిటీ పరిశీలకులు ఎక్కడ?.. వాస్తవానికి దూరవిద్య పరీక్షలు జరిగే సమయంలో సదరు యూనివర్సిటీకి చెందిన సిబ్బంది పరిశీలకులుగా వస్తారు. పరీక్షలు జరిగే సమయంలో అక్కడే మకాం వేసి కట్టుదిట్టంగా పరీక్షలు జరిగేలా చూడాలి. అయితే, ఏఎన్‌యూ దూర విద్యలో మాత్రం ఈ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. యూనివర్సిటీ నుంచి వచ్చిన పరిశీలకులు ఎక్కడా కనిపించని పరిస్థితి. కనీసం సెంటర్ల వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం గమనార్హం. -
1 నుంచి దూరవిద్య పరీక్షలు
ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలోని బీఈడీ దూరవిద్య పరీక్షలు ఆగస్టు 1 నుంచి జరగనున్నాయి. ఈ మేరకు పరీక్షల విభాగం అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు 1న పౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, 2న సైకాలజీ ఆఫ్ టీచింగ్ అండ్ లర్నింగ్, 3న స్కూల్ మేనేజ్మెంట్ అండ్ ఇష్యూస్ మేనేజ్మెంట్ , 4న ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ ( ఐసీటీ) ఎడ్యుకేషన్, 5, 6, 7న టీచింగ్ మెథడ్స్ పరీక్షలు జరగనున్నాయి. -
ఎస్వీయూ దూరవిద్య పరీక్షలు వాయిదా
తిరుపతి: ఎస్వీ యూనివర్సిటీలో శుక్రవారం నుంచి మొదలు కావాల్సిన యూజీ, పీజీ పరీక్షలు సెప్టెంబర్ 8 వతేదీకి వాయిదా వేసినట్లు రిజిస్ట్రార్ ఎం.దేవరాజులు ఓ ప్రకటనలో వెల్లడించారు. నూతన పరీక్షల షెడ్యూల్‌ను ఈ నెల 26 నుంచి http://www.svuniversity.ac.in/ వెబ్ సైట్లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. -
తెలుగు వర్సిటీ దూరవిద్య పరీక్షలు వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలుగు విశ్వవిద్యాలయం దూరవిద్య పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నెల 3 నుంచి 23 వరకు హైదరాబాద్, వరంగల్, రాజమండ్రి, కూచిపూడి, శ్రీశైలం కేంద్రాల్లో పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే పదో షెడ్యూల్లో ఉ న్న ఈ వర్సిటీ సేవలు కావాలని ఏపీ ప్రభుత్వం ముందుకు రాకపోవడం.. ఒప్పందం లేనిదే సేవలు అందించే ప్రసక్తే లేదని తెలంగాణ ప్రభుత్వం మెట్టు దిగక పోవడంతో వివాదం జఠిలమైంది. స్వయంగా ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ జోక్యం చేసుకున్నా పరి ష్కారం లభించలేదు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కోర్టు మెట్లెక్కిన విషయం తెలిసిందే. కాగా ఈ విషయంలో ఏదో ఒక స్పష్టత వచ్చే వరకు పరీక్షల నిర్వహణను నిలిపివేయాలని వర్సిటీ అధికారులు ఒక నిర్ణయానికి వచ్చారు. దూర విద్య పరీక్షలను రెండు రాష్ట్రాల్లో వాయిదా వేస్తున్నట్లు, తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని త్వరలో ప్రకటిస్తామని వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ తోమాసయ్య సోమవారం తెలిపారు.